Friday, September 20, 2024

గాంధియన్‌ ఇంజనీరింగ్‌

మషేల్కర్, ప్రహ్లాద్

గాంధీయే మార్గం-33

గాంధేయ సాంకేతిక విజ్ఞానం – ఇటువంటిది ఒకటి ఉందా? అని కూడా సందేహం రావచ్చు. ఇటీవల కాలంలో గాంధీని లోతుగా అధ్యయనం చేయడం పెరిగింది. ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు ఆర్‌.ఏ.మషేల్కర్‌, సి.కె. ప్రహ్లాద్‌ గార్లు గాంధీయన్‌ ఇంజనీరింగ్‌ అనే పద ప్రయోగాన్ని దశాబ్దం కిందట చేయడమే కాదు అదేమిటో, అది ఏ రకంగా విభిన్నమో, ప్రయోజనకరమో వివరించారు. 

2010 ఏప్రిల్‌లో చేసిన ‘ గాంధీయన్‌ ఇంజనీరింగ్‌ : మోర్‌ ఫ్రమ్‌ లెస్‌ ఫర్‌ మోర్‌’ అనే ప్రసంగ – ప్రదర్శన చాలామందిలో ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ నింపింది. మషేల్కర్‌ ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త, సిఎస్‌ఐఆర్‌ (CSIR) డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. సి.కె. ప్రహ్లాద్‌ మేనేజ్‌మెంట్‌ విభాగపు నిపుణులు. వీరిద్దరు ఈ ‘గాంధీయన్‌ ఇంజనీరింగ్‌’ భావనను ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రయత్నించారు. అయితే సి.కె. ప్రహ్లాద్‌ 2010 ఏప్రిల్‌లోపే గతించడం విషాదం. తక్కువ వనరులు వినియోగించుకుని పొందే ఫలితం ఎక్కువమందికి  ఉపయోగపడాలి అనేదే ఈ సూత్రం. అత్యుత్తమమైన, అత్యున్నతమైన టెక్నాలజీ ద్వారా ఉన్నత ప్రమాణాలతో, తక్కువ ఖర్చుతో ఎక్కువమందికి ప్రయోజనం చేకూర్చేదే ఈ ‘గాంధీయన్‌ ఇంజనీరింగ్‌’. ఇది సాధ్యమా అని ప్రశ్నించడమే కాదు. టెక్నాలజీ గురించి గాంధీజీ భావనలు ఏమిటి – అని ప్రశ్నలు రావచ్చు. ఈ విషయం ఈ శాస్త్రవేత్తల ద్వయానికి బాగా తెలుసు కనుకనే ఉదాహరణలతో వివరిస్తారు!  

‘సర్వైవల్‌ ఆఫ్‌ ది కైండెస్ట్‌’ అని ‘మ్యూజిక్‌ ఆఫ్‌ ది స్పిన్నింగ్‌ వీల్‌’ అనే  పుస్తకంలో దీన్ని వివరిస్తారు సుధీంద్ర కులకర్ణి. పూర్తిగా విభిన్నంగా ఆలోచించడం గాంధీజీ శైలి. ఆపిల్‌ సంస్థను ప్రారంభించిన వారిలో ఒకరైన స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs) కు గాంధీజీ అంటే వ్యక్తిగతమైన ఆరాధన ఉండేదనీ, విభిన్నంగా ఆలోచించే రీతికీ గాంధీజీ స్ఫూర్తి అనీ, జాబ్స్‌ జీవిత చరిత్రలో వాల్టర్‌ ఐజాక్‌సన్‌ (Walter Isaacson) వివరిస్తారు. పరిశోధనలో, ప్రయోగాలు పేరిట జంతువులనూ, రకరకాల ప్రాణులను చంపడం గురించి తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీజీ ఒక మాట అంటారు. ‘‘రక్త ప్రసరణ వ్యవస్థను కనుక్కున్న శాస్త్రవేత్త ఎంత జీవహింస చేశారు?’’ – అనే ప్రశ్నను సంధిస్తారు!  కాస్త నెమ్మదిగా ఈ ప్రశ్నవైపు దృష్టిపెడితే గాంధీజీ భిన్న కోణపు దిశ ఏమిటో మనకు బోధపడుతుంది. మషేల్కర్‌, ప్రహ్లాద్‌ ద్వయం గాంధీయన్‌ ఇంజనీరింగ్‌నూ, ఇన్నోవేషన్‌నూ ఇలా వివరిస్తారు – డూయింగ్‌ థింగ్స్‌ డిఫరెంట్లీ, మేకింగ్‌ ఎ బిగ్‌ డిఫరెన్స్‌ అండ్‌ మేకింగ్‌ ది ఇంపాసిబుల్‌ పాసిబుల్‌. విభిన్నంగా చేయడం, అసాధ్యమైనదాన్ని సాధ్యం చేస్తూ, చేసే పనులు గొప్ప తేడాతో సత్ఫలితాలు రాబట్టడం. ఇదీ ఆ ఆలోచన. 

జైపూర్ కృత్రిమపాదం

మషేల్కర్‌, ప్రహ్లాద్‌ ద్వయం ఇచ్చిన ఐదు ఉదాహరణలలో మొదటిది ఇది – డా. పి.కే. సేథి నేతృత్వంలో రామచంద్రశర్మ కృత్రిమ పాదాన్ని రూపొందించారు. అమెరికాలో అథమపక్షం 12 వేల డాలర్లు అయ్యేది ముప్ఫై డాలర్ల ఖర్చుతో పదిరెట్లు మెరుగ్గా ఈ జైపూర్‌ పాదంతో సాధించారు! ఇటువంటి ఆవిష్కరణలు గాంధేయ సృజనాత్మక సాంకేతిక విజ్ఞానంతోనే సాధ్యం.    

మనదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. సంప్రదాయ పద్ధతిలో – అక్షరమాలతో ప్రారంభించకుండా పదాలను నేర్పడంతో మొదలుపెట్టి రెండు నెలలలోపు కనీస జ్ఞానాన్ని, తక్కువ ఖర్చుతో పొందవచ్చు. దీన్ని ఎఫ్‌.సి.కోహ్లి రూపొందించారు. ఇది గాంధీయన్‌ ఇంజనీరింగ్‌కు రెండవ ఉదాహరణగా మషేల్కర్‌ చెబుతారు. ఎఫ్‌.సి. కోహ్లీ ఎవరు?  టిసిఎస్‌గా పిలువబడే టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ సంస్థాపకులు. తక్షణ అవసరాలను తక్కువ ఖర్చుతో, త్వరగా, మెరుగ్గా సాధించడమే గాంధేయ సాంకేతిక విజ్ఞానపు భావన. 

గాందీజీ విభిన్న జీవనం

గాంధీజీ చాలా విస్తృతంగా, విరివిగా మాట్లాడారు. విభిన్నంగా జీవించారు. త్వరగా స్ఫూర్తి పొందవచ్చు. అయితే ఆయన ఆలోచనలు పూర్తిగా బోధపడటం చాలా కష్టం. మనతో సహా మొత్తం ప్రపంచం గాంధీజీని ఆలస్యంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది.  గాంధేయ వాదాన్ని లోతుగా అధ్యయనం చేసిన బి.ఆర్‌.నందా మహాశయుడు సైతం గాంధీ ఆర్థిక విధానాలు నేటికి సరిపోవనీ, మరెక్కడికో దారితీస్తాయనీ ‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ గాంధీ : ఎస్సేస్‌ అండ్‌ రిఫ్లక్షన్స్‌ ‘ అనే గ్రంథంలో అభిప్రాయపడతారు. 1941 డిసెంబరు 13న దీనికి జవాబు గాంధీ చెప్పినట్టు ‘కన్‌స్ట్రక్టివ్‌ ప్రోగ్రామ్‌ : ఇట్స్‌ మీనింగ్‌ అండ్‌ ప్లేస్‌ ‘ అనే చిన్న పుస్తకంలో కనబడుతుంది. ఖాదీ, ఖాకీ గురించి చెబుతూ గాంధీజీ – ‘‘చాలా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాను. ఈ రకంగా సాగితే రావాల్సిన స్వతంత్రం నడిసంద్రంలో మునిగే నావ అవుతుందనీ, దేశాన్ని తిరోగమనంలో నడిపిస్తున్నాననీ – భావిస్తున్నారు’’ అని అన్నాడు.

చర్ఖా అంతర్గత ఉద్దేశం ఏమిటి?     

ఇంకా అంటారు – ‘కాంగ్రెస్‌ పార్టీ చర్ఖాను సులువుగా, ఇష్టంగా ఆమోదించిందా’ అని ప్రశ్నించి కేవలం తనకోసం భరించింది కానీ దాని అంతర్గత ఉద్దేశ్యం బోధపడికాదు అని గాంధీజీ అవగాహన! ఆయన వాస్తవికవాది. ఆర్థిక పురోగతికి చర్ఖాను శాశ్వత ప్రతీకగా తీసుకున్నారా? అహింసతో, దోపిడిలేని, సామరస్యాన్ని ప్రోది చేసే ఆర్థిక పురోగతిని గాంధీజీ వాంఛించారు. దీని కంటే మెరుగైన ప్రత్యామ్నాయం వస్తే స్వీకరించడానికి గాంధీజీ సిద్ధంగా ఉన్నారు. కనుకనే 1920 దశాబ్దంలో చర్కాను మెరుగుపరిచే ఇంజనీరింగ్‌ ఇన్నోవేషన్‌కు ఏటా బహుమతులు ప్రకటించారు. ‘ఖాదీ’ అనేది కేవలం ‘వస్త్రం’ కాదు. అది ఒక భావన, ఒక ఆదర్శం (ఐడియా, ఐడియల్‌) అంటారు. దీన్ని అర్థం చేసుకోవడం సులువు కాదు. కనుకనే ఆయన గతించి ఏడు దశాబ్దాలయినా అపోహలు సాగుతున్నాయి. 

హింద్ స్వరాజ్ ను సవ్యంగా అర్థం చేసుకోలేకపోయాం

అహింసే మన జీవనవిధానం అయితే భవిష్యత్తు అంతా స్త్రీమూర్తిదే అంటున్నారు. ఇటువంటి ఆలోచనలు ఒక ప్రాంతానికీ, కాలానికీ, చట్రానికి బందీలు కావు. కనుకనే ‘హింద్‌ స్వరాజ్‌’ గ్రంథాన్ని సవ్యంగా అర్థం చేసుకోలేకపోయామని సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. ఊహాత్మకంగా సాగిన ఇరువురి సంభాషణ ఈ 275 పుటల ‘హింద్‌ స్వరాజ్‌’  గ్రంథం. ఇంగ్లాండ్‌ నుంచి దక్షిణాఫ్రికా వెడుతున్నప్పుడు గాంధీజీకి, డా. ప్రాణ్‌ జీవన్‌ మెహతా మధ్య జరిగిన చర్చ, తర్వాత గాంధీజీ కేవలం నాలుగు రోజులలో పుస్తకంగా రాశారు. మధ్యలో కుడిచేయి సహకరించకపోతే సుమారు 40 పేజీలు గాంధీజీ ఎడమచేతితో రాసారు. తర్వాత ఒక అరవై లైన్లను తీసివేయడం, అక్కడక్కడ కొన్ని పదాలు మార్చడం మినహా గాంధీజీ మరేమీ మార్పు చేయలేదు. ఈ పుస్తకంలో సైన్స్‌, టెక్నాలజీ, ఆధునీకరణ వంటి విషయాలను గాంధీజీ చర్చిస్తారు. సరిగ్గా అర్థం చేసుకోకపోతే సమస్యలు చాలా  ఉంటాయి. ఇదే ఇంతవరకు జరిగింది. హింద్‌ స్వరాజ్‌కు మూలమయిన డా. ప్రాణ్‌ జీవన్‌ మెహతా 1909 నవంబర్‌ 8న గోపాలకృష్ణ గోఖలేకు రాసిన లేఖలో గాంధీజీని ‘మహాత్మా’ అని పేర్కొన్నారు. ఇది మహాత్మా అని టాగోర్‌ పిలవడం కంటే చాలాముందు. ఇలాంటి విషయాలు లోతుగా గమనించిన మషేల్కర్‌, సి.కె. ప్రహ్లాద్‌ ద్వయం ప్రపంచానికి చాటాలని దశాబ్దం క్రితమే భావించడం విశేషం. అంతర్జాతీయంగా 800 రూపాయలకు లభించే హెపటైటిస్‌ వాక్సిన్‌ కేవలం 34 రూపాయలకు శాంతా బయోటెక్‌ వరప్రసాదరెడ్డి సాధించి, ప్రపంచవ్యాప్తంగా సగం మార్కెట్‌ వాడకాన్ని కైవసం చేసుకోవడం కూడా ‘గాంధీయన్‌ ఇంజనీరింగ్‌ విధానం’ అంటారు. నాలుగు నిమిషాలు తొక్కితే నాలుగంటలు వెలిగే ఎల్‌ఈడీ కెపాసిటర్‌ ను సి.కె. ప్రహ్లాద్‌ శిష్యుడు ఆశిష్‌ గావ్‌డే రూపొందించారు. అంటే ఆ కెపాసిటర్‌ 50 డాలర్ల ఖరీదు నుంచి 5 డాలర్లకు ఆయన తన పరిశోధన ద్వారా తగ్గించారు. 

ఈ ఆలోచనలు చేసింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు. మాటలకన్నా చేతలు, ఫలితాలు ప్రధానమనే శాస్త్రవిభాగాల నిపుణులు వీరు. గాంధీజీ విభిన్నమైన సృజనాత్మకమైన ఆలోచనల గురించి ప్రపంచవ్యాప్తంగా విశేషంగా అధ్యయనం జరుగుతోంది.

డా. నాగసూరి వేణుగోపాల్,

ఆకాశవాణి పూర్వ సంచాలకులు,

మొబైల్ 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles