Friday, February 3, 2023

శ్రేయస్సు మరువని సైన్స్‌ దృష్టి

గాంధీయే మార్గం-32

సత్యం, ధర్మం, అహింస, దేశభక్తి, మతసహనం, సత్ప్రవర్తన గురించి మాత్రమే గాంధీజీ దృష్టి పెట్టారని ఎంతోమంది భావిస్తారు. అయితే వాస్తవం వేరుగా ఉంది. ప్రయోగాలకు ప్రాణులను వాడటాన్ని తీవ్రంగా ఖండించారు;  పరిశోధనలు లేని ఆయుర్వేదం సంబంధించి హేతుబద్ధంగా విభేదించారు;  చర్ఖా నైపుణ్యం పెరగాలని ఒక దశాబ్దంపాటు ప్రపంచస్థాయి పోటీలు పెట్టారు; టెక్నాలజీని వాడే మనిషి స్వభావం కూడా మెరుగుపడాలని వాంఛించారు; సాంకేతికతను పెంచుకున్న పాశ్చాత్య ప్రపంచం నైతికంగా మెరుగయ్యిందా అని ప్రశ్నించారు; గ్రామీణ ప్రాంతంలో చెరుకు ఆడించే గానుగను మెరుగుపరిచే శాస్త్రవేత్తలు కావాలన్నారు; సాంకేతిక విజ్ఞానం స్థానిక భాషల్లో బోధించబడాలి, నేర్చుకోవాలి అన్నారు; శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో కాదు సగటు మనిషి చెంత ఉండాలన్నారు. నిజానికి గాంధీజీ సైన్స్‌ గురించి లోతుగా, విస్తృతంగా మాట్లాడడమే కాదు, దానికి మించి, పాశ్చాత్య ప్రపంచ విజ్ఞానపు ధోరణికి విరుగుడుగా ప్రత్యామ్నాయ సైన్స్ కు ఉండాల్సిన తాత్విక నేపథ్యాన్ని సైతం ప్రతిపాదించారు గాంధీజీ! గాంధీజీ నేరుగా సైన్స్‌ గురించి చర్చించలేదని చాలామంది పరిగణిస్తారు. దానికి కారణం గాంధీజీ రచన ‘హింద్‌ స్వరాజ్‌’ పుస్తకాన్ని సరిగా పరిశీలించకుండా చర్చించడమే.  అలాకాకుండా, 1888-1948 మధ్యకాలంలో వారి సమగ్ర రచనలు పరిశీలిస్తే తప్పా అసలు విషయం మనకు అవగతం కాదు. చివరి నాలుగు దశాబ్దాల వ్యవధిలో పండిన ఆయన ఆలోచనలు పరిహరించి, చర్చించడం ఎంతవరకు సబబు?

Also read: సైన్స్‌ ఆఫ్‌ బ్రహ్మచర్య

సమాజం వైజ్ఞానిక స్థాయి కంటే నాలుగుడుగులు ముందు

ఇక్కడ మరో విషయం గమనించాలి. గొప్పగా శ్లాఘించి, కీర్తించిన వారే గాంధీజీ సైన్స్‌ గురించి చెప్పిన విషయాలను పట్టించుకోకపోవడం. చర్ఖా అనేది కేవలం స్వాతంత్య్ర ఉద్యమానికి తోడ్పడుతుంది కానీ, మరేమీ కాదు అని నెహ్రూతో సహా చాలామంది భావించడం ఆశ్చర్యం కొలుపుతుంది. గాంధీజీ సైన్స్‌ ఆలోచనల గురించి కేవలం మూడు, నాలుగు దశాబ్దాల క్రితం కొత్త అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఇందులో భారతీయుల కన్నా ఇతరులే అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పుడు శోధిస్తే గాంధీజీ వర్తమాన విజ్ఞానశాస్త్ర ప్రపంచపు ధోరణికన్నా నాలుగు అడుగులు ముందున్నారని బోధపడుతోంది. గాంధీజీని;  గాంధీజీ ఖాదీ ఉద్యమాన్నీ – సైన్స్‌ వ్యతిరేకం అని తొలుత పరిగణించిన వారు ఆల్డస్‌ హక్స్లీ. ఇంతవరకు మనిషి సాధించిన ప్రగతిని నిరాదరించాలనే ధోరణి అని తప్పు పట్టారు. అంతేకాదు టాల్‌స్టాయ్‌, గాంధీజీ ఈ విషయంలో ఒకటే అన్నట్టు ఖండించారు కూడా! అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మహాశయుడు గాంధీజీని గొప్పగా కీర్తించారని అంటాం. అదే సమయంలో ఆధ్యాత్మికంగా, రాజకీయంగా గాంధీజీ తలపండిన మహనీయుడే కానీ శాంతికి సంబంధించిన  విజ్ఞానానికి కాదు అని ఐన్‌స్టీన్‌  వ్యాఖ్యానించడం కూడా ప్రాచుర్యం పొందింది. రెండవ పంచవర్ష ప్రణాళిక మార్పులకు మూలమైన శాస్త్రవేత్తకు గాంధీజీ పట్ల ఎటువంటి భావనలు ఉంటాయి? 

Also read: సమగ్రాభివృద్ధియే లక్ష్యం 

సైన్సు ప్రచారానికి గాంధీ కృషి

తక్కువ తెలుసుకుని ఎక్కువ మాట్లాడటం మన సమాజ స్వభావం కావచ్చు. కేవలం ‘హింద్‌ స్వరాజ్‌’ ఆధారంగానే ఎవరో కొందరు చెప్పిన విషయాలు పట్టుకుని ఈ ఏడున్నర దశాబ్దాలుగా మనం స్వాతంత్య్ర దేశ పౌరులుగా ఖండిస్తూ వచ్చాం. సైన్స్‌ సామర్థ్యాన్నీ, ప్రయోజనాన్నీ బాగా తెలిసిన గాంధీజీ అవి మన గ్రామీణ సమాజానికీ, దేశప్రజలకు ఎలా ఉపయోగపడాలో చాలా ప్రతిపాదనలు చేశారు. ఒకరకంగా పాశ్చాత్యదేశాల సైన్స్‌కు ప్రత్యామ్నాయంగా భావన చేశారు. అలానే భౌతికం కానటువంటి వనరుల గురించి ఆలోచన చేసి సైన్స్ ను మరింత అర్థవంతంగా కొనసాగాలన్నారు. మరోరకంగా చెప్పాలంటే టెక్నాలజి ఉన్న మనిషీ, అది లేని మనిషి గురించీ, మనిషి-ప్రకృతి సంబంధం గురించి, వాస్తవం-విలువ తేడా గురించి తర్జనభర్జన చేశారు. పరిశోధనలకు ప్రాణులను వాడటంపై ఇప్పుడు ఒక వర్గం వారు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ఆలోచనలు గాంధీజీ ఆనాడే చేశారు.  గాంధీజీ ఆలోచనలు భూమి అడుగు పొరలపై దృష్టిని పెడతాయి.

Also read: గాంధీ ఆర్థిక శాస్త్రం కృత్రిమ మైంది కాదు!

చర్ఖా నైపుణ్యం పెంచేందుకు పోటీ

 చర్ఖా నైపుణ్యం పెంచాలని ఇంజనీర్లకు పోటీ పెట్టారు. 1921లో ఆ బహుమతి పైకం ఐదువేలు.  ఈ బహుమతిని  ప్రతి సంవత్సరం పెంచుతూ పోయి 1929కి దాన్ని లక్ష రూపాయలు చేశారు. ఈ స్థాయిలో పెంచడానికి కారణం ప్రపంచస్థాయిలో ప్రయోగాలు జరుగుతాయి, మరింత ప్రయోజనకరమైన ఫలితాలు వస్తాయని. అంతకుమించి జగదీశ్‌ చంద్రబోస్‌, సి.వి.రామన్‌ తమ రంగాలలో ఏ స్థాయిలో పరిశోధన చేశారో భారతీయ వస్త్రరంగంలో కూడా అదే స్థాయి పరిశోధన జరగాలని గాంధీజీ ఆశించారు. 1934 నుంచి గాంధీజీ ఆలోచన ‘గ్రామాలకు సైన్స్‌’ అని సాగింది. అంతేకాదు సైన్స్‌ బోధన పట్ల కూడా ఎంతో దృష్టి పెట్టి స్థానిక భాషలలో అది సాగాలని వాంఛించారు. జపాన్‌ ఆ రీతిలో సాగుతోందని చెప్పేవారు. అదే సమయంలో అవసరమైతే ఇంగ్లీషు పదాలను స్థానిక భాషల్లో వాడుతూ, వివరణ సులువుగా ప్రజలకు చేరాలని స్పష్టం చేశారు. అంతకుమించి ఆలోచనల్లో, భావనలలో, శాస్త్రవిజ్ఞానంలో కేంద్రీకరణ అవసరం గానీ సైన్స్‌ పాలనా విభాగంలో కేంద్రీకరణ అంత ప్రధానం కాదంటారు. ఇంకా చెప్పాలంటే శాస్త్రవేత్త స్వభావం, దృక్పథం మరింత మానవీయంగా, గ్రామీణులకు అనుకూలంగా వుండాలని యోచన చేశాడు గాంధీజీ. దీనికి సంబంధించి ‘సత్యాగ్రహి శాస్త్రవేత్త’ అనే భావన చేశారు. మగన్‌లాల్‌ గాంధీజీ ఈ రకమైన భావనలకు ప్రత్యక్ష ఉదాహరణగా కృషి చేశారు. 1928లో మగన్‌లాల్‌ చనిపోయేదాకా గాంధీజీ సైన్స్‌ భావాలకు సాక్ష్యంగా సాగారు.  

Also read: గ్రామాల సుస్థిర అభివృద్ధికి గాంధీజీ సాంఘిక, ఆర్థిక విధానాలు

శాస్త్రీయ అభినివేశం

1921లో ఢిల్లీలోని టిబ్బా కళాశాలని ప్రారంభిస్తూ ఆయుర్వేదం, యునాని పాటించే వైద్యులలో శాస్త్రీయ అభినివేశం లేదని విమర్శించారు. ఎంతమాత్రం పరిశోధన చేయకుండానే సాగే ఈ భారతీయ వైద్యులు అగౌరవస్థాయిలోకి దిగజారిపోయారని ఖండించారు. మద్రాసు ఆయుర్వేద ఫార్మసి, కలకత్తా అష్టాంగ ఆయుర్వేద విద్యాలయ సమావేశాలలో – రెండూ 1925లోనే – లైంగిక సామర్థ్యాన్ని పెంచేరీతిలో ఈ వైద్యులు ఆయుర్వేద ఔషధాలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడాన్ని గట్టిగా ఖండించారు. అసలు పరిశోధనలు చేయకుండా చేసుకునే ప్రచారాన్ని తప్పుపట్టారు (19వ సంపుటం). గాంధీజీ చేసిన విమర్శలు ఎంత తీవ్రమో తెలుసుకోవడానికి  ఈ సందర్భం బాగా సహకరిస్తుంది. 

Also read: గాంధీజీని అనుసరించిన మహనీయులు

కలకత్తా ప్రసంగం ఆయుర్వేద వైద్యులకు కోపం తెప్పించింది. కవిరాజ్‌ గణనాథ్‌ సేన్‌ అనే ఆయుర్వేద ప్రముఖుడు విబేధిస్తూ గాంధీజీని వివరించమని కోరారు. జవాబుగా చాలామంది ఆయుర్వేద వైద్యులు సర్వరోగాలను నయం చేస్తామని చెప్పుకునే దొంగ వైద్యులనీ, వారిలో వినయంగానీ, ఆయుర్వేదం పట్ల గౌరవం గానీ, ఎటువంటి క్రమశిక్షణ గానీ లేవని గాంధీజీ ఖండించారు. అదే సమయంలో పరిశోధన కోసం జీవితాలను త్యాగం చేస్తున్న ఆధునిక వైద్యుల స్ఫూర్తిని, దృష్టిని శ్లాఘిస్తారు. మరో సందర్భంలో ఆయుర్వేద వైద్యం చౌక కానీ, సరళం గానీ, ఫలవంతం గానీ కాదని విమర్శిస్తూ, ఆయుర్వేద విధానాలు సంక్లిష్టమని ఖండించారు. మలేరియాకు క్వినైన్‌, నొప్పులకు ఐయోడిన్‌ వంటి ఔషధాలను ఆయుర్వేదంలో చూపమని కోరుతారు గాంధీజీ. సేవాగ్రామ్‌లో కలరా సోకినప్పుడు, దీనికి సంబంధించి ఆయుర్వేదం, హోమియోపతిలో పరిశోధనలు సాగాలని కోరారు. 

1904లో దక్షిణాఫ్రికాను ‘బ్రిటీష్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్ మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌’  సంస్థ సభ్యులు సందర్శించారు. వారితో చర్చిస్తూ గాంధీజీ సైన్స్ ను ప్రాచుర్యం చేసి, బ్రిటన్‌ తన వలస దేశాలను కలుపుకోవాలని కోరారు. ‘బ్రిటీష్‌ ఎంపైర్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్ మెంట్‌ ఆఫ్‌ సైన్స్’ గా ఆ సంస్థ పేరును మార్చుకోమని సూచించారు. అంతేకాదు, భారతదేశంలో ఒక సమావేశం ఏర్పరచమని, దానివల్ల భారతదేశం మాత్రమే కాక మొత్తం అసోసియేషన్‌ లబ్ధి పొందుతుందని కూడా వివరించారని కంప్లీట్‌ వర్క్స్‌ 5వ సంపుటం, 46వ పేజీలో వుంది. సైన్స్‌ ప్రాచుర్యం వల్ల శాస్త్రవేత్త నుంచి సామాన్యుడికి విజ్ఞాన ప్రసారం జరుగుతుంది. అయితే అది అంతమాత్రమే కాదు, ఒక సామూహిక ప్రయత్నం. తద్వారా ఆ సమాజాలే కాదు, సైన్స్‌ కూడా లబ్ధి పొందుతుందని వేరొక సందర్భంలో అనడమే కాదు, శాస్త్ర ప్రగతి కారణంగా మనిషి నైతిక స్థాయి ఎంతమాత్రం పెరగలేదని కూడా స్పష్టంగా చెబుతారు. యూరోప్‌ ఖండంలో శాస్త్రపురోభివృద్ధి వల్ల ద్వేషం, అన్యాయం ఎంతమాత్రం తగ్గలేదని కూడా విమర్శిస్తారు. (చూడుము సంపుటాలు 12, 16 & 18).

వీలయినచోట్ల శాస్త్ర దృష్టిని పెంపొందించే రచనలు తన ‘ఇండియన్‌ ఒపీనియన్‌’పత్రికలో ఇచ్చారు గాంధీజీ. సైన్స్‌ పరిమితులను గుర్తిస్తూనే,  సైన్స్‌ అభినివేశం వ్యాప్తి చెందాలని వాంఛించారు. వెసువియస్‌ అగ్నిపర్వతం బద్దలయినపుడు, విపత్కర పరిస్థితుల్లో సైతం శాస్త్రవేత్త మెటుస్సీ (Metussi) సమాచారాన్ని సేకరించడం అభినందనీయమని రాశారు. అంతేకాదు అటువంటి ప్రతిభ, దృష్టి, సామర్థ్యమున్న వ్యక్తులు భారతదేశం, దక్షిణాఫ్రికాలలో కూడా ఉన్నారని అంటూ, అయితే ప్రభుత్వాల కారణంగా వారు దెబ్బ తింటున్నారని వివరిస్తారు (5వ సంపుటం).

Also read: శ్రమజీవిగా బహురూపి

సహచరులకు రాసిన   ఉత్తరాలు, చేసిన చర్చలు, ప్రసంగాలు, సంభాషణలు గాంధీజీ శాస్త్ర దృక్పథాన్ని విశదం చేస్తాయి. జగదీశ్‌ చంద్రబోస్‌, ప్రఫుల్ల చంద్ర రే శాస్త్రవేత్తల దృష్టినీ, ప్రతిభను గాంధీ పలుసార్లు కొనియాడాడు. వీరిరువురు భారతీయ సమాజాన్నీ, మూలాల్ని బాగా ఎరిగిన దేశభక్తులయిన శాస్త్రవేత్తలని మనం గమనించాలి. ఆయా సంస్థల సమావేశాలు, సంబంధించిన వ్యక్తులతో చేసిన చర్చలలో మాత్రమే గాంధీజీ విమర్శలు చేశారు. వార్తలకోసమో, మరోదానికోసమో కాకుండా ఫలితం  ఉద్దేశించి చేసిన విమర్శలివి.   1919-1920 ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమ సమయంలో యంత్రాల గురించి గాంధీజీ ఏమంటారని ఎన్నో ప్రశ్నలు తారసపడ్డాయి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి వారు గాంధీజీని ఈ విషయంలో విమర్శించారు కూడా. ఈ సందర్భంలో తను యాంత్రీకరణకు వ్యతిరేకం కాదనీ, అయితే ఆ యంత్రాలను  వాడే మనుషుల బుద్ధిని దారిలో పెట్టాలని గాంధీజీ చాలా స్పష్టంగా వివరిస్తారు (19వ సంపుటం). దీనికి సంబంధించి డేనియల్‌ హ్యామిల్టన్‌ గారికి రాసిన ఉత్తరంలో గాంధీజీ భావనలో సైన్స్‌ విస్తృతి ఏమిటో గమనించవచ్చు. ఇలా రాశారు – “… was not a romantic or a mystic out to spiritualize machinery, but to introduce a human or a human spirit among the man behind the machinery.”

శాస్త్ర పురోభివృద్ధికోసం ప్రాణులను వాడటం గురించి గాంధీ చాలా లోతుగా, స్పష్టంగా విభేదించారు. శరీరకోత లేకుండా రక్తప్రసరణ సిద్ధాంతం ప్రతిపాదించడం సాధ్యమైనపుడు, చీటికిమాటికి ప్రయోగాలకు ప్రాణులను బలిచేయడం అర్థరహితమని గాంధీజీ వాదించారు. దీనికి సంబంధించి 29వ సంపుటంలో ఘాటుగా, వివరంగా చర్చిస్తారు. ఇటువంటి ప్రయోగాల వల్ల ఆధునిక వైద్య శాస్త్రం మతం యొక్క అసలు స్ఫూర్తిని వదిలివేయడమే కాదు, దాని శరీరం నుంచి ఆత్మను కూడా తొలగించిందని అంటాడు. సైన్స్‌ విషయంలో ఒక్క సిద్ధాంత విభాగం మాత్రమే చేయగలిగేది ఏమీ లేదు. పని అనేది మన మనసు, మెదడుతో కలిసి సాగితేనే అది అర్థవంతం అని కూడా చెబుతారు గాంధీజీ. అంతేకాదు. ఇంకా విప్లవాత్మకంగా ఆధునిక శాస్త్రవేత్తల నమ్రత, శాస్త్ర అభినివేశం వంటివి మన సంప్రదాయ వైద్యులలో లేవని కూడా ప్రకటిస్తారు. ఒకవైపు ప్రాణులను చంపి పరిశోధనలు చేసే ఆధునిక వైద్యశాస్త్రాన్ని ఖండిస్తూనే వారు ఏ రకంగా ఆయుర్వేద వైద్యుల కన్నా మెరుగో వివరించడం అనేది గాంధీజీకున్న సంపూర్ణ సైన్స్‌ దృష్టిని చెబుతుంది. 

Also read: హింస… అహింస

డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు

మొబైల్ ఫోన్-9440732392

Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles