Saturday, April 20, 2024

మానవత్వపు సుగంధాలు విరజిమ్మే కావ్యం తిరుప్పావై

  • 17 గోదా గోవింద గీతం

నేపథ్యం

అన్నదమ్ములను భార్యాభర్తలను విడదీసేవారు, పిల్లలను తల్లినుంచి వేరుచేసి చంపే వారు కంసుడి వంటి వారు. మనుషుల మధ్యవిభేదాలు సృష్టించేవారు రాక్షసులు. విభజించి పాలించే వారు దుష్టపాలకులు. వీరినుంచి యశోద నందులు చిన్నారి క్రిష్ణయ్యను కాపాడుకుంటున్నారు. నిన్నటి పాశురంలో ద్వారపాలకులను బతిమాలుకుంటే నందగోపుని భవనంలోపలకి అనుమతించారు.  అక్కడ నందుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు శయనించి ఉన్నారు. యశోదకు నందుడికి భయం. మన్మథుడికే మన్మథుడైన బాలకృష్ణుని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని, మహాబలుడు బలరాముడిని వేరు చేస్తారేమోనని భయం. అందుకే నిద్రపోయేసమయంలో కూడా శ్రీకృష్ణుని ఇటు, బలరాముని అటు పరుండబెట్టుకుని మధ్య మధ్య చూసుకుంటూ ఉన్నదా తల్లి.  రాక్షసులు ఎక్కువై పోతున్న సమాజంలో యశోదానందులకున్న భయం అందరికీ ఉంటుంది అని వివరిస్తున్నదీ పాశురం. నందగోపుడు గురువు, యశోదే మంత్రం, శ్రీకృష్ణుడే భగవంతుడు, విష్ణువుకు పానుపై, శ్రీరామునికి లక్ష్మణుడై, శ్రీకృష్ణుడికి అన్నయై ప్రక్కతోడుగా ఉన్న బలరాముడూ పరమ భాగవతోత్తముడని ఈ పాశురం సారాంశం.  ఆచార్యుడు మంత్రం అందిస్తాడు. ఆమంత్రార్థం  పరమాత్మ, ఆ పరమాత్ముని చేర్చేది భాగవతోత్తముల సేవ అని  సందేశం. అడుగడుగునా మానవత్వపు సుగంధాలు విరజిమ్మే కావ్యం తిరుప్పావై. యశోదను బలరామకృష్ణులను మేలుకోలిపే పాశురం ఇది.

అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్

ప్రతిపదార్థం

అమ్బరమే = వస్త్రములు, తణ్ణీరే = చల్లని నీరు,శోఱే = అన్నము, అఱం = ధర్మం, శెయ్యుం= చేయునట్టి ఎమ్బెరుమాన్ = మాస్వామీ, నందగోపాలా! =నందగోపాలనాయకుడా, ఎరుందిరాయ్ =లేవయ్యా,
కొన్బనార్కు ఎల్లాం= ప్రబ్బలి మొక్కవలె యున్న స్త్రీలందరికీ, కొళుందే! =చిగురువలె నుండే దానా, కుల విళక్కే= కులదీపమువంటి దానా, ఎమ్బెరుమాట్టి = మాస్వామినీ, యశోదా! =యశోదమ్మతల్లీ, అఱివుఱాయ్ = నిదురలేవమ్మా, అమ్బరం =ఆకాశమును, ఊడఱుత్తు =మధ్యగా భేదించి, ఓంగి = పెరిగి, ఉలగ = లోకములను, అళంద= కొలిచిన, ఉమ్బర్ కోమానే! = నిత్యసూరులకు రాజయినవాడా, ఉఱంగాదు-= నిదురించరాదు, ఎరుందిరాయ్= మేల్కొనుము. శెమ్ పోల్ కళల్ = ఎర్రని బంగారముతో చేసిన కడియము ధరించిన, అడి= పాదముగల, చ్చెల్వా బలదేవా!= బలరాముడా, ఉమ్బియుం = నీ తమ్ముడును, నీయుం =నీవును, ఉఱంగ్-ఏల్ = మేల్కొనండి.

Also Read : తలుపులు తెరిస్తే కదా తలపులు మెరిసేది

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు అనువదించిన తిరుప్పావై సిరినోము తెలుగు పద్యం.

తిన తిండి త్రావ నీరును కట్టుకొన వస్త్ర

          ములనిచ్చి మము సాకు పుణ్యసన్ని

ధీ: నంద గోపయ్య: తెలవారె మేలుకో

          ఎల్ల గోపికలకు నేడు గడవు

కులదీపిక: యశోద: తెలవారె మేలుకో

          వినువీధి చీల్చుక విశ్వమెల్ల

పెరిగిన స్వామి: నిద్దుర మాని మేలుకో

`        చెంగావి బంగారు సిరులు చిలుకు

గండ పెండేరమ్ము కాలను దాల్చిన

          ఘనకీర్తి: బలదేవ: కనులు తెరచి

నీవు నీ తమ్ముడు నిదురలెం డికనైన

          మేలుకొండు: జగాల నేలుకొనుడు

భావార్థం

ఈ పాశురంలో వారిని ఒక్కొక్కరినీ మేలుకొలుపుతున్నారు. ద్వయ మంత్రాన్ని పొందడానికి ముందు గురుపరంపరను ధ్యానించాలి. పదిమంది గోపికలకు ఆహ్వానం పలకడమంటే గోపికలు గురుపరంపరను స్మరించారు. తరువాత అమ్మవారి ద్వారా నారాయణుని ఉపాయంగా ఆశ్రయించాలి. గురుపరంపరాధ్యానంతో ఆచార్యకులం చేరే అర్హత లభించింది, అదే నందగోపుని భవనం. ఆచార్యుని ఆశ్రయించాలంటే అంతకుముందు అహంకారాన్ని వదులుకోవాలి, దానికి శమదమాలు ఉండాలి. ద్వారపాలకులను బతిమాలడంలో తమ బుధ్దిని అహంకార రహిత స్థితిని సూచించారు. తరువాత భవనంలోకి ప్రవేశించి తొంగి చూస్తూ నలుగురు నిద్రిస్తూ కనిపిస్తారు. కనిపించిన రీతిలో క్రమంలో వారిని మేలుకొలపడం ప్రారంభిస్తారు గోదా గోపికలు. ముందు రాజు నందగోపాలుడిని లేపుతున్నారు. నందుని మేల్కొలుపడం అంటే ఆచార్యసమాశ్రయణము, యశోదను మేల్కొలుపడం అంటే తిరుమంత్రాన్ని సాధించడం, శ్రీకృష్ణుని మేల్కొలుపడం అంటూ భగవంతుడు సాక్షాత్కరించడమే, బలరాముడిని నిద్రలేపడమంటే భాగవతులను ఆశ్రయించడం.

నందగోపాలుడు వ్రేపల్లెలో జనప్రియమైన నాయకుడు. వస్త్రాలు కావలిసిన వాడికి వస్త్రాలు, త్రాగునీరు కావలసిన వారికి త్రాగునీరు, అన్నం అడిగే వారికి అన్నం, ధర్మబుద్ధితో, ప్రతిఫలాపేక్షలేకుండా ఇచ్చే ఉత్తముడు నందగోపుడు. అటువంటి మాస్వామీ మేలుకోవయ్యా అని శుభోదయం పలుకుతున్నారు.

Also Read : తిరుప్పావై అంతా గురుపరంపర ధ్యానమే

పుండరీకాక్ష రక్షమాం

ఈ పాశురం వస్త్రదానంతో మొదలవుతుంది. రాజు వస్త్రాన్ని కూడా ఇస్తాడు అవసరమైన వారికి. కాని ఆ రాజే వస్త్రాలను దుర్మార్గంగా వంటి మీదనుంచి తీసేసుకుంటే ఏం చేయాలి? ఎవరు ఆదరిస్తారు? అంబరము, అంటే శరీరాన్ని దాచుకునే చీరను ఇచ్చేదెవరు? ఇక్కడ వస్త్రం ఎంత అవసరమైందో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో తెలుసుకోవాలి. అయిదుగురు మహావీరులైన భర్తలు ఉండి కూడా ఏమీ చేయలేని దశ. భీష్మద్రోణ కృపాచార్యులు ఊరక మిన్నకుండిన పరిస్థితి, రాజు గుడ్డివాడైనా చెవులు వినిపిస్తున్నాయి జరుగుతున్న అవమానం అర్థమవుతున్నది. కాని పుత్రప్రేమ పాండవుల పట్ల అసూయ అతన్ని దుర్యోధనునికి ఎదురుచెప్పలేని బలహీనుడిని చేసాయి. వికర్ణుడు ప్రశ్నిస్తాడు కాని చిన్నవాడు కనుక నోరుమూయిస్తారు. విదురుడు ఎదురు తిరుగుతాడు. కాని ఎవరూ ప్రథానమంత్రి మాట వినరు. ఆయనే సభనుంచి వెళ్లిపోవలసి వస్తుంది. రజస్వల ఏకవస్త్ర అయిన ద్రౌపదిని జుట్టుబట్టి లాగి, అన్న దుర్యోధనుడి ఆజ్ఞతో, కర్ణుని ప్రోత్సాహంతో దుశ్శాసనుడు ఆమె వస్త్రాన్ని ఊడబెరుకుతున్న దౌర్జన్యం విర్రవీగుతుంటే ఆమెకు అప్పుడు కావలసింది వస్త్రం. రాజు ఇవ్వాలి. యువరాజు తీసేస్తున్నాడు. గుడ్డిరాజు అందుకు మౌనంగా అనుమతిస్తున్నాడు. అందరినీ సర్వనాశనం చేయడానికి ఈ ఒక్క సంఘటన సరిపోయింది. ద్రౌపదికి మరే దిక్కూ లేదు. కృష్ణుడు తప్ప శరణాగతి తప్ప. అప్పుడు శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతిమ్ అని ఆమె వేడుకున్నది. స్నానం చేసి ఉపవాసం చేసి వ్రతం చేసే సమయం లేదు. మనసుతో ఉపవాసం చేసింది. కన్నీళ్లతో స్నానం చేసింది, మాన ప్రాణాలపై స్వయత్నాలను వదిలేసి నీవే శరణని శరణాగతి చేసింది. 

ఆమెకు కావలసింది అన్నం కాదు. ప్రాణం కాదు, సంపద కాదు. వస్త్రాలు. ఆ వస్త్రాలు అపరిమితంగా ఇచ్చి ఆదుకున్న వాడు శ్రీ కృష్ణ పరమాత్మ. ఒక్క అంబరమే వస్త్రం అన్న మాట వెనుక ఇంత అర్థం ఉంది.  పీతాంబరం చీని చీనాంబరాలు అనే మాటలో మూలపదం అంబరం వస్త్రం. ద్రౌపదికి అంబరాలు ఇచ్చి ఆదుకున్న పీతాంబరుడు కృష్ణుడు. ఒక్కోసారి అంబరం అన్నిటికన్నాముఖ్యం అవుతుందనడానికి ఈ సంఘటన ఉదాహరణ. చుట్టూ బలం కలిగిన మనుషులూ రాజులు వీరులంతా అన్యాయం సహించే లేదా అన్యాయం చేసే రాక్షసులైతే ఎవరు ఆదుకుంటారు? వస్త్రాలు తీసేవారురాక్షసులైతే అన్నవస్త్రాలు దానం చేసేవారు ఉత్తములు దేవతలు. అది మానవత్వానికి సంబంధించిన అంశం. నందరాజు వస్త్రాలు ఎవరికి అవసరమో తెలుసుకుని, అడిగిన వారికి ఇస్తూ ఉండేవాడు.

నీరివ్వడమే గొప్పదానం

రెండో పదం తణ్ణీరే అంటే నీరు. దాహంతో రగిలే ప్రాణులకు నీరివ్వడం చాలా గొప్పదానం. అది అవసరం. అప్పుడ ఇచ్చే నీరు అమృతమే. దాన్ని మించిన అమృతమేదీ ఉండదు. కురుపాండవ సంగ్రామరంగం కురుక్షేత్రంలో అశ్వాలు అలిసిపోతే వాటిని నీరు కరువైతే, పాండవులకు ఏం చేయాలో పాలుపోని స్థితి వస్తే శ్రీ కృష్ణుడు రథమెక్కి అశ్వములకోసం వారుణాస్త్రం ప్రయోగించి భూగర్భజలాలను పైకి తెచ్చి తన రథాశ్వాలకు ఇతర అశ్వాలకు కూడా నీరిచ్చిన పోషకుడాయన.

తరువాత పదం శోరే.  అంటే అన్నం. ఆహారం. పరమాత్మకోసం మునులంతా యజ్ఞాలు చేస్తుంటారు. అక్కడే ఉన్న పరమాత్ముడు చిన్నారి శ్రీ కృష్ణుడిని వారు గుర్తించరు. అప్పుడు  గోపబాలకులంతా కృష్ణయ్యా ఆకలి అని అడుగుతారు. క్రిష్ణయ్య నేరుగా మునిపత్నులదగ్గరికి వెళ్తాడు. తనకు తన మిత్రులకు అన్నం పెట్టమని అడుగుతాడు. యజ్ఞం ముగిసేదాకా ఆగాలని కోప్పడకుండా ఆ మునిపత్నులు, చిన్నారి క్రిష్ణయ్య చిన్నారిబొజ్జలో ఆకలి అంటూ ఉంటే మునుల నియమాలన్నీ పక్కన బెట్టి ఆయనకు పిల్లలకు అందరికీ భోజనాలు వడ్డిస్తారట.  యా ప్రీతిర్మునిపత్ని భక్తిరచితే… నారాయణుడికి రోజూ వైష్ణవులు చేసే తిరువారాధన ఆరగింపులో చదివే శ్లోకంలో ఈ పదం తప్పనిసరిగా వస్తుంది. ప్రీతితో భక్తితో మునిపత్నులు కృష్ణునికి ఆయన బాలమిత్రులకు ఆకలి తీర్చి మహాపుణ్యం కట్టుకున్నారు. వారి భర్తలకు దక్కే యజ్ఞఫలం కన్న ముని పత్నులకు ఎంతో ఎక్కువ ఫలం దక్కించి, క్రిష్ణయ్య యజ్ఞం చేస్తున్న మునులను చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతాడట.

అక్షయపాత్ర

మరో కథ కూడా కృష్ణుడితోనే ముడిబడి ఉంది. దుర్వాసుడు దుర్యోధనుడి విందు ఆరగించినతరువాత సంతోషించి వరం కోరుకోమంటే దుష్టబుద్ధి అయిన దుర్యోదనుడు వనవాసం చేస్తున్న పాండవుల దగ్గర కూడా భోజనం చేసి దీవించమంటాడు. ఆయన సరే అంటాడు.  సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్రతో ధర్మరాజు రోజూ తన కుటుంబానికి పరిజనులకు అందరకీ భోజనం పెడుతూనే ఉన్నాడు. కాని ఒకసారి కడిగిన తరువాత ఆ పాత్ర ఆనాటికి అన్నం పెట్టదు. దుర్వాసుడు వచ్చి కూచున్నాడు వందలాది శిష్యులతో. ద్రౌపది ధర్మరాజు ఆందోళనలో పడతారు. ధర్మరాజు మీరైతే స్నానం చేసి రండి సిద్ధం చేస్తాం అంటాడు. వారంతా దగ్గర్లో నదికి వెళతారు. ద్రౌపదికి ఏమీ పాలుపోదు. శరణాగతి తప్ప మరేదీ లేదు. శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తే, వస్తాడు. అక్షయపాత్ర తెమ్మంటాడు.  అక్కడెక్కడో ఒక మెతుకు ఉందంటాడు. అన్నాడు కనుక ఉంటుంది. దాన్ని తింటాడు. ఇంకేముంది క్రిష్ణయ్య కడుపు ఒక్క మెతుకు తీసుకున్నా ఈ ప్రపంచం ఆకలి తీరకుండా ఉంటుందా? దుర్వాసుడు బతిమాలినా రాడు. శిష్యుల కడుపులునిండి పోయి తిన్నదరగడానికి ఏం చేయాలా అని ఆలోచించే దశ. భీముడు వెళ్లి అన్న పిలుస్తున్నాడు రండి అంటే వినేవారెవరు. సమయానికి అన్నం పెట్టి ఆపద తప్పించిన వాడు.  మంచిపనులను మెచ్చుకొనడంతో మేలుకోలుపు జరుగుతుంది. నందగోపాలుడు జనరంజకుడైన పాలకుడు, అడిగినవారికి అడిగినది ఇచ్చే దానశీలి.

యదువంశకులదీపం

తరువాత అమ్మ. యశోద సుకుమారమైనది. ప్రబ్బలి చెట్టువలె సున్నితమైన మహిళలలోకెల్లా చిగురువంటిది. యదువంశానికి కులదీపము. మాయజమాని, స్వామిని, యశోదా అఱి వుఱాయ్ లేవమ్మా. ఇక్కడ యశోద యశస్సును ప్రసాదించే దేవత. మంత్రరత్తం. నందుడు ఎంబెరుమాన్ అయితే ఈమె ఎంబెరుమాట్టి. ప్రబ్బలి చెట్టు నీటి ఒడ్డున ఉంటుంది. నీటి వేగం ఎక్కువైతే వంగి పోతుంది. నీరు వెడలిపోయిన తరువాత లేచి నిలుస్తుంది. సహజంగా మార్దవమైనదీ, ప్రియుని అనుసరించడం లో నేర్పు గల స్త్రీని ప్రబ్బలి చెట్టుతో పోలుస్తున్నారు గోదమ్మ. అటువంటి స్త్రీ జాతికి చిగురు అంటే శ్రేష్టమైనది యశోద. శ్రీ=లక్ష్మీదేవి స్వామిని, శ్రియఃపతి స్వామి. నంద యశోదలు తమకు సర్వేశ్వరుని అందించే వారు గనుక వీరినే స్వామినీ, స్వామి అని సంబోధిస్తున్నారు. యశోద మంత్రము. మంత్రము వలె భగవానుని గర్భములో నిమిడ్చికొని కాపాడునది. ఆశ్రితులకు దప్ప ఇతరులకు కనబడకుండా కుమారుడిని కాపాడుతున్నది యశోద. ఇక క్రిష్ణయ్యను లేపుతున్నారు. ఆకాశాన్ని రెండుగా చీల్చుకుంటూ మధ్యలో ఎదిగిన వాడా, నిత్యసూరులకు రారాజా, త్రివిక్రముడైన శ్రీకృష్ణమూర్తీ లేవయ్యా. ఆ తరువాత అటు కొసకు పడుకున్న బలరాముడు.స్వచ్ఛమైన ఎఱ్రని బంగారంతో చేసిన కడియాన్ని ధరించిన బలదేవా, నీవూ నీ తమ్ముడూ ఇద్దరూ లేవండి, అని గోపికలు మేలుకొలుపులుపాడుతున్నారు.

విశేషార్థం

యశః =కీర్తిని ద=యిచ్చునది. పరమాత్మే యశస్సు. ఆ పరమాత్మనుఇచ్చేది యశోద మంత్రము అని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు వివరించారు. విష్ణు షడక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి, నారాయణాష్టాక్షరి వంటి మంత్రాలున్నాయి వాటిలో శ్రేష్టమైనది నారాయణ అష్టాక్షరి. అన్నిమంత్రాలలో తిరుమంత్రము వంటిదే యశోద. మంత్రో మాతా, గురుఃపితా = మంత్రమే తల్లివంటిది, గురువే తండ్రి వంటి వాడు. భగవంతుడినే కుమారుడిగా పొందిన కౌసల్య, దేవకి, యశోద అనే ముగ్గురిలో శ్రేష్ఠమైనది యశోద. కౌసల్యకు దేవకికీ కుమారినితో కలిసి ఉండే భాగ్యం కలగలేదు. కుమారుని కట్టి, కొట్టే అధికారం కలిగింది యశోద. భగవంతుడిని పూర్తిగా వశపరుచుకునే శక్తి యశోదకు ఉన్నట్టు తిరుమంత్రానికి మాత్రమే ఉంది. ఈ మంత్రము మేలుకొనడం అంటే తిరుమంత్రార్థమును మనకు విశదం చేయడమే. ఆచార్యుని, మంత్రమును, మంత్రార్థమును (కృష్ణ)ను గోపికలు మేలుకొలుపుతున్నారు.

ఇక శ్రీ కృష్ణుడికి మేలుకొలుపుపాడుతున్నారు. ఆయన వామనావతారాన్ని పొగుడుతున్నారు. రాజ్యం కోల్పోయిన దేవతలకోసం యాచకుడై వచ్చినవాడు, బలి దానమివ్వగానే ఆకాశాన్ని మధ్యకుచీలుస్తూ పెరిగిన వాడు లోకాలు కొలిచిన వాడు, రాజ్యమిప్పించిన వాడు. వాత్సల్యానికి పరాకాష్ట వామనుడు.

భూమి అంతా కొలిచి అలసి నిద్రిస్తున్నావా? పాదములు కందినవా? ఏమినిద్ర? లేవయ్యా గోపయ్యా అంటున్నారు గోపికలు. నారములు అంటే నిత్య పదార్థములు, ఆయణ అంటే చోటు. సర్వపదార్థముల యందు తానుండి, సర్వపదార్థములను తనయందు నిలుపుకున్నవాడు నారాయణుడు. వామనుడు త్రివిక్రముడైనప్పుడు సర్వవ్యాపకత్వము నిరూపణ అయింది. అంబరం అంటే ఆకాశం. ఆకాశానికి పర్యాయం శూన్యం. వేదాలను నిరసించే వేద బాహ్యులు, సర్వశూన్యవాదులను నిరసించి సర్వజగద్వ్యాపకమైన భగవత్తత్వము కలదని అస్తిత్వము చూపినదీ వామనావతారము. ముందు అన్నగారిని లేపండి. ఆయనతోపాటు నేనూ లేస్తాను అని శ్రీకృష్ణుడు అన్నాడు.

అప్పుడు బలరాముడిని లేపుతున్నారు. అతను రామావతారంలో లక్ష్మణుడు, రామానుజుడు. లక్ష్మణుడు సీతాసమేతుడైన రాముని సేవించడానికి ఆశపడినట్టు, శ్రీకృష్ణుడిని మాతో చేర్చి మమ్మల్ని ఆనందింపజేయగలవు. నిద్రించడం తగదు. దేవకీ వసుదేవుల ఏడవ సంతానం బలరాముడు. గర్భంమార్చి రోహిణి యందు ప్రవేశ పెట్టడం వల్ల బతికి సుఖంగా ఉన్నాడు కనుక, అతని వల్ల శ్రీకృష్ణుడు కూడా క్షేమంగా ఉన్నాడుకనుక అతని కాలికి బంగారు కడియం వేశారట. ఆయన పాదానికి తొడిగిన కడియమే భగవచ్ఛేషత్వము. కడియమున్న బలరాముని పాదమే భాగవత శేషత్వము. గుహుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, విభీషణుడు రాముడిని చేరింది లక్ష్మణుడి ద్వారానే. ఆయనే ఇప్పుడు శ్రీకృష్ణుడి దరిచేర్చేబలరాముడు. నీవూ తమ్ముడూ లేవండి అని అందుకే బలరాముడిని లేపుతున్నారు గోపికలు.

ఆచార్యశరణాగతి

పొందించే ఉపాయము ఆచార్యుడై నందగోపుడు, అంటే రాజు వలె ధారక, పోషక భోగ్యములనిచ్చువాడు, ఇక్కడ ఆచార్యశరణాగతిని సూచిస్తున్నారు. పొందవలసిన ఫలము యశోద అంటే పెరుమాళ్లను ఇచ్చే తల్లి, అంటే మంత్రప్రాప్తి. పొందుట వలన ఆనందము, అంటే మంత్రార్థమైన కృష్ణుడు, భగవత్సాక్షాత్కారము. ఈ విధంగా పొందిన ఆనందాన్ని నిలుపుకోవడం అంటే మంత్రసారమైన బలరాముడు. ధారణ. భాగవత శేషత్వము. బలరాముడు స్వామికి అనుకూలమైన సాయాలు అందించే వాడు. వెళ్లుతూ ఉంటే గొడుగు, కూర్చుంటే మెత్తని ఆసనం, నిలబడితే పాదుకలు, సముద్రంలో తెప్ప, చీకటిలో రత్నదీపం, అందమైన వస్త్రం, నిద్రిస్తే దిండు, పరుపు, సర్వేశ్వరుడికి ఈ శేషుడు తన శేషత్వము వలన ఆదిశేషుడైనాడు.

నందుడు దశరథుడు పుణ్యాత్ములు. పుత్రుని పొందడం కోసం దశరథుడు వ్రతములు ఉపవాసములు మొదలైన కాయక్లేషమును చేసి మంత్ర ద్రవ్య క్రియాలోపాలు లేకుండా అశ్వమేథ పుత్రకామేష్ఠి యాగాలు చేసినాడు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసి అమృతం సంపాదించినట్టు దశరథుడు రాముడిని సంపాదించాడు. నందుడు ఆ కష్టాలేవీ పడ్డట్టు లేదు. భగవంతుడిని బాలుడిగా ఎత్తుకుని పెంచగలిగే భాగ్యశాలి నందుడు. దశరథుడు పుత్రుడిని పొందడం కోసం అనేక కార్యాలు చేస్తే నందుడు పొందిన పుత్రుడిని రక్షించుకోవడానికి అనేక పుణ్యకార్యములు చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు. అదేపనిగా అందరికీ కావలసినవి ఇస్తూ ఉండే వాడు. ఆయన దానము ఫలాపేక్ష లేని దానము. ఆచార్యుని వలన మనకు వస్త్రము, నీరు ఆహారములు (అంబరము, తణ్ణీరు, శోర్) లభిస్తాయి.

ఉభయవిభూతి నాయకుడు

నందగోపాలకుడు ఆచార్యుడని ఎందుకన్నారు? కృష్ణుని ఒడిలో దాచుకుని రక్షిస్తాడు, రామానుజుడు కూడా. శతృవుల పట్ల క్రూరంగా ఉంటాడు, రామానుజుడు పరమతాన్ని నిరసిస్తాడు. నందుడు నాయకులకు నాయకుడు. రామానుజుడు ఉభయవిభూతి నాయకుడు. వేలాయుధం పట్టుకుంటాడు నందుడు. త్రిదండములు ధరిస్తాడు రామానుజుడు.నందుడికి ద్వారపాలకులు ఇద్దరు. రామానుజుని కాపాడిన వారు ఇద్దరు గురువులు. నందుడంటే రామానుజుడి వంటి ఆచార్యుడు.

సీతా స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టి గెలుచుకున్నప్పడికీ రాముడు దశరథుడి అనుమతి లేకుండా ఆమెను వివాహం చేసుకోలేదు.  సీతవంటి పరమ సాధ్వీమణికి సాక్షాత్తూ లక్ష్మీ అవతారిణి కి దశరథుడి అనుమతి అవసరమైంది. అదే విధంగా నందుడి అనుమతి లేకుండా గోపబాలబాలికలకు కృష్ణస్వామిని చేరే భాగ్యం లభించదు.

అంబరము అంటే తిరువడిఘల్ (పాదములు), తణ్ణీర్ అంటే శ్రీపాద తీర్థము,శోర్ అంటే ప్రసాదము. అంబరమంటే అంటే ఆకాశమనీ అర్థం.  ఆకాశము నీరు అన్నము మూడూ బ్రహ్మస్వరూపాలే. బలం కన్న అన్నము, అన్నము కన్న నీరు, నీరుకన్న తేజస్సు, తేజస్సు కన్న ఆకాశము గొప్పవని సనత్కుమారుడు బ్రహ్మజ్ఞానం గురించి నారదుడికి వివరిస్తాడు. అంబరమే తణ్ణీరే శోరే అంటే భోగ్యము ధారకము పోషకములన్నమాట. వాటిని ఇచ్చేవాడు నందగోపుడు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles