Tuesday, September 17, 2024

భారత రాజకీయరంగంలో గాంధీజీ ప్రవేశం!

గాంధీయే మార్గం-38

(గతవారం తరువాయి)

చంపారన్ ఉద్యమంలో ప్రయాణం

ఇంగ్లండులో బారిష్టర్ చదువు పూర్తి అయినా, సరైన ఉపాధి దొరకక పోవడంలో 1893లో గాంధీజీ దక్షిణాఫ్రికాలోని దాదా అబ్దుల్లా కంపెనీ న్యాయ సలహాదారుగా వెళ్ళారు. వెళ్ళిన రెండు నెలలలోనే తలపాగా తీయడానికి నిరాకరించి కోర్టు నుంచి నిరసనగా బయటికి రావడం, అంతకు మించి ఫస్ట్ క్లాస్ బోగి నుంచి టికెట్ ఉన్నా బయటికి తోయబడటంలో నాయకుడుగా మారినవారు గాంధీ. భారతదేశం నుంచి వెళ్ళిన ఎంతోమంది ఇలాంటి వివక్షకు గురవుతున్నారని గుర్తించి. మరుసటి సంవత్సరంలోనే దక్షిణాఫ్రికాలో ‘నేషనల్ ఇండియన్ కాంగ్రెస్’ స్థాపించారు. 1896లో గాంధీ భారతదేశం వచ్చి దక్షిణాఫ్రికా భారతీయుల గురించి సమావేశాలు నిర్వహించారు. 

Also read: గాంధీజీ రాక ముందు దేశరాజకీయరంగం

గురువుగా గోఖలే

దక్షిణాఫ్రికానుంచి ఇండియా వచ్చినప్పుడు, కొల్లాయికి మారకముందు.

1901లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో తొలిసారి పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా భారతీయుల విజ్ఞప్తి మేర 1902లో తిరిగి వెళ్ళారు. మరుసటి సంవత్సరం అక్కడే ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికనూ, మరుసటి సంవత్సరం ‘ఫినిక్స్ సెటిల్మెంట్’ ప్రారంభించారు.  తర్వాత 1906లో సత్యాగ్రహ భావనను ప్రతిపాదించి అక్కడి భారతీయులను ఏకం చేసి హింసాత్మక పోరాటం సలిపారు. చివరికి 1914 జనవరిలో దక్షిణాఫ్రికాలోని బారతీయులకు సమస్యలు తొలిగాయి. అయితే అంతకు ముందు దక్షిణాఫ్రికాలో పర్యటించిన గోపాలకృష్ణ గోఖలే దౌత్యపరంగా చేసిన సాయం గాంధీకి  ఆ పోరాటంలో చాలా దోహదపడింది. ఫిరోజ్ షా మెహతా, బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలేలను అధ్యయనం చేసి, మితవాది అయిన గోఖలే మహాశయుడిని గాంధీ తన గురువుగా ఎంపిక చేసుకున్నారు. అది గాంధీజీ లోని చైతన్యం, స్పృహ, దార్శనికత!

Also read: గాంధీజీతో ప్రభావితమైన భారతీయ శాస్త్రవేత్తలు

ఏడాది రైలుబండిలో దేశయాత్ర

నెహ్రూతో గాంధీ

భారతదేశం 1915లో తిరిగి వచ్చిన గాంధీ శాంతినికేతన్ దర్శించి,  అహమ్మదాబాద్ దగ్గర సత్యాగ్రహ ఆశ్రమం ప్రారంభించారు. గోఖలే సలహా మీద ఒక సంవత్సరంపాటు రైలు బండి ప్రయాణం ద్వారా దేశం నలుమూలల పర్యటించి, ప్రజల ఆకాంక్షలు,  భాషలు, అలవాట్లు, సైకాలజీ మొదలైనవి అధ్యయనం చేశారు. తర్వాతనే (1916 ఫిబ్రవరి 4న) గాంధీజీ భారతదేశంలో తొలి ప్రసంగం బెనారస్ హిందూ మహా విద్యాలయంలో చేశారు. గాంధీజీ మాటలకు సంస్థానాదీశులు మాత్రమే కాదు, అనిబిసెంట్ కూడా నొచ్చుకుని, ప్రతిఘటించారు. 1916 డిసెంబరులో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో జవహర్ లాల్ నెహ్రూ పరిచయం అయ్యారు. మరుసటి సంవత్సరం చంపారణ్యంలో నీలిమందు రైతుల కష్టాలకు స్పందించి బ్రిటీషు ప్రభుత్వంతో పోరాడి, విజయం సాధించి తన విధానాన్ని భారతదేశంలో కూడా పరీక్షించుకున్నారు.  అదే సమయంలో మన సమాజంలో అజ్ఞానం, అవిద్య, అపరిశుభ్రత బాగానే ఉందని సంస్కరణ చర్యలు చేపట్టి ఫలితం సాధించారు. బాబూ రాజేంద్రప్రసాద్, మహదేవ్ దేశాయి ఈ ఉద్యమ కాలంలోనే పరిచయమయ్యారు. మరుసటి సంవత్సరం అహమ్మదాబాదు జౌళి కార్మికుల సమస్యలు తీర్చడానికి గాంధీజీ విధానాలు సహాయపడ్డాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే గుజరాత్ లోని ఖేడా జిల్లాలో రైతులను కరువుసమయంలో పన్ను కట్టమని ప్రభుత్వం పీడించడం పెరిగింది. గాంధీజీ ఖేడా సత్యాగ్రహం ద్వారా సమస్యను పరిష్కరించారు. చంపారన్ రైతులు, అహమ్మదాబాదు మిల్లు కార్మికులు, ఖేడా రైతులు సంఘటనలలో గాంధీజీ శ్రామికనేత అయ్యారు.

Also read: గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు!

ఎటుచూసినా పీడన, పేదరికం 

  “…దేశంలో ఎటుచూసినా పీడన, పేదరికం తాండవిస్తున్నాయి. జవసత్వాలుడిగి, జనం దైన్యంతో ఉన్నారు. బుద్ధిమందగించింది. పక్షవాతం వచ్చిన వారిలా, అవయవాలు కోల్పోయినవారిలా ఉన్నారు. రైతులు, కార్మికులు…. ప్రజలందరూ అనాథలయ్యారు. శతాబ్దాల వలస పాలనలో దిశానిర్దేశనం చెయ్యాల్సిన మధ్యతరగతి నిస్తేజంగా మారి, మానసిక బానిసైపోయింది. దరిద్రం, ఓటమి, నైరాశ్యంతో నిండిపోయిన మాతృభూమి మొర ఆలకించడానికన్నట్టు గాంధీజీ రంగ ప్రవేశం చేశారు” అని జవహర్ లాల్ నెహ్రూ తన  ‘డిస్కవరి ఆఫ్ ఇండియా’ గ్రంథంలో ఈ విషయాన్నే ఎంతో అర్థవంతంగా పేర్కొంటారు! 

Also read: గాంధీజీ దృష్టిలో టెక్నాలజి

(తరువాయి వచ్చే వారం)

డా నాగసూరి వేణుగోపాల్

ఆకాశవాణి పూర్వ సంచాలకులు,

 మొబైల్-9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles