Tuesday, April 23, 2024

హరియాణా ప్రభుత్వంతో ఢీకొంటున్న రైతులు

ఆగస్టు 28న రైతులపైన పోలీసులు లాఠీచార్జీ చేసినందుకు నిరసనగా జిల్లా అధికారులను ఘెరావ్ చేయడానికి రైతులు ఒక ప్రదర్శనగా బయలు దేరారు. హరియాణా పోలీసులు పలువురు రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారంటూ రైతు ఉద్యమ నాయకుడూ, స్వరాజ్ అభియాన్ అధినాయకుడూ యోగేంద్ర యాదవ్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. తననూ, భారతీయ కిసాన్ దళ్ నేత రాకేష్ తికాయత్ నూ, తదితరులనూ నమస్తే చౌక్ నుంచి అరెస్టు చేసి వెంటనే విడుదల చేశారని ట్వీట్ ద్వారా తెలిపారు. కర్నాల్ వీధులలో రైతులు సముద్ర సదృశంగా ప్రదర్శన జరుపుతున్నారు. అంతకు ముందు పదకొండుమంది రైతు నాయకులతో జిల్లా అధికారులు జరిపిన చర్చలు విఫలమైనాయి. ‘‘ప్రభుత్వంతోచర్చలు సాధ్యం కాలేదు,’’ అని విలేఖరులకు తికాయత్ చెప్పారు. ప్రదర్శనకు అనుమతించడంపైన చర్చలు జరపాలని భావించారు.

రైతుల ప్రదర్శనను అనుమతించేది లేదని హరియాణా ప్రభుత్వం స్పష్టం చేసింది. నలభై కంపెనీల పోలీసులను రంగంలోకి దింపింది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేశారు. భద్రతాచర్యలకోసం కెమెరా బిగించిన డ్రోన్ లను వినియోగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామంటూ సోమవారంనాడు హరియాణా హోంమంత్రి అనీల్ విజ్ రైతులను హెచ్చరించారు. న్యాయంకోసం పోరాటంలో భాగంగానే కిసాన్ మహాపంచాయత్ నూ, మహాప్రదర్శననూ నిర్వహిస్తున్నామని ఒక ట్వీట్ లో తికాయిత్ ప్రకటించారు. లాఠీచార్జిలో దెబ్బలు తిని మరణించిన రైతు సుశీల్ కాజ్లా కుటుంబానికి న్యాయం చేయాలన్నదే తమ డిమాండ్ అని తియాయత్ అన్నారు. సుశీల్ కాజ్లా గుండెనొప్పి వచ్చి మరణించాడనీ, లాఠీ చార్జివల్ల కాదనీ పోలీసులు అంటున్నారు.

కర్నాల్ లో మోహరించిన పోలీసు బలగాలు

సహనం కోల్పోవద్దు : రైతులకు యోగేంద్రయాదవ్ విజ్ఞప్తి

ప్రశాంతంగా ఉండాలనీ, ఉద్యమాన్ని ధ్వంసం చేయడానికి ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టబోతోందనీ, వారి సహనానికి పరీక్ష పెట్టబోతోందనీ, సహనం కోల్పోయి అసహనానికి లోనై హింసాకాండ సృష్టిస్తే ప్రభుత్వం వేసిన వలలోకి నడవటమే అవుతుందనీ యాదవ్ హెచ్చరించారు. లాఠీ చార్జి ఆదేశించిన అధికారులపైన ఎఫ్ఐఆర్ పెట్టాలనీ, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలనీ కోరుతూ 40 రైతు సంఘాల సమన్వయ సంస్థ సంయుక్త కిసాన్ మోర్చా మంగళవారంనాటి ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఆగస్టు చివరివారంలో పోలీసులు చేసిన క్రూరమైన లాఠీ చార్జీని కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. రైతులు తలలు పగలగొట్టాలంటూ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ (సబ్ కలెక్టర్ హోదా) ఆయుష్ సిన్హా చేసిన వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా హరియాణా ముఖ్యమంత్రి ఎంఎస్ ఖట్టర్ రైతులకు ఆగ్రహం కలిగించారు. ఆయుష్ సిన్హా ఉపయోగించిన పదజాలం సవ్యంగా లేదు కానీ గట్టిగా ఉండటం అవసరమేనంటూ ఖట్టర్ సన్నాయినొక్కులు నొక్కడం రైతులకు కోపం తెప్పించింది. కర్నాల్ జిల్లా మెజిస్ట్రేట్ నిషాంత్ యాదవ్ సిన్హా వ్యాఖ్యలపట్ల విచారం వెలిబుచ్చారు. సిన్హాను బదిలీ చేశారు కూడా.  కానీ రైతులు శాంతించలేదు.

సోమవారందాకా ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో రైతులు వేల సంఖ్యలో జమైనారు. 15 రాష్ట్రాలకు చెందిన రైతులు అక్కడికి వచ్చారని నిర్వాహకులు అంటున్నారు. రైతుల, రైతు కూలీల సమష్టి శక్తి ఎటువంటిదో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూ, ప్రధాని నరేంద్రమోదీకీ తెలిసివస్తుందని రైతు నాయకులు వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు నియమించిన సంస్థ నివేదికను బహిర్గతం చేయండి

వ్యవసాయచట్టాలపైన అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు నియమించిన సంఘం నివేదికను బహిర్గతం చేయవలసిందిగా అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను సంఘం సభ్యులు కోరారు. ఈ సంవత్సరం మార్చిలో ఈ సంఘం తన నివేదికను సమర్పించింది. ‘‘సుప్రీంకోర్టు ఆ నివేదికను పట్టించుకోలేదని నా అభిప్రాయం,’అంటూ సంఘంలో రైతుల పక్షాన నియుక్తులైన అనిల్ ఘన్వత్ ప్రధాన న్యాయమూర్తకి రాసిన ఒక లేఖలో వ్యాఖ్యానించారు. హరియాణాలోని కర్నాల్ లో నిరసన వెలిబుచ్చుతున్న రైతులపట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్న సందర్భంగా ఈ లేఖ రాశారు.

ఒక వైపు రైతులు తమ బలాన్ని సమీకరించుకుంటుంటే మరో పక్క ప్రభుత్వం బందోబస్తు పెంచుతూ వచ్చింది. ఇరు పక్షాలు దీనిని ప్రతిష్ఠాత్మకమైన విషయంగా పరిగణించడంతో పరిణామాలు ఏ విధంగా ఉంటాయోనని సమాజంలోని ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఏ మూడు చట్టాటపట్ల నిరసన ప్రకటిస్తున్నారో  ఆ మూడు చట్టాల అమలును సుప్రీంకోర్టు జనవరిలో నిలుపుదల చేయించింది. రైతులు లేవనెత్తిన అంశాలు పరిష్కారానికి నోచుకోలేదనీ,  ఉద్యమం కొనసాగుతున్నదనీ, ఇది ఆందోళనకరంగా పరిణమించిందనీ ఘన్వత్ అన్నారు. ఆయన షేట్కారీ సంఘటన తరఫున సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో సభ్యుడైనారు. రైతుల అభిప్రాయాలనూ, ఇతర వర్గాల అభిప్రాయాలనూ సేకరించి ఆ నివేదికలో పొందుపరిచామనీ, దానిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమనీ ఆయన వ్యాఖ్యానించారు.  

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles