Saturday, April 20, 2024

నిలిచి గెలిచిన రైతు

  • ఎన్నికల కారణంగానే వెనక్కు తగ్గిన మోదీ
  • రైతులపట్ల ప్రేమ ఉంటే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి
  • రైతుల నికరాదాయం  పెరిగేందుకు చర్యలు తీసుకోవాలి

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించామని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కీలక ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఈ స్థాయిలో రైతుఉద్యమం ఎప్పుడూ జరగలేదు. మరి కొన్ని నెలల్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ కూడా ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో ఉద్యమిస్తున్న రైతులను వాహనం గుద్దడంతో  నలుగురు మరణించారు. కేంద్ర మంత్రి కుమారుడే ఈ పాపానికి వడికట్టాడని ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈ ఘటనతో బిజెపికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చెడ్డపేరు వచ్చింది.

నిరసనోద్యమంలో రైతులు

పంజాబ్ లో పెరిగిన విజయావకాశాలు

కేంద్రం మూడు సాగు చట్టాలను తీసుకొచ్చిన వేళ, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అకాలీ దళ్ పార్టీ ఎన్ డి ఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. పంజాబ్ లో రేపు జరగబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి సాగడానికి నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో, రైతు వ్యతిరేకత, ప్రజాగ్రహం పార్టీకి నష్టం తెస్తుందనే భయంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఉద్యమంలో పంజాబీలు, ముఖ్యంగా సిక్కులు ఎక్కువ ఉన్న కారణంగా, వారికి అత్యంత పూజనీయమైన గురునానక్ జయంతి నాడే ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమేనని, ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ విన్యాసాలని ప్రతిపక్షాలు వ్యంగ్య బాణాలను సంధిస్తున్నాయి.  ఈ విమర్శలు, వ్యాఖ్యలు ఎట్లా ఉన్నా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. ఈ కీలక నిర్ణయం రేపటి ఎన్నికల్లో బిజెపి గెలుపునకు ఊతమిచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతు ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది కూడా ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులే. మిగిలిన రాష్ట్రాల రైతు సంఘాలు ఉద్యమానికి సంఘీభావం పలికినా, ఉద్యమం దేశమంతా విస్తరించ లేదు. దాని ప్రభావం ఎక్కువ శాతం ఉత్తరాది రాష్ట్రాలపైనే ఉంది. 2023/2024 లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలంటే  త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బిజెపికి అత్యంత ముఖ్యం. అందునా, ఉత్తరప్రదేశ్ చాలా కీలకం,పంజాబ్ కూడా అంతే ముఖ్యం. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం బిజెపి అధికారంలోనే ఉంది. పంజాబ్ లో ఎలాగైనా అధికారపీఠాన్ని ఎక్కాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. కొత్త చట్టాల రద్దు నిర్ణయంతో, అకాలీ దళ్ ను  ఎన్ డి ఏ కూటమిలోకి తిరిగి ఆహ్వానించవచ్చనే వ్యూహం కూడా బిజెపికి ఉంటుందని భావించాలి. అలా జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంతంగా పార్టీని స్థాపించబోతున్నానని ఇటీవలే ప్రకటించారు. కెప్టెన్ మద్దతు కూడా బిజెపికి జతకలుస్తుందని అంచనా వెయ్యవచ్చు. నవ్ జోత్ సింగ్ సిద్ధూ చేస్తున్న నానా యాగీ వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిణామాలన్నీ కలిసి వస్తే పంజాబ్ లో బిజెపి పాగా వేయడం చాలా సులభం.

Also read: ధర్మవర్తనుడికి బ్రహ్మరథం, యాచకుడికి ఘనంగా వీడ్కోలు!

చట్టాలు రద్దు చేస్తే సరిపోదు

కొత్త చట్టాల రద్దు విషయంలో ప్రధాని సూత్ర ప్రాయంగా ప్రకటన చేశారు. ఈ చట్టాలు ఇప్పటికే చట్టరూపం దాల్చుకున్నాయి. వాటిని రద్దు చేయాలంటే రాజ్యాంగ పరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. రద్దు చేసే అధికారం పార్లమెంట్ కే ఉంది. కొత్త చట్టాన్ని తెచ్చేందుకు పార్లమెంట్ లో ఏ విధంగా బిల్లును ప్రవేశ పెట్టారో, అట్లాగే, చట్టాల రద్దు కోసం కూడా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాల్సి వుంది. అధికార పార్టీ, అందునా అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వం చాలా తేలికగా దీనిని అధిగమిస్తుంది. పార్లమెంట్ లో మూడు చట్టాల రద్దు జరిగేంత వరకూ ఎదురు చూస్తామని, అప్పటి వరకూ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి, ఉద్యమ కీలక నేత రాకేశ్ టికాయిత్ అంటున్నారు. కనీస మద్దతు ధరతో పాటు మిగిలిన అంశాలపై కూడా  రైతులతో ప్రభుత్వం చర్చించాల్సి ఉందని టికాయిత్ చెబుతున్నారు. స్వామినాధన్ కమిటీ చేసిన సూచనలను యథాతధంగా అమలు చేయడానికి ప్రతి ప్రభుత్వమూ వెనకడుగు వేస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతుల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడమే ఈ అనర్ధాలకు కారణమని నిపుణులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు చట్టాల సంప్రదింపుల కోసం సుప్రీం కోర్టు గత జనవరిలో నిపుణుల కమిటీని నియమించింది. ప్రధానమంత్రి తాజాగా చేసిన ప్రకటనపై ఆ కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు.  వారి అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. అధికార బిజెపికి ఎన్నికల్లో ప్రయోజనం కోసమే  తీసుకున్న రాజకీయ నిర్ణయంగా కమిటీ సభ్యుడు అనిల్ జె ఘన్వాత్ సైతం అభివర్ణించడం గమనార్హం. ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన రైతులు ఆందోళనను విరమించే అవకాశం లేదని ఆయన అంటున్నారు. ‘కనీస మద్దతు ధర’ కు (ఎం ఎస్ పీ) చట్టభద్రతను కల్పించడమే అన్నదాతలు మొదట నుంచీ చేస్తున్న ప్రధాన డిమాండ్. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకూ రైతుల విషయంలో న్యాయం జరగడం లేదు. వ్యవసాయం లాభసాటిగా మారనంత కాలం రైతుల ఘోష ఆగదు. రైతుల కంట కన్నీరు రాజ్యానికి, పాలించే ప్రభువులకు మంచిది కాదు. భారతదేశం వ్యవసాయ దేశం. ఇది గ్రామీణ భారతం. మన నాగరికతకు, ప్రగతికి పల్లెటూర్లే మూల స్థానాలు. పల్లెల్లో ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం మన జీవనాడి. దాని విషయం చిత్తశుద్ధితో ప్రవర్తించడమే ఉత్తమ పాలకుల లక్షణం.

Also read: సంపాదక శిరోమణి ముట్నూరి కృష్ణారావు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles