Tuesday, January 31, 2023

సైన్స్‌ ఆఫ్‌ బ్రహ్మచర్య

సుశీలా నయ్యర్, గాంధీజీ

గాంధీయే మార్గం-30

Kasturba Gandhi, the larger than life shadow of Mahatma Gandhi | Kasturba  Gandhi | Articles on and by Gandhi
కస్తూర్బా,గాంధీ

 

‘‘….. అంటే… ఆయన… ఆయన వైవాహిక జీవితాన్ని వదిలేశారా?’’ – అని ‘లైఫ్‌’ పత్రికలో పనిచేసే అమెరికన్‌ ఫోటో జర్నలిస్టు మార్గరెట్‌ బర్కీ వైట్‌ అడిగారు ( నమ్మలేకుండా )కస్తూర్బా గాంధీని! 

‘‘ఆ… నాలుగు సార్లు ప్రయత్నించి విఫలుడయ్యాడు… ఇపుడు తీవ్ర ప్రతిజ్ఞ తీసుకున్నాడు’’ నవ్వుతూ జవాబు చెబుతుంది కస్తూర్బా!

‘‘మరి … ఆ ప్రతిజ్ఞను వమ్ముచేయలేదా?’’ అని తిరుగు ప్రశ్న. దానికి కస్తూర్బా మెరిసే కళ్ళతో ‘‘ఇంకా లేదు’’ అని జవాబిస్తారు.  దీనికి ప్రశ్నలడిగిన బర్కీ వైట్‌తో పాటు అక్కడే ఉన్న మీరాబెన్‌ పగలబడి నవ్వుతారు. 

`ఇది క్విట్‌ ఇండియా ఉద్యమం (1942 ఆగస్టు 9) తర్వాత ఆగాఖాన్‌ ప్యాలస్‌లో జరిగిన సంఘటనగా రిచార్డ్‌ అటెన్‌బరో సినిమా ‘గాంధీ’ లో ఈ దృశ్యాల్ని చిత్రీకరించారు.

సత్యం, అహింస, బ్రహ్మచర్యం – ఈ మూడూ గాంధీజీ జీవిత అన్వేషాంశాలు. మొదటి రెండింటి గురించి  ఎక్కువ మాట్లాడి; మూడోదానిని అపోహలకు వదిలేశారా – అని బాహ్యంగా అనిపిస్తుంది. అంతేకాదు ఎక్కువ విమర్శలకు, మితిమీరిన అపోహలకు గురికావడమే కాదు, అచంచలమైన  గాంధీ భక్తులు, అభిమానులు కూడా తీవ్రంగా స్పందించారు గాంధీజీ బ్రహ్మచర్య ప్రయోగాలకు! అందులకే ఈ విషయాలు ఎంతోమందికి ఆసక్తి కల్గిస్తున్నాయి. 

Gandhi's Private Life by Deepti Priya Mehrotra
గాంధీ, మనూబెన్

2012లో సుధీంద్ర కులకర్ణి    ‘మ్యూజిక్‌ ఆఫ్‌ ది స్పిన్నింగ్‌ వీల్‌’  అనే పుస్తకంలో ఇంటర్నెట్‌ యుగంలో పనికివచ్చే గాంధీజీ ఆలోచనలను 660 పేజీల్లో చర్చిస్తారు. ఇందులో చర్చించిన విషయాల్లో సగటున 17 పేజీలుండగా, గాంధీజీ సెక్సువాలిటీ మీద రాసిన విషయానికి దేనికీ ఇవ్వనంత రీతిలో 86 పేజీల దాకా విశ్లేషిస్తారు ఆ రచయిత. అలాగే 1959లో ఆదర్శ గ్రంథమండలి ప్రచురించిన ‘గాంధీ దర్శనం’ లో సగటున ఒకో విషయానికి రెండు పేజీలు చొప్పున కేటాయించారు. అయితే ‘బ్రహ్మచర్యం’ అనే దానికి 10 పేజీలు కేటాయించడం గమనించవచ్చు. ఉప్పలూరి వెంకటసుబ్బారావు సంకలనం, అనువాదం చేసిన ఈ క్రోడీకరణలో స్త్రీ, వివాహం, సంతానం, వ్యభిచారం, ప్రేమ వంటి విభాగాలలో కూడా గాంధీజీ లైంగికత గురించి మాట్లాడతారు. గాంధీజీ వివరంగా ఈ విషయాలు చెప్పుకున్నారు, ప్రస్తావించారు. 

గాంధీజీ కన్నా కస్తూర్బా ఐదున్నర నెలలు పెద్దవారు. వారికి పద్నాలుగేళ్ళ వయసులో పెళ్ళయ్యింది. దీన్ని తన ‘ సత్యశోధన ‘ ఆత్మకథలో పేర్కొంటూ ‘టూ ఇన్నోసెంట్‌ చిల్డ్రన్‌’ అని చెబుతూ వివరిస్తారు. 1900 నుంచి బ్రహ్మచర్య దీక్షమీద దృష్టిపెట్టారు గాంధీజీ. 1904 డిసెంబరు నుంచి  ఫినిక్స్‌ సెటిల్‌మెంట్‌లో జీవితం ప్రారంభమయ్యాక ఈ దృష్టి మరింత బలపడింది.  తన వాంఛల గురించి, మోహావేశాల గురించి కూడా గాంధీజీ వివరంగా, నిజాయితీగా చెప్పుకుంటారు. 1936 డిసెంబరు 28 సంచికలో ప్రచురింపబడిన ఈ విషయాలు చూడండి:

‘‘కొన్ని నెలల క్రిందట నేను బొంబాయిలో ఉండటం తటస్థించింది. అప్పుడు నేనొక నరకకూపంలో పడినంత జరిగింది. ఒక రెప్పపాటు నేను ఒక మోహావేశంలో మునిగిపోయాను. నేను నిద్రావస్థలోనున్నాను. అప్పుడు కలలో ఒక యువతిని సందర్శించాలని భ్రమించాను. నలుబది సంవత్సరాల నుండి స్త్రీ వాంఛ నరికట్టాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాను. నాకు అట్టి వాంఛ నిద్రావస్థలో కలిగినా, నా తల త్రుంచివైచినట్లనిపించింది. ఆనాడు నేను ఎంత బాధపడ్డానో దైవానికెరుక! తుదకాభావాన్ని జయించగలిగాననుకోండి. అయినప్పటికీ, ఆ నిమిషంలో కామోద్రేకాన్ని ముఖాముఖి  ఢీకొనవలసి వచ్చింది. ఆ ఉద్రేకానికి నేను లొంగినచో నాటినుండే నా పతనం ప్రారంభమై యుండెడిది…’’ 

(అనువాదం ఉప్పులూరి వెంకట సుబ్బారావు, ఆదర్శ గ్రంథమండలి, 1959)

‘యంగ్‌ యిండియా’  పత్రిక 1924 జూన్‌ 5వ తేదీ సంచికలో బ్రహ్మచర్యం గురించి వివరంగా రాశారు. అదిలాసాగుతుంది :

‘‘బ్రహ్మచర్యం అతిసూక్ష్మమైన విషయం. నేను ఈ విషయాన్ని – 1924 మే 25వ తేదీ ‘నవజీవన్‌’ పత్రికలో రాశాను. దీనిని మహదేవ దేశాయ్‌ అనువదించారు. ఆ అనువాదాన్ని నేను ‘యంగ్‌ ఇండియా’లో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఎందుచేతనంటే భారతదేశంలోని ఇతర ప్రాంతాలవారు ఈ విషయాన్ని గూర్చి తెలపమని నాకు అనేక లేఖలు వ్రాశారు. మనోవాక్కాయ కర్మలలో బ్రహ్మచర్యాన్ని సంపూర్తిగా ఆచరించడం సాధ్యమనే నేను విశ్వసిస్తున్నాను. కానీ నేనింకా పరిపక్వస్థితికి చేరలేదు. ప్రతినిమిషం ఈ స్థితికి రావాలని ప్రయత్నిస్తున్నాను కానీ రాలేకపోతున్నాను. ఇంద్రియనిగ్రహం తేలికగా అలవడదు. అందులో కామవాంఛను అరికట్టడం మరీ కష్టం! దుర్బలమైన జాతి సహజంగా బ్రహ్మచర్యాన్ని ఆచరణలో పెట్టలేదు…’’ ఆ వాదం ఈ పద్ధతిలో సాగుతుంది. 

మళ్ళీ 1927 జనవరి 23 సంచిక  ‘యంగ్‌ ఇండియా’లో రాస్తూ ప్రారంభించిన వాక్యం ఇలా ఉంది – ‘‘బ్రహ్మచర్యాన్ని గూర్చి తెలుపమని అదే పనిగా నలుమూలల నుంచి లేఖలు వస్తున్నాయి. ఎలా ఆచరించాలా తెలుపమని కోరుతున్నారు…’’

గాంధీజీ బ్రహ్మచర్యాన్ని ఉత్కృష్టంగా గౌరవించారు. అయినా గాంధీజీ ప్రతిపాదించే ‘వివాహంతో కూడిన బ్రహ్మచర్యం’ ఏమిటని ఎంతోమంది ప్రశ్నిస్తారు. హింసకు పరాకాష్ట చంపటం. చావుకు వ్యతిరేకం పుట్టుక. పుట్టుకకు మూలం స్త్రీ-పురుషుల సెక్స్‌ కలయిక. కనుక సెక్స్‌ ఒక శాంతిదాయకమైన  చర్య అని గాంధీజీ భావిస్తారు.  అంతేకానీ ఆనందం కోసం సెక్స్‌ కాదు. గాంధీజీ ప్రకారం సెక్సువాలిటీ రెండు రకాలు. కామంతో కూడినది మొదటి రకం. నేటి ప్రపంచం ప్రస్తుతం భావించేది దీని గురించే. అయితే రెండవది మనిషిని మెరుగు పరుస్తుంది. సెక్స్‌ను ఆధ్యాత్మికం (స్పిరిట్యువలైజ్‌) చేస్తుంది. సెక్స్‌ అనేది కోరిక కలగడం, సంయోగం అనేవి కేవలం సంతానోత్పత్తికి మాత్రమే అనే గాంధీజీ ఆలోచనలను ఎంతోమంది విమర్శించారు. అలాగే ఎంతోమంది మేధావులు పరిగణించినట్లు సెక్స్‌ అనేది స్వతహాగా హింసాత్మకమైన కార్యక్రమం కాదని గమనించాలి. 

గాంధీజీ రెండవ కుమారుడు మణిలాల్‌ ఒక ఆశ్రమవాసితో సెక్స్ లో పాల్గొంటారు. ఇది 1912 ప్రాంతంలో  జరిగింది. ఈ సంఘటన ఆయనను ఎంతో కలచివేసింది. పిమ్మట ఏడురోజులు ఏమీ తినకుండా  ఉపవాస దీక్ష పాటించారు. తర్వాత నాలుగున్నర నెలలు పాటు రోజూ ఒకే భోజనంతో జీవించారు. 

నిజానికి సేవాగ్రామ్‌ అయినా, సబర్మతి అయినా ఆశ్రమంలో ఆచ్ఛాదన లుండేవికావు. నేచర్‌ క్యూర్‌ వైద్యంలో భాగంగా గాంధీజీ పూర్తి దిగంబంరంగా మాలీష్‌ చేయించుకునేవారు. యుక్తవయసులో ఉన్న బాలికలు మసాజ్‌ చేసేవారు. కొన్ని సందర్భాలలో ఇలా మసాజ్‌ టేబుల్‌ మీద పరుండే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులను కలిసేవారు. అలాగే హైడ్రోపతిక్‌ చికిత్సా సమయంలో నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి వెళ్తుండేవారు.

గాంధీజీకి బ్రహ్మచర్య ప్రయోగాలు, పరీక్షల మీద ఆసక్తి మొదటి నుంచి ఉన్నా, 1940 దశకంలో చేసిన ప్రయోగాలు చాలా ధైర్యంతో కూడినవీ, అలాగే వివాదాస్పదమైనవీ కూడా! మహదేవ దేశాయ్‌ 1942 ఆగస్టు 15న గతించిన తర్వాత ప్యారేలాల్‌ సెక్రటరీగా చేశారు. ఆయన చాలా వివరంగా ఈ విషయాలు రాశారు కూడా. అట్లని కేవలం సెక్స్‌ మాత్రమే లేకుండా వుంటే గాంధీజీ ప్రకారం బ్రహ్మచర్యం పూర్తి కాదు. కోపం, లోభం, గర్వం, భయం,  ద్వేషం, అసూయ వంటి నెగెటివ్‌ ఎమోషన్స్‌ను కూడా నియంత్రించుకుంటేనే గాంధీ ప్రకారం బ్రహ్మచర్యం. 

గాంధీజీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి పేర్కొనే వారిలో మను గాంధీ, అబా గాంధీ, డా. సుశీలా నయ్యర్‌ పేర్లు తారసపడతాయి. తల్లిని కోల్పోయిన మను గాంధీ 1942లో గాంధీ ఆశ్రమం వచ్చారు. మనవరాలిగా గాంధీజీ ప్రేమించారు.  ఆమె అంగీకారంతో ఇరువురూ పూర్తిగా నగ్నంగా శయనించేవారు. అలా నగ్నంగా దగ్గరగా ఉండటం వల్ల కామం కలుగుతుందా అని  పరీక్షించుకోవడం ఉద్దేశ్యం. ఈ ప్రయోగం యిద్దరికీ వర్తిస్తుంది. ఇది నౌఖాలి పర్యటన సమయంలో జరిగింది. విజయం సాధించలేదని గుర్తించి ఈ ప్రయోగాలకు స్వస్తి గాంధీజీ చెప్పారు. 

సుధీంద్ర కులకర్ణి ఈ విషయాలు రాస్తూ మను గాంధీ డైరీ ప్రచురింపబడితే  ఉపయోగం అని 2012లో భావించారు. ‘ది డైరీ ఆఫ్‌ మను గాంధీ’ 1943-1944 అనే 248 పేజీల పుస్తకాన్ని తర్వాత ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించింది. ఇందులో గాంధీజీ తనకు తల్లిలా కనబడేవారు అని మను గాంధీ రాయడం విశేషం. అయితే బ్రహ్మచర్య ప్రయోగాల గురించిన డైరీలో కొంత భాగం ఇంకా ప్రచురింపబడాలి.

గాంధీజీ బ్రహ్మచర్య ప్రయోగాలకు సంబంధించి  ‘మై డేస్‌ విత్‌ గాంధీ’ పేరుతో ఎన్‌.కె. బోస్‌ రాసిన పుస్తకం వివాదాస్పదమైంది. బోస్‌ కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన యాంత్రోపాలజి ప్రొఫెసర్‌, కాంగ్రెస్‌ వాది. 1946-47 సమయంలో గాంధీజీకి అనువాదకుడుగా పనిచేశారు. ఆయనే గాంధీజీ ప్రయోగాలను నీతి బాహ్యమని ఖండిస్తూ ఈ పుస్తకం రాశారు. అయితే అంతర్జాతీయ శాస్త్రవేత్త ఎరిక్‌సన్‌ మహాశయుడు బోస్‌తో విబేధించారు. ఈ విషయానికి సంబంధించి గాంధీజీ  కున్న శరీర నిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం సరిపోలేదు అని శాస్త్రవేత్త ఎరిక్‌సన్‌ వ్యాఖ్యానించారు. సుధీంద్ర కులకర్ణి కూడా బోస్‌తో విభేదిస్తూ గాంధీజీ స్త్రీ-పురుష అనే తేడాలకు అతీతం అని భావించారు. వినయ్‌ లాల్‌ కూడా అలాగే పరిగణించారు. ‘ది సెక్సువాలిటీ ఆఫ్‌ ఎ సెలబ్రిటీ లైఫ్‌’ అనే వ్యాసంలో ఆశిష్‌ నంది కూడా ఇదే విషయాన్ని మరోరకంగా స్త్రీ – పురుష అనే డైకాటమీని అధిగమించిన స్థాయికి గాంధీజీ వెళ్ళారని పేర్కొంటారు. ఎరిక్‌సన్‌, ఆంథోని జె. పార్సల్‌, ఆశిష్‌ నంది ప్రకారం గాంధీజీ సాధారణ స్థాయిని మించిన  ప్రయోగశీలి అని పరిగణిస్తారు. 

ఈ విషయాలు పూర్తిగా అందరికీ అందవు, అందినా సులువుగా బోధపడవు. దాంతో సులువుగా, రంజుగా ఉండే సరుకు సోషల్‌ మీడియా ద్వారా ప్రతి చేతిలో ఒదిగిపోతూంటుంది. ఏది ఏమైనా గాంధీజీ ధైర్యశాలి, సదా ప్రయోగశీలి!

సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ శిష్యుడు ఎరిక్‌ హెచ్‌. ఎరిక్‌సన్‌ ఇలా అంటారు… ‘గాంధీస్‌ ట్రూత్‌’ అనే పుస్తకంలో (పుటలు 98, 99):

”Originology”  is a psycho-analytical term employed by Freud – to trace the beginning of a human conflict further and further back into childhood.

But in the long range of human awareness, Freud is both a successor to Luthor and a contemporary to Gandhi. It could well be, then, that we must look at the self-inspection practiced by such men in public as part of an ‘evolutionary’ trend in man to break through new kinds of awareness.”

గాంధీజీ ఈ రంగంలో చేసిన కృషిని ‘సైన్స్‌ ఆఫ్‌ బ్రహ్మచర్య’ అని సుధీంద్ర కులకర్ణి ‘మ్యూజిక్‌ ఆఫ్‌ ది స్పిన్నింగ్‌ వీల్‌’  పుస్తకంలో వ్యాఖ్యానిస్తారు.

డా. నాగసూరి వేణుగోపాల్,

ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్-9440732392

Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles