Friday, June 2, 2023

సీతను రామునికి అప్పగించుము, రావణుడికి విభీషణుడి హితవు

రామాయణమ్168

‘‘శాంతించండి,మీరంతా కాస్త ప్రశాంతముగా ఆలోచించండి. నాయనలారా, ఏదేని ఒక కార్యమును సామ, దాన, భేదములను మూడు ఉపాయముల ద్వారా సాధించలేనప్పుడు మాత్రమే దండోపాయముమునకు పూనుకొనవలెను.

ఏమరపాటుగా ఉన్నవారు, ఇంకొక శత్రువుచేత ఆక్రమింపబడినవారు, దైవము ప్రతికూలముగా ఉన్నవారు ఇలాంటి వారివిషయములో బాగా పరీక్షించి  పరాక్రమము ప్రదర్శించినచో అది సఫలమగును.

Also read: రావణుడి సేనాధిపతుల ప్రేలాపన

ఆ రాముడు బలవంతుడు, ఏమరుపాటులేనివాడు, జయించవలెనన్న పట్టుదలతోఉన్నవాడు, ఆయన కోపమును జయించినవాడు, ఎదిరింపశక్యము కాని వాడు మహాబలవంతుడు. ఆయనను ఏవిధముగా ఎదిరింపగలమని అనుకొను చున్నారు?

అసలు అంతకుమునుపు ఎవడైనా సముద్రమును దాటివచ్చి లంక చేరగలిగినాడా? హనుమంతుడు వచ్చి సీతాదేవిని చూసి మాటలాడి, లంకను తగులపెట్టి తిరిగి వెళ్ళిపోయినాడు. అసలు ఇటువంటి సంఘటన జరుగ గలదు అని మనము ఎప్పుడైనా కలలోనైనా ఊహించినామా?

Also read: ఇప్పుడేమి చేయవలె, మంత్రులకు రావణుడి ప్రశ్న

రాక్షసరాజు జనస్థానమునుండి రాముని భార్యను అపహరించినాడు. రాముడు ఏ అపరాధము చేసినాడని సీతాదేవి అపహరణకు గురి అయినది? మనకు రాముడి వలనజరిగిన అపకారమేదైనా ఉన్నదా?

మన ఖరుడిని చంపినాడు అని అందురేమో! స్వీయరక్షణ ఏ ప్రాణి చేయకుండును? మితిమీరి ప్రవర్తించిన ఖరుని రాముడు చంపినాడు. అందులో దోషమేమున్నది?

సీతాదేవి మన లంకకు వినాశ హేతువు. తీసుకొని వచ్చిన ఆమెను మరల వెనుకకు పంపివేయవలెను. అనవసర కలహముల వలన ఏమి ప్రయోజనము?

…అనుచూ విభీషణుడు ప్రసంగిస్తూనే ఉన్నాడు

అతడు పరాక్రమవంతుడు. అతడు ధర్మమూర్తి. అతని బాణమునకు ఎదురులేదు.

అతనితో మనకేల వైరము?

ఆతని భార్యను ఆతనికిచ్చివేయుము!

నీవే స్వయముగా తీసుకొని వెళ్ళి ఆయన భార్యను ఆయనకు అప్పగించుము. అదే మనకు శ్రేయస్కరము!

నేను నీ బంధువు అగుట చేత బ్రతిమిలాడుచున్నాను. నా మాట వినుము ..నీకు హితమును గూర్చు సత్యమునే పలుకుచున్నాను.

Also read: మహేంద్ర పర్వత సానువుల్లో రామలక్ష్మణులు, వానరసైన్యం

రామశరము నీ శిరములను ఎగురగొట్టకముందే అతని ప్రియసతిని అతనికి తిరిగి ఇచ్చివేయుము!

అన్నా, ధర్మమును నశింపచేయు కోపమును విడిచిపెట్టుము..ధర్మమార్గములో ప్రయాణము నీకు కీర్తిని, యశస్సును పెంపొందింపగలదు.

 నీవు, మేము, మనము అందరమూ సుఖముగా జీవించగలము.’’

అని పలికిన విభీషణుని పలుకులు విని మారుమాటాడక అందరినీ పంపి వేసి తన ఇంటిలోనికి వెడలిపోయినాడు రావణుడు.

అది ప్రాతః కాలము. మరల విభీషణుడు రావణుని గృహమునకు వెళ్ళెను.

NB

కామందక నీతి.

(కామందక నీతి అని ఒక నీతి ఉన్నది. ఎప్పుడు శత్రువుపై దండెత్తవచ్చును ..దీనిని Political Strategies, Corporate wars కు కూడా అన్వయించుకొనవచ్చును. శత్రవు బాలుడైనప్పుడు, శత్రువు వృద్ధుడైనప్పుడు, దీర్ఘరోగి, జ్ఞాతులచే వెలివేయబడ్డవాడు, పిరికివాడు, పిరికి పరిజనము ఉన్నప్పుడు, లోభము కలవాడైనప్పుడు, ప్రజలయొక్క ప్రేమ కోల్పోయినప్పుడు

.

ఏ శత్రువుపై విజయము సాధించవచ్చు … Today’s context లో ఏ party ని ఓడించవచ్చు.

ప్రజల విశ్వాసము కోల్పోయినవాడు

ఇంద్రియ లోలుడై, విషయభోగాల పట్ల అతిగా ఆసక్తి కలవాడు.

భిన్నాభిప్రాయాలతో ఒకరంటే ఒకరికి పడని మంత్రిమండలి కలవాడు(ఏకతాటి మీద తన ministers లేని పాలక పార్టీలు), విద్యావంతులను ,మేధావులను అవమానించువాడు ( intellectuals ను insult చేసే పార్టీలు), దైవ బలము లేనివాడు, కరువు కాటకాలతో అల్లలాడుచున్న దేశమును పాలించువాడు,  సైన్యములో కలతలు ఉన్నవాడు (తన కాడర్ లో కలతలు), తన దేశములోతానుండని వాడు, ఒకేసారి అనేకమంది చుట్టుముట్టినప్పుడు(united political fronts), మరణము ఆసన్నమైనవాడు (వృద్ధుడైనప్పుడు), ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు శత్రువుమీద విజయము సాధించవచ్చు.)

Also read: సముద్ర తీరానికి బయలుదేరిన వానరసేన

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles