Sunday, December 3, 2023

హేమావతి… రత్నగిరి… సేద్యపు సుద్దులు

ఆకాశవాణిలో నాగసూరీయం-17 

ఆకాశవాణి ఉద్యోగంలో నా అనుభవాల లేదా సంఘటనల తీరుతెన్నులు గురించి చదువుతున్నారు. అదే సమయంలో ఉద్యోగంలో బదిలీల ప్రయోజనాలు, ఇబ్బందులు గురించి కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాం. పదోన్నతి కలిగితే అదే ఆఫీసులో ఉండకుండా వేరే చోటుకు వెడితే మీ సామర్థ్యానికి మరింత సావకాశంగా ఉంటుందని భావిస్తారు. అది నిజమే. మనం పనిచేసే ఉద్యోగస్థాయి బట్టి కొంత అనవసరమైన లగేజి తయారై ఉంటుంది. దాన్ని వదిలించుకోవడానికి స్థానచలనమే మంచి మార్గం. అది ఆఫీసు పరంగా కూడా మంచిదే. ఒకే చోట ఎక్కవ కాలం పని చేసినా, మన ప్రమేయం లేకుండా ఇంకొంత లగేజిని మోయాల్సి ఉంటుంది. ఏ లక్ష్యాలకోసం ఉద్యోగంలో నియమించబడ్డామో అనే స్పృహ ఉన్నవారికి ఈ విషయాలు తెలియనివి కావు!

Also read: ఉత్సవాలవెల్లువగా ఆకాశవాణి ఉద్యోగపథం!

బదిలీపై కొత్త ఊళ్ళ పరిచయం

అనంతపురంలో మే 1990లో అనౌన్సర్ల బృందం

 నా వరకు అయితే బదిలీ అయినా, పదోన్నతి అయినా వేరే చోటు వెళ్ళడం చాలా రకాల ప్రయోజనకరం అని భావిస్తాను. కనుకనే నేను చాలా కొత్త ఊళ్ళు బదిలీ మీద చూడగలిగాను. అయినా, రెండుసార్లు అదే కేంద్రాలలో – (అనంతపురం, హైదరాబాద్) మళ్ళీ ఉద్యోగం చేశాను. తిరుపతి ఆకాశవాణి కేంద్రం ప్రోగ్రాం హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నపుడు హైదరాబాదు ప్రసారభారతి శిక్షణాకేంద్రం నిర్దేశకుడిగా 2018 ఆగస్టులో బదిలీ అయ్యాను. ఇది అంతకుముందు చేసిన పెక్స్ ఉద్యోగానికి పోలిక లేదు. కానీ దేశంలోని నాలుగు శిక్షణా కేంద్రాలతోపాటు హైదరాబాద్ రీజినల్ అకాడమిని కూడా మూసివేసినపుడు, 2019 జూన్ లో మళ్ళీ హైదరాబాదు ఆకాశవాణిలో చేరాను. అక్కడ గాంధీజీ 150వ జయంతి వత్సరానికి చాలా వినూత్న కార్యక్రమాలు చేయగలిగాను!

Also read: బదిలీ బాదరాయణంలో జీవనమాధుర్యం!

విజయవాడ-అనంతరపురం-విజయవాడ

‘హిందూపురం – గోరంట్ల – హిందూపురం’ అని ఆర్టీసీ బస్సు మీద బోర్డు ఉన్నట్టు నేను ‘అనంతపురం – విజయవాడ – అనంతపురం’ రూట్లో వెనక్కి పంపబడ్డాను. ఒకేచోట, ఒకే స్థాయి ఉద్యోగం… అయితే వయసు, అనుభవం ఐదేళ్ళు పెరిగాయి! మిగతా సహోద్యోగులు ఎలా ఉద్యోగాన్ని పరిగణిస్తారో, ఎలా చేస్తారో – ఇప్పటికీ నాకు ఆసక్తి లేదు, అవగాహన లేదు!  కొంకణి, మరాఠి, పోర్చుగీసు భాషలలో ప్రసారాలుండే ఆకాశవాణిలో ఉద్యోగం చేసిన తర్వాత,  తెలుగు భాష మీద, ఆ ప్రసారాల మీద, కార్యక్రమాల మీద మక్కువ పెరిగింది. అదే  అనంతపురంలో 1991లో చేరిన తర్వాత నా ఉద్యోగపు స్వభావాన్ని ప్రభావితం చేసింది. 

ఆకాశవాణి అనే మహావ్యవస్థలో ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫీసు, ఢిల్లీ కేంద్రం; పిమ్మట కలకత్తా, బొంబాయి, మద్రాసు వంటి ప్రాంతీయ స్థాయి ఆఫీసులు; తర్వాత రాష్ట్ర రాజధానులలో వుండే కేంద్రాలు, తర్వాత విశాఖపట్నం, కడప, కొత్తగూడెం వంటి స్టేషన్లు;  తర్వాతనే అనంతపురం, కర్నూలు, తిరుపతి, మార్కాపురం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాదు వంటి జిల్లా ఆకాశవాణి కేంద్రాలు. ఈ వ్యవస్థ గురించి అవగాహన ఉంది కనుక,  మనం చివర ఉన్నాం… పై స్థాయి కార్యాలయాలలో అవకాశాలు, ప్రతిభ, నేర్చుకునే వెసులుబాటు ఎక్కువ ఉండే వీలు ఉంటుందని భావించేవాడిని.

Also read: పదిలంగా సాగిన ఉద్యోగ రథం!

చాలా గమనించాను, నేర్చుకున్నాను, మెరుగయ్యాను 

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో…

ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, హైదరాబాదు, మద్రాసు, విజయవాడ నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలను విద్యార్థిలాగా ఆసక్తిగా పరిశీలిచడం అలవాటయ్యింది. దీనివల్ల ఆకాశవాణి ఉద్యోగిగా చాలా గమనించాను, నేర్చుకున్నాను, మెరుగయ్యాను!  ఇదివరకే చెప్పాను నాకు మెరుగైన పనితనం అంటే ఆరాధన అని. విజయవాడ వెళ్ళాక నాకు చాలా విభిన్నమైన కార్యక్రమాలు చేయగలిగే అవకాశం లభించింది. తృప్తి కల్గింది. తృప్తికి మించిన నమ్మకం – నా మీద నాకునమ్మకం, విశ్వాసం పెరిగాయి. అదీ 2002లో అనంతపురం వెళ్ళే సమయానిక నా మానసిక స్థితి! విజయవాడలో కొనసాగాలనే కోరిక లేదు. మళ్ళీ అనంతపురం కాకుండా మరోచోట అయితే మంచిదని అనిపించింది. అది సాధ్యపడలేదు. 

Also read: లేచి వచ్చిన లేపాక్షి బసవడు!

విజయవాడలో రిలీవ్ అయ్యేవేళకు నా మదురై కామరాజ్ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్ ఎం.ఏ (జర్నలిజం) మొదటి సంవత్సరం పరీక్షలు సుమారు నెల దూరంలో ఉన్నట్టున్నాయి. అప్పటికి పరీక్షలు రాయాలనే నిర్ణయానికి పూర్తిగా రాలేదు. రిలీవ్ అయ్యాను. అనంతపురం వెళ్ళాలి. సరిగ్గా ఆ సమయంలో నా మిత్రుడు, విజయవాడ సహోద్యోగి అబ్దుల్ ఖుద్దూస్ ఇచ్చిన సలహా బాగా పనిచేసింది. ఎం.ఏ. పరీక్షలు రాసెయ్యమని నన్ను గట్టిగా ఖుద్దూస్ కోరారు. ఆయన ఆ రోజు అలా కోరకపోయుంటే నేను పరీక్షలు రాసేవాడినో కాదో ఇప్పుడు చెప్పలేను.  సెలవు పెట్టి, చదువుకుని, తొలి సంవత్సరం పరీక్షలు రాశాను. 2002లో ఎం.ఏ. పరీక్ష  రాయకపోయి ఉంటే పిహెచ్.డి. ప్రయత్నం జరిగి వుండేది కాదుకదా! అనంతపురంలో జాయిన్ అయ్యాను. దాదాపు రెండేళ్ళు పనిచేశాను. కన్నడ-తెలుగు మిత్రులు అంజనప్ప నాకు అధికారి.

Also read: అనంతపురం పల్లెకళల దిగంతం!!

అనంతపురం గురించి అంతా తెలుసు 

అంతకుముందు 1991-1996 మధ్యకాలంలో అనంతపురం కేంద్రంలో చేశాను కనుక,  జిల్లా స్వరూపం, సంస్కృతి, సమస్యలు, సమాజ  అవసరాలు, ఆకాశవాణి అవకాశాలు సంబంధించి అవగాహన ఉంది. అంతకుమించి జిల్లా కేంద్రం కనుక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల శాఖలు, మిగతా పబ్లిక్ రంగ వ్యవస్థలు ఎలా, ఏ పరిధిలో పనిచేస్తాయో , దానికి ఉండే వ్యవస్థ ఏమిటో బోధపడింది. 

Also read: విజయదశమి కనకదుర్గ తెప్పోత్సవం

నిజానికి ఏ ఆకాశవాణి పెక్స్ అయినా తొలి దశలో జిల్లా కేంద్రం ఆకాశవాణిలో ఓ నాలుగేళ్లు పనిచేస్తే ఇతర వ్యవస్థల పని తీరుతో పాటు, తాము కూడా ఏ స్థాయి,  ఏ అవసరాలున్న శ్రోతలకు కార్యక్రమాలు చేస్తున్నామో బోధపడుతుంది. తర్వాత తమ వనరులు ఆధారంగా పనిలో సాగే అవకాశముంది.

Also read: చిరస్మరణీయమైన ‘వెలుగుజాడ’ ధారావాహిక!

విజయవాడలో ఉత్కృష్ట ఫలితాలు    

విజయవాడలో  ఐదున్నర సంవత్సరాలు పనిచేయడం వల్ల మంచి కార్యక్రమాలు ఎలా చేయగలమో తెలియడమే కాక, చక్కగా శ్రమిస్తే ఎలా ఉత్కృష్టమైన ఫలితాలు పొందగలమో కూడా  బోధపడింది. ఈ అనుభవం, విశ్వాసం అనంతపురంలో రెండోసారి పనిచేసినప్పుడు నన్ను నడిపాయి. అంతకు మించి సమాజం పట్ల, ప్రాంతం పట్ల, స్థానిక భాష తీరుపట్ల ఎస్. హెచ్.  అంజనప్ప అవగాహన, దృష్టి నా పనికి తోడయ్యాయి. 

Also read: జంట ప్రసంగాల కదంబం – బొమ్మా, బొరుసా

అంతకుముందు  చేయని విభాగాలు, బాధ్యతలు ఇష్టపడ్డాను, స్వీకరించాను. సర్వీస్ లో సీనియారిటీ కొంత వచ్చింది కనుక,  ఎంపికలో స్వేచ్ఛ కూడా లభించింది. కనుకనే వ్యవసాయదారుల కార్యక్రమాన్ని ఇష్టంగా తీసుకుని చేశాను. లేపాక్షి, హేమావతి,  రత్నగిరి,  సేద్యపు సుద్దులు వంటి రీతిలో కార్యక్రమాలకు స్థానిక ప్రాధాన్యత గల నామకరణం చేయడం ; ప్రముఖులతో ప్రతినెలా లైవ్ ఫోన్ – ఇన్ ప్రోగ్రాం నేనే నిర్వహించడం; జిల్లా ప్రముఖుల గురించి, ఆయిల్ టెక్నాలజి ఇన్ స్టిట్యూట్ ప్రయోగాలు, విజయాలు గురించి ఇంకా మీతో ఆకాశవాణి ఇలా చాలా అర్థవంతమైన ప్రయత్నాలు చేయగలిగాను. రెండోసారి తక్కువ కాలమే పనిచేసినా, కొంత సాధించాననే తృప్తి మాత్రం తక్కువ కాదు! 

Also read: అన్నమయ్య పదగోపురం

డాక్టర్ నాగసూరి వేణుగోపాల్,

ఆకాశవాణి పూర్వ సంచాలకులు,

మొబైల్-9440732392

 

Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles