Thursday, December 8, 2022

ఎపి తెలంగాణ నీటి ప్రాజెక్టులకు గెజిట్ గండం

రాష్ట్రాల హక్కులపై కేంద్రం రాజ్యాంగ వ్యతిరేక దుర్మార్గం

మాడభూషి  శ్రీధర్

కృష్ణా గోదావరి నదులపైన ఆనకట్టలు, ఎత్తిపోతలు వంటి ప్రాజెక్టులన్నీ తనకే ఇవ్వాలని కేంద్రం రాజపత్రం జారీ చేసింది. ఆ ఆస్తులన్నీ నాకిచ్చెయ్. అప్పులు నువ్వుకట్టుకో అని ఆదేశిస్తున్నది డిల్లీ, ఆర్నెల్లలో అన్నీ తమ అధీనంలోకిరావాలన్నారు. ఆ ఆరునెలలు గడిచిపోయింది. అంటే ఆదేశాల ప్రకారం ప్రాజెక్టులు ఏక్షణాన్నయినా స్వాధీనం చేసుకోవచ్చు. అనుమతులు లేవన్న నెపంతో అనేకానేక ప్రాజెక్టులనుంచి తాగునీరు సాగునీరు సరఫరా ఆపేయవచ్చు. ఈ గెజిట్ ను ఉపసంహరించుకోకపోతే, ఎపి తెలంగాణ ప్రాజెక్టులకు పెద్దగండం వాకిట్లో ఎదురుచూస్తున్నట్టే.

ఆ రెండు నదులపై అన్ని ప్రాజక్టులను స్వాధీనం చేయాలని ఆదేశించడమే జులై 15, 2021 నాటిడిల్లీ ప్రభువులు రాజపత్రం లక్ష్యం. ఇది కనీవినీ ఎరుగని దౌర్జన్యపు ఆదేశం. ఈ నదులనీటి ఆజమాయిషీని డిల్లీ పాదుషాలు వారి అనుయాయులు ఏవిధంగా నిర్వహిస్తారు? ఈ ఆలోచనే లేదు. 

పూర్తయిన ప్రాజెక్టులు ఆపుతారట

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో మార్చి 5న తెలంగాణ డెవలప్ మెంట్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం దృశ్యం

ఒక వేళ ఎపి తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఈ దురాక్రమణ గెజిట్ ను అమలు చేయగలిగితే అందువల్ల తీవ్ర జలసంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పడికి తొమ్మిది ప్రాజెక్టులను చేపట్టింది, అందులో నాలుగు దాదాపుగా పూర్తయినాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 36 లక్షల 53వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తాయి.  ఇప్పడికి 7 లక్షల 53 వేల ఎకరాలకు నీరు అందుతున్నది. ఈ గెజిట్ ఆదేశాలు పాటిస్తే  ఈ నాలుగే కాదు మొత్తం అన్ని ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిందే.  మొత్తం 70 వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులునిర్మాణం అవుతూఉన్నాయి, అందులో 37 వేల కోట్లు ఇప్పడికే వెచ్చించారు. ఈ దశలో కేంద్రం ఈ ప్రాజెక్టులన్నీ నాకిచ్చేయ్, నోరుమూసుకొని పక్కకు తప్పుకో, అంటే ఏమన్నట్టు? వాహనాలు, పని ముట్లు, కార్యాలయాలు, కాగితాలు, భవనాలు, ఉద్యోగులు అన్నీ వారికే అప్పగించాలట. ఈ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి తేలేక పోతే ఆపేస్తాం అంటూనే, వీటి నిర్వహణకు ఏడాదికి 200 కోట్ల రూపాయల చొప్పున చెల్లించమని ఆదేశిస్తున్నదీ గెజిట్.

వేల కోట్ల ప్రజాధనానికి ఎవరు దిక్కు?

కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిపివేస్తారట. అంటే 37 వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి వాటిద్వారా జనానికి జలాలుఅందాలని చూడాల్సిన బాద్యత పక్కన బెట్టి, వాటిన స్వాధీనం చేసుకుని నిలిపివేస్తామనడం ఎంత అవివేకమైన మాట. ఇంత వింత ఆలోచన పాలకులకు రావడం ఆశ్చర్యకరం. ప్రాజెక్టులకు అనుమతులకు రాకపోవడానికి కారణాలు పరిస్థితులు వారిక తెలుసు. ఇవ్వడం కూడా వారి బాధ్యతే. ఆ బాధ్యత వదిలేసి, నువ్వే మా దగ్గరనుంచి అనుమతులు తెచ్చుకో అనడం, తేకపోతే ప్రాజెక్టులు ఆగిపోతాయనడం శత్రువులైనా చేస్తారా? లక్షల ఎకరాలకు అందుతున్ననీటినిఉన్నట్టుండి ఆపేస్తు వచ్చే వ్యవసాయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎవరు ఎదుర్కొంటారు? పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రానివ్వరా?  సగంలో ఆగిన ప్రాజెక్టులను అక్కడే ఆపితే ఎవరికి లాభం? వాటిపై పెట్టిన ఖర్చులు ఎవరు భరిస్తారు? అప్పులు తెచ్చి శరవేగంగా ప్రాజెక్టులు కట్టి, నీరు పారుదలకు కాలువలు తవ్వి, ఇక ఈ ప్రాజెక్టులు అనవసరం అని ఆపుకుంటారా? అప్పుడు ఆ  అప్పులు ఎవరు తీర్చుతారు?

తాగునీరు కూడా ఇవ్వరా?

ఈ ప్రాజెక్టులు కేవలం సాగునీటికోసమే కాదు. 12 జిల్లాలలో కోటి 80 లక్షల మందికి తాగు నీరు కూడా ఇస్తున్నాయి. ఇవి ఆగిపోతే, తాగే నీళ్లుకూడా రావు. ఇంతెందుకు. మన భాగ్యనగరానికి తాగే నీళ్లిచ్చే ప్రాజెక్టులు కూడా ఆగిపోతే నగరవాసులకు తాగడానికి నీళ్లుండవు. అప్పుడు డిల్లీనుంచి తాగే నీటి టాంకర్లు పంపిస్తారా? 

ఆయా ప్రాజెక్టులకోసం లక్షా 20 వేల ఎకరాల భూములకు నష్టపరిహారం ఇచ్చి సేకరించి పెట్టుకున్నారు. వీటిని ఏం చేయాలో గెజిట్ లో లేదు.

ఆమోదం పొందవలసిన ప్రాజెక్టుల్లో నిర్మాణం అవుతున్నవి ఎన్నో ఉన్నాయి. వాటిపైన 28 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఆమోదం పొందకుండా నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల మీద 8734 కోట్లరూపాయలు వెచ్చించారు. పూర్తయిన ఈ సాగునీటి ప్రాజెక్టుల కింద 7.53 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ గెజిట్ ప్రకారం పూర్తయిన ప్రాజెక్టులు కూడా మూసివేయాల్సిందే.

జవహర్ నెట్టంపాడు ఎత్తిపోతలు, కోయిల్ సాగర్ ఎత్తిపోతలు, మహాత్మా గాంధీ కల్వకుర్తి, ఎ ఎం ఆర్ పి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయినాయి. ఆమోదాలుఇంకా తీసుకోలేదు. దాదాపు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. 7.53 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి.   పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, శ్రీరామరాజు విద్యాసాగరరావు దిండి ఎత్తిపోతలు, శ్రీశైలం ఎడమగట్టుకాలువ టన్నెల్ పథకం, ఉదయ సముద్రం ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 28 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసారు. 43వేల 872 ఎకరాలు సేకరించారు.

అధికార పరిధి అంటే స్వాధీనమా?

రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్రమైన చిక్కులు తెచ్చిపెడుతూ జలశక్తి మంత్రిత్వశాఖ (నీటి వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగం) జులై 15వ తేదీన న్యూదిల్లీ నుంచి నెం.ఎస్‌.ఒ.2842 (ఇ) పేరుతో ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.ఏడేళ్ళ తమ పాలనకు అనుగుణంగానే కేంద్రం ఇక్కడ తన అధికార పరిధిని నిర్ణయించింది. అంటే వారి ఉద్దేశం ప్రకారం ఇక్కడ ‘అధికార పరిధి’ అంటే అర్థం. హైడల్‌ జనరేషన్‌తో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను బదిలీ చేయడమే. కేవలం బదిలీ మాత్రమే కాదు మొత్తం ఈ ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి అపహరించి తన నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. నదీ జలాల నిర్వహణా బోర్డుల పేరుతో ఈ జలాక్రమణకు పాల్పడింది. ఈ రాజపత్రాలు ఉపసంహరించి, తెలుగువారి ఆనకట్టలు ఆయకట్టులు తెలుగువారికే అప్పగించాలనే తెలంగాణ పౌర సమాజం, అనేక పార్టీలు, సంస్థలు, ఇతర సంఘాలు తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఇటీవల డిమాండ్ చేసారు. జీవనదులను, వానిపై కట్టిన ఆనకట్టలను, వాటికింద నిర్మించిన ఆయకట్టులకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి, నిలబెట్టుకోకుండా వదులుకోవాలా? ఇది ఆర్థిక వ్యావసాయిక విధానాలకు గొడ్డలి పెట్టు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల సార్వభౌమత్వానికే అవమానం కాదా?

కృష్ణ, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డులు (కెఆర్‌ఎంబి`జిఆర్‌ఎంబి) అధికార పరిధిని నిర్వచించే సాకుతో నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం రాష్ట్రాలకున్న అన్ని అధికారాలనూ, వారి పాలనాశక్తిని గుంజుకుని వాటిని బోర్డులకు అప్పగిస్తారు. కృష్ణా నదిపైన 35, గోదావరి పరిధిలోని 71 ప్రాజెక్టులపైనరాష్ట్రాలకున్న అన్ని రకాల అధికారాలను కేంద్రం మింగేసే గెజిట్ ఇది.

ఆస్తులు కేంద్రానికి అప్పులు రాష్ట్రాలకు

ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలను మిగల్చని కేంద్రం వాటి మీద బాధ్యతలను మాత్రం మోపడం విచిత్రం. బోర్డులకు ఛైర్మన్‌లను నియమించడానికి వీల్లేదట. రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు, సిబ్బంది ఈ పదవులకు అనర్హులని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర అధికారులను మాత్రమే నియమించే అధికారాన్ని కేవలం కేంద్రానికి కట్టబెట్టింది. అంటే కృష్ణా, గోదావరి జలాలు ఇక కేంద్రంలోని పెద్దలు, వారి కనుసన్నల్లో మెలిగే ఇంజినీర్ల సొంతమన్నమాట. అప్పుడురాష్ట్రాల హక్కులు ఇక గుండు సున్నాయేనా.
సమర్థవంతంగా పని చేసేందుకుగాను బోర్డులకు ప్రారంభ నిధిగా రూ.400 కోట్లు చొప్పున డిపాజిట్‌ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. తరువాత ఏటేటా కోట్ల రూపాయలు ఇస్తూనే ఉండాలట. అవసరమైన అదనపు నిధులను బోర్డులు డిమాండ్‌ చేస్తూ ఉంటాయట,  చేసిన 15 రోజుల్లోగా నిధులు ఇచ్చేయాలట.

ప్రాజెక్టుల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలనైనా ఇచ్చే అధికారం రెండు బోర్డులకూ ఉందట. వాటికి రాష్ట్రాలు తలొగ్గడం తప్ప చేసేదేమీ లేదట. తమ ఆదేశాలను అమలు చేసేందుకు బోర్డులకు పూర్తి అధికారాలను ఇచ్చారట. ఈగెజిట్ నియమాలలో ఇటువంటి ఘోరమైన షరతులు ఎన్నో.
‘‘ప్లాంట్‌కు సంబంధించిన ప్రతిదీ యంత్ర పరికరాలు, స్టోర్స్‌, వాహనాలు మొత్తం ఆస్తులన్నీ కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబీకే చెందుతాయి. ఈ కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబీ అధికార పరిధికి సంబంధించి ఎలాంటి సందేహం తలెత్తినా కేంద్రం నిర్ణయమే అంతిమం’’ అని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఆమోదం లభించని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా ఆమోదం సాధించేందుకు రాష్ట్రాలు ప్రయత్నించాలి. ఆమోదం లభించని అన్ని ప్రాజెక్టుల్లోనూ కొనసాగుతున్న పనులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిలిపివేయాలి. ఆరు నెలల్లోగా ఆమోదం లభించకపోతే ఈ ప్రాజెక్టులు పనిచేయకుండా ఆపేయాలి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు కారణమైనప్పటికీ అన్ని అనామోదిత ప్రాజెక్టులను నిలిపివేయక తప్పదు. కేంద్రం వీటికి ఎలాంటి బాధ్యత వహించదు అని ఈ గెజిట్ నిరంకుశఆదేశం.

రాజ్యాంగ లక్ష్యాలకు భంగకరం, ఎపి విభజన చట్ట వ్యతిరేకం

కేంద్రానికి ఈ పెత్తనాన్ని కట్టబెడుతున్నది ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 అని అంటున్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్రానికి రెండు నదీ జలాల బోర్డు ఏర్పాటుకు, వాటి అధికార పరిధిని నిర్ణయించేందుకు అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఈ బోర్డులు 2014లోనే ఏర్పడ్డాయి కానీ వాటి అధికార పరిధి గురించిన ఆలోచనలు మాత్రం 2021లో వచ్చాయి.

ఈ విభజన చట్టంలో నదులను, వాటిపై ప్రాజెక్టులను డిల్లీకి అప్పగించాలని కానీ, డిల్లీ కి ఆ విపరీత అధికారాలున్నాయని కానీ ఎక్కడా చెప్పలేదు.

రాజ్యాంగంలో అధికారాల విభజన ప్రకారం నీళ్లు రాష్ట్రాల అంశం. కానీ కేంద్రం.. ఉమ్మడి జాబితాలోని అంతర్రాష్ట్ర నదుల అంశంపైన ఉభయులకు ఉండే పరిధిని వాడుకుంటూ , ఏపీ పునర్విభజన చట్టం 2014లో నియమాలకు వక్రభాష్యం చెబుతోంది. నదీ జలాల పంపిణీ అంశాలను కేంద్రం తన స్వాధీనం లోకి తెచ్చుకుంటూ నోటిఫికేషన్లు జారీ చేసింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీలోని సాధారణ సూత్రాలకు వ్యతిరేకంగా తమ రాష్ట్రాలలోని నదులనీటి నిర్వహణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకున్న స్వతంత్ర ప్రతిపత్తిని హరించి వేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి జలాలను కేంద్రంలోని అధికారులచేతిలో పెడుతూ చేసిన ప్రకటనతో రాజ్యాంగ మౌలిక లక్షణమైన సమాఖ్య సూత్రం నీటి మూట అయ్యింది.
ఆంధ్ర, తెలంగాణ ఉప ప్రాంతాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాల అసమాన పంపిణీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు అర్ధ శతాబ్దానికి పైగా ఆందోళనలు చేస్తున్నారు. నీటి కేటాయింపుల్లో అన్యాయానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు కేవలం ఒక రాష్ట్రానికే అధికారం ఉంటుందని రాజ్యాంగం  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 10 తెలంగాణ జిల్లాలకు చట్టబద్ధమైన అవకాశం (సామర్థ్యం) లేనందున ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ మరింత బలపడింది. తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ వెనకనున్న రాజ్యాంగబద్ధ అవసరాన్ని గురించి జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి నేను వ్యక్తిగతంగా తెలియజేశాను. సుప్రీంకోర్టు మాజీ జడ్జి (శ్రీకృష్ణ), లా యూనివర్సిటీ (నల్సార్‌ విసి ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌) వైస్‌ ఛాన్సలర్‌లు ఈ విషయంపై అనేక ప్రశ్నలు అడిగారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాన్ని రాజ్యాంగబద్ధంగా కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే లేవనెత్తగలదు. రాష్ట్రం మాత్రమే సుప్రీంకోర్టు న్యాయ పరిధిలో సహాయాన్ని కోరగలదు. కృష్ణ లేదా గోదావరి జలాల వివాదం ట్రిబ్యునల్‌కు వెళ్ళేందుకు సాంకేతికంగా ఒక ఉప ప్రాంతానికి సాధ్యం కాదు.
తెలంగాణలో 70 శాతం కృష్ణా జలాలు ప్రవహిస్తుంటే 50 శాతం వాటా కూడా ఇవ్వరా? ఇది రాజ్యాంగంలోని అధికరణలు 21, 14 ప్రకారం సమానత్వానికి సంబంధించిన అంశం. ఈ రెండు నదులు ప్రవహిస్తున్న అన్ని రాష్ట్రాల మధ్య వాటాలను పునఃకేటాయించాలి. కనీసం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల వాటాలు నిర్ణయించరు. ప్రాజెక్టులను అనుమతించరు. ట్రిబ్యునల్ వేయరు. నీటికేటాయింపులు చేయరు. ప్రాజెక్టులు కట్టనీయరు. పూర్తయిన ప్రాజెక్టులు ఆపేస్తారు. సగంలో ఉన్నవి సాగనీయరు. సాగునీరు పారనీయరు, తాగునీరు రానీయరు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తారు. ఇదెక్కడి న్యాయం?

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles