Saturday, February 24, 2024

కార్పొరేట్ నిధులతో ప్రమాదభరితంగా విస్తరిస్తున్న ఫాసిజం

బాలగోపాల్ స్మారక సభలో అరుంధతీరాయ్

ఫాసిస్టు ధోరణులపై క్లిఫ్టన్ డి రొసారియో, మిహిర్ దేశాయ్, జాహా ఆరా ప్రసంగాలు

ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థలు మమేకం కావడం ఫాసిస్టు ధోరణులకు తార్కాణమని ప్రసిద్ధ రచయిత్రి, ఆలోచనాపరురాలు అరుంధతీరాయ్ వ్యాఖ్యానించారు. సుప్రసిద్ధ మానవహక్కుల నేత, రచయిత బాలగోపాల్ 13వ స్మారక సభలో ‘ఫాసిస్టు మొమెంట్ ’ అనే అంశంపై ప్రసంగిస్తూ, కార్పొరేట్ నిధులతో ఫాసిస్టు ధోరణుల ప్రచారం నిర్నిరోధంగా సాగిపోతున్నదని అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారంనాడు నిర్వహించిన స్మారక సభలో ఫాసిస్టు ధోరణులపైన ప్రముఖ న్యాయవాదులు క్లిఫ్టన్ డి రోసారియో, మిహిర్ దేశాయ్, జాహా ఆరాలు కూడా ప్రసంగాలు చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం అయిదు వరకూ సాగిన ప్రసంగాలను హాలు నిండా ఉన్న సభికుల ఏకాగ్రచిత్తంలో ఆలకించడం విశేషం. సభికులలో అత్యధికులు యువతీయువకులు కావడం మరో విశేషం.

దేశంలో బలమైన హిందూత్వరాజ్యం ఏర్పాటు చేయాలనే కుట్ర జరుగుతోందనీ, కేంద్ర ప్రభుత్వం సంకల్పాన్ని ప్రజలు అమలు చేసే విధంగా విధానాలు రూపొందించి అమలు చేస్తున్నారనీ అరుంధతీరాయ్ అన్నారు. ఫాసిస్టు ధోరణులను ప్రజల బుర్రల్లోకి ఎక్కించడానికి ప్రయత్నం జరుగుతున్నదనడానికి కొన్ని సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. గతం అద్భుతంగా ఉండేదని చెప్పడం, కార్పొరేట్ సంస్థల నిధులతో అధికారపార్టీ ఆధ్వర్యంలో  ఉద్యమాలు నిర్వహించడం, విదేశాల నుంచి సరిహద్దులో ప్రమాదం ఉన్నదంటూ కట్టుకథలు చెప్పడం, వీధులలో పోరాటానికి పోరుగాళ్ళను (మిలిషియా)ను తయారు చేయడం, మహిళలకు వ్యతిరేకమైన ధోరణులను ప్రోత్సహించడం వంటివి ఫాసిస్టు స్వభావాన్ని సూచించే లక్షణాలని అరుంధతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగాలలోకి తీసుకున్నవారికి మిలిటరీ శిక్షణ ఇచ్చి, కొన్ని సంవత్సరాలు సైన్యంలో వినియోగించుకొని పంపివేసిన తర్వాత వారు మిలీషియాలో చేరే అవకాశం ఉన్నదని ఆమె అన్నారు. ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతృత్వంలో యువకులకు పోరాటంలో శిక్షణ ఇస్తున్నారు. వారు కూడా మిలీషియాలో చేరవచ్చు. ఊహాజనితమైన గతం గురించి గొప్పగా చెప్పి వారికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

This image has an empty alt attribute; its file name is image-13.png
క్లిఫ్టన్ డీరోజారియో

బాహాటంగా పేదలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరుంధతీరాయ్ అన్నారు. రాజ్యాంగ సంస్థలను నీరుగార్చి ఫాసిస్టు వ్యవస్థకు దారితీయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయని ఆమె విమర్శించారు. ప్రతిపక్షం లేని భారత్ కావాలని కోరుకోవడం, హిందూత్వ పేరుతో విధ్వసం చేయడం మోదీ ప్రభుత్వ విధానాలని అన్నారు. కులవివక్ష కారణంగా హిందూ మతాన్ని వదలి వెళ్ళినవారిని మళ్ళీ హిందూ మతంలోకి రావాలని బలవంతం చేయడం, పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకొనిరావడం ఫాసిజం వస్తున్నదనడానికి నిదర్శనాలని అరుంధతీరాయ్ చెప్పారు. నిరుత్సాహపడకుండా ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని వామపక్షవాదులకు అరుంధతి పిలుపునిచ్చారు. బాలగోపాల్ వివిధ న్యాయస్థానాల తీర్పులపైన ప్రచురించిన 40 వ్యసాల సంపుటి ‘న్యాయస్థానాలు, సామాజిక న్యాయం’ అనే గ్రంథాన్ని అరుంధతీరాయ్ ఆవిష్కరించి తర్వాత ప్రసంగించారు. మీడియా, న్యాయవ్యవస్థ, పాలనావ్యవస్థ, విద్యాసంస్థలు ఫాసిస్టు శక్తుల చేతుల్లోకి వెళ్ళాయని ఆమె చెప్పారు.

అడ్వకేట్ క్లిఫ్టన్ డీరోజారియో ‘కార్మికవర్గంపైన ఫాసిస్టు దాడి’ అనే అంశంపైన మాట్లాడారు. కార్మిక చట్టాలను కుళ్ళబోడిచారనీ, కార్మికులకు కష్టాలు కలిగించే విధంగా పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారనీ, అదే విధంగా కోవిద్ -19 దాడి చేసిన సందర్భంగా అకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించి వలస కూలీల ప్రాణాలు తీశారనీ గుర్తు చేశారు. కార్మికుల పట్ల పాలకుల దృష్టి ఫాసిస్టు ధోరణికి అనుకూలంగా ఉన్నదని చెప్పారు. బీచ్ లలో ఇసుక తవ్వకం రంగంలోకి అదానీ ప్రవేశించేందుకు కొన్ని రోజుల ముందుగానే ఇసుక తవ్వకంపైన ఉన్న నిషేధాన్ని మోదీ ప్రభుత్వం తొలగించిందనీ, దీనివల్ల ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తున్నదో తెలిసిపోతున్నదనీ క్లిఫ్టన్ అన్నారు.

This image has an empty alt attribute; its file name is image-15-1024x576.png
మిహిర్ దేశాయ్

న్యాయవ్యవస్థ కాషాయమయం అవుతోందని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) కి చెందిన ముంబయ్ న్యాయవాది మిహిర్ దేశాయ్ హెచ్చరించారు. నేటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ అయినా రేపటి జస్టిస్ చంద్రచూడ్ అయినా తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను అప్పుడప్పుడు చిన్న విషయాలలో చాటుకోవచ్చును  కానీ బీజేపీ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన విధానాలపైన జోక్యం చేసుకునే అవకాశాలు ఏ మాత్రం లేవని చెప్పారు. ఉదాహరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడాన్ని ప్రశ్నించిందంటే రాజ్యాంగాన్నే మార్చివేయాలని మోదీ ప్రభుత్వం తలబోస్తుందని మిహిర్ దేశాయ్ అన్నారు. రాజ్యాంగాన్ని సవరించకుండా తాము అనుకున్న విధంగా పనులు జరిగినంత కాలం రాజ్యాంగం జోలికి ఎన్ డీఏ సర్కార్ వెళ్ళదని, తమ అజెండాకు అడ్డుతగిలితే మాత్రం ఉపేక్షించబోదనీ, రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేసి కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెస్తుందని దేశాయ్ అన్నారు. మోదీ ప్రభుత్వం ఇంతవరకూ నాలుగు సార్లు మాత్రమే రాజ్యాంగ సవరణలు చేసిందని ఆయన గుర్తు చేశారు.

సభలో ప్రసంగిస్తున్న జాహా ఆరా

హిందూత్వ రాజ్యంలో నివసించడం అనే అంశంపైన విశాఖపట్టణానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త జాహా ఆరా ప్రసంగించారు. ఏదైనా ఇస్లామిక్ దేశంలో అపభ్రశం జరిగితే అందుకు తాను బాధ్యురాలు అన్నట్టు హిందువులు చూస్తారనీ, వారు అడిగే ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పాలని ఇబ్బంది పెట్టేవారనీ అన్నారు. ఆ క్రమంలో తనను దేశద్రోహిగానో, పాకిస్తాన్ లేదా అఫ్ఘానిస్తాన్ తొత్తుగానో, జీహాదీ శక్తులతో అంటకాగుతున్న ఉగ్రవాదిగానో పరిగణిస్తున్నట్టు మాట్లాడతారని చెప్పారు. ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రస్తావించి, అక్కడ తప్పని సరిగా హిజబ్ ధరించాలని నిర్బంధం చేస్తున్నారు కనుక మహిళలు ఉద్యమం చేస్తున్నారనీ, కర్ణాటకలో హిజబ్ ధరించడానికి వ్యతిరేకండా ఒత్తిడి తెస్తున్నారు కనుక ఇక్కడ ఉద్యమం జరుగుతున్నదనీ, రెండు చోట్లా ఒత్తిడికి వ్యతిరేకంగానే ఉద్యమం జరుగుతోందని గ్రహించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల వ్యవహరించే క్రమంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదనీ, అది దేశానికి క్షేమదాయకం కాజాలదని ఆమె హెచ్చరించారు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles