Saturday, April 20, 2024

మానవత్వమే మహాత్ముడి స్పూర్తి !

“ఒక్క మహాత్మా గాంధీకి తప్పా అంతటి మహోన్నత మరణం మరెవరికీ సాధ్యంకాదు. ఆయన మంచాన పడి, వేణ్ణీళ్ళ కోసమో, వైద్యుల కోసమో, నర్సుల కోసమో ఎదురు చూస్తూ పోలేదు. ఏవో అస్పష్టమైన మాటలు గొణుగుతూ పోలేదు…కూర్చుని కూడా కాదు, ఆయన నిటారుగా నిలబడి ప్రాణాలు విడిచాడు!”

The assassination of Mohandas Gandhi - UPI Archives
ప్రార్థనా సమావేశానికి వెడుతూ గాంధీజీ

గాంధీజీ మరణానంతరం కలకత్తాలో  రాజగోపాలాచారి అన్న మాటలివి. అదే కలకత్తాలో జీవితాంతం గాంధీజీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన నవ్య మానవవాద సిద్దాంతకర్తా, భారతీయ కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు యం. యన్. రాయ్ సారధ్యంలో ఒక సమావేశం జరుగుతోంది. రాయ్ ప్రసంగిస్తూ ఉండగా గాంధీజీ మరణ వార్త తెలిసింది. దిగ్భ్రాంతికి గురైన  రాయ్, “ఈ రోజు భారతదేశం తన అత్యుత్తమ బిడ్డను కోల్పోయింద”ని వ్యాఖ్యానిస్తూ సమావేశన్ని అప్పటికప్పుడు ముగించి వేశాడు. గాంధీజీ పద్ధతులని ఎన్నడూ అంగీకరించని బౌద్ధ భౌతికవాది, మహా పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ తన వైజ్ఞానిక భౌతికవాద్ గ్రంథంలో గాంధీజీని పెట్టుబడిదారీ ఏజంట్ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. గాంధీజీ హత్య తర్వాత ఎప్పుడైనా పొగ తాగే అలవాటు ఉన్న రాహుల్జీ జీవితంలో ఇకపై సిగరెట్ ముట్టననే శపథం చేయడమే కాదు, జీవితాంతం దానికి కట్టుబడి ఉన్నారు. అంతేకాదు, గాంధీజీ ని బుద్దుడితో పోలుస్తూ ఏకంగా “ఇద్దరు మహావ్యక్తులు : బుద్ధుడు – గాంధీ” పేరుతో  హిందీ పత్రిక ‘ఆజ్ కల్’ లో వ్యాసం కూడా రాశాడు. అందులో “వ్యక్తి ని, సంపూర్ణ సమాజాన్ని ప్రేమించే విషయంలో గాంధీజీ రెండవ తథాగతుడు” అంటారు.  అంబేద్కర్ మొదలుకొని మహమ్మ దాలీ జిన్నా వరకూ గాంధీజీ ఉదాత్తమైన మరణం పట్ల విస్మయం చెందని నేత ఒక్కరు కూడా లేరనడం అతిశయోక్తి కాదు. భారతావని మొత్తాన్నీ తేరుకోలేని దుఃఖం లోకి నెట్టేసిన ఆ దుర్మార్గం జరిగిన రోజు ప్రపంచంలోని అనేక ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ లో కూడా అనేకమంది తీవ్రంగా చలించిపోయారు. ఆ రాత్రి ఎంతో మంది వారు పాటించే పవిత్ర ఇస్లాం ధర్మం సాక్షి గా  స్వచ్ఛం దంగా ఉపవాసం ఉన్నారు!

Also read: మహామానవవాద తత్త్వవేత్త మానవేంద్రనాథ్ రాయ్!

అసాధారణ వెలుగు: నెహ్రూ

Veer Savarkar: The Man And Mission Beyond The Mercy Petitions
వీన్ సావర్కర్

జవహర్‌లాల్‌ నెహ్రూ “అసాధారణ వెలుగు” గా ప్రస్తావించిన గాంధీ జీవితం తోనూ, ప్రయోగాల తోనూ సంబంధం లేని అశేష ప్రజానీకం కూడా తమ కుటుంబ సభ్యుడే హత్య చేయబడ్డట్లు బాధ పడ్డారు. సంబంధం ఉన్న అసంఖ్యాక జనాలైతే విలవిల్లాడి పోయారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే జరిగిన ఈ ఘోరం మానవాళి మనుగడకు మతతత్వం ఎంత ప్రమాదమో తెలిపింది. అందుకే, ” స్వతంత్ర భారతంలో జరిగిన ప్రప్రథమ కిరాతక చర్య 1948, జనవరి 30వ తేదీన ప్రార్థన సమావేశం నిర్వహిస్తున్న గాంధీజీ ని ఢిల్లీలో మతోన్మాది వినాయక్ రావ్ గోడ్సే కాల్చి చంపడం.. ” అంటారు  ప్రసిద్ధ పాత్రికే యుడు, భాషా, చరిత్ర శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ గారు. అభిప్రాయ భేదాలు, విధానపర విభేదాలు సరేసరి. కానీ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన ప్రజా నాయకుడ్ని ఆయన భావాల కారణంగా అత్యంత కిరాతకంగా హత్య చేయడమనేది భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. 75 ఏళ్ళ అమృతోత్సవ వేడుకల్ని జరుపుకున్న స్వాతంత్ర్య భారతావని మహాత్ముడి అమరత్వాన్ని ఈ 75 సంవత్స రాలుగా అనేక సందర్భాలలో అశ్రుధారలతో గుర్తు చేసుకుంటూనే ఉంది. గాంధీజీ హత్యలో ప్రధాన నేరస్తులు గాడ్సే, ఆప్టేల ఉరిశిక్ష ని రద్దు చేయాల్సిందిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటూ గాంధీజీ కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేసారు. వాళ్ళిద్దరూ హిందూత్వ వాదైన సావర్కర్ కి ప్రియ శిష్యులు. గాంధీజీ హత్య జరిగిన 20 ఏళ్ళ తరువాత పార్లమెంటుకి ఆరు సంపుటాల వివరణాత్మక పరిశోధనాత్మక నివేదిక సమర్పించిన జె. ఎల్. కపూర్ కమీషన్ మహాత్ముడి హత్యలో ప్రధాన కుట్రదారు సావర్కర్ అని నిరూపించారు. ఇదే విషయంపై పాశ్చాత్య చరిత్రకారుడు డోమినిక్ లాపేయిర్ మొదలుకొని ఎంతో మంది రచనల్ని శోధించిన ప్రఖ్యాత గాంధేయవాది కీ. శే. కలిదిండి భీమరాజు గారు తెలుగు లో “భారతీయం”, “గాంధీజీ హత్య వెనుక…” అనే గ్రంథాలు కూడా రచించారు !

‘ధర్మసంసద్’లో విద్వేష ప్రసంగాలు

ఈ మధ్య హరిద్వార్ లో జరిగిన “ధర్మ సంసద్” లో అన్య మతస్తులని ఏకంగా హత్య చేయడానికి ఆయుధాలు పట్టమనే విద్వేష ప్రసంగాలను చూశాం. అదే సమయంలో ఒక కరుడుగట్టిన హిందూత్వవాది చత్తీస్‌గఢ్ లో గాంధీజీ పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఈ రెండు సంఘటనలు వేర్వేరు చోట్ల జరిగినప్పటికీ పరిశీలిస్తే వీటి అంతస్సారం అర్దమౌతుంది. చనిపోయిన ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ దేశ భావజాలంలో అంతర్భాగంగా కలగలసిపోయిన గాంధేయవాద లౌకిక ప్రజాస్వామ్య స్పూర్తి, మతోన్మాదుల్ని ఇప్పటికీ ఎంతగా భయపెడుతోందో కనిపిస్తుంది. భౌతికంగా లేని ఒక వ్యక్తి సత్యం, అహింసలనే ఆయుధాలతో నిర్మించిన సామ్రాజ్యం ఇంత పటిష్టంగా ఉండడాన్ని చూసి ఓర్వలేకే గాంధీ అంటే ఈనాటికీ ఉన్మాదానికి వణుకు పుడుతుంది. ఆ ద్వేషాన్ని దాచుకోలేక పోవడంలో భాగమే మహాత్ముడి పై అడపా దడపా కక్కే విషపు వ్యాఖ్యలు. ఈ రోజు సమాజానికి కావాల్సింది ధర్మ ప్రచారం కాదు, సర్వ ధర్మ సమానతా ప్రచారం. అది గాంధేయవాద దృక్పథంతో  మాత్రమే సాధ్యం!

గాంధీని నేనెందుకు చంపాను?

Nathuram Godse - Wikipedia
నాధూరాం గాడ్సే

ఇదంతా చరిత్ర కాగా, ఈ రోజు “గాంధీని నేనెందుకు చంపాను? (Why I Killed Gandhi?)” అనే సినిమాకి సంబంధించిన వివాదం చూస్తున్నాం. ఆ చిత్రాన్ని నిషేదించాలనే డిమాండ్ ని వ్యతిరేకిస్తూ “భావాలని భావాలతో మాత్రమే ఎదుర్కోవాలి గానీ నిషేధాల తోనో, నిర్మూలన తోనో కాద” నే కొత్త భాష కరసేవకులు కూడా మాట్లాడుతున్నారు. నిజానికి గతంలో “మీ నాథూరామ్ గాడ్సే బోల్తోయి” అనే ‘నాటకం’ ప్రదర్శనలు చేపడుతున్నప్పుడే ఈ వివాదం తెరమీదికి వచ్చింది. అప్పుడు కూడా భావాలను నిషేదించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా? అంటూ వాదించారు. అత్యంత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, సత్యం, అహింసలని ఆచరణ ప్రాతిపదికన అమలు చేస్తున్న 78 ఏళ్ళ వృద్దుడ్నీ, అందరి చేతా మహాత్మా అని గౌరవిం చబడే ఒక  వ్యక్తిని అతడి భావాల కారణంగా హత్య చేసి, ఆ హత్య ఎందుకు చేయవలసి వచ్చిందో విద్వేషంతో కూడిన  అహేతు కమైన అవాస్తవాల్ని  ప్రచారం చేస్తూ, అలా చేయడం చట్టబద్దం కాదనే వాదనని తోసిపుచ్చడానికి గానూ “భావాలని భావాల తోనే ఎదుర్కోవాలి” అనే వింత వితండ వాదన ఈ విధంగా చేయడం  మతోన్మాద మూకలకే చెల్లింది. అప్పట్లోనే మతతత్వ వాదుల కి జవాబు గా సీనియర్ గాంధేయవాది చినుభాయి వైద్య గారు ఎంతో ఓపికగా శోధన చేసి, ” Assassination of Gandhi : facts & falsehood” అనే విలువైన పుస్తకాన్ని రాశారు. అన్ని భారతీయ భాషల్లోకి అది అనువాదమైంది కూడా. కాగా, కొత్తగా ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేర్చు కోవాలని అనుకుం టున్నారో స్పష్టం. సరిగ్గా గాంధీజీ హత్య జరిగిన రోజే ఆ సినిమాని విడుదల చేయాలని అనుకోవడం ఉన్మాదం తారాస్థాయికి చేరుకుంద నేందుకు నిదర్శనం!

హేతువాదుల వరుస హత్యలు

ఎవరైతే గాంధీజీ హత్యకు కారణం అయ్యారో, హత్య చేసిన తర్వాత దేశమంతటా దుఃఖ సాగరంలో మునిగి ఉండగా ఏ మూకలైతే మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపు కున్నారో, ఏ సంఘాన్ని గాంధీ హత్యకు కారకులని తేల్చి నిషేదించడం జరిగిందో ఈ రోజు అవే మూకలు భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట భావాల్ని నిషేదించడం సరికాదంటున్నాయి. గాంధీని హత్య చేసిన గాడ్సే పూనాకి చెందిన వాడు, మతతత్వ వాదులు అధికారం చేపట్టిన తొలినాళ్ళ నుంచి అదే మహరాష్ట్ర  పూనాతో మొదలెట్టి వరుసగా డాక్టర్ నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే ల్ని హత్య చేశారు. అంతేకాదు, కర్ణాటక కి చెందిన కల్బుర్గి, గౌరీ లంకేష్ లని కూడా చంపేశారు. ఇన్నాళ్ళలో దేశ వ్యాప్తంగా ఆదివాసీలు మొదలుకుని దళిత బహుజన మైనారిటీ లు, రైతాంగం,  మహిళల పై లెక్కలేనన్ని అమానుష దాడులు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇటు ఈశాన్య రాష్ట్రాలు మొదలుకొని అటు కశ్మీర్ వరకూ, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ ల లోని ఆదివాసుల నుంచి ఢిల్లీ, పంజాబ్ లలోని రైతుల దాకా అడుగుతోంది వాళ్ళ కనీస హక్కుల గురించి కాదా??  ఇదంతా భావాలపై సంవాదం చేసేందుకు చేతకాక భౌతిక నిర్మూలనకు పాల్ప డటం ద్వారా ఆలోచనల్ని నిషేధించే ప్రక్రియలో భాగం కాదా? అణగారిన ప్రజల హక్కులు, అభాగ్యజీవుల గొంతుకలు, జైళ్ళలో మగ్గుతున్న దేహాలు ఇవన్నీ పాలకుల అన్యాయాల్నీ, పెద్దల అక్రమాల్నీ ప్రశ్నించే భావజాలంలో భిన్న భాగాలే కదా? భావాలనేవి కొందరికే ఉంటాయా? అట్టడుగు భావాలకి చోటు కల్పించడమే అత్యున్నత ప్రజాస్వామ్య విలువ. అది ఏ నాటికైనా ఈనాటి పాలకులకు అర్దం అవుతుందా? భారతదేశానికి సుస్థిరమైన ఆధునిక ప్రజాస్వామ్య గణతంత్ర స్థాయిని కల్పించిన రాజ్యాంగాన్నే కాదనే ఉన్మాదులకు అందులోని ప్రాథమిక హక్కులపై ఇంతటి అభిమానం హఠాత్తుగా పుట్టుకురావడం ఆశ్చర్యకరం!

మతతత్వవాదులకు మహాత్ముడి జీవితం సవాలే

ఆధునిక సమాజం ఎప్పుడూ అది అంగీకరించని భావాలకి కూడా అర్థవంతమైన స్థానం కల్పిస్తుంది. అల్ప సంఖ్యాకుల అస్తిత్వానికి భద్రత నిస్తుంది. ఆలోచనలు అవెంత విరుద్ద మైనవి ఐనప్పటికీ, వాటి వ్యక్తీకరణ కు తోడ్పాటు అందిస్తుంది. ప్రత్యామ్నాయ వ్యవస్థలకి సంబంధించిన ప్రతీ భావజాలానికీ చోటు కల్పిం చడమే ఆధునిక ప్రజాతంత్ర నిర్మాణం యొక్క మౌలిక స్వరూపం. ప్రపంచం లోని ప్రతీ నాగరిక సమాజానికి ప్రాధమికంగా ఉండాల్సిన దృక్పథం అదే. పాఠ్యాంశాలు మొదలుకుని కళ, చరిత్ర, సంస్కృతి, ఆహారం, మత విశ్వాసాలు తదితర అన్ని విషయాల్లో వక్రీకరణకి పాల్పడి విద్వేష పునాదులపై, అమాయక ప్రజల సమాధులపై నిర్మించిన మతతత్వ ఆధిపత్య విధానాలకు మహాత్ముడి జీవితం ఇప్పటికీ ఒక పేద్ద సవాలే. ముఖ్యంగా, 1992 లో బాబ్రీ మసీదు ఉదంతం ద్వారా, 2002 లో గుజరాత్ ఘోరకలి ద్వారా అమానుష మైన విధ్వంసానికి పాల్పడ్డ మూకలు దక్షిణాదిలో సైతం వాటి రాజకీయ ప్రయోజనాల కోసం ఈసరికే వ్యూహాత్మక పన్నాగాల్ని పన్నుతాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి, మత సమైక్యత, మానవత్వమే ప్రధానంగా మహాత్ముడి స్పూర్తిని నిర్మాణాత్మకంగా మలచడం మనిషి పక్షాన నిలిచే ప్రతి ఒక్కరి కర్తవ్యం. అదే ఆధునిక మానవాళి మనుగడకు అవసరమైన సహృధ్బావ వైఖరిని పెంపొందించే ప్రధాన సాధనం!

లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు గాంధీ మార్గమే శరణ్యం

మానవసేవే మాధవసేవనే సూత్రమే సర్వమత సారమనీ, అదే మానవాళి హితమని నమ్మి, దానినే బోధించి, ఆచరించిన మహాత్మాగాంధీ ఒక్క మత సమైక్యత వరకే పరిమితం కాలేదు, ఏ మతాన్ని నమ్మని వారు, సోషలిస్టు లు, కమ్యూనిస్టులు,  అంబేద్క రిస్టులు,రాయిస్టులు , అనార్కిస్టులు తదితర అన్ని రకాల సమూహా ల అభిప్రా యాలను ఆయన అంగీ కరించక పోయినా జీవితంలో ఎన్నడూ వాటిని  అగౌరవపర్చలేదు. ఈ రోజు భారతీయ తాత్విక స్రవంతిలోని ఆ విభిన్నతని స్వాగతిం చే లక్షణం బలహీనపడు తోంది. బహుళత్వాన్ని ప్రమాదకరంగా చిత్రించే కుట్ర జరుగుతోంది. దీనిని ఎదుర్కో వడం అత్యవసరం. అందులో భాగంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ, భారతీయ దార్శనిక లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ స్వరూపానికి ఈ రోజు గాంధీజీ అవసరమని గ్రహించడం అన్ని ప్రజాస్వామ్య స్రవంతులకి అవసరం. ఆరోగ్యకరమైన విభేదాలు ఎప్పుడూ అవసరమే కానీ అసహనంతో కూడిన విద్వేషానికి విరుగుడు సౌశీల్యం కల తరాన్ని తయారు చేయడమేననే గ్రహింపు అవసరం. ఆ క్రమంలో నానాటికీ పేట్రేగిపోతున్న మతతత్వ శక్తులకు దీటుగా ప్రజాతంత్ర శ్రేణులన్నీ కల్సీ ఏకతాటి మీదికి రావడం పై దృష్టి పెట్టాలి. అదే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడని గాంధేయవాద దృక్పథంతో  మలచగల  మానవీయ సోపానం. అదే చివరి శ్వాస విడుస్తూ కూడా మహాత్ముడు భావి తరాల మానవాళికి ఇచ్చిన ఐక్యతా సందేశం!

(అనేక విభేదాలు ఉన్నప్పటికీ వర్తమాన కాలంలో పెచ్చరిల్లుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా, గాంధీజీ 75 వ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం)

-గౌరవ్, సామాజిక కార్యకర్త

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles