Thursday, March 28, 2024

ముందున్నవి మంచిరోజులు

  • రోజువారీ కోవిద్ కేసుల సంఖ్య తగ్గుముఖం
  • మాస్క్, వగైరా జాగ్రత్తలు పాటించవలసిందే
  • దిల్లీలోనూ బడులు తెరవడం శుభసూచకం

అత్యంత వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఉన్న ఒమిక్రాన్ ప్రభావం తగ్గుముఖం పట్టి, కాస్త ఊపిరి తీసుకొనే మంచి రోజులు దగ్గరపడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దానికి బలాన్నిచ్చే విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాఖ్యలు, ప్రభుత్వాల చర్యలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఫిబ్రవరి మూడో వారం నుంచి వాతావరణం అనుకూలంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఫిబ్రవరి రెండోవారం ముగియడంతోనే ఉధృతి తగ్గుముఖం పడుతుందని అనుకోవాలి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది. మూడో వేవ్ లో గరిష్ఠ స్థితిని దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మాటలబట్టి అర్థం చేసుకోవాలి.

Also read: సామాజిక న్యాయం సాటిలేని నినాదం

దేశవ్యాప్తంగా వైరస్ అదుపులోకి వస్తోంది

“దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు,పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది “, అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. జనవరిలో కోవిడ్ మూడో వేవ్ ఉధృతి స్పష్టంగా కనిపించింది. జనవరి 21 వ తేదీ నాటికి కోవిడ్ కేసులు 3 లక్షల 47 వేలకు చేరాయి. మూడో వేవ్ లో దీనినే గరిష్ఠ సంఖ్యగా భావించాలి. అప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 3 వ తేదీ నాటికి ఆ సంఖ్య లక్షా 72 వేలకు పడిపోయింది. పాజిటివిటీ రేటు కూడా 18 శాతం నుంచి 11 శాతానికి తగ్గిపోయింది. దీంతో దేశంలో మూడో వేవ్ ప్రభావం గరిష్ఠ స్థితిని  దాటినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే విధంగా సాగితే  వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు భావించాలని నిపుణులు అంటున్నారు.దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. కేరళ,మిజోరాం వంటి రాష్ట్రాల్లో మాత్రం వైరస్ ప్రభావం పెరుగుతోంది. కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, చాలా రాష్ట్రాలలో ఆంక్షలను సడలించారు. ఇప్పటికే 11 రాష్ట్రాల్లో స్కూల్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. మరో 16 రాష్ట్రాల్లో పాక్షికంగా తెరుచుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఇతర రంగాలపై ఉన్న ఆంక్షలను కూడా క్రమంగా ఎత్తేసే పనిలో ఆయా రాష్ట్రాలు ఉన్నాయి.స్కూల్స్ పునఃప్రారంభమవుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వీటిని పాటించడంలో అశ్రద్ధ వహిస్తే,మళ్ళీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. స్కూల్స్ పూర్తిగా తెరుచుకున్న రాష్ట్రాల్లో మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా తీవ్రంగా ప్రభావం చూపించిన దిల్లీలోనూ బడిగంటలు మోగుతుండడం మంచి పరిణామం. అనుకున్నట్లుగా కోవిడ్ తగ్గితే ఈ నెల 15 వ తేదీ తర్వాత  భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి శుక్రవారం నాడు వెల్లడించడం కూడా శుభ పరిణామమే.

Also read: కార్పొరేట్లకు కొమ్ముకాసే బడ్జెట్

ఊపందుకున్న వాక్సిన్ ప్రక్రియ

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, ఇప్పటికే ఆశించిన స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్లు అందడం, తద్వారా  హెర్డ్ ఇమ్మ్యూనిటీ ( సామూహిక రోగ నిరోధక శక్తి) పెరగడం వల్ల ఒమిక్రాన్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. కాకపోతే, రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకడం అలోచించాల్సిన అంశం. ముందు నుంచీ అంటున్నట్లుగా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ, ప్రాణభయం లేకపోవడం వల్ల ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఒమిక్రాన్ దుష్ప్రభావం భవిష్యత్తులో ఊపిరితిత్తులపైన ఉంటుందనే మాటలు కూడా వినపడుతున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ ప్రస్తుతం అదుపులోకి వచ్చినా,నియో -కోవ్ వంటి అత్యంత ప్రమాదకర వైరస్ లు పొంచిఉన్నాయనే వార్తలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఎటువంటి వైరస్ లు పుట్టుకొచ్చినా,ఎదుర్కొన గలిగే సర్వశక్తివంతమైన వ్యాక్సిన్లను నిర్మాణం చేసుకోవడమే ఏకైక పరిష్కారం. స్వయం క్రమశిక్షణను పాటిస్తూ శారీరక, మానసికశక్తిని పెంచుకోవడం కీలకం. కోవిడ్ నుంచి కోలుకొని తిరిగి అన్నిరంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం చారిత్రక అవసరం. మంచి రోజులు త్వరలోనే వస్తాయని బలంగా విశ్వసిద్దాం.

Also read: శీతాకాలంలో కశ్మీర్ లో మంటలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles