Friday, April 19, 2024

రైతు ఉద్యమంపై ఎవరి మాట వారిది

బుధవారం నాడు యావత్తు భారతదేశమంతా “రైతు దినోత్సవం” జరుపుకుంది. దాదాపు నెలరోజుల నుండి ఢిల్లీలో ఉద్యమం చేపట్టిన రైతులు ఉద్యమాన్నే ఉత్సవంగా భావించి, పోరును కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలను రద్దు చేసేంతవరకూ వెనక్కి వెళ్ళేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. చట్టాల రద్దు జరిగిన రోజునే పండుగగా భావన చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పూర్వ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్బంగా రైతులతో వర్చువల్ విధానంలో మాట్లాడుతానంటున్నారు.

చట్టాలకు అనుకూలంగా మాట్లాడిన కొందరు రైతులు

నూతన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తానని చెబుతున్నారు. “ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” పథకంలో భాగంగా 18 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రధాని నిర్వహించే వర్చువల్ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు ప్రభుత్వ పథకాల వల్ల పొందిన లాభాల గురించి మాట్లాడేలా ఏర్పాటుచేశారు. ఒక పక్క రైతులు ఉద్యమం చేస్తూ వుంటే, ఇంకొక పక్కన రైతులతో మాట్లాడించి, ప్రజలకు ప్రభుత్వంపై నెలకొంటున్న అపోహలను తొలగించే ప్రయత్నం కేంద్రం చేపట్టింది.

బీజేపీ ఎంపిక చేసిన రైతులు

ఇక్కడ మాట్లాడేవారు బిజెపి ప్రభుత్వం ఎంపిక చేసిన రైతులు, వాళ్లు బిజెపి ముందుగానే ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతారు తప్ప, వేరే ఏమీ మాట్లాడరు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, పైగా ప్రజలను మాయచెయ్యడానికి  ప్రభుత్వ పెద్దలు వేసిన పన్నాగంగానే ప్రతిపక్షాలు, రైతు సంఘాలు కొట్టి పారేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమం ప్రతిపక్షాల కుట్రగానే ప్రధాని పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మొదలు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎంతో బలహీనంగా ఉన్నాయన్న  విషయం అందరికీ తెలిసిన నేపథ్యంలో, ప్రతిపక్షాలకే అంత బలముంటే అసలు ఇటువంటి చట్టాలే వెలుగుచూడవని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి.

ఉద్యమంతో సంబంధం లేని రైతులతో కేంద్రం చర్చలు

నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెబుతున్నారు.ఉద్యమంతో ఏమాత్రం సంబంధంలేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోందని, తద్వారా ఉద్యమాన్ని బలహీనపరచేందుకు కుట్రలు పన్నుతోందని ఈ రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతులు చర్చలకు ఇష్టంగా లేరనే ప్రచారం అవాస్తవమని రైతు సంఘాలు ప్రకటిస్తున్నాయి. కేంద్రం రాత పూర్వక హామీలతో రావాలని,మూడు కొత్త చట్టాలను రద్దు చేసి తీరాల్సిందేనని గట్టిపట్టు పడుతున్నారు. రైతు సంఘాలు ఉద్యమం ప్రారంభం రోజు నుండీ ఇదే మాటపై ఉన్నాయి. చట్టాలు రద్దు చేయకుండా, సవరణలు చేస్తామని, ప్రయోజనాలను వివరిస్తామని ప్రభుత్వం మొదటి నుంచీ అంటోంది.

కేంద్ర తాజా ప్రతిపాదనలో స్పష్టత లేదు

కనీస మద్దతు ధర విషయంలో, స్వామినాథన్ కమీషన్ సిఫారసులకు అనుగుణంగా చట్టం తేవాలని, ఈ విషయంలో లిఖిత పూర్వక ప్రతిపాదనలతో పిలిస్తేనే చర్చలకు వస్తామని రైతు సంఘాలు తెగేసి చెబుతున్నాయి. కేంద్రం తాజాగా పంపిన ప్రతిపాదనలలో కనీస ధరపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని రైతు నేతలు విమర్శిస్తున్నారు. స్వామినాథన్ చెప్పిన వాటన్నింటినీ యధాతధంగా అమలుచేస్తే, ప్రభుత్వాలు దివాలా తీసే పరిస్థితులు వస్తాయని, మధ్యేమార్గంగా అమలుపరచుకుంటే సరిపోతుందని కొందరు వ్యవసాయరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రాంతీయ పార్టీల విభిన్న వైఖరి

ఇదే అదనుగా, రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఎవరికి నచ్చినట్లుగా వారు  రైతు ఉద్యమంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. బెంగాల్ నుండి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా రైతు సంఘాల గొంతుకు శృతి పలుకుతూ మద్దతు చెబుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొదటి నుంచి రైతులతో నడుస్తూనే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ చట్టాలను మొదటి నుండీ వ్యతిరేకిస్తున్నారు.

దిల్లీలో కేసీఆర్ రైతులను కలుస్తారని అనుకున్నారు

మొన్న దిల్లీ వెళ్ళినప్పుడు ఉద్యమం చేస్తున్న రైతుల దగ్గరకు వెళ్లి, సంఘీభావం తెలుపుతారని బాగా ప్రచారం జరిగింది. కానీ, ఎందుకో వారిని కలవకుండానే వెనుతిరిగారు. దిల్లీ పెద్దలకు కోపం తెప్పించడం తనకు క్షేమం కాదని లెక్కలు వేసుకొనే, రైతులను కలువలేదని కొందరు రాజకీయ పరిశీలకులు భాష్యం చెబుతున్నారు. కేరళ, పంజాబ్ ఎలాగూ రైతులవైపే నిల్చున్నాయి.

చంద్రబాబునాయుడు మౌనం వెనుక ఏమున్నది?

గతంలో ఎన్నికల ముందు, నరేంద్రమోదీ విధానాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఉద్యమాలు చేసిన చంద్రబాబునాయుడు దిల్లీ వెళ్లి  రైతులకు ఎందుకు సంఘీభావం తెలపడం లేదంటూ వస్తున్న విమర్శలకు స్పందించకుండా  చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మొత్తం మీద  రైతు ఉద్యమం ఇప్పుడప్పుడే ఆగేట్టు లేదు. ఫెడరల్ విధానం ప్రకారం, వ్యవసాయం  రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి, ఎవరికి ఇష్టమైన రీతిలో వారు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఐనప్పటికీ కేంద్రం మద్దతులేకపోతే, నిధులు, రాయతీలు మొదలైన అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన  పరిస్థితుల్లో రాష్ట్రాలు ఉన్నాయన్నది వాస్తవం. ఈ తరుణంలో, బంతి కేంద్రం కోర్టులోనే ఉంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles