Friday, June 2, 2023

పాకిస్తాన్ వారా లేక భారతీయులా?

కానుకలే కదా అనుకుంటే జైలుకు పంపుతారు తెలుసా?

‘అద్భుతం. సుప్రీంకోర్టు పాకిస్తాన్ లో గెలుస్తుంది అని నమ్మం. మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చెల్లదని సుప్రీం న్యాయస్థానం చేప్పింది. తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు తోషఖానా కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు తాజాగా ‘స్టే’ మంజూరు చేసింది. ముందస్తు అరెస్టు చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌ను భారీ భద్రత మధ్య శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు.

గురువారం నాడు ఆ ఖాన్ ను తక్షణమే విడుదల చేయాలని, దేశంలో అల్లర్లను తక్షణమే ఆపాలని పీటీఐ కార్యకర్తలను పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ ఆదేశించడం అద్భుతం. అయినా అల్లర్లను ఆపాలని కోర్టులు చెబితే వింటారా?

ఒక్కోసారి వినాలి. న్యాయం గెలుస్తుంది. ‘‘న్యాయం గెలుస్తుదన్న మాట నిజమే, కాని గెలిచిందంతా న్యాయం కాదు,’’ శ్రీశ్రీ అన్నారు.  ఈ విషయం గుర్తు చేసుకోవాలె కదా?

మనకు లేదు గానీ, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అధికారులపై పాక్ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అనుమతి లేకుండా న్యాయస్థానం ఆవరణలో అరెస్ట్ చేసినందుకు మండిపడింది. కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం కోర్టు ధిక్కారమేనని తెలిపింది.

మే నెల 9న అల్-‌ఖదిర్ ట్రస్టు కేసులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు నేషనల్ అకౌంటబుల్ బ్యూరో ఆదేశించడంతో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆ అరెస్టును ఐహెచ్‌సీ సమర్ధించగా, సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అవినీతి నిరోధక విభాగం ఇమ్రాన్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగణంలో ఎవరినీ అరెస్టు చేయడానికి వీలులేదన్న కోర్టు.. దేశంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని కూడా అనుకుంటున్నది

ఇంతకీ అసలు కథ ఏమిటి?

విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకలను ప్రభుత్వానికి సమర్పించాలి. లెక్క చెప్పాలి. పాకిస్తాన్ ఖజానాను తోషిఖానా అంటారు. ప్రభుత్వ అధికారులకు వచ్చే కానుకలను అందులో ఉంచవలసి ఉంది. ఇమ్రాన్ ప్రధాని అయిన తర్వాత తనకు వచ్చిన కానుకలు ఏమిటనేవి చెప్పడానికి నిరాకరించడం ఈ మహానుభావుడి ఘనత. ఇమ్రాన్ గారే వింత పరిష్కారం చెప్పాడు. ఎంతో కొంత ధర ఇచ్చిన తోషఖానా నుంచి వాటిని తీసుకునేందుకు, తిరిగి అమ్ముకునేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి ఈ మహానుభావుడు లేఖ రాశారు. వీటిని కానుకలు అనడం కరెక్టా లేక లంచం అనవలెనా అని జనం లెక్క పెట్టుకుంటారు. ఇమ్రాన్ గారికి వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన వస్తువులకు 2 కోట్లు చెల్లించి తీసుకున్నారని నివేదికలు వచ్చాయి. అంటే అందులో కూడా అవినీతి ఎంతో ఉంటుంది మరి. 

ఉదాహరణకు మూడు వాచీలు అమ్ముకున్నారని కూడా నివేదిక పేర్కొందట. 2022లో తోషఖానా వివాదంపై ఇమ్రాన్ పై కేసు నమోదైంది. ఎంతో కొంత ధర చెల్లించి తన సొంతం చేసుకున్నారని, అయినప్పటికీ అనైతికంగా ఆ పని చేస్తూ తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారంటూ కనుక ఆయనపై ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించిందట. ఇదీ తోషఖానా కేసు కథ.

మన వారెం తక్కువా?

మనవాళ్లేమీ తక్కువ లేదు. మహాఘనత వహించిన (అంటే పొట్టిగా ‘మఘవ’ అంటే బాగుంటుంది కదూ) భారత రాష్ట్రపతి ఒకామె తొలి పౌరమ్మ గారు.  చాలా అందంగా విలువైన కానుకలన్నీ ముచ్చుటపడి తనవే అనుకుని, అవి ఈ దేశానివే అనుకుని, తీసుకుపోయాడట. అప్పుడు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కావాలని అడిగితే పాపం ఆమె ప్రేమగా దాచుకున్నవన్నీ లెక్క పెట్టి ఇచ్చేయవలసి వచ్చింది. అది మన ఆర్ టీ ఐ విజయం కింద మనం రాసుకునేవాళ్లం. ఆర్ టి ఐ వల్ల హుష్ కాకి కాకుండా విలువైన వస్తువలన్నీ మళ్లీ రాష్ట్రపతి భవనానికి వాపస్ వచ్చాయి.

ఆ విషయం అందిరికీ తెలిసిన తరువాత, ఆ నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ప్రతి కానుకను ఏ రాష్ట్రపతికి ఎవరికైనా ఎవరు ఇచ్చినా, విదేశీ పెద్దలైనా, సొంత దేశీయులైనా మాయం చేసే ప్రమాదం లేకుండా, ఒక్కొక్క విలువైన కానుక పోటో తీసించి, ఎప్పుడు ఎవరికి ఇచ్చారో వివరాలు రాయించి లెక్క గట్టి, పెద్ద రాష్ట్రపతి గదుల్లో అందంగా అమర్చి పెట్టేవారు. కనుక పాత రాష్ట్రపతి గారు జైల్లో పోయే ప్రమాదం తప్పింది మరి.

మాడభూషి శ్రీధర్ 13.5.2023

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles