Tuesday, April 23, 2024

గోదాదేవి రచించిన వారణమాయిరమ్‌ – వేయేనుగుల కల

తొమ్మిదో శతాబ్దపు పరమభక్తురాలు, శ్రీగోదాదేవి తిరుప్పావై పాశురాలకు ఎంత ప్రాచుర్యం ఉందో దాదాపు అంతే విలువ ఉన్న పది ద్రావిడ పాశురాలు. 1200 సంవత్సరాల కిందట రచించిన వారణమ్ ఆయిరమ్ పాశురాలు ఈనాటికీ నిలిచి వెలుగుతున్నాయి.

అల్లినాళ్ తామరే మే లారణజ్ఞి నిన్ఱుణైవి

మల్లినాడాణ్డ మడమయిల్ మెల్లియలాళ్

ఆయర్ కులవేన్ద నాకత్తాళ్, తెన్ పుతువై

వేయర్ పయన్ద విళక్కు

అల్లినాళ్ తామరే మే= అల్లితామరపుష్ఫము మీద నిరంతరం నివసించే, ఆరణంగిన్= పెరియ పిరాట్టి అంటే లక్ష్మీదేవిగారికి, ఇన్ తుణైవి = ప్రియసఖియలు, మల్లినాడు అండమడమయల్ = అడవులను తన సౌందర్యముచేత శాసిస్తున్న సమృద్ధమయిన పింఛము కలిగిన నెమలి వలె ఉండేది, మెల్లియలాళ్ = మృదుమధుర స్వభావము గల, ఆయర్ కుల వేన్దన్ ఆగత్తాళ్ = గోపకుల భూషణుడైన పురుషోత్తముని కల్యాణగుణగుణాలను వర్ణించే ప్రావీణ్యం కలిగిన, తెన్ పుదువై = దక్షిణ దిశలో ఉండే శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తునితులసీదోటలో అవతరించిన, విళక్కు = రత్నదీపమైన గోదాదేవి.

తిరుక్కణ్ణమంగైయాణ్డాన్ ఈ తనియను రచించారు.

వారణమాయిరమ్ దశ పాశురాలకు ముందు ఈ తనియను అనుసంధించాలి. తామరలందుండెడి ముద్దరాలు అన్నమయ్య అన్నట్టు, ఎప్పుడూ కమలం మీద ఆసీనురాలైన శ్రీమహాలక్ష్మికి ఇష్ఠసఖి గోదాదేవి. ప్రియసఖి. అడవిలో పరిపుష్టి అయిన పింఛము కలిగిన నెమలి వంటి మహాసౌందర్యవతి అయిన ఆమె విష్ణువియోగం భరించలేక దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీభట్టనాథుడని పిలువబడే విష్ణుచిత్తుడు (పెరియాళ్వార్) పూదోటలో తులసివనంలో అయోజనిగా జన్మించిన దీపకళికవంటి వనిత గోదాదేవి. శ్రీమహాలక్ష్మితో సమానురాలని చెప్పేందుకు అల్లినాళ్ అని ఈ పాశురాన్ని ప్రారంభించారు. శ్రీగోదాదేవి పెరుమాళ్లను భర్తగా పొందాలనే ఆసక్తి తో తిరుప్పావై వ్రతం చేశారు.

తిరుప్పావై దివ్యగీతాలను రచించి, వ్రతం పాటించినా స్వామి దయకలగలేదు. గోదాదేవి కలత చెందారు. నిరాశ నిస్పృహలకు లోనైనారు. ఆ దశలో వివేకం కోల్పోవడం కూడా జరుగుతుంది. అప్పుడామె మన్మథుని ప్రార్థిస్తున్నారు, ఎందుకంటే విడిపోయిన వారిని, కలవాలని తపించే వారిని కలపడం కోసం తాను భస్మమైనా మంచిదేననుకున్నాడు మన్మథుడు. మన్మథుడిని అతని సోదరుడైన సాంబుడిని గోదాదేవి ప్రార్థించారట. తనకు శ్రీకృష్ణుని కలిసే సౌభాగ్యం కల్పించాలని వేడుకున్నారు. కూడల్ అనే జోస్యపద్ధతిని అనుసరించి ఒక సరి సంఖ్య నిచ్చి తన ఆశయం నెరవేర్చేట్టుజేయాలని వేడుకున్నారు.  కూ అని కూసే కోయిలతో, వర్షించే నీలిమేఘాలతో తన విరహ వేదనను స్వామికి తెలియజేయాలని కోరుకుంటారు. అయినా వ్రతం ఫలించిన సూచనలేవీలేవని ఆమె మరింత కలత చెందారు. తన తనువున్నంతో తానా నారాయణుని చేరుదునో లేదో అని ఆమె పరితపించారు. ఆమె రంధితో విరహ వేదనతో కృంగి కృశించనారంభించారు. భక్త వత్సలుడైన పరమాత్ముడు ఆమె శరీరం నిలుపదలచుకున్నాడు. తాను ఏవిధంగా గోదాదేవిని వివాహం చేసుకోదలుచుకున్నాడో వివరంగా తెలియజెప్పడం కోసం అద్భుతమైన కలను కన్పింప జేసాడు. తన స్వప్న వైభవాన్ని పది పాశురాల్లో చెలికత్తెకు వివరించమే వారణమాయిరమ్.

ఆ కలలో శ్రీరంగనాథుడు ఆమెను పాణిగ్రహం చేసి స్వీకరించడానికి బయలుదేరి శ్రీవిల్లిపుత్తూరుకు వస్తున్నారు. వేయిఏనుగులతో రాజలాంఛనాలతో ఆయన ఊరేగి వస్తున్నారు.

వారణమ్ అంటే ఏనుగులు, ఆయిరమ్ అంటే వేయి. ఇది గజసహస్రం.  ఏమిటీ గజసహస్రం?వేయి అంటే ఖచ్చితంగా వేయి అని కాదు, అనేకానేక అని అర్థం. ఆ వేయి ఏనుగుల పేరుతోనే ఈ దివ్య స్వప్నకావ్యం రూపొందింది. అదే వారణమ్ ఆయిరమ్.

 వేయి ఏనుగులపేరుతో పాశురాలు రచించడమేమిటి? తిరుప్పావై పూర్తయి, దివ్యమైన నోము ఫలించి, మధురభక్తి కీర్తనలు సత్ఫలితాలనిచ్చి శ్రీరంగనాథుడు పూలరంగడై, వరుడై, గోదాదేవి ప్రేమను అంగీకరించి, ఆమెను సతిగా స్వీకరించడానికి వేయి ఏనుగుల మధ్య సకల రాజలాంఛనాలతో కదలివచ్చినాడట. అదే వారణమ్ ఆయిరమ్ తొలి పాశురం. 

ఒకటో పాశురం

వారణమాయిరమ్ శూళ్ వలమ్ శెయ్ తు

నారణ నమ్బి నడక్కిన్ఱానెన్ఱు ఎతిర్

పూరణ పొఱ్కుడమ్ వైత్తు ప్పుఱమెజ్ఞుమ్

తోరణమ్ నాట్టక్కనాక్కణ్డేన్ తోళీనాన్

ప్రతిపదార్థాలు

తోళీ = ఓ సఖీ, నమ్బి = పరిపూర్ణుడైన, నారణన్ = నారాయణావతారుడైన శ్రీకృష్ణుడు, వారణమ్ ఆయిరమ్ =వేయి ఏనుగులు, శూళ్= పరివేష్టించిరాగా, వలంశెయ్ దు = ప్రదక్షిణముగా, నడక్కిన్ఱాన్ ఎన్ణు = నడచి వచ్చుచున్నడని , ఎతిర్ = ఎదురుగా, పూరణ పొఱ్కుడం = పవిత్రజలాలతో నిండిన పూర్ణ కుంభాలను, వైత్తు = తమ నివాసగృహాల ఇరుప్రక్కలనుంచి, పుఱముజ్ఞుం = పట్టణమంతా, తోరణం నాట్ట = తోరణ స్తంభములు నాటినట్టు, నాన్ = నేను, కనాకణ్డేన్ = కలగంటిని.

గోదమ్మ తన చెలికత్తెలతో నిన్నరాత్రి వచ్చిన స్వప్నంగురించి వివరిస్తున్నారు. ఓ చెలియా, ఆ మోహనాకారుడు, శ్రీకృష్ణుడు వేయేనుగులుచుట్టూ వస్తూ ఉన్నాడు. అదీ ఊరికి ప్రదక్షణముగా వస్తున్నాడు. పురజనులు పురాన్ని అలంకరించారు. తమ ఇళ్లకు తోరణాలుకట్టినారు, పవిత్ర జలాలు తెచ్చిపూర్ణకుంభాలు నింపి రెండు చేతులతో పట్టుకుని వైదికశాస్త్రగణ్యులు  స్వస్తివాచన చేస్తూ శ్రీకృష్ణునికి సకల మర్యాదలతో ఎదురేగుతున్నారు. అంతేకాదు ప్రతిఇంటిముందు అరుగులమీద జలపూర్ణములైన సువర్ణఘటములనుంచి శ్రీకృష్ణునికి మంగళ ప్రదమైన నీరాజనాలిస్తున్నారట. పురజనుల ఉత్సాహానికి అంతే లేదు. ఊరంతా మహోత్సవంతో కళకళలాడుతున్నదని కలగన్నానే.

తాము చేసిన పనులు, ఆలోచనలను బట్టి ఉంటాయి. ప్రగాఢంగా మనసులో నాటుకున్న ఆలోచనలే స్వప్నరూపం పొందుతాయని వైదికులు అంటారు. వారి వారి కర్మలననుసరించి, వారి వారి అభిరుచులకు అనుగుణంగా తనను ఆశ్రయించిన వారికి ఈశ్వరుడే కలలు కన్పింపచేస్తాడని పెద్దలంటారు.

ఇక్కడ శ్రీకృష్ణుడు వివాహ ముహూర్త పత్రిక వ్రాసుకోవడానికి వరుడై  కల్యాణ మండపానికి వస్తున్నాడు.

మాడభూషి తెలుగు భావగీతిక

వేయేనుగులమధ్య ఆ పావనగుణపరిపూర్ణరూపుడు

తోరణాల భాసిల్లెడు వాకిళ్లు, బంగారు కలశ నీరాజనాలు

పూర్ణకుంభాలు స్వస్తిమంత్రాల సుస్వాగత సుమాంజలుల మధ్య

ననుగొనిపోవ నారాయణుడరుదెంచునని చెలీ కలగంటినేను

కృష్ణమూర్తి కవిత

విశాఖ పట్నం నివాసి, మాజీ డిప్యుటీ కమిష్నర్ శ్రీపప్పలకృష్ణమూర్తి

వారణమాయిరమ్ ను పద్యరూపంలో తెలుగులోకి అనువదించారు.

సీస పద్యం:

పరిపూర్ణ కళ్యాణ పావన గుణముల

నారాయణుడు హరి నల్లనయ్య

నాలుగు ప్రక్కల నడచెడి వేలాది

కరులతో వలగొని కదలివచ్చె

నిగనిగమెఱుగులనిండారు పుత్తడి

కుండలతో పూర్ణ కుంభములను

వాకిళ్లలోనుంచి వరుసగా ఎదురేగి

స్వాగతంబుబలికె స్వజనులంత

తేటగీతి.

నాటెతోరణ స్తంభాలు నగరమంత

పసిడికెందమ్మి వెలుగుల పల్లవములు

గట్టె సర్వత్ర కాంతులు గ్రమ్మునట్టు

చెలియ నేనొక్క కలగంటి చిత్రమాయె.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles