Thursday, March 28, 2024

భక్తులతోనేదేవుడికిముప్పు, నాస్తికులతో కాదు!

నాస్తికవాదులతో దేవుడికి, మతానికి ప్రమాదమనే భావన మన సమాజంలో ఉన్నది. ఈ భావన రావడానికి కారణం వారు దేవుడు ఉనికిని,  కార్యక్రమాలను విమర్శించడం వల్ల వచ్చింది. అందువల్లనే మొదటి నుండి కూడా వివిధ మతాలకు చెందిన భక్తులు హేతువాదులపై దాడులు, ఆఖరికి హత్యలకు కూడా తెగబడుచున్నారు. ఇటీవలి కాలంలో గౌరీలంకేష్, కల్బుర్గి , గోవిందుపన్సారిలాంటి వారు హత్యలకు గురైన విషయం తెలిసిందే. మొన్నటికిమొన్న తెలంగాణలో బైరినరేష్ పై దాడులు జరిగాయి. భక్తులు భావిస్తున్నట్లు నాస్తికవాదులతో దేవుడికి ముప్పు ఉన్నదా? అనే విషయాన్ని పరిశీలిస్తే, అసలు భక్తులతోనే ముప్పు ఉందనే విషయం మనకు బోధపడుతుంది. అది ఎలాగో పరిశీలించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

Also read: భారతదేశంపైన మార్క్స్ఏమన్నారంటే….!?

దేవుడిని ఎందుకు నమ్ముతారు?

ముందుగా అన్ని మతాలలోని భక్తులు దేవున్ని ఎందుకని నమ్ముతారు? అనే విషయాన్ని పరిశీలిద్దాం. దేవుడు అంటే సృష్టికర్త అనే దాని కంటే కూడా కోరిన కోర్కెలు తీర్చేవాడు అనే అర్థమే జనంలో ఉన్నది. ఈ విషయంలో మన ఏడుకొండల వెంకన్న ప్రసిద్ధి పొందాడు. అందుకనే ఆయనకు అంబానీలాంటి పెట్టుబడిదారుడు మొదలుకొని సాధారణ కూలిపని చేసుకునేవారందరూ భక్తులే. ఇలాంటి భక్తులందరూ వారివారి స్థాయిని బట్టి తిరిగి కానుకలను చెల్లించుకుంటారు. బళ్లారి గనుల వ్యాపారంలో లాభం పొందిన గాలి జనార్దన రెడ్డి స్వామి వారికి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహుకరించాడట. కొందరు అజ్ఞాత భక్తులు (తమ సొమ్ముపై ఆదాయపన్ను వారి దృష్టి పడకుండా) పెద్ద మొత్తంలో స్వామివారి హుండీలో కానుకలు వేసినట్లు పేపర్లలో చూస్తున్నాం. ఇలా కానుకలు చెల్లించడం అనేది ఒక్క వెంకటేశ్వరస్వామి విషయంలో మాత్రమే కాదూ, అందరు దేవుళ్ళ దగ్గరా ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఆసరా చేసుకునీ దేవుడి దూతలుగా లేదా ప్రచారకులుగా చెప్పుకునేవారు కూడా ఆదరణ పొందుతున్నారు. కొందరు కార్పొరేటు ప్రచారకర్తలుగా కూడా ఎదుగుతున్నారు. అంటే భక్తుల కోరికలు ఆ స్థాయిలో ఉన్నాయన్నమాట.

మన కాలపు మనుషులే ఇలా దేవుళ్ళని కోరికలు కోరుకుంటారని అనుకుంటే పొరపాటు. మన పురాణాలను పరిశీలిస్తే ముని పుంగవులు, వీరులు తపస్సు చేసి తమ కోరికలు తీర్చుకున్న చరిత్ర వాటిలో కనిపిస్తుంది.  విశ్వామిత్రుడు, రావణబ్రహ్మ, అర్జునుడు లాంటివారు ఎందరో ఈ కోవలోకి వస్తారు. వారు అమితమైన శక్తినీ, ధనరాశులు, అస్త్రశాస్త్రాలు, ఎదురులేని విధంగా మూడు లోకాలపై ఆధిపత్యంలాంటి వరాలుగా పొందినట్లు చదువుతాము. ఇలా వరాలు పొందిన వారు ముల్లోకాలను గడగడలాడిస్తుంటారు. వీరి ధాటికి దేవతలు కూడా తట్టుకోలేక శరణం, శరణం అంటూ ముఖ్య దేవుళ్ళను వేడుకోవడం కనిపిస్తుంది. ఇందువల్ల దేవతల రాజైన దేవేంద్రుడు చాలాసార్లు రాజ్యాన్నికోల్పోతాడు. ఇక భస్మాసురుడి కథ మనకు తెలిసిందే. అందువల్లనే భక్తులు కోరగానే వరాలు ఇవ్వటానికి దేవుళ్ళు సంశయిస్తుంటారు. అయినప్పటికీ భక్తులు ఊరుకోరు. ఘోరమైన తపస్సు చేస్తుంటారు. ఆ తపస్సు ఎక్కువ కాలం సాగితే ఉండే ప్రమాదం,  దీనితో పాటు భక్తుల బలహీనతలు కూడా తెలుసు.

Also read: ప్రేమికుల రోజు వర్ధిల్లాలి!

ఎంతటివారైనా లొంగిపోతారు

 అంటే ఎలాంటి వారైనా కానీ కీర్తి, కాంత, కనకం వంటివాటికి లొంగిపోతారు. అందుకు ఎన్నో కథలు మనకు తారాసపడతాయి. విశ్వామిత్రుడి తపస్సు ఎలా భగ్నం చేయపడుతుందో అందరికీ తెలుసు. దేవతలు మేనకను పంపించడం, వారికి శకుంతల పుట్టడం, ఆ శకుంతలకు భరతుడు అనే కుమారుడు పుట్టడంతో భారతదేశం ఆ రకంగా ఏర్పడిందని మనం చదువుతాం.

 దేవుళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికి భక్తులు అక్కడితో ఆగిపోరు. ఇంకా ఘోరమైన తపస్సును చేస్తుంటారు. ఆ తపస్సు జ్వాలలకు దేవలోకం అల్లకల్లోలం అవుతుంది. ఆ రకంగా దేవుళ్ళు అనివార్యంగా వరాలు ఇచ్చే పరిస్థితిని సృష్టిస్తారు. ఆ విధంగా వరాలు పొంది దేవుళ్లను ముప్పు తిప్పలు పెట్టేది ఆయుధాలు, రాజ్యాలు పొందిన వారే కాదూ? మహాశక్తిని పొందిన భక్తులు కూడా దేవుళ్లను లెక్కచేయని వారు ఉన్నారు. అందుకు పాదములో కన్ను ఉన్న భృగుమహర్షి ఉదంతం అందరికీ తెలిసిందే. ఇతను ముక్కోపి. సాక్షాత్తు విష్ణుమూర్తినే తన్నుతాడు. ఈ రకంగా మన భక్తులు తాము చెప్పినవి చేయకపోతే దేవుళ్లను కూడా శపిస్తారు.

ఏడుకొండలను ఏసీ చేయిస్తానంటారు

వీరితో పోల్చినప్పుడు నేటి భక్తులు అంత ప్రమాదకరమైనవారు కాదు. కాకపోతే నేటి కాలం భక్తుల కోరికలు అనంతంగా, అడ్డుగోలుగా ఉంటాయి. ఖడ్గం సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రవితేజతో ఏడుకొండలను ఏ.సీచేపిస్తానని పాడిస్తాడు. వాస్తవానికి ఏడు కొండలు పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది. అయినప్పటికీ ఈ భక్తుడు ఏడుకొండలకు ఏసి పెట్టిస్తానని మొక్కుతాడు. ఇలాంటి వారు మన సమాజంలో లేకపోలేదు.

అసలు దేవుడు నుండి ఎలాంటి స్వార్థం లేకుండా కోరికలు కోరుకునే భక్తుడు ఉన్నాడా? అంటే అనుమానమే. ప్రతి భక్తుడు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే కోరికలు కోరతాడు. ఆ కోరికల వల్ల సమాజానికి నష్టం ఉంటుందా? అనే విషయాన్ని పట్టించుకోడు. దీనికి రెండు ఉదాహరణలు చెబుతాను. సారాయి కొట్టు నడిపే వ్యాపారి మొదట దేవుని పూజించి న తర్వాతనే సారా అమ్ముతాడు. అతనికి లాభాలు రావాలంటే అందరూ బాగా తాగాలి. బాగా తాగితే ఇల్లు, వల్లు గుల్లవుతుంది.  కొందరుచనిపోతారు. సారాయి వ్యాపారస్తుడే కాదూ, రోగాలను తగ్గించే మెడిసిన్స్ అమ్మే  వ్యాపారి కూడా దేవుణ్ణి లాభాలు రావాలని కోరుకుంటాడు. అలా జరగాలంటే రోగాలు పెరగాలి. ఎక్కువ మందులు అమ్ముడు పోవాలి. కొందరు చచ్చిపోతారు. అంతేకానీ అసలు రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చినా కూడా కనీస మందులతో ఎలా తగ్గించుకోవాలి? అలా ఉండే విధంగా జనం ఉండాలని దేవుని ఆయన కోరుకోడు. అలా కోరుకుంటే లాభాలు రావు. ఈ రకంగా మనుషులు తమ అడ్డమైన కోరికలను కోరుతూ దేవుని తమ స్వార్ధదాహం తీర్చే పనిముట్లుగా మారుస్తున్నారు.

Also read: దారితప్పిన దళితోద్యమం!?

బెదిరించే భక్తులు

నిజంగా దేవుడు ఉంది లోకకళ్యాణంకోసం. అంటే మంచి కోసం. మరి భక్తులు ఏం చేస్తున్నారు? తమ కోరికలను ఎలాగైనా తీర్చాలని, అలా తీర్చని ఎడల ఇంకో దేవుణ్ణి వెతుక్కుంటారు. ఇంకా తమ అడ్డమైన పాపాలన్ని రద్దు చేసి మరణాంతరం స్వర్గములో సీటు లభించే విధంగా చూడాలని కోరుతారు. ఇలా కోరుకునే వీరు నాస్తిక వాదులు కాదు సుమా!

దేవుడిని చంపడానికి సిద్ధమైన  భక్తులు

అంతేకాదు. భక్తులమని చెప్పుకుంటూ దేవుని సొమ్మును కైంకర్యం చేసేవారే కాదూ, అవసరమైతే దేవుని చంపడానికి కూడా వెనకాడనీ భక్తులు ఉంటారని MVS హరినాధరావు అనే మాటల రచయితగా ఉన్న ‘దేవాలయం’ సినిమా చూస్తే తెలుస్తుంది. అందులో శోభన్ బాబు హీరో,  విలన్ రావు గోపాలరావు. మన విలన్ హీరోలపై దేవుడు నగలు దొంగిలించాడనే ఆరోపణ చేస్తాడు. వాస్తవానికి ఆ నగలు ఇతనే కొట్టేస్తాడు. అతని సహాయకుడైన ఎంవిఎస్ హరినాధరావు ఇలా అడుగుతాడు. “దేవాలయ ట్రస్ట్ చైర్మన్ నువ్వేకదా! అలాంటిది నువ్వే దేవుని నగలు కొట్టివేస్తే,  ఆ దేవుడు నిన్ను ఏంచేయడా?” అంటే దానికి “దేవుడే నన్నుఏమై నా చేయటానికి ముందుకు వస్తే ఇప్పటికే పదిసార్లు మర్డర్చేసి ఉండేవాడిని’’ అని రావు గోపాలరావు అంటాడు. ఈ రకంగా భక్తులు దేనికైనా తెగిస్తారు. అంతెందుకు దళితులు దేవాలయంలో ప్రవేశించడం వల్ల మైల పడిందని శుద్ధి చేయటం లేదా ఆఖరికి దేవున్ని కూడా వెలి ఇస్తున్న ఘటనలను చూస్తున్నాం. అన్ని మలినాలనూ తొలగించే దేవుడు మైలపడటం ఏమిటి? అనే ప్రశ్న వారికి రాదు . దేవుడు వరాలు ఇవ్వక పోతే ఆదేవుని కూడా వదిలివేయడానికి ఏ మాత్రం కూడా సంకోచించరు. దీన్నిబట్టి చూస్తే భక్తులతోనే దేవుళ్లకు ముప్పు ఉందని అర్థమవడం లేదా?

Also read: బహుజన రాజ్యాధికారంతో ఎస్సీలకేంపని?

డాక్టర్. పట్టావెంకటేశ్వర్లు, 9959649097

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles