Friday, September 29, 2023

వైసీపీకి రాజమహేంద్రవరంలో సొంత కార్యాలయం!

వోలెటి దివాకర్

అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలనే నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీకి  కార్యాలయాలను నిర్మించనున్నారు. నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 5-6 నెలల కాలంలో అత్యంత సుందరమైన, అధునాతన కార్యాలయం ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వెనుక రెండు ఎకరాల స్థలంలో నిర్మించనున్న కార్యాలయానికి శనివారం ఉదయం జక్కంపూడి రాజా దంపతులు శంకుస్థాపన చేశారు. పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించారని రాజా చెప్పారు.

వైఎస్ ఆర్ సీపీ రాజమహేంద్రవరం కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా వనిత, జక్కంపుడి రాజా, తదితరులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రతీ పార్టీకి జిల్లా కార్యాలయం ఎంతో ముఖ్యమన్నారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగడం పార్టీలోని అందరికీ ఎంతో సంతోషకరమన్నారు. త్వరలోనే నిర్మాణం పూర్తి, కొద్ది నెలల్లోనే ప్రారంభించుకోవా లనే ధృడ సంకల్పంతో తామంతా నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నామన్నారు.

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణానికి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా నాయకత్వంలో శంకుస్థాపన జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ వంద వసంతాలు పూర్తిచేసుకుని చెక్కు చెదరకుండా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నామన్నారు.

నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు,  తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాల్ కృష్ణ, జగ్గంపేట నియోజక వర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమండ్రి రూరల్ కో- ఆర్డినేటర్ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు, రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలరెడ్డి, రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు ఆడపా శ్రీహరి, వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు గుద్దే రఘు నరేష్, వివిధ విభాగాల చైర్మన్లు, డైరెక్టర్లు,మాజీ కార్పొరేటర్లు, వార్డ్ ఇన్చార్జులు, నాయకులు, శ్రేణులు అందరూ పాల్గొన్నారు.

ప్రస్తుతం జాతీయ పార్టీ బీజేపీకి మినహా ఇతర పార్టీలకు రాజమహేంద్రవరంలో  సొంత కార్యాలయాలు లేవు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ గానీ…14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ కానీ సొంత కార్యాలయాలు నిర్మించుకోలేకపోయాయి. అధికారంలో ఉన్నంత కాలం మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన కాంప్లెక్స్ లో ఒకే కార్యాలయాన్ని నిర్వహించిన టీడీపీ నాయకులు ఆతర్వాత అంతర్గత విభేదాల కారణంగా సొంత కార్యాలయాలు తెరుచుకున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని  రాజమహేంద్రవరంలో తొలి వైసీపీ సొంత కార్యాలయ నిర్మాణానికి రాజా  శ్రీకారం చుట్టడం విశేషం. ఏపార్టీకైనా సొంత కార్యాలయం ఉంటే అంతర్గత విభేదాలను అదుపులో పెట్టడంతో పాటు పార్టీ నాయకులు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉంటాయి.

Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles