Thursday, November 30, 2023

మోదీకి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం

  • యూపీ ఫలితాలు రాకుండానే తొందరపడుతున్నారా?
  • బలమైన ప్రతిపక్షం అధికార పక్షానికీ మంచిదే
  • సీజన్ కి ఒక నేత ముందుకు వస్తున్నారు

ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని, తద్వారా నరేంద్రమోదీని గద్దె దింపడానికి విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క విపక్షనేత స్వరం బలంగా వినిపిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్ రూపకల్పన దిశగా అడుగులు పడుతున్నట్లు హడావిడి జరుగుతోంది.

Also read: ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ

కాంగ్రస్ సహితంగా, రహితంగానా?

కాంగ్రెస్ ను కలుపుకొని వెళతారా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. వాస్తవ రూపం ఇంకా ఏర్పడలేదు. మొదటి నుంచీ, మోదీపై నిప్పులు చెరుగుతున్నవారిలోమమతా బెనర్జీదే మొదటి స్థానం. స్వరం అంత తీవ్రంగా లేకపోయినా వ్యతిరేకతను చూపిస్తున్నవారిలో స్టాలిన్ ఇంకొకరు. తెలంగాణ  ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే వివిధ సందర్భాల్లో అటు బిజెపి -ఇటు నరేంద్రమోదీతో పాటు అమిత్ షాపై కూడా తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. మొన్న కేంద్ర బడ్జెట్ విడుదలైన సమయం నుంచి మరింత ధాటిగా మాట్లాడుతున్నారు. నరేంద్రమోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్యస్ఫూర్తి దెబ్బతినకుండా కాపాడాలనే పిలుపునిస్తున్నారు. ‘ఫెడరల్ ఫ్రంట్’ అనే పేరుతో పార్టీ పెడతానని అధికారికంగా ప్రకటించకపోయినా విపక్షాలు ఐక్యమై కేంద్రంపై పోరాడాలని గట్టిగా చెబుతున్నారు. ప్రజలు కోరితే జాతీయ పార్టీని కూడా స్థాపిస్తానని తాజాగా ప్రకటించారు. ఆ మధ్య సోనియాగాంధీ నివాసంలోనూ విపక్షాల సమావేశం జరిగింది. ఎందుకోగానీ తర్వాత ముందుకు వెళ్ళలేదు. ఆ సమావేశంలో అన్ని విపక్ష పార్టీలు పాల్గొనకపోవడం గమనార్హం.  కారణాలు ఏవైనా మోదీపై కెసీఆర్ మంచి కాకమీద ఉన్నారు. గతంలో స్టాలిన్ ను కలిసొచ్చారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ మొదలైనవారితో మాటలు నడుపుతున్నారు. “కె సీ ఆర్ జీ! మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు, మీది న్యాయమైన పోరాటం, మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది” అంటూ  కెసిఆర్ తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ముంబయి రావాలని, ఆతిధ్యాన్ని స్వీకరించాలని కెసిఆర్ ను ఉద్దవ్ ఠాక్రే కోరినట్లుగా తాజా సమాచారం. ఈ ఆహ్వానం మేరకు ఈనెల 20వ తేదీన కెసిఆర్ ముంబయి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య సోనియాగాంధీ నివాసంలో జరిగిన విపక్షాల సమావేశంలో శరద్ పవార్ కూడా పాల్గొన్నారు. తదనంతర కాలంలో శరద్ పవార్ నుంచి పెద్దగా వ్యాఖ్యలు ఏమీ వినపడలేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడవనున్నాయి. అందులో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాలు రాకమునుపే కెసిఆర్, స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే వంటివారు ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్మాణంపై గట్టిగా మాట్లాడుతున్నారు.

Also read: సంజీవయ్య – ఒక సజీవ స్మృతి!

మోదీని గద్దె దిపడమే ఎజెండా

ఒక్కొక్కరూ ఒక్కొక్క సిద్ధాంతంతో మాట్లాడుతున్నా, నరేంద్రమోదీని గద్దె దింపాలన్నది ఏకైక ఎజెండాగా కనిపిస్తోంది. వచ్చే సంవత్సరం కర్ణాటక మొదలైన పలు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల దిశగా కెసిఆర్ అలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  “ఆయన ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికే ప్రధాని అనుకుంటా..” అంటూ నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ టీ ఆర్ ఎస్ అగ్రనేత, తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కెటీఆర్ తాజాగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిజెపి వ్యతిరేక పోరాటంలో ముందున్న వారంతా వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలే. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడుతున్నారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచీ కాంగ్రెస్ అధిష్టానం – కెసిఆర్ మధ్య బంధాలు తెగిపోయాయి. తాజా వ్యాఖ్యలతో మళ్ళీ కొత్త వాతావరణం పుట్టుకొస్తోంది. ఇంతకాలం తర్వాత రాహుల్ కు మద్దతుగా కెసిఆర్ మాట్లాడడం వెనకాల ఏదో పెద్ద వ్యూహం ఉందనీ కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మార్చి 10 వ తేదీన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ ఈ విపక్షాలు కాస్త ఆగివుంటే బాగుండేదని కొందరు సీనియర్ పాత్రికేయులు అంటున్నారు.

Also read: ‘హూ’ నుంచి చల్లని కబురు

యూపీ ఫలితాలు తేలిన తర్వాతనే స్పష్టత

ముఖ్యంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ లో బిజెపి బలాబలాలు తేలిన తర్వాత వచ్చే రూపం మరింత స్పష్టంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంకా వివిధ విడతల్లో ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో, బిజెపికి నష్టం కలిగించడానికే ఈ నేతలంతా స్వరం పెంచుతూ ఏకమవుతున్నారని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అత్యంత బలంగా ఉన్న బిజెపిని ఢీకొట్టాలంటే వీరి  బలం ఏ మేరకు సరిపోతుందని ప్రశ్నించే వారూ ఉన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ ను కలుపుకోకుండా ఏర్పడే ఫ్రంట్ ఏ మాత్రం ఫలితాలను ఇస్తుందో చెప్పలేమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జనతా పార్టీ స్థాపన నుంచి నేషనల్ ఫ్రంట్ వరకూ జరిగిన పరిణామాలను గమనిస్తే చరిత్ర అవగతమవుతుందని కొందరు గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే ఉత్తరప్రదేశ్ లో బలపడడం అత్యంత కీలకమని చరిత్ర చెబుతూనే ఉంది. అదే విధంగా ఎక్కువ లోక్ సభ స్థానాలు ఉన్నచోట శక్తివంతంగా మారడం అంతే అవసరం. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడులో 40కి పైగా పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒరిస్సా, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో 20కి పైగా లోక్ సభ సీట్లు ఉన్నాయి.ఆయా రాష్ట్రాలలో బిజెపి – ప్రాంతీయ పార్టీల బలాబలాలను బేరీజు వేసుకొని ఆట ఆడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తో కలిసి నడవడానికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ అంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మెలగడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏ మేరకు ముందుకు వస్తారన్నది అనుమానమే. కాంగ్రెస్ -జగన్ మధ్య ఉన్న వ్యతిరేక వాతావరణం తెలిసిందే.

Also read: తెలుగు సినిమాకు మంచి మలుపు

నవీన్ ది ఎంజీఆర్ తరహా

ఇక,నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తారు తప్ప, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వారితో సంఘర్షణకు ఇష్టపడరు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ ది కూడా అదే విధానం. కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం అనే సిద్ధాంతానికి ఆయన వ్యతిరేకం.  నవీన్ పట్నాయక్ ది కూడా ఇంచుమించుగా అదే విధానంగా భావించాలి. ఇలా ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో అనేక సిద్ధాంతాలను, చరిత్ర చెప్పిన పాఠాలను, నేటి పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అంశం మొదలు అనేక కీలకమైన అంశాలలో ఐక్యత రావాల్సి ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో విపక్షాల పాత్ర విస్మరించజాలనిది. బలమైన  ప్రతిపక్షం లేకుంటే  అధికారపక్షం ఏకస్వామ్యంగా వ్యవహరించే ప్రమాదం ఉంటుందని రాజనీతిజ్నులు బోధిస్తూనే ఉన్నారు. ఆరంభ శూరత్వం కాక, ఆచరణాత్మకంగా ఉంటేనే ఏ పక్షమైనా పదికాలాల పాటు ప్రజాభిమానాన్ని గెలుచుకుంటుంది.

Also read: హిజాబ్ వివాదం అనర్థదాయకం

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles