Friday, July 19, 2024

శీతాకాలంలో కశ్మీర్ లో మంటలు

  • జనవరిలోనే 11 ఎన్ కౌంటర్లు
  • పుల్వామాలో అశాంతి
  • 21 మంది ఉగ్రవాదులు హతం

కశ్మీర్ లో కాంతిరేఖలు ప్రసరించేనా ?//- కొత్త సంవత్సరం ఆరంభంలోనే కశ్మీర్ గడ్డ దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఈ జనవరి నెలలోనే మొత్తం 11 ఎన్ కౌంటర్లు జరిగాయి. ప్రతి మూడు రోజులకు ఒక ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ 11 ఎన్ కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమైనట్లు మన సైనిక వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా ప్రాంతం మళ్ళీ రక్తశిక్తమైంది. బుద్గామ్ కూడా వణికిపోయింది.

Also read: మళ్ళీ కస్సుబుస్సు అంటున్న పెగాసెస్

జమ్ము-కశ్మీర్ లో మొన్న శనివారం నాడు జరిగిన తాజా ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులను మన భద్రతాదళాలు మట్టుబెట్టాయి. శరీరంలోకి తూటాలు దిగినా ఉగ్రవాదులను వదలకుండా వీరోచితంగా పోరాడిన స్క్వాడ్రన్ లీడర్ సందీప్ ఝాజరియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఉగ్రవాదులు వదిలిన తూటాలు  ఒకటి ఛాతీ సమీపంలోకి, రెండోది ఎడమచేతికి తగిలాయి.అయినప్పటికీ సందీప్ వెనక్కు తగ్గకుండా పోరాటం కొనసాగించాడు. అతని వెంట మిగిలినవారూ అదే పోరాటస్ఫూర్తితో ముందుకు దుమికారు. రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ము-కశ్మీర్ పోలీసులు, గరుడ్ కమాండోలు- ఉగ్రవాదుల మధ్య ఈ పోరు జరిగింది. పాకిస్తాన్ మద్దతు ఉన్న లష్కరే, జైషే మహమ్మద్ లకు చెందిన ఉగ్రవాదం జమ్ము-కశ్మీర్ తీరంలో ఆగకుండా సాగుతూనే ఉంది.పుల్వామా ప్రాంతంలో 2020 నుంచి ఉగ్రవాద కార్యక్రమాలు యదేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి.

Also read: అత్యంత ప్రమాదకరమైన వైరస్ భయం!

ప్రస్తుతానికి సైనికులదే పైచేయి

ప్రస్తుతం మన సైనికులదే పైచేయిగా నడుస్తున్నా,ఆ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూనే బతుకుతున్నారు. సందీప్ వంటి సైనికులు ప్రాణాలను పణంగా పెట్టుకొని పోరాడుతూనే ఉన్నారు. ఏ సమయంలో ఏ దుర్ఘటన జరుగుతుందో అనే భయం భారతీయులలో వెంటాడుతూనే ఉంది. సుమారు 135 మంది ముష్కరులు నియంత్రణ రేఖ (ఎల్ ఓ సీ) దాటి మన దేశంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నం చేశారని మొన్న గణతంత్ర వేడుకల సందర్భంలో వార్తలు వచ్చాయి.

గతంతో పోల్చుకుంటే 2021లో చొరబాట్లు తగ్గాయని మన బీ ఎస్ ఎఫ్ వారంటున్నా, ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? తాలిబాన్ మూక కూడా చొరబడే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నా, మన అధికారులు వాటిని కొట్టిపారేస్తున్నారు.

Also read: విజయపథంలో బీజేపీ, ఆప్?

యాంటీ డ్రోన్ విధానంతో ఆ చర్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నట్లు మనవాళ్లు చెబుతున్నారు. పోయిన సంవత్సరం జమ్మూ ప్రాంతంలో డ్రోన్ లు చేసిన అలజడి తక్కువది కాదు. పాకిస్తాన్ కు తోడు, నేడు తాలిబాన్ మూక కూడా అలజడి సృష్టించడానికి సిద్ధంగానే ఉంది.వాటి వెనకాల చైనా ప్రోద్బలం ఎలాగూ ఉంది. జమ్ము-కశ్మీర్ లో చిన్న చిన్న ఉగ్రవాద సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఆ మధ్య పోలీసులు ప్రయాణిస్తున్న ఒక బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అందులో ముగ్గురు పోలీసులు మరణించగా,

11మంది గాయపడ్డారు. దీని వెనక ‘కశ్మీర్ టైగర్స్’ అనే ఉగ్రసంస్థ హస్తమున్నట్లు మన భద్రతాదళాలు అనుమానించాయి. 2019లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత పోలీసులపై జరిగిన దాడులలో ఇదే పెద్దది. రెండేళ్ల వ్యవధిలో నాలుగు కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చినట్లు మన భద్రతా దళాలే గుర్తించాయి. ది రెసిస్టెన్స్ ఫోర్స్,పీపుల్స్ అగైనెస్ట్ ఫాసిస్ట్ ఫోర్స్,పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్,కశ్మీర్ టైగర్స్ అందులో ఉన్నాయని సమాచారం.

కొన్ని వందలమంది ఉగ్రవాదులు కశ్మీర్ లో చురుకుగా ఉన్నారు. ఉగ్రవాదాన్ని తుదకంటూ మట్టుపెట్టగలిగిన పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచంలో ఏ మేరకు ఉన్నాయన్నది అనుమానమే.  సామ్రాజ్య కాంక్షతో ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు పెంచిపోషిస్తున్నాయి. అధికారిక సైనిక దళాలకు తోడు, వీరినీ ఉసిగొల్పుతున్నారు.

Also read: వీడని కోవిద్ మహమ్మారి

పెరుగుతున్న నైరాశ్యం

జమ్ము-కశ్మీర్ లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి,అభివృద్ధి ఊపందుకొని, పూర్వవైభవం రావాలని కోరుకొనేవారు ఇంకా నిరాశలోనే ఉన్నారు. జమ్ము-కశ్మీర్ కు చెందిన ముఖ్యనేతలతో ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా వంటి ముఖ్యనేతలు సమావేశమయ్యారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు తేవడానికి, అభివృద్ధి పథంలో నడిపించడానికి విపక్షాల సహకారాన్ని కూడా అభ్యర్ధించారు. నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా  తెలిపారు. రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తామని మరోమారు ఆయన ప్రకటించారు. జమ్ము-కశ్మీర్ లో పెట్టుబడులు రావడం ప్రారంభమయ్యాయనీ, ఇప్పటికే 12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, పర్యాటకుల రాకపోకలు పెరిగాయనీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఉగ్రవాదుల దాడులు 40 శాతం తగ్గాయని కేంద్ర హోంమంత్రి చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి కేటాయించే బడ్జెట్ 9వేల కోట్ల రూపాయల నుంచి 21 వేల కోట్లకు పెరిగిందని అమిత్ షా అంటున్నారు. జమ్ము-కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా ఉందని పాలకపక్షం అంటున్న మాటలను విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి.

Also read: ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్త జిల్లాలు వస్తున్నాయ్!

ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తేనే శాంతి భద్రతలు మెరుగుపడతయానే విపక్షాల మాటలను అధికారపక్షం ఖండిస్తోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలకు,వాస్తవ పరిస్థితులకు ఎంతో అంతరాయం ఉందనే వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కశ్మీర్ పండిట్లు ఇంకా అక్కడే ఉన్నారు. సొంత రాష్ట్రానికి చేరడానికి ఇంకా వారికి ధైర్యం సరిపోవడం లేదు. ఆ మధ్య జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో నష్టబోయినవారిలో హిందువులతో పాటు సిక్కులు కూడా ఉన్నారు. సిక్కులను కూడా లక్ష్యం చేయడం కొత్త పోకడలను ఆవిష్కరించింది. మొత్తం మీద, కల్లోలం నుంచి అభివృద్ధి వైపు నడిచినప్పుడే కశ్మీర్ లో శాంతిరేకులు విచ్చుకుంటాయి, కాంతిరేఖలు ప్రసరిస్తాయి.

Also read: రెండు మాసాల్లొ కరోనా ఖతం?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles