Sunday, December 3, 2023

వారసత్వం కాదు, సమర్థతే ప్రధానం

ఏ రంగలోనైనా వారసత్వం కంటే సమర్థత, జ్ఞానం ప్రధానమని, ఆ లక్షణాలు కలవారితో  ఆయా రంగాలు సుసంపన్నమవుతాయని భావించి  అచరించిన మహనీయుడు గురునానక్. సమర్థపాలకుని వల్లనే మంచి పరిపాలను అందుతుందని, అలాగే మంచి గురువుతోనే జ్ఞానం వికసిస్తుందని విశ్వసించారు. అందుకే తాను నెలకొల్పిన  సిక్కు మతానికి తన వారసుడిగా  కుమారుడికి బదులు ఎన్నో ఆధ్యాత్మిక పరీక్షలకు నిలచిన అంగదేవ్ ను  నిర్ణయించారు. గురుశిష్య సంబంధానికి అత్యంత విలువనిచ్చారు. భగవంతుడు సద్గురువులోనే ఉన్నాడని ప్రబోధించారు.

నానక్ సంప్రదాయ హిందూ కుటుంబంలో జన్మించినా స్వమతంతో పాటు ముస్లిం గురువు వద్ద చదువుకున్న  రెండు మతాల  మత గ్రంథాలను అధ్యయనం చేసి, లోతైన అవగాహన పెంచుకున్నారు. మతాల పేరిట  జరిగే అనాచారాలను,మూఢాచారాలను వ్యతిరేకించారు. రెండు మతాలలోని మంచిని గుర్తించి, దాని ఆచరణలోని లోపాను  గమనించి కులమత వివక్ష లేని ధర్మాన్ని ప్రబోధిస్తూ సిక్కు మతాన్ని స్థాపించారు. గురుశిష్య సంబంధాను పటిష్ఠ పరుస్తూ  సర్వమానవ సమానత్వం, ప్రేమతత్వాన్ని  పెంపొందించేలా దీనిని తీర్చిదిద్దారు. ఆయన వేసిన పాదుకు గురుపీఠం వారసులు పందిళ్లు వేసి ఆయన బోధనలను పరిమళింపచేశారు.

సమత మమతలే అభిమతం

మమతలే అభిమతం`ఉన్నవి రెండే మతాలు, అవి  సమత, మమత. అవే మనకు అభిమతం కావాలి. వాటి ప్రభోదం, ఆచరణ  సమ్మతం కావాలి‘ అని నానక్  ప్రచారం చేశారు. సర్వమానవ సమానత్వమే మతమని, దానిని పాటించేవాడే మనీషి, భగవత్ బంధువు అని చాటారు. తోటి వారి పట్ల మానవత్వం ప్రదర్శించాలనే వారు.  మతసామరస్య ప్రచారానికి విస్తృతంగా ప్రపంచయాత్రలు చేశారు. వాటిని  ‘ఉదాసీ’ యాత్రలు అంటారు. ‘స్వమతాన్ని గౌరవించు, పరమతాన్ని ప్రేమించు’ అనే హితవు పలికారు. తమతమ మత విశ్వాసాలను ఉన్నతంగా భావించవచ్చు కానీ ఇతర మతాల  విశ్వాసాల పట్ల చులకనగా వ్యవహరించడం ఆధ్యాత్మికత కాదని, అలాంటి వారు ఆరాధించే దేవుడు కూడా  ఆ వైఖరిని  మెచ్చడన్నది గురునానక్ వచనం. తాను  మనుషులను మాత్రమే చూస్తాను తప్ప వారు  ధరించిన మతపరమైన దుస్తులు, విశ్వాసాలను కాదని ప్రబోధించారు.  కష్టసుఖాలను సమంగా స్వీకరించాలన్న `గీత` వాక్యాన్ని స్పూర్తిగా తీసుకున్నారు. వాటిని దైవప్రసాదాలుగానే భావించాలనే వారు. ఉదాహరణకు, తమ జైలు జీవితంలో, గోధుమలు విసిరే పని అప్పగించినప్పుడు సహచరులు  బాధపడేవారు. కానీ నానక్, దానిని దైవకార్యంగా భావిస్తూ పాటలు పాడుతూ ఆ పని చేసేవారు. నానక్  మహిమను, ఉన్నత వ్యక్తిత్వం గుర్తించిన  బాబర్ పాదుషా స్వయంగా జైలుకు వెళ్లి మన్నింపు కోరి విడుదల చేస్తానన్నాడు. దానిని మృదువుగా తిరస్కరించిన నానక్, తోటి ఖైదీలకు కూడా స్వేచ్ఛ ప్రసాదించాలని కోరాడు. దానిని ఆమోదించిన బాబర్, తన వంశాభివృద్దికి ఆశీస్సులు కోరగా, `ప్రజలను హిసించనంత కాలం మీ వంశం వర్ధిల్లుతుంది` అని ఆశీర్వదించాడు.అంటే  `ధర్మాన్ని మీరు కాపాడితే  ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది` అనే ఆర్యోక్తిని పరోక్షంగా చెప్పినట్లయింది. ప్రజలను దయతో చూడాలని కూడా సూచించారు.

అవసరం మేరకే ఆర్జన

`కష్టించి, న్యాయమార్గంలోనే ధానాన్ని ఆర్జించాలి.నిజాయతీగా ఆర్జిస్తూ అవసరార్థులను ఆదుకోవాలి. పనిచేసే వాడికే తినే హక్కు ఉంటుందని ఆనాడే  చెప్పారు. కష్టించి ధర్మమార్గంలోనే  ధనార్జన చేయాలి. సంపాదన అవసరమే కానీ సంపాదనే పరమార్థం కాదు.డబ్బు జేబుకే పరిమితం కావాలి తప్ప హృదయానికి తాకకూడదు.  అలా జరిగితే అనేక సమస్యలు  చుట్టుముడతాయి`అని  నేటి సమాజ  పోకడలను నాడే ఎత్తి చూపారు. మహాత్ములు, మహనీయులు మాటలు నిత్యసత్యాలే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles