Thursday, March 28, 2024

వి’నాయకులు: విగ్రహాలు – నిగ్రహాలు

రెండు శతాబ్దాలు పాటు బ్రిటిష్ పాలనలో వున్నవి ఆంధ్ర-రాయలసీమ-ఉత్తరాంధ్ర జిల్లాలు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘మెడ్రాస్ ప్రెసిడెన్సీ’ అనేవారు. తెలంగాణ నిజాం పాలనలో ఉండేది. గతంలో 1956 నవంబర్ లో వొకసారి, తిరిగి జూన్ 2014 తర్వాత మరొకసారి ఈ ప్రాంతాన్ని ‘ఆంధ్రప్రదేశ్’ అని అధికారికంగా భారత ప్రభుత్వం నోటిఫై చేసింది. మొన్నటి వరకు వీటితో కలిసి అరవై ఏళ్ల పైగా వున్న నైజాం ఏరియా ఇప్పుడు మరొక రాష్ట్రం -తెలంగాణ అయింది. అలా సుదీర్ఘ కాలం పాటు బ్రిటిష్ పాలనలో వున్న ఈ ప్రాంతం మీద ‘బ్రిటిష్’ ప్రభావం 70’ దశకం వరకు కూడా పాలు నీళ్ళు మాదిరిగా కలిసి పోయి ఉండింది. ఆ తర్వాత ఏమైందీ? అదీ చూద్దాం.

బ్రిటిష్ వారి కాలంలో పరిపాలనతో పాటుగా చదువు, వైద్యం ఈ రెండు ఇక్కడ ఆధునీకరించబడిన ప్రధానమైన అంశాలు. బందరులో 1843-1938 మధ్య పనిచేసిన నోబుల్ హైస్కూల్, కాలేజిలో అన్ని కులాల వారికీ చదువు చెప్పడానికి వీల్లేదు. అందుకు అనుమతి ఇవ్వమని టెర్లింగ్టన్ నోబుల్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ద్వారా ఇంగ్లాండ్ పలు మార్లు ఉత్తరాలు రాస్తే తప్ప, చివరికి అందుకు అనుమతి రాలేదు. ‘ది మాన్యువల్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్’ గ్రంధంలో గోర్డన్ మెకంజీ దీన్ని రాసారు. మళ్ళీ తిరిగి 1966 తర్వాత దీన్ని తెరిచారు. అప్పట్లో సర్వశ్రీ ముట్నూరు కృష్ణారావు, భోగరాజు పట్టాభిరామయ్య, కొంపెల్ల హనుమంతరావు, విశ్వనాధ సత్యనారాయణ, కాసు బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ చదివిన వారే.


బారిస్టర్ పార్వతీశం:

ఇప్పటికీ ఇక్కడ మనం మన దైనందిన జీవితంలో పిలుచుకొంటున్న పేర్లు – కాటన్ బ్యారేజి (రాజమహేంద్రి) బకింగ్ హాం కెనాల్ (కాకినాడ-మెడ్రాస్) టర్నర్స్ చౌల్ట్రీ (విశాఖపట్టణం) బ్రౌన్ లైబ్రరీ (కడప) బెజవాడలో వించ్ పేట, ఫిటిన్ గేల్ పేట, ఇలా ఇటువంటి పేర్లు కోసం మనం వెతికితే ప్రతి పట్టణంలో ఏదో ఒక్కటి అయినా మనకు బ్రిటిష్ కాలం నాటి పేర్లు కనిపిస్తాయి. మొక్కపాటి నరసింహ శాస్త్రి ప్రముఖ నవల ‘బారిష్టర్ పార్వతీశం’ లో నాయకుడు నర్సాపురం నుంచి బయలుదేరి నిడదవోలు వచ్చి అక్కణ్ణించి బకింగ్ హాం కెనాల్ ద్వారా మెడ్రాస్ అక్కడ నుంచి ఇంగ్లాడ్ చేరిన వైనం రాస్తారు. అంతర్లీనంగా అందులో వున్నది – ‘బ్రిటిష్ ఎరా’ ప్రభావమే!

ఆంగ్లమత ఛాయలకోసం అన్వేషణ:

ఇప్పుడు కొత్తగా బ్రిటిష్ ఇక్కణ్ణించి వెళ్ళిన 75 ఏళ్ల తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంగ్ల మత ఛాయలు కోసం వెతకడం, అది కొత్తగా వార్త అవుతున్న సందర్భంలో గతంలోకి వెళుతుంటే, గుర్తుకొస్తున్న విషయాలు ఇవి. ‘మతం’ పేరుతో ఇప్పుడు కొత్తగా మన జీవితాలు నుంచి విడదీయడానికి వీలులేనివి ఇవి! విభజన తర్వాత హడావుడిగా రాజధానిని బెజవాడ మార్చాక, అప్పటి కప్పుడు తెలుగుదనం లేదా మన ‘ఆంధ్ర ప్రైడ్’ వొకటి ఉండాలి అంటూ… వెతికి చివరికి బెజవాడ బందరు రోడ్డు మీద సబ్ కలెక్టర్ ఆఫీస్ పక్కన వున్న విక్టోరియా జూబిలీ మ్యుజియం పేరు మార్చి దాన్ని ‘బాపు మ్యుజియం’ అన్నారు. బోర్డు మార్చినంత మాత్రాన ఆ కట్టడం నిర్మాణ శైలి బ్రిటిష్ అని తెలియకుండా చేయడం మనతో అవుతుందా!

విశాఖపట్టణం, బందరు, నెల్లూరు కలక్టరేట్ భవనాలను ‘ఇండియనైజ్’ చేయడం సాధ్యం అవుతుందా? బందరు కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ బంగాళాలకున్న చెక్కమెట్లు వాటికి సమీపాన వున్న నోబుల్ కాలేజి దాని అనుబంధ క్లార్కి హాస్టల్ మెట్లు ఒకే రీతిగా వుంటాయి. సుదీర్ఘ సముద్ర తీరం వున్న రాష్ట్రంలో వొకప్పటి బ్రిటిష్, డచ్చి వారి అవాసాలుగా వున్న తీర ప్రాంత పట్టణాలలో వొక పర్యావరణంగా మారిన ‘మిషన్ కాంపౌండ్’ జీవనశైలిని ఇప్పుడు మార్చడం ఎలా? గతంలో క్రైస్తవ పాలకులు పోర్టులు, హార్బర్లు నిర్మించిన చోటే ఈ ప్రభుత్వం కూడా కడుతున్నది, అంటే ఇక చెప్పడానికి ఏముంది?

కరుణ కుమార్ రచన కొత్త చెప్పులు:

‘బ్రిటిష్ చర్చి’ ఇక్కడి సామాజిక జీవనంలోకి చొచ్చుకెళ్ళిన వైనం గురించి నెల్లూరు ప్రాంతంలో బ్రిటిష్ పాలన చివరి రోజులు చూసిన రెవెన్యూ అధికారి తొలి తరం కధకుడు కరుణ కుమార రాసిన 50’ దశకం రచన ‘కొత్త చెప్పులు’ కధ చెబుతుంది. మాదిగ ముత్తడు కుట్టిన కొత్త చెప్పులు వల్ల కామందు కాళ్ళకు పుండు అవుతుంది. అంతే, వాణ్ణి ఇంటికి పిలిచి చావిడి గుంజకు కట్టి చావమోదుతాడు. వాడు చచ్చేట్టుగా ఉన్నట్టుగా గమనించిన గుమస్తా, “అయ్యా వీడు దొరల మతమైన కిరస్తానీ మతం పుచ్చుకున్నాడు, వీడి పేరు ఇప్పుడు ముత్తడు కాదు – మత్తయ్య, వీడికి కనుక ఏమైనా అయితే, రేపు మనకు డిప్టీకలెక్టర్ దొరగారితో కచేరి అవుతుందేమో” అంటాడు. అంతే, భయపడ్డ కామందు అతన్ని వదిలేస్తాడు. ఇలా, ఉత్తరాంధ్రను చూసినా ఇదే ధోరణి. గురజాడ ‘కన్యాశుల్కం’ లో సౌజన్యారావులో మనకూ దృశ్యాదృశ్యంగా కనిపించేవి బ్రిటిష్ ప్రభుత్వం సంస్కరణ ఛాయలే!

క్రైస్తవంలో ఆధిపత్య కులాలు:

ఇక్కడివే గంజాం ప్రాంత జిల్లాలు బరంపురం, గజపతి పట్టణం చూస్తే, ఒరిస్సాలో స్థిరపడ్డ కులీన బెంగాల్ బ్రాహ్మణ క్రైస్తవ ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చారిత్రిక సత్యానికి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు పురుషోత్తమ చౌదరి ప్రస్తావన వొక్కటి చాలు. రాగం-తనం-పల్లవిని జోడించి మరీ వారు రాసిన గీతాల్లోని భాష అనితర సాధ్యం! ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు గ్రంధంలో గత వందేళ్లుగా తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సమాజం ఇప్పటికీ పాడుతున్న ‘క్లాసిక్స్’ అవే! ఇంకా, కొన్ని తరాలు క్రితమే తమిళనాడు నుంచి వచ్చి పిఠాపురంలో స్థిరపడ్డ మరో సవర్ణ వాగ్గేయకారుడు రెవ. మాసిలామణి, తెలుగు బ్రాహ్మణ పండితుడు రెవ. ఆర్.ఆర్.కే. మూర్తి, మారనాథ సంఘాల స్థాపకుడు కృష్ణాజిల్లా నివాసి రెవ. మోజెస్ చౌదరి, ఇంకా కేథలిక్ చర్చిలో సర్వోన్నత స్థానాల్లో వున్న రెడ్డి, కమ్మ, మొదలైన ఆధిపత్య కులాల వారు క్రైస్తవంలో వుండడం ఈ ప్రాంత చరిత్ర నుంచి వేరుచేసి చూసేవి కాదు.

ఇందిర కాలంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు:

ఎనభై దశకంలో ఇందిరా గాంధీ సంక్షేమ కాలంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఇన్సురెన్స్ కంపెనీల్లో జరిగిన భారీ రిక్రూట్మెంట్లు కాలంలో రాజ్యాంగంలో వున్న ‘రిజర్వేషన్లు’ ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త ‘వోపెనింగ్’ అయ్యాయి. దాంతో అప్పటివరకు ‘చర్చి’ అనుబంధ బోర్డింగ్ ల్లో వుంటూ మిషన్ స్కూళ్ళలో చదివి, మిషనాసుపత్రి వైద్యం పొందిన విద్యావంతులైన వారు, మొదటి సారి ఈ కాలంలో ఉద్యోగాలు కోసం ‘రాజ్యం’ వైపు అవకాశాల కోసం చూడడం మొదలైంది.
ఎస్టీల విషయంలో సమస్య లేకపోయినా ఎస్సీల విషయంలో కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) పొందటం ఒక దశాబ్దం పాటు తేలిగ్గానే జరిగినా, 90’ దశకం నాటికి వాటి మీద ఆంక్షలు నియంత్రణ మొదలయిది. ఈ దశకంలో క్రమంగా ప్రభుత్వ సర్వీసుల్లో రిక్రూట్మెంట్లు తగ్గాయి, ప్రైవేటీకరణ తో ఎంపికకు అక్కడ కులం, మతం విషయం కాకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో వీరి ‘మతం’ సందిగ్ధమైంది. చదువులు వరకు క్రైస్తవ్యం అనుసరించినవారు, ప్రభుత్వంలో కులం ప్రాతిపదికగా ఉద్యోగం పొందడానికి మతం అడ్డు అయింది.

ఎస్సీ ఎంఎల్ఏలపై కేసులు:

ఎన్నికల్లో ‘కులం’ ప్రాతిపదికగా ఎస్సీ స్థానాల్లో ఎంపిక అయిన వారి ‘మతం’ కారణంగా వచ్చే కేసులు ఇటువంటివే. ఇటువంటి వారు ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉంటున్నప్పుడు, రాజకీయ విమర్శ కోసం వీరిని ‘టార్గెట్’ చేయడం ఇటీవల పరిపాటి అయిపొయింది. వీటన్నిటినీ మించి, ఆంధ్రప్రదేశ్ లో దళిత క్రైస్తవులను ‘ఎస్సీ’ లుగా పరిగణించాలి అనే డిమాండ్ కేంద్ర ప్రభుత్వం వద్ద ముప్పై ఏళ్లుగా పెండింగ్ లో వుంది. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఎవరికైనా ఎవరితో అయినా కష్టం కలిగినప్పుడు వీరి మతాలు వార్తలు కావడం, తర్వాత అది ఎవరికీ పట్టని విషయం కావడం మామూలు అయింది.

ప్రత్యేకించి విభజిత ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇక్కడి ఆర్ధిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్రతో అది ముడిపడిన అంశం అయింది. కొన్ని ఇతర మతాలు మాదిరిగా క్రైస్తవ్యంలో ‘విశ్వాసం’ అనేది దృశ్యమానంగా కనిపించేది కాదు. దాంతో వారి జనాభా కూడా అర్ధం కాని అంశంగా మారింది. ‘టెక్నాలజీ’ కారణంగా ఇప్పుడు ‘చర్చి’ పాత్ర కూడా ‘కోవిడ్-19’ కాలంలో తగ్గిపోయి, ఇష్టమైన వారు ‘యూట్యూబ్’ ప్రసంగాలు వింటున్నారు. ‘చర్చి’ కూడా ఇప్పుడు అలా ‘వోపెన్’ అయింది.

కార్పొరేట్ చర్చి సంస్కృతి కూడా ఇక్కడిదే:

ఇటువంటి చారిత్రిక నేపధ్యం వున్న స్థల కాలాల్లో, ఆర్ధిక సంస్కరణల వల్ల ప్రతిదీ వాణిజ్యం అయ్యాక, ‘కార్పోరేట్ చర్చి’ సంస్కృతి కూడా ఇక్కడ మొదలై గత దశాబ్దం కాలంలో అది వికృత రూపం తీసుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అవసరం మేరకు వీరిని ప్రోత్సహిస్తున్నారు. ఆదాయం పెరిగిన ఈ ‘చర్చి’ అధినేతలు కూడా రాజకీయ పార్టీలను ప్రోత్సహిస్తున్నారు. ఇలా వీరి మధ్య సంబంధాలు ఉభయతారకంగా మారాయి. అయితే, ‘ఎండోమెంట్’ శాఖ వంటి సంస్థాగత భూమిక దీనికి ప్రభుత్వంలో లేని కారణంగాను, ఇక్కడి ‘చర్చి’కి రాజకీయల్లో చోటు లేకపోవడం వల్ల; వీటిని అనుసరిస్తున్న ప్రజలు రాజకీయ ఎంపిక విషయంలో స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు.
నిజానికి ‘క్రైస్తవం’ నేపధ్యం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న చౌకబారు ప్రదర్శన వ్యవహారం ఎంతమాత్రం కాదు. డిల్లీ కాశ్మీర్ గేట్ వద్ద 1710 లో స్థాపించబడి, ఇప్పటికీ అదే స్పూర్తితో పనిచేస్తున్న- ‘ఇండియన్ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ క్రిస్టియన్ నాలెడ్జ్’ (ISPCK) సంస్థ గత 310 ఏళ్లుగా పనిచేస్తూ వున్న చరిత్ర తెలుసుకుంటే, అది ఎంత గంభీరమైనదో అర్ధం అవుతుంది. పైన ప్రస్తావించిన వైతాళికులు ఈ కాలం వారే!

రాజకీయవైరంలో అస్త్రశస్త్రాలు వేరుగా ఉండాలి:

గతం ఇలా వుండగా, ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు వున్న ముఖ్యమంత్రి క్రైస్తవుడు అయ్యేసరికి, అతడు ఈ ప్రాంతంలో గడచిన రెండువందల ఏళ్ల చరిత్రను ఆ మతం వారికి అనుకూలంగా సృష్టించాడు అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు! రాజకీయ స్పర్ధ లేదా వైరం వున్నప్పుడు, దాన్ని ఎదుర్కోవడానికి ఎంపిక చేసుకోవలసిన అస్త్ర శస్త్రాలు వేరుగా వుండాలి. మరీ ముఖ్యంగా, మొదటి నుంచి చైతన్యం వున్న ప్రజల మధ్య ఇటువంటి ‘టూల్స్’ తో రాజకీయాలు అంటే, అన్ని రాజకీయ పార్టీలు ముందుగా ఈ ప్రాంత ‘కల్చర్-హెరిటేజ్’ కి క్షమాపణలు చెప్పాలి.

రచయిత: అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

1 COMMENT

  1. The analysis of contemporary historian is not only near to the truth,but it’s the only trth.By virtue of my father’s name I was branded as Christian, though my father was a communist and me an atheist and deprived of scholarship & hostel facilities. During 1970’s a good number of B.C(c)s gone under ‘suddhi’sangam/Aryasamaj certificates and had the SC certificates. It doesn’t mean that they left Christianity,or became a Hindu.It is a notion of the so called rulers/petty scholars in beaureocracy, they just close their eyes to see the reality in doing good to the society. The geographical, economic & social conditions of the Dalits are same irrespective of their religion. Strictly speaking Dalits have no place in Hindu caste heirarchy ,as they were below the Sudras.As a country,all the people are equal and if a patriate wants his country’ to be strong and developed, it’s people to be developed. But the country of ours is a contry of caste groups and poltico-religious communities. For political ends the leaders are throwing the country in to backwardness, illiteracy and poverty. This trend is evident from 2014 and later phases.
    The words of sociaistic, scientific,welfare, equality have disappeared in the mind’s of the political leaders no one utters at any parlances.The words of smooth and mannered too vanished.

    There is a dire need of change in the leadership and entry of benevolent elite in the political arena. Let’s all hope for the best.we need more provocative & inspirational thoughts from the pen of contemporary historian Dr choragudi Johnson.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles