Thursday, April 25, 2024

దీపోత్సవం

  • అందరి పండుగ దీపావళి
  • జీవితాలలో వెలుగు నిండాలని ఆకాంక్షించే రోజు
  • కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముహూర్తం

భారతీయ సంస్కృతిలో జరుపుకొనే ప్రతి పర్వదినానికి ఒక విశిష్టత ఉంటుంది. సాంస్కృతిక వైభవ చిహ్నంగా వందల ఏళ్ళ నుంచి ఈ సంప్రదాయం సాగుతోంది.b పల్లెలు, పట్టణాలు, నగరాలు, నిరుపేదలు, ధనికులు అనే తారతమ్యాలు లేకుండా చేసుకొనే పండుగలలో ‘దీపావళి’ తొలి వరుసలో ఉంటుంది. దీపావళి అంటేనే దీపాల వరుస. అమావాస్య నాడు వచ్చే వెన్నెల రోజు.

Also read: హుజూరాబాద్ లో ఈటల విజయ పతాక

వేల మతాబులు వెలిగే రోజు. కోట్లాది దివ్వెలు ప్రభవించే రోజు. పెద్దలు సైతం పిల్లలు వలె ఆడుకొనే రోజు. చీకట్లను తొలగించుకొనే రోజు. వెలుగులు పూయించుకొనే రోజు. కటిక చీకటిలోనూ కాంతి రేఖలు చూచే రోజు. తిమిరంపై సవాలు విసిరే రోజు. పురాణాల ప్రకారం నరకాసురుడనే రాక్షసుడుని సంహరించిన మరునాడు, అతని పీడ వదిలినందుకు ప్రజలందరూ వేడుక జరుపుకొనే రోజు దీపావళి. దీనినే ఉత్తరాదివారు ‘ దివాలీ’ అని అంటారు. పది తలల రావణుడిని మట్టుపెట్టి, సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్యలో అడుగు పెట్టిన రోజు రాజ్యంలోని ప్రజ మొత్తం పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుకున్న రోజు. ఇలా దీపావళి చుట్టూ  పురాణ, ఇతిహాస కథలుగాథలు ఎన్నో ఉన్నాయి. అధర్మంపై ధర్మం గెలిచి, దుర్మార్గుల మదమణచి సన్మార్గులు తలపైకెత్తి చూసిన రోజు కూడా ఇదే. చీకటిని పారద్రోలుతూ వెలుగులు విరజిమ్మే ఈ రోజంటే  అందరికీ ఎంతో ఇష్టం. పండుగ వైభవం పగలు కంటే రాత్రే ఎక్కువగా ఉంటుంది. దీపావళి ముందు రోజు చతుర్దశి, దానినే నరక చతుర్దశి అంటారు. నరకాసురుడిని చంపిన రోజు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ మరునాడే అమావాస్య. దీనిని దీపావళి అమావాస్యగా పిలుచుకుంటాం. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ పండుగను జరుపుకోవడం తరతరాల నుంచి వున్న ఆనవాయితీ.

Also read: భూతాపం అధికమైతే విలయం అనివార్యం

దీపం జ్యోతి పరబ్రహ్మ

“దీపం జ్యోతి పరబ్రహ్మ – దీపం సర్వ తమోపహమ్ – దీపేన సాధ్యతే సర్వమ్- సంధ్యా దీప నమోస్తుతే”- ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైనది. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, దీపం అన్ని చీకట్లను పోగొట్టేదిగా, దీపపు వెలుగు సర్వాన్ని సాధించి పెట్టేదిగా భావిస్తూ, ఆ దీపాన్ని సంధ్య వేళ వెలిగించి నమస్కరించడం మన సంప్రదాయం. మహిళలందరూ చతుర్దశి నాడు మొదలు పెట్టి,  కార్తీక మాసాంతం వరకూ సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగిస్తూ ఉండడం అనంతంగా వస్తున్న ఆచారం. దీపావళి శరదృతువులో వచ్చే పండుగ. దీపావళి నాడు మహాలక్ష్మి దేవిని విశేషంగా పూజిస్తారు. గోగునార కట్టలకు చిన్న చిన్న గుడ్డముక్కలు కట్టి వెలిగించడం నిన్న మొన్నటి వరకూ మనం పల్లెల్లో చూసేవాళ్ళం. ఆ సంప్రదాయం ఇప్పుడు సన్నగిల్లింది. నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి మనసారా నమస్కరించుకుంటే, సర్వ ఐశ్వర్యములు సిద్ధిస్తాయానే విశ్వాసం భారతీయ సనాతన సంప్రదాయంలో ఉంది.బాణా సంచాలు కాల్చడం ఈ పండుగ ప్రత్యేకత. వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకొచ్చే క్రిమి కీటకాలు బాణా సంచా పొగలకు నశిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసి, కొత్త ఖాతా పుస్తకాలు తెరచే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. చాలా సాధారణమైన రీతిలో మట్టి దీపాలు వెలిగించుకుంటూ, బాణసంచాలు కాల్చుకుంటూ మొదలైన సంబరాలు తర్వాత వెర్రితలలు వేశాయి. డబ్బున్న వాళ్ళకు, దర్పానికి పోయేవాళ్ళకు ప్రదర్శక వేడుకగా మారింది. నువ్వా నేనా అన్నట్లు రాత్రంతా లక్షలాది రూపాయల మందుగుండు సామాగ్రిని ఒక్కొక్క కుటుంబమే కాల్చే అట్టహస సంప్రదాయం వచ్చేసింది.

Also read: ఉక్కు ఉద్యమానికి పవన్ ఊతం ఉపకారమే

పెను పరిశ్రమగా పండుగ

నేడు దీపావళి ఒక్కరోజు నాడే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇదొక పెద్ద పరిశ్రమగా మారింది. సుమారు 10లక్షల మంది ప్రత్యక్షంగా ఈ పరిశ్రమ పైనే ఆధారపడ్డారని సమాచారం. దేశంలో మందులు తయారుచేయడంలో తమిళనాడు ప్రాంతానికి చెందిన శివకాశి అగ్రగామిగా వెలుగొందుతోంది. 90శాతం మార్కెట్ షేర్ ఈ ప్రాంతానికే దక్కుతుంది. కాలుష్యం, పిల్లలు,పెద్దల ఆరోగ్య భయం దృష్ట్యా దీపావళి మందులపై నిషేధం విధించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.చాలామంది కోర్టులకెక్కుతున్నారు. న్యాయస్థానాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. టపాసుల్లో వాడే బేరియం సాల్ట్  వినియోగాన్ని 2018లోనే సుప్రీంకోర్టు నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ‘హరిత టపాసులు’నే అనుమతించింది. తక్కువ కాలుష్య కారకాలుగా చెప్పే హరిత టపాసులను మూల్యాంకనం చేయడంలో వ్యవస్థలు వందశాతం విజయవంతమవుతున్నాయా? అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. దీపావళి సమయంలో జరిగే పేలుళ్ల ద్వారా ఎన్నో ప్రమాదాలు,మరణాలు సంభవించడం చూస్తూనే ఉన్నాం. వీటిని సంపూర్ణంగా అరికట్టడంలో అందరూ కలిసి సాగాలి. ఎంతో శాస్త్రీయమైన విధానాలతోనే మన పండుగలు, ఆచారాలు రూపకల్పన జరిగాయి. వాటి చుట్టూ ఎన్నో ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నది మరువరాదు.సంప్రదాయ ప్రస్థానంలో వెర్రితలలు పెరగడం వల్ల వాటి రూపు రేఖలు మారిపోతున్నాయి. పర్యావరణాన్ని,జీవన స్థితిగతులను, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఆరోగ్యకరమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవడం ఉత్తమ సంప్రదాయం. అందరి జీవితాల్లో గొప్ప వెలుగులు ప్రసరించు గాక – భారతీయ సంప్రదాయం నిత్యనూతనంగా ప్రభవించుగాక. 

Also read: గ్రామాలలో ఐటీ వెలుగులు!  

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles