Monday, November 28, 2022

శ్రీకృష్ణా మమ్మల్ని రక్షించడానికే అవతరించినావు

21. మన తిరుప్పావై ..గోదా గోవింద గీతం

ఏట్రకలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్

తెలుగు భావార్థ గీతిక

ఘటములెల్ల నిండి పొంగి పొరలెడు పాలనిచ్చు

గోమందల పాలక గోవింద నిదుర లేవవయ్య

నినుదెలియ వేదమేదారి, వేదమైన నినుదెలుపలేదు

సహస్ర సూర్యకిరణ సహస్రాక్ష సహస్రపాదుడీవు

సకలచేతనా చక్షువుల ప్రత్యక్ష తేజో రూపమీవు

బలముడిగి శత్రువులు నీ చరణాలు ఆశ్రయించి

నీయింటి వాకిట అన్యథా గతిలేక శరణు వేడుచున్నారు

నీకు మంగళము పాడ మేము కూడ జేరి నిలిచినాము.

ప్రతిపదార్థములు:

పాల కుండలు (ఏట్రకలంగళ్) నిండి పైకి పొంగి పొరలి పోయే (ఎదిర్ పొంగి మీదళిప్ప) విధంగా ఎడతెగకుండా పాలు స్రవిస్తున్న (పాల్ శోరియుమ్) ఉదారమైన (వళ్లన్) భారీ ఆవులను (పెరుంబశుక్కళ్) విశేషంగా కలిగిన నందగోప కుమారా కృష్ణా (ఆట్రపడైత్తాన్ మగనే) మేలుకో (అఱిఉఱాయ్), వేదం తెలిపిన (ఊట్రముడైయాయ్) మహాబలశాలీ, వేదం వలన కూడా తెలుసుకోవడం సాధ్యం కాని (పెరియార్) మహామహిమాన్వితుడా, ప్రపంచంలో (ఉలగినిల్) సకల చేతనా చక్షువులకు ప్రత్యక్షంగా నిలిచిన (తోట్రం ఆయన్ నిన్ణ) తేజో రూపా (చుడరే), నిద్రమేలుకో (తుయలెజాయ్) , నీకు శత్రువులు (మాట్రార్) నీ ముందు బలాన్ని కోల్పోయి (ఉనక్కు వలితొలైందు) నీ ఇంటి వాకిట (ఉన్ వాశల్ కళ్) గతిలేక నిలిచి (ఆట్రాదువందు) నీ పాదాలను (ఉన్ అడి) స్తుతించినట్లు (పణియు మాపోలే) మేము (యామ్) నిన్ను స్తుతించి (పుగజున్దు) నీకు మంగళాశాసనం (పోట్రి) చేయడానికి వచ్చినాము (వందోమ్).

Also read: తిరుమంత్రమై శ్రీకృష్ణుని కాచే యశోద


అటువంటి (పెరుంబశుక్కళ్) పెద్ద ఆవులెన్నో ఉన్న సంపన్నుడు నందగోపుడి ఇంటిలో మాధవుడిని నిద్రలేపుతున్నారు, ఆండాళ్, నీళాదేవి, గోపికలు. క్షీరాబ్దిలో శేషశాయి అయిన శ్రీవిష్ణువుని కాదు, మాకోసం నందగోప కుమారునిగా జన్మించి మాతో ఉన్న నిన్ను లెమ్మని ప్రార్థిస్తూ ఉంటే మేలుకోవడం లేదేమిటి? నందగోపుని కీర్తించే మాకోసం ఆయన గౌరవం నిలబెట్టడం కోసమైనా మావైపు చూడు. ఆర్తితో పిలిచే మా పిలుపులు వినవా? నీ ఐశ్వర్యం వల్ల మా పిలుపు అందడం లేదా? అని పదేపదే బతిమాలుతున్నా ఆయన కదలడం లేదు. పశుసమృధ్ది ఉన్న వారెందరో ఈ ఊళ్లో ఉన్నారు. నన్నేలేపుతున్నారని ఎందుకనుకోవాలి? అని శ్రీ కృష్ణుడు మౌనంగా ఉన్నాడట. అది గమనించిన గోపికలు శ్రీకృష్ణునికి మాత్రమే పొసగే విశేషణాలతో కీర్తించడం ఆరంభించారు.శత్రువులు బాణముల దెబ్బకు తాళలేక భయపడి నీ వాకిట చేరారు. మాకు ఆ భయం లేదు. నీ గుణములు మనసుకు తూట్లు పొడిచాయి అందుకని వచ్చాం. నేను నాకు నాది అనేవి వదిలేసి వచ్చాం, నిన్ను స్తుతించడం కోసమే. నిద్రలేచి ఆదరించు అంటున్నారు గోపికలు.శ్రీ భాష్యం వారు అంతే ఔదార్యంతో మనను కరుణించి తిరుప్పావై వివరాలు మనకు అందించారు.


నీతండ్రి ద్వారా సంక్రమించిన ఐశ్వర్యము మా ఆర్తి విని తీర్చడానికే గాని మా పిలుపు. వినబడకుండా మదించి నిద్రించడానికి కాదు. అయినా క్షీరాబ్దిని వదిలి, వైకుంఠాన్ని వదిలి, పాలుపితికే మాకులంలో జన్మించింది మమ్మల్ని రక్షించడానికే కదా అంటున్నారు గోపికలు. నందగోపుని గుణాలు అయిదు. 1. వేలాయుధంతో శ్రీకృష్ణుని సేవించడం, 2. నాయకుడు, 3. వస్త్ర, అన్న, జలములను ఉదారముగా ఇచ్చే ధర్మము చేయడం, 4. మదగజాలను ఎదిరించి, సమరంలో వెనుదిరగని వీరత్వం, 5. అవిచ్ఛిన్నముగా పాలు స్రవించే ఉదారములైన గోవులు అనేకం కలిగి ఉండడం. ఆచార్యుని లక్షణాలు కూడా ఇటువంటివే అంటారు శ్రీభాష్యం. 1. భగవంతుడిమీద ఎంత ప్రేమంటే ఆయనను తాను రక్షించాలనుకోవడం, మంగళాశాసనం చేయడం, 2. తాను సాధించిన భగవదనుభవాన్ని అందరికీ అందించాలనుకునే నాయకత్వలక్షణం, 3. దానికి సాధనమైన తిరుమంత్రాన్ని ఇచ్చి, భగవంతుడే ధారకము, పోషకము, భోగ్యముగా ఉండే దశను ఇచ్చే లక్షణం. 4. ఈ అనుభవాన్ని నిరోధించే వారిని జయించే బలం, గజం వంటి పరమాత్మనే వశం చేసుకోగల్గడం, 5. తాననుభవించిన దానిని శిష్యులకు ఉదారంగా ఇచ్చే వాగ్వైభవం కలిగి ఉండడం. అటువంటి వైభవము, ఔదార్యము కల్గిన శిష్యులు ఎంతో మందిని కలిగి ఉండడం. ఇటువంటి ఆచార్యులకు పరమాత్మవిధేయుడై ఉంటాడు.

Also read: నందరాజు సుపాలన చెప్పే పాశురం

నిన్న తనను మేల్కొల్పిన గోదా గోపికలతో నీళాదేవి కలిసిపోయింది. ‘‘నేనూ మీతోనే ఉంటాను. వెళదాం పదండి, మనందరమూ కలిసి శ్రీకృష్ణుని మేలుకొలుపుదాం’’ అన్నది నీళాదేవి. మొన్నటిదాకా శ్రీకృష్ణుణిని క్షణకాలం విడువకుండా ఆశ్రయించి ఉన్న నీళమ్మవారు ఇప్పుడు ఆశ్రయం కోరే వారితో కలిసినడుస్తూ  వారితోపాటు భగవంతుడి ఆశ్రయం కోరుతున్నారు. స్తుతించేప్పుడు మనతో ఉండి, ఆ స్తోత్రాన్ని స్వీకరించేప్పుడు భగవంతుడితో ఉండే అమ్మవారిని శ్రీః అంటారు. జీవకోటితో కలిసి మన మాట వినిపిస్తుంది. భగవంతుడితో కలిసి మన మాటలు వింటుంది. శృణాతి శృణోతి. పురుషకార భూతురాలు. శ్రీవైష్ణవంలో ఉన్న విశేషం అదే. తల్లి మనతోనూ ఉంటుంది. మనం ఆరాధించి ఆశ్రయించే దేవతా అవుతుంది.

Also read: నందుని భవనమే మంత్రము, నందుడే ఆచార్యుడు

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles