Wednesday, April 24, 2024

తొలి రోజు సభ నినాదాలతో సరి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు   ఆరంభమయ్యాయి. ఎప్పటి వలె తొలినాడు.. ప్రతిపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్య వాయిదాలతో ముగిసింది. కొత్త మంత్రుల పరిచయ వేళ, విపక్షాల నినాదాలను నిరసిస్తూ ప్రధాని మోదీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయగా, అధికార పార్టీ అగ్రనేతలు రాజ్ నాథ్, పీయూష్ గోయల్ ఆగ్రహ స్వరంతో జతకట్టారు. కొత్త మంత్రుల పరిచయాలు, గతించినవారికి నివాళులతో తొలిరోజు గడిచింది. రాజ్యసభలోనూ విపక్షాల నినాదాలే పెద్దగా సవ్వడి చేశాయి. మొత్తంమీద, ఉభయ సభల్లో ఆందోళనలు, అరుపులు తప్ప ప్రయోజనకరంగా ముందుకు సాగలేదు.

Also read: దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునికీకరణ

తీరు మారదా?

ఇది షరా మామూలే అని ఎన్నాళ్ళు సరిపెట్టుకుంటాం? ఎంతో విలువైన సమయం వృధామయంగా సాగడం విచారకరం. ఎప్పుడు సభలు జరిగినా, తీరు ఒకటే తప్ప మార్పు కనిపించడం లేదు. అదే తంతు కొనసాగడం, అవే విమర్శలు చర్వితచర్వణం అవ్వడం తప్ప వేరు కాదు. గడచిన సంవత్సరాలు ఎలా ఉన్నా నేటికాలం అత్యంత విషాదమయం. కరోనా కష్టాలు అలుముకున్న దుర్భర వాతావరణంలో, అనేక సమస్యలు దేశాన్ని చుట్టుముట్టుకొని ఉన్నాయి. రేపటి పట్ల ఆశ ఎలా ఉన్నా నేటి పట్ల ఆందోళనలోనే ప్రజ ఉంది. వీటన్నింటికి సమాధానాలు కావాలి, పరిష్కారాలు రావాలి, ఆత్మస్థైర్యం పెరగాలి. అంతిమంగా ప్రజలు కోరుకునేది అదే. పార్టీల రాజకీయాలు దేశప్రగతికి, ప్రయాణానికి గుదిబండలు కాకూడదు. ఈసారైనా మనకు పనికొచ్చే, మన కష్టాలు తీర్చే, ఊతం ఇచ్చే ప్రకటనలు ఏమైనా వస్తాయా  అంటూ ఎదురుచూసే ప్రజలకు నిరాశమిగలడం తప్ప అన్యధా నాస్తిగానే ఉంటోంది. సభా సమావేశాల వల్ల పాలకుల స్వప్రయోజనం తప్ప, ప్రజాప్రయోజనం ఏమేరకు ఉంటుంది  అనే నిస్తేజంలోనే మేధావి వర్గం ఉంది. పెట్రోలు,డీజిల్ మొదలు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోవిడ్ కు శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవడంలో ఎక్కడున్నామో తెలియరావడం లేదు. వ్యాక్సినే సర్వశక్తి మంత్రంగా ప్రచారం జరుగుతున్న వేళ,ఆ ప్రక్రియలోని వైఫల్యాలు తప్పకుండా ప్రశ్నార్హమే అవుతాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ నెలలతరబడి సాగుతున్న రైతుల నిరసనలకు ముగింపు పలకడం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. జమ్మూలో వరుసగా జరుగుతున్న డ్రోన్ల దాడులు, అఫ్ఘాన్ కేంద్రంగా తాలిబాన్ చేపట్టిన భారత్ వ్యతిరేక ఉగ్రవాద చర్యలు, సరిహద్దుల్లోకి చొచ్చుకొని వస్తున్న చైనా దుందుడుకు చేష్టలు, పెరుగుతున్న పాకిస్తాన్ స్వరం, భారత్ కు దూరంగా జరుగుతున్న రష్యా విధానం, అమెరికా ద్వంద్వనీతి మొదలైనవాటితో కూడిన విదేశాంగ అంశాలపై చర్చకు అవకాశమిస్తూ, ప్రభుత్వ విధానాలు తెలుపుతూ ప్రజలకు విశ్వాసాన్ని ప్రోది చేయడం అధికార పక్షం బాధ్యత. 

Also read: చైనా నైజం మారదా?

రాజ్యద్రోహం చట్టం రద్దుపై ఆలోచించాలి

బ్రిటిష్ కాలపునాటి 124 ఏ రద్దుపై దృష్టి సారించండంటూ సుప్రీంకోర్టు చేసిన నిర్దేశాన్ని ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారో తెలపాల్సింది ఏలినవారే. రఫెల్ ఒప్పందంపై రచ్చ రావణకాష్టంగా కాలుతూనే వుంది. పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 31 అంశాలను అధికార పక్షం ముందుకు తేనుంది. అందులో 29 బిల్లులు, 2 ఆర్ధికపరమైన అంశాలు ఉన్నాయి. ఆరు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు, దివాలా స్మృతి సవరణ బిల్లు వంటివి కూడా ఉన్నాయి. పెగాసస్ స్పైవేర్ తో ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ అంశం మళ్ళీ అగ్గిరగులుస్తోంది. ఇదంతా ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందని విపక్షాలు చేసే విమర్శలను అధికార పార్టీ తిప్పికొడుతున్నా, నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.  వై ఎస్ ఆర్ సిపి నేతలు దూకుడు పెంచడం మంచి పరిణామామే. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రత్యేక హోదా కేటాయింపు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, విభజన చట్టం ప్రకారం రావాల్సిన అంశాల్లో జాప్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొని వున్న అపరిష్కృత అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన వాటాల్లో జాప్యం మొదలైనవాటిపై చట్టసభల్లో పోరాడి గెలవాల్సిన బాధ్యత, అవసరం రెండూ వైసీపీకి ఉన్నాయి. స్వరాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకొనే కార్యాచరణలో టిడిపి సభ్యులు సైతం జత కలవాలి. ఈ విషయంలో, రాజకీయాలను మరచి, తమిళనాడు నేతలను ఆదర్శంగా తీసుకోవాలి. ఆగస్టు 13 వరకూ జరిగే సమావేశాలు ఎంత ప్రయోజనకరంగా సాగుతాయో చూద్దాం.

Also read: ముంచుకొస్తున్న మూడో కరోనా ముప్పు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles