Friday, February 3, 2023

గాంధీజీ దృష్టిలో టెక్నాలజి

గాంధీయే మార్గం-34

1930 చారిత్రాత్మక దండియాత్రలో పాల్గొనడానికి గాంధీజీ ఎంపిక చేసిన 78 మందిలో చిన్నవాడు – బాల్‌ కాలేల్కర్‌. అహమ్మదాబాదులో గుజరాత్‌ విద్యాపీఠ్‌ స్థాపించిన కాకా కాలేల్కర్‌ కుమారుడైన బాల్‌ కాలేల్కర్‌ గాంధీగారి సబర్మతీ ఆశ్రమంలో పెరిగినవాడు. 

Also read: గాంధియన్‌ ఇంజనీరింగ్‌

1941లో అమెరికాలోని మాసచుసెట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి (ఎంఐటి) నుంచి ఈ యువకుడు మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందాడు. మహాత్మాగాంధీ – ఎంఐటి అనే అంశం మీద అధ్యయనం  చేసిన ప్రొఫెసర్‌ రాస్‌ బెసెట్‌ (యూనిర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కారోలినా) మహాశయుని అభిప్రాయం ప్రకారం చురుకైన పిల్లలను ఎంఐటిలో చదవడానికి గాంధీ బాగా ప్రోత్సహించారు. బాల్‌ కాలేల్కర్‌ ఎంఐటిలో చదువు పూర్తి కాగానే అమెరికాలోనే తన మిత్రులకు ఈ యువకుడిని పరిచయం చేస్తూ గాంధీజీ ఉత్తరం రాశారు. ప్రొఫెసర్‌ బెసెట్‌ అధ్యయనం ప్రకారం దాదాపు 9 మంది గాంధీ ప్రోత్సాహం కారణంగా ఎంఐటిలో చదివారని, వారిలో నాథు పాండ్య ఒకరని అంటారు. స్వాతంత్య్రం వచ్చాక ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజి (ఐఐటి) సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సర్కార్‌ కమిటీ బృందంలో ప్రధాన వ్యక్తిగా నాథు పాండ్య సేవలందించారు.

Also read: శ్రేయస్సు మరువని సైన్స్‌ దృష్టి

శాస్త్రసాంకేతికతల పట్ల వాస్తవిక దృక్పథం

గాంధీజీ శాస్త్రసాంకేతిక రంగాలపట్ల చాలా ఆదర్శనీయమైన, వాస్తవికమైన దృక్పథం కలిగి  ఉన్నాడని ఈ దిశలో కృషి చేసిన ప్రొఫెసర్‌ రావ్‌ బెసెట్‌ పేర్కొన్నారు. ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరి గురించి మనకు తెలుసు. ఆమె కాకుండా ఆమె భర్త, కుమార్తె కూడా నోబెల్‌ బహుమతులు పొందిన ప్రతిభావంతులు. మరో కుమార్తె ఈవ్‌ క్యూరీ కూడా సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు. ఈమె 1942 డిసెంబరులో హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ సిండికేట్‌ (న్యూయార్క్‌) జర్నలిస్టుగా గాంధీజీని ఢిల్లీలో ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆ మహిళా జర్నలిస్టు తన తల్లి గురించి తను రాసిన జీవితచరిత్ర పుస్తకాన్ని గాంధీజీకి బహూకరించింది. ఆ పుస్తకాన్ని ఆనందంగా ఆమూలాగ్రం చదివిన గాంధీజీ పారిస్‌ వెళ్ళి క్యూరి నివసించిన ఇల్లు సందర్శించాలని ఎంతో ఉద్వేగపడ్డారు. క్యూరి పడిన కష్టాలతో పోల్చినపుడు మన శాస్త్రవేత్తలు పడే ఇబ్బందులు లెక్కలోకి రావు అని గాంధీజీ అన్నారని డా. పంకజ్‌ జోషి 2011లో రాసిన ‘గాంధీ అనె విద్యాన్‌’ అనే గుజరాతీ గ్రంథంలో వివరిస్తారు. గాంధీ మహాశయుడు ఈవ్‌ క్యూరీ రాసిన పుస్తకాన్ని అనువదించమని  తన మిత్రురాలు, వైద్యులు అయిన డాక్టర్‌ సుశీలా నయ్యర్‌ను చాలాసార్లు కోరారు.

Also read: సైన్స్‌ ఆఫ్‌ బ్రహ్మచర్య

దక్షిణాఫ్రికాలో బారిస్టర్‌గా ఉన్న గాంధీజీ – 1901లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశాలలో పాల్గొనడానికి ఆహ్వానించింది ఎవరో తెలుసా?  పి.సి.రేగా ప్రఖ్యాతులయిన ప్రఫుల్ల చంద్ర రే! రసాయనశాస్త్రవేత్తగా ఎంతో ప్రఖ్యాతులయిన పి.సి.రే బెంగాల్‌ కెమికల్స్‌ అనే ఫార్మాసూటికల్‌ పరిశ్రమను కూడా స్థాపించిన గొప్ప దేశభక్తుడు. గాంధీజీ కన్నా ఎనిమిదేళ్ళు పెద్దవారైన పి.సి.రే గాంధీ నిరాడంబరమైన కృషిని గుర్తించి ఉత్తేజం పొందారు.

Also read: సమగ్రాభివృద్ధియే లక్ష్యం 

గాంధీ పట్ల సివి రామన్ గౌరవప్రపత్తులు

మన దేశానికి విజ్ఞాన శాస్త్రరంగంలో తొలి నోబెల్‌ బహుమతిని 1930లో గడించి ఇచ్చిన మహాశాస్త్రవేత్త  సి.వి.రామన్‌ మహనీయుడు తన భార్య లోకసుందరి అమ్మాళ్‌తో కలసి 1936లో సేవాగ్రామ్‌ ఆశ్రమం సందర్శించి కస్తూరిబా – గాంధీజీ దంపతులతో ముచ్చటించారు. గాంధీజీ అంటే ఉత్కృష్టమైన గౌరవంతో ఉండేవారు సి.వి.రామన్‌ అని జి. వెంకటరామన్‌ అనే శాస్త్రవేత్త ‘సి.వి.రామన్‌ ది స్పిరిట్‌ ఆఫ్‌ జయింట్‌’ అనే వ్యాసంలో పేర్కొంటారు. గాంధీజీ గతించిన తర్వాత 1948 ఫిబ్రవరి 7న సి.వి.రామన్‌ ఆకాశవాణిలో ప్రసంగిస్తూ ఇలా అన్నారు – ‘‘… భారత స్వాతంత్య్రోద్యమంలో నేను క్రియాశీలక పాత్ర ధరించలేదు. అంతేకాదు ఆనాటి నాయకులతో పరిచయం కూడా పెంచుకోలేదు. అయితే గాంధీజీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. వారితో కలసిన, మాట్లాడిన, విన్న ప్రతి సందర్భం నా మనస్సులో భద్రంగా గుర్తుండిపోయింది.’’ రామన్‌ మహాశయుడు ప్రతియేటా గాంధీ స్మారక ప్రసంగాన్ని తన రామన్‌ రీసర్చి ఇన్‌స్టిట్యూట్‌ (బెంగుళూరు)లో 1970లో వారు గతించేదాకా నిర్వహించారు. ఒక్క సంవత్సరం కూడా ఆగకపోవడం విశేషం.

Also read: గాంధీ ఆర్థిక శాస్త్రం కృత్రిమ మైంది కాదు! 

ఇలాంటి విషయాలు తరచి చూస్తే గాంధీ జీవితంలో సైన్స్‌ పార్శ్వపు సంగతులు బోలెడు కనబడతాయి. కేవలం రెండు దశాబ్దాలుగా ఈ దిశలో గొప్ప పరిశోధన ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అంతవరకు సుమారు ఐదు దశాబ్దాల కాలం శాస్త్ర సాంకేతిక రంగాలకు గాంధీ వ్యతిరేకం అనే ప్రచారం బాగా జరిగింది, ఇప్పుడూ సాగుతోంది.

Also read: గ్రామాల సుస్థిర అభివృద్ధికి గాంధీజీ సాంఘిక, ఆర్థిక విధానాలు

(ఇంకా ఉంది)

డా నాగసూరి వేణుగోపాల్

ఆకాశవాణి పూర్వ సంచాలకులు,

మొబైల్-9440732392

Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles