Friday, March 29, 2024

మహాపాదయాత్రకు మూడేళ్ళు

దేశచరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాదయాత్రకు శనివారంతో మూడేళ్ళు నిండుతాయి. నాటి ప్రతిపక్ష వైఎస్ ఆర్ సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 44 ఏళ్ళ యువకుడు. తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసి అప్పటికే ఏడున్నరేళ్ళు దాటింది. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ధిక్కరించడం, సొంతపార్టీ పెట్టుకోవడం, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనీ, క్విడ్ ప్రో కో కింద ముఖ్యమంత్రిగా వైఎస్ చేసిన పనులకు కృతజ్ఞతాభావంతో జగన్ మోహన్ రెడ్డి వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు జరిపించారు. దర్యాప్తు జరుగుతుండగానే జైలులో 16 మాసాలు ఉంచారు. ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే అప్పటికే జగన్ మోహన్ రెడ్డి అనేక ఎదురుదెబ్బలకు కాచుకొని కరకుతేలారని గుర్తించడానికి. 2014 ఎన్నికలలో కేవలం ఒక వాగ్దానం చేయడానికి వెనకాడి అధికారంలోకి వచ్చే అవకాశం కోల్పోయారు. అదే వాగ్దానం (రైతుల రుణ మాఫీ) చేసి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అధికారం హస్తగతం చేసుకున్నారు.

రెండు శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. పాదయాత్ర ఆ కుటుంబానికి కొత్త కాదు. అప్పటికే 2003లో వైఎస్ ‘ప్రజాప్రస్థానం’ పేరుతో నడివేసవిలో ఏప్రిల్ నుంచి రెండు మాసాలపాటు రంగారెడ్డి జిల్లా  చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ 1,500 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత వైఎస్ కుమార్తె, జగన్ సోదరి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరుతో 18 అక్టోబర్ 2012 నుంచి 04 ఆగస్టు 2013 వరకూ 14 జిల్లాల గుండా మూడు వేల కిలోమీటర్లకు పైగా నడిచారు. ‘రాజన్న కూతురిని,’ ‘జగనన్న విడిచిన బాణాన్ని’ అంటూ తనను తాను ప్రజలకు పరిచయం చేసుకున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన ఒక మహిళ అన్ని రోజులు అంత దూరం పాదయాత్ర చేయడం దేశ చరిత్రలో అదే ప్రథమం.

పాదయాత్రల రాష్ట్రం

అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 02 అక్టోబర్ 2012 నుంచి అనంతపురంలో బయలు దేరి శ్రీకాకుంళం జిల్లా వరకూ 208 రోజులపాటు 2,820 కిలోమీటర్ల (వైఎస్ కంటే రెట్టింపు) నడిచారు. పాదయాత్రకు ‘వస్తున్నా మీకోసం’ అని పేరు పెట్టారు. షర్మిల చంద్రబాబునాయుడు రికార్డును అధిగమించారు. వీరందరి రికార్డులనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బద్దలు కొట్టారు. పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ వయస్సు 54 సంవత్సరాలు, చంద్రబాబునాయుడి వయస్సు 63 సంవత్సరాలు, షర్మిల వయస్సు 39 ఏళ్ళు. జగన్ మోహన్ రెడ్డికి 44 ఏళ్ళు.

కడప జిల్లా ఇడుపులపాయలో 06 నవంబర్ 2017న జగన్ ‘ప్రజాసంకల్పయాత్ర’ పేరుతో మహాపాదయాత్ర ప్రారంభించారు. 341 రోజులపాటు 134 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3,648 కిలోమీటర్లు నడిచారు. ఇంతవరకూ దేశం మొత్తం మీద ఏ రాజకీయ నాయకుడూ ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేయలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు- తండ్రి 1,500 కిలోమీటర్లూ, కుమార్తె 3000 కిలోమీటర్లూ, కుమారుడు 3, 648 కిలోమీటర్లూ పాదయాత్ర చేయడం అపూర్వం. ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబునాయుడు కూడా దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం విశేషం. మరే ఇతర రాష్ట్రంలోనూ రాజకీయ నేతలు ఇంతమంది ఇంతదూరం పాదయాత్రలు చేసిన దృష్టాంతాలు లేవు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం

కడప జిల్లాలో తండ్రి పుట్టిన గ్రామం ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర 180 రోజుల్లో పూర్తవుతుందని ప్రణాళిక వేశారు. కానీ అది 341 రోజులు పట్టింది. ప్రతి శుక్రవారం పాదయాత్రను నిలిపివేసి, హైదరాబాద్ కు వచ్చి,  సీబీఐ కోర్టుకు హాజరై మర్నాడు తిరిగి పాదయాత్ర ప్రారంభించేవారు.  పాదయాత్రలో షార్ట్ కట్ లు లేవు. మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం లేదు. ప్రజలతో కలసి నడవడం, వారి కష్టాలూ, సమస్యలూ అడిగి తెలుసుకోవడం. వాటిని మనసులోనే నాటుకోవడం. వృత్తులవారీగా వివిధ వృత్తులకు చెందినవారికి దారిలో ఎక్కడో ఒక చోట కలసి వారితో సంభాషించడం. వారి జీవితాలను గురించి తెలుసుకోవడం. సమస్యలు ఆలకించడం. 09 జనవరి 2019న, ఎన్నికలకు కొద్ది మాసాల ముందు, పాదయాత్రను ఇచ్ఛాపురంలో ముగించారు. ఇచ్ఛాపురం వెళ్ళినవారు వైఎస్ కుటుంబానికి చెందిన ముగ్గురి పాదయాత్ర ముగింపు చిహ్నాలనూ చూడవచ్చు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం పోరాటడం, పంట రుణాల మాఫీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదంటూ చంద్రబాబునాయుడిపైన ధ్వజమెత్తడం, మహిళలకు డ్వాక్రా రుణాలు ఇవ్వడం లేదంటూ విమర్శించడం, గృహనిర్మాణ పథకాల గురించి గుర్తు చేయడం ప్రసంగాంశాలుగా ఉండేవి. దాదాపు వంద బహిరంగ సభలలో జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించి ఉంటారు. రోజుకి 15 నుంచి 30 కిలోమీటర్ల వరకూ నడిచారు. కాళ్ళు బొబ్బలు కట్టేవి. రక్తం కారేది. ఎన్ని సమస్యలు ఎదురైనా సడలని దీక్షతో పాదయాత్ర సాగించారు. తనను కలసిన వ్యక్తులతో మాట్లాడారు. తనను పీఠంపైన కూర్చోబెడితే ఎవరికి ఏమేమి చేయదలిచారో వాటిని వివరించేవారు. నవరత్నాలు (తొమ్మది వాగ్దానాలు) పేరుమీద పైలాన్ నిర్మించారు. 2016లో బీహార్ లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమి నాయకడు నితీశ్ కుమార్ నినాదం ‘సాథ్ సంకల్ప్. ’ సాత్ సంకల్ప వెనుకా, నవరత్నాల వెనుకా ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిషోర్ బృందం ఆలోచణ, ప్రణాళిక ఉన్నాయి. పాదయాత్రలో చేసిన వాగ్దానాల అమలు కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన 18 మాసాలూ తాపత్రయ పడుతున్నారు.

వాగ్దానాలు నిలబెట్టుకోవాలని పట్టుదల

తనను కలిసిన సుమారు రెండు కోట్ల మంది ప్రజల ఆశలు ఏమిటో, కష్టాలు ఏమిటో తెలిసిన రాజకీయ నేతగా, ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కొన్ని నిర్ణయాలను న్యాయస్థానాలు ఆమోదించడం లేదు. మరికొన్ని ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. ఆర్థికంగా పరిస్థితుల సహకరించాలి. కోవిద్ వల్ల ఏర్పడిన ప్రతిబంధకాలు ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీశాయి. కానీ ప్రజలకు చేసిన బాస ప్రకారం నడుచుకోవాలనే తపన ముఖ్యమంత్రిలో కనిపిస్తున్నది. సాధ్యాసాధ్యాలు పరిశీలించుకొని, ఆచరణసాధ్యమైన పద్ధలిలో ముందుకు వెడితే సత్ఫలితాలు ఉంటాయి. పాదయాత్ర ఫలితంగా, చంద్రబాబునాయుడు చేసిన తప్పిదాల సహకారంతో ఎన్నడూ, ఏ నాయకుడూ సాధించిన ఘనవిజయం జగన్ మోహన్ రెడ్డి సాధించారు. 51 శాతం ఓట్లనీ, 175లో 151 సీట్లనీ గెలుచుకోవడం అన్నది అసాధారణమైన విషయం. పాదయాత్ర స్ఫూర్తితో, ఆచరణ సాధ్యమైన బాటలో, అందరినీ కలుపుకొని వెడుతూ పరిపాలనను నడిపినంతకాలం జగన్ మోహన్ రెడ్డికి తిరుగుండదు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ లాంటివి. రెండిటిలో దేనిని విస్మరించినా పాలకులకు తిప్పలు తప్పవు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles