Wednesday, November 6, 2024

భయంగొలుపుతున్న పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్

పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం తన మంత్రులపైనే నిఘా పెడుతున్నది. ప్రస్తుత ఐటీ మంత్రిపైన లోగడ నిఘా ఉండేది. ప్రతిపక్ష నేతలపైనా, పారిశ్రామిక వేత్తలపైనా, ఉన్నతాధికారులపైనా, న్యాయమూర్తులపైనా, జర్నలిస్టులపైనా నిఘా పెట్టారు. వ్యక్తిగత విషయాలనూ, సంబంధాలనూ, లావాదేవీలనూ ప్రభుత్వం దృష్టి నుంచి దాచలేమని తెలుసుకోవలసిన సమయం ఆసన్నమయింది.  మనకంటూ ఒక వ్యక్తిగత జీవితం, ఇతరులకు తెలియని గోప్యమైన అంశాలూ ఉండవనే విషయం ప్రజలందరూ గ్రహించవలసిన సమయం వచ్చింది. పడక గది రహస్యాలు కూడా బట్టబయలవుతాయని గ్రహించాలి.

పెగాసస్ అంటే గ్రీక్ పురాణాలలో రెక్కల గుర్రం అని అర్థం. ఇజ్రాయిల్ తయారు చేసిన ఈ పెగాసస్ సహాయంతో మన ఫోన్ నుంచి సమాచారం రెక్కలు కట్టుకొని ఎవరికి చేరకూడదో వారికి చేరుతుంది. కేవలం ఫోన్ల సంభాషణలు వినడమే కాదు, మనకు తెలియకుండానే మన మొబైల్ లో కెమెరాను ఆన్ (యాక్టివేట్) చేసి ఫోటోలు తీసుకొని నిఘా పెట్టినవారికి పంపించివేస్తుంది. మనకు ఫోన్ చేసినవారి ఫోటోలనూ, వారికి సంబంధించిన సమస్త వివరాలనూ క్షణాలలో సేకరిస్తుంది. పోన్ రెంగ్ కాకుండా, ఫోన్ యజమానికి తెలియకుండా అది నిఘా ఉంచినవారికి సమస్త సమాచారం అందిస్తుంది. దీన్ని జీరో ఎలర్డ్ అంటారు. ఫోన్ చేతిలో ఉన్నా దానిపైన నిఘా ఉన్న్ట్టట్టు మనకు తెలియనే తెలియదు. ఇక రహస్యం అంటూ ఏమీ ఉండదు. ఇది భారత రాజ్యాంగం ప్రదానం చేసిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే. వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించడమే. వ్యక్తిగత జీవితాలలో ప్రభుత్వం ప్రమేయం పెట్టుకోవడమే. మన జీవితం మనది కాకుండా పోతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. సమాచారమే శక్తి అంటారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి ఉపయోగించుకోవడం నియంతృత్వానికి పరాకాష్ఠ.

నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష ప్రభుత్వాలను అవలీలగా పడగొట్టడం వెనుక మెగాసస్ ఉన్నదనే ఆరోపణ కలవరం కలిగిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్)సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఈ నిఘా యంత్రమేనంటూ, ఈ వ్యవహారంపైన సంపూర్ణ దర్యాప్తు జరిపించాలని కర్ణాటక ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో కూడా ఈ నిఘా సాప్ట్ వేర్ తోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలలో ఒక రోజులోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా మారిపోతోంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.

వెయ్యిమంది భారతీయులపై నిఘా

ఒకరో, ఇద్దరో కాదు, దాదాపు వెయ్యమంది భారతీయుల ఫోన్లను ఈ యంత్రం హ్యాక్ చేసిందని అంటున్నారు. బలమైన అనుమానాలు ఉన్నాయి. రెండు, మూడు వందల మందిపైన ఈ యంత్రం ద్వారా నిఘా పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయి. కనీసం పదిమందిపైన నిఘాపెట్టినట్టు ధ్రువీకరణలు ఉన్నాయి. వారిలో ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిశోర్ ఒకరు. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపైన నరేంద్రమోదీ, దేశీయాంగమంత్రి అమిత్ షా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన విషయం విదితమే. ఆ ఎన్నికలలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఎప్పు. అయినా ఫలితం లేకపోయిందన్నది వేరే విషయం.  ఈ నిఘా సాఫ్ట్ వేర్ ను ప్రయోగించింది ఉగ్రవాదులపైన కాదు. రాజద్రోహులపైన కాదు. దేశద్రోహులపైన కూడా కాదు. అధికారపార్టీకి రాజకీయ ప్రత్యర్థులపైన దీనిని ప్రయోగించినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. రాహుల్ గాంధీపైనా, ఆయన సన్నిహితులపైనా, మాజీ ఎన్నికల కమిషనర్ పైనా, బర్తరఫ్ చేసిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపైనా, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ పైనా, మాజీ ప్రధాన న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారని ఆరోపణ చేసిన మహిళ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులపైనా, కశ్మీర్ లో, నాగాలాండ్ లో వేర్పాటువాదులపైనా, మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక బెనర్జీపైనా నిఘా పెట్టారు. ఈ జాబితా చూస్తే  ఈ పని ఎవరు చేశారో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. భారత ప్రభుత్వం ఈ పని చేసిందని అనుమానించడానికి ఆస్కారం చాలా ఉంది.

వెయ్యిమంది భారతీయులపైనా నిఘా పెట్టారని ప్రాథమిక వార్తలు వస్తే వాటిలో 300 మంది మొబైల్ నంబర్లను తనిఖీ చేశారు. 22 మంది వివరాలను ఫ్లొరెన్సిక్ ప్రయోగశాలలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశీలన చేయించింది. కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటో ప్రయోగశాలలో పరీక్షించారు. పదిమందిపైన నిఘా జరిగిన మాట నూటికి నూరు పాళ్ళు వాస్తవమని ఈ పరీక్షలలో తేలింది. ప్రశాంత్ కిశోర్ ఫోన్ పైన జులై 14న కూడా నిఘా ఉన్నదని తేలింది. ఎన్ డీఏ ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు. కేవలం అనుమానాలు ఉన్నాయి. ఈ నిఘా ఎవరికి అవసరం, ఎవరికి ప్రయోజనం అని ప్రశ్నించుకుంటే ప్రభుత్వం అనే సమాధానం వస్తుంది. పెగాసస్ పరికరాలను కొనుగోలు చేశారా అని అడిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. నిఘా సాఫ్ట్ వేర్ తయారు చేసిన ఎన్ఎస్ఓ కాడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలు కావాలని చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ప్రస్తుత ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రభుత్వం ఇటువంటి పనులు చేసే ఆస్కారమే లేదని చెబుతున్నారు. నిఘా పెట్టిన మాట వాస్తవం. ప్రభుత్వం ఈ పని చేయకపోతే విదేశీ ప్రభుత్వాలు చేశాయా? విదేశాలు చేశాయని అనుకుంటే విదేశాలకు ప్రశాంత్ కిశోర్, రాహుల్ గాంధీల వివరాలు ఎందుకు? ఈ ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.

‘క్రానాలజీ సమఝియే’ అంటున్న అమిత్ షా

‘క్రానాలజీ సమఝియే’ (వరుసను అర్థం చేసుకోండి) అంటూ దేశీయాంగ మంత్రి చేసిన వ్యాఖ్యను పరిశీలిద్దాం. అంటే పార్లమెంటు సమావేశాల ప్రారంభంలో ఇటువంటి గొడవ ఒకటి చేయాలని ప్రతిపక్షాలు అనుకొని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అమిత్ షా భావన. ఆయనకు అన్నీ తెలుసు. భారత పార్లమెంటు ప్రారంభానికి ముందు ఇటువంటి కుంభకోణం గురించి వార్తలు రాయాలని ఉంటే ప్రతిపక్షాలకు ఉండవచ్చు.  ‘ద వైర్‘ వంటి డిజిటల్ వార్తా సంస్థకు కూడా ఉంటుందని అనుకుందాం మాటవరుసకి. లే మాండే అనే ప్రతిష్ఠాత్మకమైన  ఫ్రెంచి పత్రికకూ, అమెరికా అగ్రశ్రేణి వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ కూ, బ్రిటిష్ చారిత్రక దినపత్రిక గార్డియన్ కూ భారత పార్లమెంటు ప్రారంభానికి ముందు గొడవ చేయాలని ఉంటుందా? ఫ్రాన్స్ అధ్యక్షుడే సాధికారమైన ప్రకటన చేశారు. పెగాసస్ ను నిఘాకోసం ప్రయోగించినట్టు ధ్రువీకరించారు. ఆయన భారత పార్లమెంటు సమావేశాలకు ముందు గొడవ చేయాలని అనుకుంటారా? ఇది అర్థం లేని వాదన. రవిశంకర్ ప్రసాద్ కానీ అమిత్ షా కానీ పసలేని వాదన చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

న్యూయార్క్ టైమ్స్ వెల్లడి

పెగాసస్ కు సంబంధించి ఏయే దేశాలకు ఈ నిఘా సాఫ్ట్ వేర్ ను  విక్రయించామనే వివరాలతో వెల్లడైన పట్టికలోవాస్తవాలు లేవంటూ ఎన్ఎస్ఓ సంస్థ చేసిన ప్రకటన పట్టుకొని కొత్త ఐటీ మంత్రి వేళ్ళాడుతున్నారు. ఇండియాకూ, మరి ఆరు దేశాలకూ పెగాసస్ యంత్రాన్ని విక్రయించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఎవరిని విశ్వసించాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. 2019లో ఫేస్ బుక్ మెగాసస్ సాఫ్ట్ వేర్ ను తయారు చేసినందుకు ఇజ్రాయిలీ కంపెనీ ఎన్ఎస్ఓ పైన కేసు పెట్టింది. ఇది సైబర్ ఆయుధాలను తయారు చేసే కంపెనీ.

ఉగ్రవాదులపైనా, వేర్పాటువాదులపైనా ప్రభుత్వం నిఘాయంత్రాలను ఉపయోగించవచ్చునా? ఐటీ చట్టంలోని 43వ, 66వ సెక్షన్లను కలిపి చదివితే ఉగ్రవాదుల ఫోన్లను సైతం టాప్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తెలుస్తుంది. అందుకు కొన్ని అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకోకుండా నిఘా పెడితే అది సైబర్ క్రైం అవుతుంది. అటువంటప్పుడు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఈ పరికరాలను ఎట్లా ఉపయోగిస్తారు? పౌరుల ప్రైవసీని (వ్యక్తిగత విషయాలలో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండటాన్ని) ప్రాథమిక హక్కుగా పరిగణించి దాన్ని పరిరక్షించే బాధ్యత  ప్రభుత్వానిది. అటువంటి ప్రభుత్వమే విదేశం నుంచి పరికరాలను కొనుగోలు చేసి సొంత పౌరులపైన వాటిని ప్రయోగించడం నేరం.

ఫ్రెంచ్ అధికార పార్టీ నాయకులపైనే ప్రయోగం

పెగాసస్ అన్నది ఇజ్రాయల్ కంపెనీ ఎన్ఎస్ఓ తయారు చేసిన రహస్య వినికిడి యంత్రం. దీనిని ఫ్రెంచి అధ్యక్షుడిమీదా, ప్రధానిమీదా, 14 మంది కేబినెట్ సభ్యులమీదా ప్రయోగించారు. ఈ విషయంపైన దర్యాప్తు చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిఘాయంత్రాన్ని విశ్వసనీయమైన ప్రభుత్వాలకూ, ప్రభుత్వ సంస్థలకూ మాత్రమే విక్రయిస్తామని ఇజ్రాయిల్ సంస్థ ప్రకటించింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ద విమానాల తయారీలో ప్రమేయం కలిగిన అనిల్ అంబానీ ఫోన్లనూ, ఆయన సంస్థకు చెందిన ఉన్నతాధికారుల ఫోన్లనూ ట్యాప్ చేయడం అంటే దేశరక్షణ వ్యవహారాలలో ఎవరో జోక్యం చేసుకున్నట్టు గానే పరిగణించాలి. రఫేల్ యుద్ధవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ ఏవియేషన్ కు భారత దేశంలో ప్రతినిధి పోసిన వెంకటరావుపైనా, సాబ్ ఇండియా మాజీ అధిపతి ఇందర్జిత్ సియాల్ పైనా, బోయింగ్ ఇండియా అధినేత ప్రత్యూష్ కుమార్ పైనా నిఘా పెట్టడానికి పెగాసస్ ను వినియోగించినట్టు వార్తలు వస్తున్నాయి.  ఫ్రాన్స్ కు చెందిన ఇడిఎఫ్ సంస్థ అధిపతి హర్మన్ జిత్ నాగీ పైన కూడా నిఘా ఉంది. ఫ్రెంచి అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మార్కన్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో పాటు నాగీ కూడా వచ్చారు.

వాటర్ గేట్ కంటే పెద్ద కుంభకోణం

ఇది ‘వాటర్ గేట్’ కుంభకోణం కంటే పెద్దదని ప్రతిపక్షాలు అంటుంటే అనధికారికంగా ఎవరి ఫోన్లూ ట్యాప్ చేయలేదని ప్రభుత్వ ప్రతినిధులు వాదిస్తున్నారు. రాజ్యసభలో గురువారం మధ్యాహ్నం తృణమూల్ ఎంపి శాంతను సేన్ ఐటీ మంత్రి చేతులలో నుంచి ప్రకటన ప్రతిని లాగివేసుకొని చించిన ఘట్టంలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసిన అనంతరం కేంద్రమంత్రి హర్దీప్ పూరి తనను కొట్టబోయారనీ, అదృష్టవశాత్తు తన పరిస్థితిని గమనించిన తృణమూల్ కాంగ్రెస్ సహచరులు వచ్చి తనను కాపాడారనీ సేన్ ఆరోపించారు. నిఘా వ్యవహారంపైన ఒక పద్ధతి ప్రకారం చర్చ జరగాలనీ, చర్చకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలనీ తృణమూల్ పక్షం నాయకుడు డెరెక్ ఓబ్రియెన్ కోరారు. సేన్ ను రాజ్యసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు.

నా ఫోన్ ట్యాప్ అవుతోందని నాకు తెలుసు: రాహుల్

‘‘నా ఫోన్ ట్యాప్ అవుతోంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. నన్ను పొటెన్షియల్ టార్కెగ్ (ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశం ఉన్నవ్యక్తుల) జాబితాలో చేర్చనక్కరలేదు,’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మెగాసస్ ని ప్రత్యర్థులపైన ఒక ఆయుధంగా ప్రభుత్వం వినియోగిస్తున్నదని రాహుల్ ఆరోపించారు. నిఘా కుంభకోణంపైన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పార్లమెంటులో గొడవ చేస్తున్నాయి. తన సంభాషణలను రికార్డు చేస్తున్నారని భద్రతా విభాగానికి చెందిన అధికారులు తనకు తెలియజేశారని రాహుల్ అన్నారు. ‘‘ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల నుంచి నాకు పోన్లు వస్తూ ఉంటాయి. మీ ఫోన్ ట్యాప్ అవుతోందని వారు చెబుతున్నారు,’’ అని శుక్రవారంనాడు పార్లమెంటు దగ్గర విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ‘‘నాకు భయం లేదు. నేను బెదిరిపోను. ఈ దేశంలోనువ్వు అవినీతిపరుడివైతే, దొంగవైతే భయపడాలి. దొంగవు కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు,‘ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఈ నిఘా పరికరాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందో లేదో వివరించాలి. పెగాసస్ ను ప్రభుత్వాలు మాత్రమే కొనుగోలు చేయగలవు. ఇది కొనాలంటే ప్రధానమంత్రి సంతకమో, కనీసం హోంమంత్రి సంతకమో కావాలి. ఒక దేశంలోని సైనిక వ్యవస్థ సైతం పెగాసస్ ను కొనుగోలు చేయలేదు,’’అంటూ రాహుల్ గాంధీ వివరించారు.       

ఎంజెలా మెర్కెల్ వ్యాఖ్య

నిఘాపైన పట్టింపు లేని దేశాలలో పెగాసెస్ వంటి నిఘా పరికరాలను విక్రయించేటప్పుడు జాగ్రత్తంగా వ్యవహరించాలని జర్మన్ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్ పోస్ట్ (అమెరికా), ద గార్డియన్ (బ్రిటన్), లే మాండే (ఫ్రాన్స్), మరి కొన్ని మీడియా సంస్థలు కలసి సంయుక్తంగా పెగాసస్ విషయంలో దర్యాప్తు చేస్తున్నాయి. ఈ సమాఖ్యలో సిద్దార్థ వరదరాజన్ సంపాదకత్వంలో నడుస్తున్న ‘ద వైర్’ కూడా ఉంది. అందుకు ఆ డిజిటల్ పత్రిక అందరికంటే ముందుగా ఇందుకు సంబంధించిన సమాచారం వెల్లడించగలిగింది.   ఈ నిఘా పరికరాలను విక్రయించడంలో, వినియోగించడంలో మరింత క్రమబద్ధీకరణ ఉండాలని ఐక్యరాజ్య సమితి హక్కుల విభాగం అధినేత మైకెల్లే బాచిలెట్ వ్యాఖ్యానించారు.

పెగాసస్ వ్యవహారంపైన దర్యాప్తు చేయాలని ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఎస్ఓ సంస్థ సరఫరా చేస్తున్న  సాఫ్ట్ వేర్ ను దురుపయోగం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల దృష్ట్యా మొత్తం పరిస్థితిని సమీక్షించేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించింది. సమీక్ష పూర్తయిన తర్వాత మేము మా విధానంలో సవరణలు చేసుకోవాలేమో ఆలోచిస్తామని ఇజ్రాయిల్ రక్షణ కమిటీ వివరించింది. మన ప్రధాని మాత్రం ఇంతవరకూ ఈ విషయంపైన నోరు విప్పలేదు. ప్రభుత్వం ఇప్పటికీ అంతా సవ్యంగానే ఉన్నదనీ, జరగరానిది ఏదీ జరగలేదనీ చెబుతూనే ఉంది. ప్రతిపక్షాలు పార్లమెంటును నడవనీయడం లేదు.

రఫేల్ దారిలోనే పెగాసస్

ఒక రకంగా ఇది అధికార పక్షానికి అనుకూలం. ప్రతిపక్షాలు ఇట్లాగే గొడవ చేస్తూ కాలయాపన చేస్తే పార్లమెంటు సమావేశాలు ముగియడానికి  ఒకటి, రెండు రోజుల ముందు ప్రతిపక్షాలను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ అధ్యక్షులు బహిష్కరిస్తారు. ఆ సమయంలో మొత్తం 30 బిల్లులను చర్చ లేకుండా గబగబా సభ ఆమోదం పొందవచ్చు. ఇంతకాలం ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహం ఇదే. సమావేశాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. పార్లమెంటును నడవనీయకుంటా అడ్డుకున్నాయనే అప్రతిష్ఠ ప్రతిపక్షాలకు మిగులుతుంది. ఇక మీడియాపైనే ఆధారపడి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉండాలి. అటువంటి ఆరోపణలకు ప్రాధాన్యం ఇస్తే దైనిక్ భాస్కర్ కు పట్టిన గతే తక్కిన మీడియా సంస్థలకు కూడా పడుతుందని హెచ్చరించడానికే ఆదాయం పన్ను శాఖ అధికారులు గురువారంనాడు ఆ పత్రిక కార్యాలయాలపైన దాడులు చేశారు. రఫేల్ కుంభకోణంపైన చర్చ జరగనట్టే పెగాసస్ కుంభకోణంపైన కూడా చర్చ జరగదు. ప్రజలు పట్టించుకుంటే 2024 ఎన్నికలలో దీని ప్రభావం కనిపిస్తుంది. అంతవరకూ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు.

Previous article
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles