Sunday, June 16, 2024

మన ఓటు- మన భవిష్యత్తు

  • ఆలోచించి ఓటు వేద్దాం, మన ఐదేళ్ల భవిష్యత్తును కాపాడుకుందాం

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. అప్పటి నుంచి ” ఖేల్ ఖతం దుకాణ్ బంద్” కాదు ఆట అప్పుడే మొదలైంది. ఎన్నికల తేదీలు ప్రకటించక ముందు నుండే మొదలైన ప్రచారం గత పది రోజులుగా వాడిగా,వేడిగా సాగింది. డిసెంబర్ 1న పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందే కుంభవృష్టి  వెలసినట్లు అమాంతం నిశ్శబ్దం ఆవరించింది. ఇది తుఫాను ముందు ప్రశాంతత అని చెప్పవచ్చు.ఇక ఆలోచించాల్సింది ప్రజలే. ఆలోచించి ఓటు వేయాల్సింది విజ్ఞత గల ఓటర్లు మాత్రమే.

అందరి వాదనలూ విన్నాం

ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ ల వాదనలు కూడా మనం విన్నాం. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే రాజకీయ పార్టీల నాయకుల గరంగరం ప్రసంగాలను విన్నాం. ప్రజల మౌలిక సౌకర్యాల అభివృద్ధి విషయం కాకుండా అనుచిత ఉచిత వాగ్దానాలు కుమ్మరించిన అన్ని రాజకీయ పార్టీల వేలంవెర్రి ఉచితాల మ్యానిఫెస్టోలు మనం చూసాము. ఇక “సబ్ కా సున్ నా’’ అయిపోయింది. ‘‘అప్నా కర్ నా’’ మిగిలిపోయింది. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి. “మన ఓటు మన గౌరవం- మన భవిష్యత్తు”అని మనం భావించినప్పుడు మాత్రమే సరైన అభ్యర్థులను ఎంచుకుంటాం. లేకపోతే మన ఐదేళ్ల  ఉజ్వల భవిష్యత్తు అంధకారం ఐపోతుంది. “ఎన్నికల్లో గెలవాల్సిందే పార్టీలు కాదు ప్రజలు మాత్రమే” అలా ప్రజలే గెలవాలంటే ప్రజలు భావోద్వేగాలకు, అనుచిత ఉచితాలకు, ఎన్నికలకు ముందు రోజు రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బు, మద్యం ఇలాంటి తాయిలాలకు లొంగ కూడదు.*

ప్రజాస్వామ్యమంటే  ఎన్నికలు మాత్రమే కాదు

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ప్రాణం.  కానీ ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు. ఎన్నికలకూ, ఎన్నికలకూ మధ్యన జరగాల్సిన అభివృద్ధి ముఖ్యం.

పేదల ఆశల మీదనే ప్రజాస్వామ్యం మనగలుగుతోంది

పేదల ఆశల మీదనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.1952లో దేశవ్యాప్తంగా జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలుకొని ఈరోజు వరకూ ప్రభుత్వంతో నిత్య జీవితంలో అవసరం ఉన్న పేదలు తాము ఓటు వేయకపోతే చచ్చిపోయి నట్లు అనుకొని బాధ్యతగా ఓటు వేస్తున్నారు. అందుకే నిరక్షరాస్యులు ఉన్న గ్రామాలలో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. విద్యావంతులు, ధనవంతులు ఉన్న పట్టణాల్లో, నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా పేదవారు మద్యాని కో, డబ్బుల కో అమ్ముడు పోతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ పేదలు ఏ రాజకీయ పార్టీని తమకు డబ్బులు ఇవ్వమని అడగడం లేదు. దేబిరించడం అంతకంటే లేదు. రాజకీయ పార్టీల కార్యకర్తలు స్వయంగా తమ ఇంటి ముంగిటకు వచ్చి డబ్బు సారా  పంపిణీ చేసినప్పుడు తిరస్కరించ లేక తీసుకుంటున్నారు. ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు నిలబడితే అందరి దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా అందులో ఉన్నంతలో మంచి అభ్యర్థికే ఓటు వేస్తున్నారు.  ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారు  ఎల్లవేళలా గెలవడం లేదు. కానీ డబ్బులు అసలే పంచకుండా గెలిచే పరిస్థితి లేదు.

ప్రజాస్వామ్యంలో లోపాలకు మరింత ప్రజాస్వామ్యమే మంచి మందు

ప్రజాస్వామ్యం ధనస్వామ్యం గా  మారిందని మనందరికీ బాధగా ఉంది. కానీ దానికి పరిష్కారం ఓటు బహిష్కరణ కాదు. ప్రజాస్వామ్యంలో లోపాలు ఉంటే దానికి మరింత ప్రజాస్వామ్యమే మంచి మందు. చదువుకున్నవారు, తమకు తాము మేధావులు అనుకున్నవారు ప్రజాస్వామ్యం గురించి తరచుగా గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చేవారు ఓటు వేయడం లేదు. ఇది సరైంది కాదు. ఓటు వేయని వారికి ప్రశ్నించే అధికారం లేదు. ఓటు వేయకుండా బూటకపు ప్రజాస్వామ్యమని అభ్యర్థులు అందరూ దొంగలేనని తాము ఎవరికి ఓటు వేసేది లేదని కొందరు విద్యావంతులు భీష్మించుకు కూర్చుంటున్నారు. రాజు గారి భోషాణంలో అందరూ పాలు పోయాలంటే నేను ఒక్కడిని నీళ్లు పోస్తే ఏం జరుగుతుంది అని అందరూ అనుకుంటే ఎలా జరుగుతుందో మనకు తెలుసు. నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకొని కొందరు ఆలోచిస్తున్నారు. ఇది సరైంది కాదు. విద్యావంతులు ఈ ఎన్నికలలో ఓటు వేసి తమ అభిమతాన్ని వెల్లడించాలి.

ఎవ్వరూ ఇష్టం లేకపోతే నోటా మీట నొక్కండి

పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎవ్వరూ ఇష్టం లేకపోతే “నన్ ఆఫ్ ది ఎబౌ” ‘నోటా’ మీట నొక్కండి. పోలింగ్ బూత్ కి వెళ్ళకుండా “ఆరామ్ కుర్చీ” రాజకీయాలు చేస్తూ అన్ని పార్టీలను  విమర్శిస్తామంటే  లాభం లేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం పాల్గొనకపోతే మనం ఓటు వేయకపోతే మనం దుర్మార్గుల దుష్ట పరిపాలన లో మగ్గవలసి వస్తుంది.

ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం!

ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులలో పార్టీలకు అతీతంగా మంచి వారిని చూసి ఓటు వేద్దాం. అవినీతికి ,ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా ఓటు వేద్దాం . ఓటు వేసే వారికి భావోద్వేగాలు కాదు ముఖ్యం. భవిష్యత్తు పట్ల ఆశ, అచంచలమైన విశ్వాసం తో కూడిన ఆలోచన ముఖ్యం. అభివృద్ధికి ఓటు వేద్దాం! మన హైదరాబాద్ నగరాన్ని నివాస యోగ్యమైన నగరంగా మార్చే వారికి ఓటు వేద్దాం!! ఓటు మన గౌరవం. ఓటు మన భవిష్యత్తు.

(Note: వ్యాస రచయిత గత ఇరవై సంవత్సరాలు గా “ఎలక్షన్ వాచ్” ప్రతినిధిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పని చేస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక కో కన్వీనర్ గా ఉన్నారు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles