Monday, November 28, 2022

కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…

కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత  సంక్షోభం స్పష్టంగా అందరికీ కనిపిస్తూనే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోరపరాజయం (వరుసగా రెండోసారి ఓటమి) తర్వాత ఆ పార్టీ పూర్తికాలం పని చేసే అధ్యక్షుడి సారథ్యంలో ఆత్మవిశ్వాసంతో నిలబడవలసి ఉంది. ఆ పార్టీ పంజాబ్ విభాగం అల్లకల్లోలంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ లో ముఠాతగాదాలు ముమ్మరమైనాయి. స్వల్ప మెజారిటీతో పార్టీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్ లో అశాంతి సెగ క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించే ముందు తనను సంప్రతించలేదంటూ ఈశాన్య రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అసంతృప్తిని వెలిబుచ్చారు. గోవా మాజీ ముఖ్యమంత్రి పార్టీ వదిలి వెళ్ళిపోయారు. కేరళలో సీనియర్ పార్టీ నాయకులు తమ సమస్యలను బహిరంగంగా చాటుతున్నారు. పార్టీలో సంస్థాగత సంస్కరణల కోసం ఎలుగెత్తిన జి-23 నాయకులు తాము లేవనెత్తిన అంశాలను ఇంతవరకూ నాయకత్వం పట్టించుకోలేదని అంటున్నారు. సంస్థాగత అస్తవ్యస్త పరిస్థితులకు తోడు కాంగ్రెస్ పార్టీ తన అవతార మూలాల (ఆత్మ) విషయంలో సందిగ్థావస్థలో పడిపోయి తన పునాదిని (అస్థిత్వాన్ని) తిరిగి అధీనంలోకి తెచ్చుకోలేకపోతోంది. ఒకానొకప్పుడు అత్యంత వైభవంగా విరాజిల్లిన పూరాతన పార్టీ (గ్రాండ్ ఓల్డ్ పార్టీ)ని ఇంత దయనీయమైన స్థితికి చేర్చిన నేపథ్యంపైన నా అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు ఆ పార్టీ ఎదుర్కొంటున్న పెను సవాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

ముందుగా ఈ వేదనను ఆలకిద్దాం: ‘‘జనసమూహాలతో సంపర్కాన్ని మనం చాలావరకూ  కోల్పోయాం. వారి నుంచి ప్రవహించే ప్రాణవాయువు వంటి శక్తిని పొందడంలో విఫలం అవుతున్నాం. మనం ఎండిపోతాం, బలహీనమైపోతాం. మన సంస్థ చక్కిశల్యమై తనకున్న శక్తిని కోల్పోతుంది.’’ కాంగ్రెస్ ఇంకా స్వాతంత్ర్యంకోసం పోరాడుతున్న ఉద్యమ పార్టీగా ఉన్న రోజులలో, స్వతంత్ర్య భారతంలో అధికారంలోకి రావడానికి దశాబ్దం ముందు, 1936లో లక్నో ఏఐసీసీ మహాసభలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలివి. అప్పటికి 50 ఏళ్ళ కిందటే 1885లో కాంగ్రెస్ పుట్టింది. నెహ్రూ ఈ వ్యాఖ్య చేసినప్పుడు పార్టీకి అగ్రనాయకుడుగా మహాత్మాగాంధీ కొండంత అండగా ఉన్నారు.

మన సంస్థకి ఏమైంది?

మరి ఇప్పుడో? పార్టీపైన వస్తున్న విమర్శను గమనించండి. ‘‘మన గొప్ప సంస్థకు ఏమైంది? దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే స్థాయి నుంచి మనం కుంచించుకొని పోయాం. శ్రమజీవులతో సంబంధాలు కోల్పోయాం. ఎన్నికలలో గెలిచామా, ఓడామా అన్నది ముఖ్యం కాదు. ఒక ప్రజాస్వామ్య సంస్థకు జయాపజయాలు కొనసాగే అస్థిత్వంలో భాగాలు. మనం ప్రజలతో కలిసి వారి మధ్య పని చేస్తున్నామా, లేదా అన్నదీ, వారి పోరాటాలతో, వారి ఆశలతో, అభిలాషలతో మనం మమేకమైనామా, లేదా అన్నదే ప్రధానం.’’

‘‘…మనం బలహీనులమైపోయాం. జనబాహుళ్యంతో సజీవమైన సంబంధాలు కోల్పోయిన ఫలితంగా సంభవించిన దురవస్థలకు బలైపోయాం.’’

‘‘…మనం ఏ క్రమశిక్షణకూ లొంగం. ఏ నిబంధననూ పాటించం. రాజకీయరంగంలో అనుసరించవలసిన నియమాలు  ఆచరించం. అవినీతిని సహించడమే కాకుండా అది నాయకత్వ లక్షణంగా పరిగణిస్తాం. చెప్పేదానికీ, చేసేదానికీ పొంతనలేని జీవితాలు మనవి. ప్రతి అడుగులోనూ మన ఆదర్శాలకూ, ఆచరణకూ మద్య ఘర్షణ జరుగుతోంది. ప్రతి దశలోనూ మన వ్యక్తిగత జీవితం మన సామాజిక నిబద్ధతను నిలువునా పాతరేస్తోంది.’’

‘‘…కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మనకు వంశపారంపర్యంగా వచ్చే అందమైన పురాతనమైన వస్తువుల్లా తయారయ్యాయి. ప్రత్యేక సందర్భాలలో వాటిని దుమ్ముదులిపి, ముస్తాబు చేస్తాం. చూసుకొని మురిసిపోతాం. మన గొప్ప దేశానికి పనికి వచ్చేవి మన సిద్ధాంతాలు మాత్రమే. ఆ సిద్ధాంతాలను ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని అన్వయించాలి. మన ప్రత్యర్థులు చేసే దాడుల నుంచి వాటిని రక్షించాలి. ఈ విషయం మనం మరచిపోతున్నాం.’’

ఇది నెహ్రూ వాపోయిన తర్వాత 50 ఏళ్లకు 1985 కాంగ్రెస్ శతవార్షికోత్సవ సందర్భంగా జరిగిన ఏఐసీసీ సభలో రాజీవ్ గాంధీ ప్రసంగం. ఎన్నికలలో పరాజయం చెందిన తర్వాత నిరాశానిస్పృహలకు లోనై మాట్లాడుతున్న పార్టీ అధినేత కాదు ఆయన. మన రిపబ్లిక్ చరిత్రలో ఎన్నడూ లేనంత అతి పెద్ద ఎన్నికల విజయం సాధించిన తర్వాత పార్టీ వేదికపై నుంచి మాట్లాడారు.

జి-23లో ముగ్గురు – కపిల్ శిబ్బల్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ

నరోరా శిబిరం నిర్ణయాలు

దానికి ఒక దశాబ్దానికి ముందు, 1974 నవంబర్ లో ఇందిరాగాంధీ పనపున కాంగ్రెస్ నాయకులు నరోరాలో సమావేశమై పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ సమస్యలపైన స్పష్టత సాధించి, సిద్ధాంతపరమైన, సంస్థాగతమైన సమస్యలను పరిశీలించి పార్టీ రాజకీయంగా పురోగమించడానికి అవసరమైన భవిష్యత్ చిత్రపటాన్ని (రోడ్ మ్యాప్)ను తయారు చేయాలని ప్రయత్నించారు. రాజకీయాలకూ, ఆర్థికానికీ సంబంధించిన 13 అంశాల కార్యక్రమాన్ని నరోరా శిబిరంలో తయారు చేశారు. అయితే, నరోరాలో తయారైన కార్యక్రమాన్ని అమలు చేసే లోగానే దేశంలో ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. తర్వాత 1977లో జరిగిన ఎన్నికలలో పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 1980లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అంతలోనే ఇందిరాగాంధీ హత్య జరిగిపోయింది. 1984లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ విధంగా నరోరా శిబిరంలో జరిగిన మేథోమథనం ఫలితాలు కార్యరూపం దాల్చకుండా ప్రధానమైన రాజకీయ పరిణామాలు అడ్డు వచ్చాయి. దేశంలో రూపుదిద్దుకుంటున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని తిరిగి ఉచ్ఛస్థాయిలో నిలపాలన్న ఆకాంక్ష కాగితాలకే పరిమితమై పోయింది.

ముంబయ్ వేదికగా 1985లో జరిగిన ఏఐసీసీ సభలో అత్యంత నిజాయితీగా, కించిత్ కఠినంగా ఆత్మవిమర్శ చేసుకుంటూ సాగిన ప్రసంగాన్ని ఆచరణలో కొనసాగించే ప్రయత్నం రాజీవ్ గాంధీ చేయలేదు. షాబానో కేసు, అయోధ్య వివాదం ముదరడం, పరువునష్టం బిల్లుపైన చెలరేగిన వివాదం, అంతకంటే ముఖ్యమైన బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ బండిని పట్టాలమీదినుంచి పక్కకు తప్పించాయి. సంస్థాగత సంస్కరణల విషయం ఆయన మనసులో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడానికి అవసరమైన ఏకాగ్రతను కోల్పోయారు.1989లో పార్టీ పరాజయం తర్వాత రెండేళ్ళ గందరగోళం, అనంతరం రాజీవ్ హత్య, అనూహ్యంగా పీవీ నరసింహారావు ప్రధాని కావడం, ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సంస్కరణలతోనే పుణ్యకాలం గడిచిపోయింది. సంస్థాగత సంస్కరణల గురించి ఆలోచించి ఆచరించే వ్యవధి లేకపోయింది. పీవీకి రాజకీయంగా ఏమైనా సుహృద్భావం ఉంటే అది ఆర్థిక సంస్కరణల గురించి కాంగ్రెస్ నాయకులకూ, దేశప్రజలకూ నచ్చజెప్పడానికే ఖర్చయింది. పార్టీకి ఆయన నాయకత్వం తిరుగులేనిది ఏమీ కాదు. చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. అందుకని కాంగ్రెస్ సంస్థాగత సంస్కరణలపైన తీవ్రమైన మేథోమథనం చేయాలనే ఉత్సాహం లేకపోయింది. 1996లో పార్టీ పరాజయం చెందడంతో ఆర్థిక సంస్కరణల గురించి భయసందేహాలు తిరిగి ప్రాసంగికమైనాయి. ఫలితంగా పార్టీ ఆత్మ గురించీ అస్థిత్వం గురించీ అనుమానాలు మొదలైనాయి.

పరిస్థితులను సమీక్షించేందుకు కాంగ్రెస్ నాయకులు 1998లో పంచమఢిలో చింతన్ బైఠక్ జరిపారు. కీలకమైన అంశాలలో పార్టీ సిద్ధాంతాలు అంత స్పష్టంగా లేవని పార్టీ గుర్తించినట్టు చర్చాపత్రం సూచించింది. ఈ అస్పష్టత కారణంగా పార్టీ ఏ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటుందనే విషయంలో ఓటర్లలోనే కాకుండా పార్టీ కార్యకర్తలలో కూడా అయోమయ పరిస్థితి నెలకొన్నది.

తిరిగి రాని బలహీనవర్గాలు

దళితులూ, ఆదివాసుల, వెనుబడినవర్గాలలో కొత్త తరాలవారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వాటిని పట్టించుకోవడంలో పార్టీ విఫలమైదని నాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చింది. ఉత్తర ప్రదేశ్, బిహార్ లో పార్టీ ప్రాబల్యం తగ్గిపోవడానికి అదే ప్రధాన కారణమని గుర్తించింది. ‘‘మనలను బలపర్చుతున్న, మనవైపు చూస్తున్న సామాజిక కూటమినీ, సామాజిక పునాదినీ కోల్పోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది,’’ అని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. అయితే, సంఘ్ పరివారం, బీజేపీ నాయకులు నిశ్శబ్దంగా పని చేసుకుంటూ తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వారు పెద్ద సవాలుగా మారిన వాస్తవాన్ని 1998 పంచమఢీ శిబిరం గ్రహించినట్టు ఎటువంటి దాఖలా కనిపించలేదు. దళితులనూ, ఆదివాసులనూ, వెనుకబడినవర్గాలనూ (ఓబీసీ) తిరిగి గెలుచుకోవాలన్న ప్రయత్నం సవ్యంగా సాగలేదు. కుల అస్థిత్వాలకు ప్రాధాన్యమిచ్చే ప్రాంతీయ పార్టీలు బలంగా వేళ్ళూనుకున్నాయి. ఆ పార్టీలు  బలహీనవర్గాలను ప్రోత్సహిస్తున్నాయి. వాటిని కాంగ్రెస్ తిరిగి ఆకర్షించలేకపోయింది.  

పంచమఢి శిబిరానికీ, 2004 ఎన్నికలకూ మధ్య కాంగ్రెస్ పార్టీలో సైద్ధాంతిక పునరుజ్జీవనం కోసం ప్రయత్నం జరగలేదు. ఇదివరకు పార్టీకి అండగా నిలిచిన సామాజిక కూటమి విధేయతను తిరిగి గెలుచుకోవాలన్న పంచమఢి తీర్మానం అపసవ్యంగా అమలు జరిగింది. బీజేపీ నాయకత్వం చేసిన వ్యూహాత్మకమైన తప్పిదాల వల్ల ఆ పార్టీ 2004లో ఓడిపోయింది. విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ తాను తిరిగి గెలుచుకోవాలనుకున్న సామాజిక కూటమి గురించి విస్మరించింది. 2009లో రెండో విడత బీజేపీ ఓడిపోవడాన్ని బీజేపీ,  సంఘ్ పరివార్ బలహీనమైనట్టు కాంగ్రెస్ పార్టీ అపార్థం చేసుకున్నది.

ఆంధ్రప్రదేశ్ లో తప్పుడు లెక్కలు

రెండో ఇన్నింగ్స్ లో కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతోనే సతమతమైపోయింది. కష్టకాలంలో కాంగ్రెస్ కు కంచుకోటలాగా నిలిచిన దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో తప్పుడు లెక్కల కారణంగా పార్టీ పెద్ద మూల్యం చెల్లించింది.  2014లో బీజేపీ ప్రచారంలో కొట్టవచ్చినట్టు కనిపించిన శక్తితో, దూకుడుతో, వనరులతో కాంగ్రెస్ పార్టీ పోటీ పడలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక విజయాలు సాధించింది. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైనదనీ, ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని రాజకీయ పక్షవాతం (పాలసీ పెరాలిస్) ఆ పార్టీని ఆవహించిందనీ బీజేపీ చేసిన ప్రచారం బాగా పని చేసింది. మధ్యతరగతి ప్రజలు కాంగ్రెస్ కు దూరం అవుతున్నారనే వాస్తవాన్ని ఆ పార్టీ నాయకత్వం గుర్తించలేకపోయింది. ఒక వేళ గుర్తించినా మధ్యతరగతిని తనతో నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో, పట్టణాలలో యువజనులు యువనాయకుడు రాహుల్ గాంధీ కంటే డెబ్బయ్యోపడిలో ఉన్న అన్నా హజారేని ఎక్కువగా ఆలకిస్తున్నారని అందరికీ తెలుస్తూనే ఉన్నది. 2004, 2009లో కాంగ్రెస్ విజయానికి తోడ్పడిన వర్గాలు పార్టీకి దూరం కాకుండా నిలుపుచేయడానికి అవసరమైన సంస్థాగత యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి లేకపోయింది. ప్రభుత్వం కంగారు పడింది. ఒక నిర్దిష్టమైన, సమగ్రమైన, స్పష్టమైన సైద్ధాంతిక ప్రాతిపదికను పార్టీ ప్రదర్శించలేకపోయింది.   

సవాళ్ళను గుర్తించడంలో వైఫల్యం

కాంగ్రెస్ పార్టీ 2013లో జైపూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ జరిగిన తీరు చూస్తే రాజకీయ, సైద్ధాంతిక సవాళ్ళను లోతుగా అధ్యయనం చేసి మదింపు చేసినట్టు కనిపించదు. తన అధికారానికి ఎదురయ్యే గట్టి సవాళ్ళను ఎన్నికలకు ఏడాది ముందు కూడా పార్టీ గుర్తించలేకపోయింది. 2014లో ఓడిపోయిన తర్వాత సైతం కాంగ్రెస్ కోలుకొని తన సైద్ధాంతిక బలాన్ని 2019 ఎన్నికలలో  కూడా ప్రదర్శించలేకపోయింది.

ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య సైద్ధాంతిక పోరాటం అసమానంగా ఉంటుంది. కడచిన ఏడేళ్ళుగా కాంగ్రెస్ రాజకీయ విమర్శలు అన్నీ ప్రభుత్వ నిర్ణయాలకూ, పనితీరుకూ సంబంధించినవే. ఈ విమర్శలు అవసరమే అనడంలో అనుమానం లేదు. కానీ అవి మాత్రమే సరిపోవు. కాంగ్రెస్ పార్టీ మోదీనీ, ఆయన ప్రభుత్వం పనితీరును మాత్రమే లక్ష్యం చేసుకొని విమర్శిస్తుంది. కాషాయపార్టీ సైద్ధాంతిక అంశాలపైన విమర్శలను విస్తరించడానికి సంకోచిస్తున్నది. ఇందుకు భిన్నంగా బీజేపీ కాంగ్రెస్ మూలాలపైన దాడి చేస్తున్నది. కాంగ్రెస్ లౌకిక విధానాలను అపహాస్యం చేస్తున్నది. ప్రభుత్వరంగాన్ని, సామ్యవాద విధానాలనూ తూష్ణీభావంతో చూస్తున్నది. సమాజం బహుళత్వాన్ని ప్రతిబింబించాలంటే దాన్ని ఒక వర్గాన్ని సంతృప్తిపరచడంగా అభివర్ణిస్తున్నది. దేశం ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకూ కాంగ్రెస్ నాయకులందరూ కారకులేనంటూ నిందిస్తున్నది. పలుకున్న కాంగ్రెస్ నాయకులను బీజేపీలో లాఘవంగా చేర్చుకుంటున్నది. ఎన్నికలపరంగానూ, సైద్ధాంతికంగానూ కాంగ్రెస్ ను దేశ రాజకీయ వేదిక అంచుల్లోకి నెట్టివేస్తోంది. దానికి కాంగ్రెస్ నుంచి ప్రతిఘటన లేదు.

అసమాన పోరాటం

ఆర్ఎస్ఎస్ లోగడ ప్రచారార్భటి లేకుండా ప్రశాతంగా, కష్టపడి పని చేసే సంస్థ. హంగూ ఆర్భాటం లేకుండా సిద్ధాంతాలను ప్రజల తలల్లోకి ఎక్కించే పని చేసేవారు. వారి పనికీ, ఎన్నికలకీ ప్రత్యక్ష సంబంధం ఉండేది కాదు. ఈ కార్యక్రమాల కారణంగా సమాజంలో చీలికలు తెచ్చి, విద్వేషం నింపి బీజేపీ వృక్షం వేళ్ళకు బలవర్థకమైన ఎరువు అందుతున్నది. భారత రాజకీయ అంతఃకరణలో మెజారిటీ భావనను అధివాస్తవికం (న్యూనార్మల్)గా చూపించేది కూడా ఈ కార్యక్రమాలే. ఈ శక్తులు కొద్ది కాలంగా దూకుడుగా, బహిరంగంగా పని చేయడం కాంగ్రెస్ కు అర్థం కావడం లేదు. వీరి పనికి సమాధానం చెప్పడానికి, వారి ప్రచారానికి విరుగుడు ప్రచారం చేయడానికి కాంగ్రెస్ ఇంతవరకూ ప్రయత్నించలేదు. తమ రాజకీయ శకటంలో సంస్కృత పండితుడినీ, అక్షరం ముక్క తెలియని నిరక్షరాస్యుడినీ ఎక్కించుకోగల శక్తియుక్తులు సంఘ్ పరివార్ సముపార్జించింది. కాంగ్రెస్ భవనానికి అటువంటి సైద్ధాంతికమైన నిర్మాణాత్మకమైన కట్టడాలు లేవు. కేవలం ఎన్నికల యుద్ధంలోనే బీజేపీని కాంగ్రెస్ ఎదిరిస్తుంది. భారతీయ ఆలోచనా విధానం (ఐడియా ఆఫ్ ఇండియా) ఏమిటో సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి నచ్చజెప్పకపోతే యుద్ధం అసమాన శక్తుల మధ్యనే జరుగుతుంది. ఈ పోరాటం రెండు సిద్ధాంతాల మధ్యా, రెండు జీవన విధానాల మధ్యా, రెండు పరస్పర విరుద్ధమైన ప్రాపంచిక దృక్పథాల మధ్యా జరగవలసి ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గుర్తించాలి. ఈ సవాలును గుర్తించకుండా ఎన్నికలలో విజయం లభించినప్పటికీ అది యాదృచ్ఛికమే, తాత్కాలికమే అవుతుంది. మానవత్వంతో కూడిన, వైవిధ్యభరితమైన, బహుళమైన, హేతుబద్ధమైన, లౌకిక భారత దృక్పథాన్ని అది కాపాడలేదు. ఆ దృక్పథం కొత్త రక్షకుల కోసం కష్టభూయిష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించవలసి ఉంటుంది.

(పరకాల ప్రభాకర్ గారు ప్రతి బుధవారం మధ్యాహ్నం యూట్యూబ్ లో పెట్టే మిడ్ వీక్ మ్యాటర్స్ కు స్వేచ్ఛానువాదం)  

Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles