Sunday, June 26, 2022

జాద్ మైదానము

( ‘THE  FIELD OF ZADD’ FROM’ THE WANDERER ‘ BY KHALIL GIBRAN )

తెలుగు సేత : డా. సి.బి. చంద్ర మోహన్

                   26. సంచారి తత్త్వాలు

                   ——————————

జాద్ నగరానికి వెళ్లే మార్గంలో ఒక బాటసారి — ఆ దగ్గర గ్రామంలో నివసించే మనిషిని కలిసి, దూరంగా ఉన్న మైదానాన్ని వేలుతో చూపెడుతూ, ఆ మనిషిని ఇలా అడిగాడు ” ఆలం చక్రవర్తి తన శత్రువులను జయించిన యుధ్ధభూమి ఇదే కదా?”

ఆ మనిషి ” అది ఎప్పుడూ రణ భూమిగా లేదు. ఆ మైదానంలో ఒకానొకప్పుడు జాద్ నగరం ఉండేది. అది కాలి బూడిదై పోయింది. ఇప్పుడు ఆ మైదానం బాగుంది కదా!”

ఆ తరువాత బాటసారి, ఆ మనిషి విడిగా వెళ్లి పోయారు. ఒక అర మైలు లోపునే బాటసారి ఇంకో మనిషిని కలిసాడు. ఆ మైదానం వైపు చూపిస్తూ ” అక్కడేగా గొప్పదైన జాద్ నగరం ఒకప్పుడు ఉండేది? ” అని అడిగాడు.

ఆ మనిషి ” అక్కడ ఎప్పుడూ నగరమనేది లేదు. కానీ ఒకానొకప్పుడు అక్కడ ఒక పీఠం ఉండేది. దక్షిణ దేశపు ప్రజలచే అది నాశనం చేయబడింది .” అన్నాడు.

 కొంచెం ముందు, అదే జాద్ నగర దారిలో ఆ బాటసారి ఇంకో మనిషిని కలిసాడు. ఆ మనిషికి మరలా ఆ మైదానం చూపిస్తూ  ఇలా అడిగాడు ” ఆ మైదానంలో ఒకానొకప్పుడు ఒక గొప్ప పీఠం ఉండేదనే మాట నిజమాకాదా?”

ఆ మనిషి ఇలా జవాబిచ్చాడు ” ఈ చుట్టు పక్కల ఎప్పుడూ పీఠమనేది లేదు. కాని ఒకానొకప్పుడు ఓ పెద్ద ఉల్క ఆ మైదానంపై పడిందని మా తాత, ముత్తాతలు చెప్పేవారు.”

 ఆ బాటసారి మనసులో ఆశ్చర్య పోతూ ముందుకు సాగాడు. అక్కడ బాగా వయసున్న ఒక పెద్దాయనను కలిసి, అతనికి నమస్కరిస్తూ ఇలా అడిగాడు ” సార్! ఈ చుట్టు పక్కల నివసించే ముగ్గురిని ఈ దారిలో కలిశాను. వారందరినీ ఆ మైదానం గురించి వాకబు చేసాను. కానీ వారిలో ప్రతి ఒక్కరూ — మిగిలిన వారు చెప్పింది త్రోసిపుచ్చారు. ప్రతి ఒక్కరూ, మిగతా వారు చెప్పని కొత్త కధను నాకు వినిపించారు.”

అప్పుడా పెద్ద మనిషి తలెత్తి ఇలా జవాబిచ్చాడు ” స్నేహితుడా! ప్రతి ఒక్కరూ నీకు చెప్పింది వాస్తవమే. కానీ, వాస్తవాలను క్రోడీకరించి , వాటినుండి నిజాల్ని (సత్యాల్ని)  రాబట్టటం కొంత మంది మాత్రమే చేయగలరు.”

Also read: నిండు చంద్రుడు

Also read: బోధన

Also read: ఎర్ర మట్టి

Also read: వంతెన నిర్మాతలు

Also read: స్వీయ జ్ఞానం

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles