Saturday, July 13, 2024

శ్రుతి, స్మృతి, ఇతిహాస పురాణ ఆగమములే ఆ అయిదు దీపాలు

  • గోదా గోవింద గీతం

నేపథ్యం

గోదాదేవి బృందావనంలోని శ్రీకృష్ణుని అభిమానుల బృందానికి ఇక్కడ నాయకత్వం వహిస్తూ పది పాశురాల ద్వారా గోపికలను తనవెంట తీసుకు వచ్చి నీళాకృష్ణులున్న వైభవ భవనానికి చేరుకున్నది. ఆ భవనం దీపకాంతులతో కళకళలాడుతున్నది. తనయులను కాపాడడానికి పోటీ పడే అమ్మానాన్నల ఆతురతను ప్రకటించే పాశురం ఇది. పైకి శృంగార రస భరితంగా కనిపించినా ఈ పద్యంలో భగవత్ తత్వ నిరూపణే జరిగిందన్నారు కీ శే శ్రీ భాష్యం అప్పలా చార్య స్వామి వారు.

కుత్తు విళక్కెరియ క్కొట్టుక్కాల్ కట్టిల్ మేల్

మెత్తెన్ఱ పంజశయనత్తిల్ మేలేఱి,

కొత్తలర్ పూంజ్ఞల్ నప్పిన్నై కొంజ్ఞైమేల్

వైత్తు క్కిడంద మలర్ మార్బావాయ్ తిఱవాయ్,

మైత్తడం కణ్ణినాయ్ నీ ఉన్ మణాళనై

ఎత్తనైపోదుమ్ తుయిలెళవొట్టాయ్ కాణ్

ఎత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్

తత్తువ మన్ఱు తగవేలో రెంబావాయ్

ప్రతిపదార్థాలు

కుత్తువిళక్కెరియ= గుత్తుదీపాలు, ఎఱియ= వెలుగుతూ ఉండగా, కొట్టుక్కాల్= దంతంతో చేసిన కోళ్లుగలిగిన, కట్టిన్ మేల్=మంచముపైన, మెత్తెన్ఱ= మెత్తనైన, పఞ్చశయనత్తిన్ మేల్= ఐదుగుణములు గల పాన్పుపైన, ఏఱి= ఎక్కి, కొత్తు= గుత్తులుగా ఉన్న, అలర్ = వికసించిన, పూజ్ఞుక్కళల్ = పూలుముడిచిన కొప్పుగల, నప్పిన్నై= నీళాదేవి, కొజ్ఞైమేల్ =స్తనములపై, వైత్తుక్కడన్ద= శరీరమును ఆనించి పడుకున్న, మలర్= వికసించిన మార్ పా= వక్షస్థలము గలిగినవాడా, వాయ్ తిఱవాయ్= నోరు తెఱచి ఓ మాట చెప్పు, మై= కాటుక పెట్టుకుని, తడమ్= విశాలమైన, కణ్ణినాయ్= కన్నులు గలదానా, నీ= నీవు, ఉన్మణాళనై= నీ వల్లభుని, ఎత్తనైపోదుమ్= కొంతసేపడికైనా, తుయిలెళవొట్టాయ్ కాణ్= లేవనీయవా ఏమి, ఎత్తనైయేలుమ్= ఎంతమాత్రమైనా, పిరివు= తెఱపి ఎడబాటు, అత్తగిల్లాయ్=ఓర్వలేవా, ఆల్ = ఆశ్చర్యము, తత్తువమన్ఱు= నీ స్వరూపము కాదు కదా తకవన్ఱు= నీ స్వభావమూ కాదు కదా?

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెనుగు సేత సిరినోము పద్యం ఇది

నలుగడ తిరువళికలు వెల్గుచుండ దం

          తపు కోళ్ల పట్టె మంచమ్ము మీద

మెత్తని పాన్పుపై మెయి చేర్చి పుష్ఫ గు

          చ్ఛ సుశోభి తాలక చారు నయన

నప్పిన్న నగ్నస్తన ద్వయిపై మోప

          శయనించి యున్న విశాల వక్ష:

పెదవి విప్పి పలుక వేమి: కజ్జల కమ్ర

          నేత్ర: నీళాదేవి: నీవు పతిని

క్షణమైన నెడబాయ జాల వాతని పాన్పు:

          పైనుండి దిగనీయ వర గడియయు

తగదమ్మ నీ కిది తథ్యమ్ము పలికెద

          తలుపు తీయవె వచ్చి తడయ కింక:

పాశురం అర్థం:

‘‘దీపపు శెమ్మెల మధ్య ఏనుగుదంతాల కోళ్లతో చేసిన మంచం మీద మెత్తని పత్తి పాన్పుపైన, వికసిస్తున్న పుష్పాలను కొప్పులో తురిమిన నీళాదేవి ఎదపై ఒరిగి నిద్రిస్తున్నక్రిష్ణయ్యా మమ్ము చూడు, విప్పారిన కాటుక కన్నుల నీళమ్మా, ఆయన్ను నిద్రలేవనీయవా, ఒక్క క్షణమైనా ఆయన్ను వదలడం సహించలేవా, ఇది నీ స్వరూపానికి తగదమ్మా, ఇది నీ స్వభావమూ కాదమ్మా…’’ అంటున్నారు గోపికలు గోదమ్మ.  నీళా భవనానికి వచ్చి శయనమందిరంలోనున్న నీళాకృష్ణులతో సంభాషించి సంభావించే మధుర గీతం ఇది.

Also Read : ఆమె జీవుడికి దేవుడికి మధ్యవర్తి, వాత్సల్య గుణోజ్వల – అలువేలు మంగమ్మ

శ్రీకృష్ణ పరాక్రమాన్ని, సౌందర్య శృంగార వైభవాన్ని గోదాదేవి అద్భుతంగా ఆవిష్కరిస్తారీ పాశురంలో. కంసుడు తనపైకి పంపిన కువలయా పీడమనే ఏనుగును మట్టుబెట్టి ఆ దంతాలతో తన శయనాగారంలో మంచం తయారు చేయించారు. ఏనుగు దంతాలు ఆయన వీరత్వానికి ప్రతీక. ఆ దంతపు కోళ్ల మంచంపైన మెత్తని, తెల్లని, విశాలమైన, వెచ్చని సుగంధాలు విరజిమ్మే పరుపు. తన భర్త శ్రీ కృష్ణుడు అలసిపోయి నిద్రిస్తున్నారు. వీరపత్ని అయిన నీళాదేవి కూడా ఆ తల్పంపైన శ్రీకృష్ణుని ఎదపై శయనించి ఉంది. ఆ మంచంలోంచి తాను లేవడానికీ, ఆయన్ను లేపడానికీ సంకోచిస్తున్నది. ఎవరో వచ్చారని తెలిసిన నీళాదేవి ‘‘వచ్చిన వారితో నేనే మాట్లాడతాను. ఆయనను లేపడం ఎందుకు’’ అని ఆలోచిస్తున్నది. ‘‘ఏమమ్మా ఒక్క క్షణమైనా ఆయన్ను వదలవా, క్రిష్ణయ్య నిద్రలేవడానికి సమ్మతించవా’’ అంటూ ‘‘ఇది నీ లక్షణం కాదు కదమ్మా’’ అంటున్నారు బయట వేచిఉన్న గోదా గోపికలు. అయినా భర్తకు నిద్రాటంకం జరగకూడదని నీళాదేవి అనుకుంటూ ఉంటే, ‘‘నీవు నచ్చజెప్పి మాదగ్గరకు పంపాల్సింది పోయి, కనీసం లేపనైనా లేపవా తల్లీ’’ అని వేడుకుంటున్నారు గోపికలు.

‘‘ఇంత పొద్దున్నే ఏమిటీ అల్లరి అని ఊళ్లో పెద్దలు అంటారేమోనని మేము ఇంకా చీకటి విడిపోకముందే చిన్న దీపపు కాంతిలో వెతుక్కుంటూ వచ్చాం. నీవేమో లోపల అనేకానేక దీపాలు వెలిగించి రాత్రిని పగలుగా మార్చి శ్రీకృష్ణుని సౌందర్యాన్ని ఆరాధిస్తూ చూస్తూ కూర్చున్నావు. మా ఇంట్లో కూడా దీపాలు వెలిగిస్తే కదా నీ అనుభవం పరిపూర్ణమయ్యేది? రాముడు సీత ప్రేమతో వెలిగిపోయాడు ఆయనకు వేరే దీపాల కాంతి ఎందుకు. నీవు శ్రీకృష్ణుని వైభవాన్ని వెలిగించే దీపపు శెమ్మెవు. ఇంకా వేరే దీపాలెందుకు. మాకు దూరంగా ఉన్నందుకు నీకు బాధగా ఉండాలి కదా, మెత్తని పరుపు కఠినంగా అనిపించాలి కదా అదేమీ లేదా, హాయిగా నూలు పరుపు మీద పడుకున్నావా? కృష్ణుడికి దూరంగా ఉన్న మా బాధను అర్థం చేసుకోలేవా?’’ అని బతిమాలుతున్నారు గోపికలు.

Also Read : తలుపులు తెరిస్తే కదా తలపులు మెరిసేది

శ్రీకృష్ణుడు నీళాదేవి కౌగిలిలో, నీళాదేవి శ్రీ కృష్ణుని ఎదమీద సేదదీరుతున్న సందర్భాన్ని అప్పుడు గోపికలు ఆదుకొమ్మని కోరే సంభాషణను గోదాదేవి నర్మగర్భితంగా అద్భుతమైన ఉపమాలంకారాలతో వర్ణించే గీతిక ఇది. ఒకరినొకరు ఎడబాయని వారి అనురాగ బంధాన్ని వివరిస్తున్నది. ‘‘అనన్యాహి మయా సీతా…’’ అని సీత ‘‘అనన్యా రాఘవేణాహమ్…’’ అని రాముడు ఒక్క క్షణమైనా ఒకరినొకరు వీడి ఉండలేం అని అన్నారట. అదే విధంగానే ఉన్నారు నీళా కృష్ణులు కూడా.

‘‘నీ విశాల వక్షాన్ని నీళమ్మకు ఇస్తే ఇచ్చావు. మాకొక మంచి మాటైనా ఇవ్వవచ్చు కదా’’ అని శ్రీ కృష్ణుణ్ని ద్వారం బయటనుంచే గోపికలు అడుగుతున్నారు. అప్పుడు ‘‘మన కోసం ప్రేమతో వచ్చిన వారిని పలకరించకపోతే ఎట్లా’’ అని ఆయన లేవబోయారట, వెంటనే నీళాదేవి గట్టిగా ఆపేసిందట. అది గమనించి ‘‘అమ్మో అమ్మను మంచిచేసుకోవలసిందే’’ అనుకుని ‘‘విశాలమైన కాటుక కన్నుల దానా నీదయగల చూపులతో ఆదుకోవమ్మా. మేమేమో వ్రతంకోసం కాటుక పెట్టుకోలేదు. నీవు కాటుక కన్నులతో జగన్నాధుని వశం చేసుకున్నావు మమ్మల్ని ఆయన్ను చూడనివ్వవు. ఆయన్ను మమ్ముల చూడనివ్వవు. సీత కన్నుల అందం చూస్తూ రాముడు ముగ్ధుడైనట్టు శ్రీ కృష్ణుడిని కన్నులతో కట్టి పడేసినావు కదమ్మా’’ అన్నారట. మళ్లీ ఆ గోపికలే ‘కాదు కాదు అమ్మ కాటుక పెట్టుకోలేదు. ఆ నల్లని మేని కాంతులు ఆమె కన్నులకు సోకి కాటుక కన్నుల వలె కనిపిస్తున్నాయి’ అని పోల్చి ‘‘ఆ కాంతులు మా కన్నులలో కూడా వెలగనీయవా’’ అని అడుగుతున్నారు గోపికలు.

శ్రీ కృష్ణుని చూపులు ఆయన జ్ఞాపకాలు, శ్రీ కృష్ణుని తో అనుభవాలే ఆమె లోకం. ‘‘జగన్నాధుడైన శ్రీ కృష్ణుడిని నీ ఒక్కదానివే ఆస్వాదిస్తావా మాసంగతేమిటి’’ అని గోపికలు ప్రశ్నిస్తున్నారు. వారు సీతారాముల వలె ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. రామతత్వం అదే కృష్ణ తత్వం కూడా అదే. అమ్మా సీతమ్మా రాముడికి చెప్పవమ్మా, అమ్మా నీళమ్మా క్రిష్ణయ్యకు చెప్పవమ్మా మమ్ములను ఆదుకొమ్మని గోదమ్మ గోపికలతోజట్టుకట్టి అడుగుతున్న మాట ఈ పందొమ్మిదో పాట. రామదాసు అన్నట్టు మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..అని వేడుకుంటున్నారు గోపికలు.

Also Read : తిరుప్పావై అంతా గురుపరంపర ధ్యానమే

అంతరార్థం

గోపికలకు వెన్నెల, దీపము శత్రువులట, చీకటియే వారికి శ్రీకృష్ణానుభవమునకు సహకరిస్తుందని వారి భావం. నీళాకృష్ణులతో సమానత్వం తమకూ ఇవ్వాలని కోరుతున్నారు. శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారు తిరుప్పావైలో రామాయణ రహస్యాలను వెలికి తీసారు. రమమాణా వనత్రయః అని వాల్మీకి అన్నారు. వనంలో ముగ్గురు అంటే సీతారాములు, ఆయనతో పాటు లక్ష్మణుడూ రమిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? సీతారాములు అన్యోన్యానుబంధంతో రమిస్తుంటే, వారిని సేవించి అంతటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడట లక్ష్మణుడు. ఆ సేవా భాగ్యంతో సమానమైన ఆనందం అడుగుతున్నారు గోపికలు. లక్ష్మిని మంగళ దీపరేఖామ్ అంటారు. పరమాత్మను ప్రకాశింపచేసేది లక్ష్మీతత్త్వము. ఆమె విద్యుల్లేఖ. తను మెరియడానికి వేరే ఏమీ అక్కరలేదు. నీళాదేవి తాను కనపడక పరమాత్మను కనపడనీయడం లేదట, నీకంటే దీపమే మంచిది అని గోపికలు నిష్టూరాలు పలుకుతున్నారు. దీపం అంటే కనిపించే వెలుగు విరజిమ్మేది మాత్రమే కాదు. నారాయణతత్త్వాన్ని ఎఱుక చేసే  జ్ఞానదీపం. కృష్ణుడు గోపవంశ సముద్భూత మంగళదీపమే. కాని అది అప్రకాశము, అన్యధీన ప్రకాశము. అంటే తనంత తాను ఎవ్వరికీ కన్పడదు. నీళాదేవి ప్రకాశింపచేయాల్సిందే. అక్కడ అయిదు దీపాలున్నాయట. అవి శ్రుతి, స్మృతి, ఇతిహాసము, పురాణములు, ఆగమములు. ఈ అయిదువిధముల విజ్ఞాన సాధన ప్రమాణములైన  గుత్తి దీపములు అవి. వీని నుంచి వచ్చే వెలుగు జ్ఞానం. దాంతో మనకు కనిపించేది శ్రీతత్త్వమూ నారాయణ తత్త్వములు.

మధురలో కంసుడు పంపిన ఏనుగు, శ్రీకృష్ణుడు చంపిన కువలయా పీడము. విశేషార్థం ఏమంటే కువలయాపీడము బలీయమైన అహంకారం. నేనే చేసాననే అహంకారం, నేనే అనుభవిస్తాననే అహంకారం, నాకే తెలుసుననే అహంకారం, ఇదంతా నాదేననే అహంకారం. దంతపు మంచపుకోళ్లు నాలుగు కర్తృత్వ అభిమాన రహితములగు శేషత్వ, కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వములు. నాల్గువిధములుగా నుండే అర్థములు 12 ఉన్నాయని శ్రీభాష్యం అప్పలాచార్యులు వివరించారు. అవి: 1. దేహములు: దేవ, మనుష్య, తిర్యక్, స్థావరములు, 2. వర్ణములు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, 3. ఆశ్రమములు: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సంన్యాసములు, 4: భగవద్భజనశీలురు: ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానులు, 5. పురుషార్థములు: ధర్మ, అర్థ, కామ, మోక్షములు, 6. మోక్షము: సారూప్య, సాలోక్య, సమీప్య, సాయుజ్యములు, 7. మోక్షసాధనములు: కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తులు, 8. మరణానంతర గతులు: యామ్యగతి, గర్భగతి, ధూమాదిగతి, అర్చిరాదిగతులు. 9. యుగములు: కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు, 10. యుగధర్మములు: ధ్యాన, యజన, అర్చన, సంకీర్తనములు. 11. వ్యూహములు: వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు. 12 భగవత్క్రియలు: సృష్టి, స్థితి, సంహార, మోక్షప్రదత్వములు. ఈ వివరాలు తెలియాలంటే అప్పలాచార్యుల వారి భాష్యం చదవాలి, ప్రవచనం వినాలి. ఇంతటి చతుర్విధ జ్ఞానానికి ప్రతీకలైన ఆ నాలుగు కోళ్ల మంచముపై నీళాకృష్ణులు శయనించి ఉన్నారు. సాధారణ మనుష్యులకే మంచము విరామ వేదిక. ఆనంద వేదిక.  మంచము అనేక లౌకిక ఆయాసములను పోగొట్టి సుఖము నిచ్చే చోటు. ఇచట ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే జగతః పితరుల మంచము బ్రహ్మానందానుభవానికి వేదిక.

Also Read : శంఖం ప్రణవం, చక్రం సుదర్శనం, దారి విష్ణువు

పడకకు అయిదు లక్షణాలు ఉండాలి. 1.వేసవి లో చల్లదనం, శీతాకాలములో వెచ్చదనము, 2, పరిమళము, 3. తెల్లదనము, 4. మెత్తదనము, 5. విస్తృతత్వము.

పంచశయనము అంటే అర్థపంచకజ్ఞానము. అర్ధ పంచకములు: 1.ప్రాప్యమగు బ్రహ్మస్వరూపము, 2. బ్రహ్మప్రాప్తికి అర్హుడయ్యే జీవి స్వరూపము, 3. బ్రహ్మను పొందే ఉపాయము, 4. బ్రహ్మప్రాప్తిచే లభించు ఫలము, 5 బ్రహ్మప్రాప్తికి ప్రతిబంధకములు. అర్థపంచకజ్ఞానము ఉంటేనే భగవదనుభవము సులభమవుతుందని అప్పలాచార్య స్వామి వారు వివరించారు.

నీళాదేవి వీరపత్ని. కువలయాపీడమనే ఏనుగును జయించిన శ్రీకృష్ణుని శౌర్యాన్ని ఆ ఏనుగు దంతాలతో చేసిన మంచంకోళ్లు గుర్తుచేస్తుంది. భర్త విక్రమోపార్జితమైన వస్తువులంటే ఆమెకు ఇష్టం. రాముడొక్కడు ఖరదూషణ త్రిశిరులతోపాటు 14 వేల మంది రాక్షసులను జనస్థానంలో నిర్జించిన తరువాత, అప్పడికే రాక్షసుల బాణాల దెబ్బలతో కవచం కోల్పోయి, ఆయన వక్షస్థలం రక్తసిక్తమై ఉంది. ఆ స్థితిలో ఉన్న భర్తను సీత ఆలింగనం చేసుకుంటుంది. ఆమె కౌగిలిలో రాముడు సేదదీరుతాడు. భర్తే సర్వము అని భావించి నిర్భరంగా ఉండే వీరపత్ని ప్రపన్నుడితో సమానం. భారమంతా భర్త యైన భగవంతుడిమీద వేసే ప్రపన్నతే ఆ వీరపత్ని లక్షణం. విష్ణువక్షస్థల వర్ణనలో అంతరార్థం అదే.

Also Read : విష్ణు సేవలో కులభేదం లేదు

నీళ ప్రేమాంజనా రేఖ

వ్రతసమయంలో పూలు పెట్టుకొనము కాటుక దిద్దుకొనము అని గోపికలు దీక్షబూనారు. నీళాదేవి కేశపాశములనిండా పూల గుత్తులు ఉన్నాయి. అవి శ్రీకృష్ణుని ఆకట్టుకుంటున్నాయి. తాము జడలో పూలు ముడువడం లేదు నీవు మాత్రం పూలతో ఆయన్ని కట్టి పడేస్తున్నావని అధిక్షేపిస్తున్నారట గోపికలు. కాటుకదిద్దిన విశాలనేత్రాలతో నీళాదేవి శ్రీకృష్ణుడిని తలుపు తెరవడానికి వెళ్లరాదని కన్నులతోనే ఆదేశించడం చూచి, ఏమ్మా నీ కాటుక కన్నులతో శ్రీకృష్ణుడిని స్వాధీన పరుచుకుని మాకు దగ్గర చేస్తావనుకున్నామే గాని ఆ కాటుక కన్నుల సైగలతోనే మాకు దూరం చేస్తావా అని ప్రశ్నిస్తున్నారు. ప్రేమ అనే అంజనం ధరించకపోతే ఎంత జ్ఞానమున్నా భగవత్స్వరూపము భాసించదు. నేత్రం జ్ఞానానికి ప్రతీకఅయితే కాటుక ప్రేమనట. పదినెలలు శ్రీరాముని ఎడబాటు సహించడం సీతకు చాలా కష్టమైనది. తరువాత క్షణమైనా విడిపోవడం కష్టం. గట్టిగా కౌగిలించుకున్న శ్రీకృష్ణుడు గోపికలు పిలిచినప్పుడల్లా కౌగిలి బిగి సడలించగానే ఎక్కడ విడిపోతాడోనని భయపడి గట్టిగా పట్టుకుంటున్నదట. ఏమమ్మా సీత పదినెలలు విరహం భరించిందే నీవు ఒక్క క్షణం కూడా భరించవా? అని అడుగుతున్నారు గోపికలు.

ఆమె వక్షస్థల స్పర్శచేత స్వామి హృదయం విశాలమైంది. ఆమె జడలోపూలు, శ్రీకృష్ణస్సర్శచేత మరింత వికసించాయట. శ్రీదేవి జ్ఞానము భక్తి అనే స్తనములపైన, కేశపాశమనే భక్తివల్ల పుట్టిన వ్యామోహముతో, జీవాత్మలనే పుష్పములు గుత్తులుగుత్తులుగా దాల్చినాడట పరమాత్మ. నిజానికి ఆయనకు వికాస సంకోచాలు లేవు. కాని వికసించాడు. అయితే ఆయన కర్మద్వారా వికాస సంకోచాలు చెందడు. కేవలం కరుణతోనే కదిలిపోతాడు. అది దోషము కాదు. అది గుణ వైభవము. ఒక్కోసారి శ్రీదేవిపైన శ్రీకృష్ణుడు, మరొకసారి కింద శ్రీకృష్ణుడు ఉంటారు. దానికి వివరణ ఇది. భోగదశలో పరమాత్మలో తాను అణిగి యుండి శ్రీదేవి జీవులచేత సేవింపబడుతూ ఉంటుంది. ఆశ్రయదశలో లక్ష్మిపైనుండి జీవులను పరమాత్మతో చేరుస్తూ ఉంటుంది.

Also Read : లక్ష్మణుడు యోగి, భరతుడు ముని: ఇద్దరూ రామభక్తులే

నీళాదేవి లేచి తలుపుతీయబోతే శ్రీకృష్ణుడు ఆమెను ఆపి, మంచముపై పడుకోబెట్టి, ఆమె వక్షస్థలము పై పడుకొని ఉండడం గమనించారు. ఆమె కేశపాశముచూసి మోహించి మాకోసం తలుపుతెరవడం మరిచావా, పోనీ తలుపు తెరవడానికి రాకపోయినా సరే, ఆమెతోనూ ఉన్నా సరే, కనీసం మాట్లాడు శ్రీకృష్ణా అని ప్రార్థించారు. నీళాదేవి ద్వారా తనను ఆశ్రయించిన జీవి అంటే పరమాత్మకు ఎక్కువ కారుణ్యం. నీళాదేవి తనను అర్థించారు కదా అని తానే వెళ్లి తలుపులు తెరవాలనుకున్నది. కాని నీళకు సంబంధించిన జీవి అడిగితే తానే ప్రేమతో తలుపుతీయాలని శ్రీకృష్ణుడు ఆమెను ఆపి, వెనుకకు లాగి, మంచంపై పడవేసి, ఆమెపై తాను అదిమిపట్టి పడుకొని, ఆతరువాత ఆ స్పర్శసుఖమువల్ల ఒడలు మరిచి తలుపుతెరవనే లేదు. అది చూసిన గోపికలు తలుపులు తెరవాలని కోరితే స్వామిలేవబోయాడట. అప్పుడు నీళ స్వామిని ఆపివేసిందట. అది చూసి అమ్మా ఇది న్యాయం కాదన్నారు.

పరమాత్మ సృష్ఠికి ముందు తరువాత కూడా లక్ష్మీసహితుడే. శ్రీమన్నారాయణ తత్త్వము అవిభాజ్యమైన ఏక, అనేకతత్త్వము. పరమాత్మ కారుణ్య సంకల్పంవల్లనే జగత్తు పుట్టి, నిలిచి పోతూ ఉంటుంది. కారుణ్యసంకల్పమే శ్రీదేవి. సంకల్పం పరమాత్మకన్న వేరు కాదుకదా. అయితే జీవులను రక్షిస్తున్నదెవరు? శ్రీ యా? శ్రియఃపతి శ్రీమన్నారాయణుడా? అవును  నారాయణుడే. కాని శ్రీ కాదు. అయితే కేవలం నారాయణుడు కూడా కాదు. శ్రీమంతుడైన నారాయణుడు. శ్రీదేవి ఆయనను రక్షకుడుగా మారుస్తున్నది. శ్రీ అనే కారుణ్యసంకల్పము రక్షణ అవసరం లేనపుడు పరమాత్మ వక్షస్థలంలో ఒదిగి ఉంటుంది. అవసరమైనపుడు ఆ కారుణ్యం ఉద్బుధ్దమవుతుంది. శృంగారమైన రీతిలో వారిరువురి ఏక అనేక తత్వాన్ని గోదాదేవి రమ్యంగా వివరించినా, నిజానికి ఈ దృశ్యం వెనుక ఉన్న తత్వం కారుణ్యమయ సంకల్ప వర్ణనే. ఇందులో శ్రీతత్వమూ ఉంది నారాయణ తత్వమూ ఉంది అని అప్పలాచార్య వివరించారు. ఆఇద్దరూ వేరు కారని తెలియజేయడం తెలుసుకోవడం ఈ పాశురంలక్ష్యం.

ముక్త పురుషుని వైకుంఠ యాత్ర

ముక్తపురుషులు శ్రీ వైకుంఠం ప్రవేశించి పరమాత్మ దగ్గరికి చేరుకుంటారు. సమున్నతుడైన శ్రీ మహావిష్ణువు శ్రీదేవితో కూడి పర్యంకముపై వేంచేసి ఉన్నారు.  అంత ఎత్తుకు చేరడం ఎలాగో తెలియక ఆలోచిస్తున్న ముక్త పురుషుడిని నారాయణుడే చేయిచ్చి తన పాదముపై ఎక్కించుకుని తదుపరి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటారట. అప్పుడు నీవెవరివి అని ప్రశ్నిస్తారు. పరమాత్మనుంచి వేరుకాననీ, పరమాత్మలోని భాగాన్ని అనే అర్థంలో ‘అహం బ్రహ్మాస్మి’ అని చెప్పగలిగే స్థాయికి చేరుకుంటాడు.  అటువంటి పరమాత్మ పర్యంకమే నీళా కృష్ణులు శయనించిన మంచం. ముక్తజీవులు వైకుంఠం చేరి అక్కడ పరమాత్మ పర్యంకాన్ని ఎక్కగలిగి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటే, గోపికలు ఆ మందిరం బయటనుంచే ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారట. వైకుంఠంలో బ్రహ్మానందాన్ని అనుభవించడాన్ని పర్యంక విద్య అంటారు.

Also Read : దర్శనంతో గోపికలనూ స్పర్శనంతో గోవులనూ అలరించే మేఘవర్ణుడు

దంపతులను గౌరవించాలి

వివాహబంధం సమాజంలో పరిపక్వమైన నాగరికతా లక్షణం. దంపతులను గౌరవించడం, వారిని ఆది దంపతులైన గౌరీ శంకరులుగా లేక ఆదర్శ దంపతులైన సీతారాములుగా పూజించడం భారతీయ సంప్రదాయం. ఆ మిధునం (జంట) రక్షణనే కోరుకోవాలి. రాముడు లేని సీతను కోరుకుని రావణుడు, సీత లేకుండా రాముని కోరిన శూర్పణఖ పతనమైనారు. ఇది లోకం పాటించవలసిన నీతి, రీతి. దంపతులపట్ల సక్రమమైన ఆలోచనలు కలిగించే అంతర్లీనమైన నీతి ఈ పాశురంలో ఉంది. శ్రీదేవిని మహావిష్ణువునుంచి విడిగా చూడకుండా వారిద్దరిమధ్య ఉన్న అనిర్వచనీయమైన సానురాగబంధాన్ని గమనించాలి. మానవుల్లో పవిత్ర బంధాల భావనను చాటిచెప్పేది ఈ గోదా కీర్తన.

పితేవ త్వత్ప్రేయాన్ జనని పరిపూర్ణాగసి జనే

హిత శ్రోతో వృత్త్యాభవతి సకదాచిత్ కలుషధీః

కిమేత న్నిర్దోషః కఇహ జగతీతి త్వముచితైః

ఉపాయైః విస్మార్య స్వజనయసి మాతా తదసినః

అని ఆర్యోక్తి

ఏదో తప్పు చేసారని పిల్లలమీద నాన్న కోపంతో ఉన్నారు. పిల్లలు తల్లడిల్లి పోతున్నారు. అప్పుడు ‘‘తప్పులు చేయని వారెవరున్నారు? అంతకోపం ఎందుకు…. పిల్లలు కదా’’ అని మృదు మధురంగా ఆ మాటా ఈ మాటా ప్రస్తావిస్తూ భర్తకు నచ్చజెప్పి శాంతపరిచే తల్లి ఎంతో ఉన్నతురాలు. ఆ ఆప్యాయతకు కొలమానం ఉంటుందా? వెంటనే తండ్రికూడా అవుననుకుని పిల్లలతో చేరడానికి ముందడుగువేస్తాడు. తల్లి ‘‘నేనే ముందు’’ అంటుంది. తమ పిల్లలను ఆదుకోవడానికి ఆదరించడానికి అనురాగం చిలకరించడానికి తల్లిదండ్రులు పోటీ పడినట్టే, తనను నమ్మిన భక్తులను కాపాడడానికి లక్ష్మీనారాయణులు పోటీపడుతుంటారని గోదా దేవి ఈ పాశురంలో వివరిస్తారు.

Also Read : శ్రీకృష్ణానుభవమే స్నానం, ధ్యానం, నిద్ర

తల్లిదండ్రుల మధ్య ప్రగాఢమైన అనుబంధం, వారిద్దరు కలిసి తమను ఆదుకోవాలన్న పిల్లల తాపత్రయం, అన్నింటికీ మించి అంతులేని అనురాగం ఈ పాశురంలో కనిపిస్తుంది. దాంపత్య సంబంధాలు… కుటుంబం, పిల్లలు తల్లిదండ్రుల అనుబంధాలను భక్తి భావాలతో భగవత్ సంబంధ సాపత్యంతో వివరించిన గొప్ప ఆధ్యాత్మిక గీతం ఇది. లక్ష్మి ఈ లోకానికే తల్లి. జగన్నాధుడే తండ్రి. మనమంతా ఆ ఆదిదంపతుల సంతానం. మనను ఆదుకోవడానికి నేనంటే నేనని వారు పోటీపడుతుంటారు.

సీతారాముడిని లక్ష్మీ నారాయణుడిని, నీళా కృష్ణుడిని ఇద్దరిద్దరినీ ఆదుకొమ్మని కోరాల్సిందే. సీత ను కాదని రాముడిని లేదా రాముడు వద్దని సీతను కోరుకుంటే రావణులమో లేక శూర్పణఖలమో అవుతాం. గురుంపరపరలో ఓం శ్రీధరాయనమః అను వాక్యం ప్రకారం సర్వేశ్వరుని నిద్రలేపుతున్నారట.

Also Read : జీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం

అనురాగపూరితులైన దంపతుల గురించి వైవాహిక బంధానికి ఉన్న పవిత్రతను గురించి వివరిస్తూ ఆ బంధాన్ని సమాజం గుర్తించవలసి ఉంటుందని గోదాదేవి ఉద్భోదిస్తున్నారు. అమ్మా నాన్నా ఇద్దరూ కలిసి మనను నడిపించాలని గోదమ్మ కోరినట్టు గోపికలు కోరినట్టు మనమూ కోరుకుందాం.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles