Tuesday, January 31, 2023

గుంటూరు వైద్యుడు డా. కార్తీక్ మిక్కినేనికి అమెరికాలో అసాధారణమైన అవకాశం

హైదరాబాద్ : డాక్టర్ కార్తిక్ మిక్కినేని స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియుక్తులైనారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన వ్యక్తులకు పంపించే వీసాను అమెరికా ప్రభుత్వం కార్తీక్ కు పంపించింది.  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో వాస్కులర్ సర్జరీ డివిజన్ లో సహాయక ఆచార్డుడుగా కార్తీక్  పని చేయబోతున్నారు. పిట్స్ బర్గ్ లోని టెంపుల్, డ్రెక్సెల్  యూనివర్శిటీలో ఇంటెగ్రేటెడ్ వాస్క్యలర్ సర్జరీలో రెసిడెన్సీ చేశారు.  న్యూయార్క్ లోని ప్రెస్బీటెరియన్ ఆస్పత్రిలో ఇన్టర్న్ షిప్ చేశారు. ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజీలో చదివారు. ఎన్ ఐహెచ్, ఏహెచ్ఏ ఇచ్చిన గ్రాంట్స్ సహాయంతో వాస్క్యులర్ మెడిసిన్ లో పరిశోధన చేశారు. వ్యాధిని వేగంగా కనిపెట్టడంలో, వైద్యం చేయడంలో కొత్త విధానాలను కనుగొన్నారు.  ఎంబీబీఎస్ చదివే సమయంలో 14 బంగారు పతకాలు సాధించారు.

తనకు 21 ఏళ్ళు వచ్చేవరకూ తన ఇంటికి రెండు కిలోమీటర్లకంటే దూరం మించి వెళ్ళలేదనీ, విద్యాభ్యాసం గుంటూరులోనే జరిగిందనీ, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాననీ,ఎంసెట్ లో 97వ  ర్యాంకు వచ్చిందనీ, గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు వచ్చిందనీ కార్తీక్ అన్నారు. కార్తీక్ విద్యాధికుల కుటుంబంలో పుట్టిపెరిగారు. తాతగారు మిక్కినేని సీతారామయ్య ప్రఖ్యాత న్యాయవాది. తండ్రి మిక్కినేని పురుషోత్తం కూడా అడ్వకేటు, రియల్ ఎస్టే ట్ వ్యాపారి. తల్లి జయంతి గృహిణి. తన ఎదుగుదలకూ, ప్రతిభను నిరూపించుకోవడానికీ ఆమె కారకురాలని కార్తీక్ చెప్పారు. తల్లి తనను ప్రోత్సహించారనీ, పోటీ పడి చదివేట్టు చేశారనీ, తాను ఈ స్థితిలో వెలిగిపోవడానికి పూర్తిగా ఆమే కారకురాలని అన్నారు.

అమెరికాలో వైద్య వృత్తిలో ప్రవేశించడానికి అవసరమైన పరీక్ష రాయడంలో తాను మూడో తరగతి ఎంబీబీఎస్ లో ఉండగానే సీనియర్లకు సహాయం చేశాననీ, తనకు 90 శాతం మార్కులు రావడంతో తాను అమెరికా వెళ్ళడం ఏ మాత్రం కష్టం కాలేదని కార్తీక్ అన్నారు. 2012లొ అమెరికా వెళ్ళారు. అమెరికాలో పిట్స్ బర్గ్ లో ఎండి చదివారు. ‘కరెంట్ వాస్క్యులర్ సర్జరీ’ అనే పుస్తకం రాయడంతో అమెరికాలో డాక్టర్ కార్తీక్ గురించి చాలామందికి తెలిసింది. ‘‘స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ యాజమాన్యం అడిగితేనే నేను ఉద్యోగం కోసం దరఖాస్తు పంపాను. అక్కడ అడిగితేనే దరఖాస్తు చేసుకోవాలి. నాతో పాటు మరి ముప్పయ్ మంది వైద్యులు ఇంటర్వ్యూకు వచ్చారు. రెండు రోజుల పాటు ఇంటర్వ్యూ జరిగింది. ఒక్కొక్క ప్రొఫెసర్ తో 90 నిమిషాల ఇంటర్వ్యూ. మధ్యాహ్న భోజనం విద్యార్థులతో, ఇతర ఉద్యోగార్థులతో కలిసి చేశాం. రాత్రి భోజనం విశ్వవిద్యాలయం అధ్యక్షుడితో కలిసి చేశాం. అప్పుడే చెప్పారు నాకు పిలుపు వస్తుందని,’’ అని కార్తీక్ వివరించారు.

ఇథర అధ్యాపకులతో స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కార్తీక్ మిక్కినేని

‘‘ఎంపిక పద్ధతి చాలా క్లిష్టంగా ఉంటుంది. నేను చెప్పిన జవాబులను నలభై మంది ప్రవీణులకు పంపించారు. వారు ఇచ్చిన మార్కులను క్రోడీకరించి ఎంపిక చేశారు. నేను క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫసర్ ని. సర్జరీలు చేయడం, రోగులను జాగ్రత్తగా చూసుకోవడం నా ప్రాథమిక విధి. తర్వాత విద్యార్థులకు బోధించాలి. అనంతరం పరిశోధన చేయాలి. మూడేళ్ళ కాంట్రాక్టు పైన సంతకం చేశాను. కావాలంటే కాంట్రాక్టు పొడిగిస్తారు. నాకు బోధనపైన ఆసక్తి ఎక్కువ.

‘‘స్వల్పకాలిక లక్ష్యం ఏమంటే మంచి వాస్క్యులర్ సర్జన్ గా, ఆచార్యుడిగా పేరు తెచ్చుకోవడం, ఆస్పత్రి యాజమాన్యంలో ఎంబీఏ చేయాలని కూడా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వాస్క్యులర్ ఇన్ స్టిట్యూట్ పెట్టాలని ఉంది. వైద్యవిద్యార్థులకు నా సలహా ఏమిటంటే అంతా మన చేతుల్లోనే ఉంది. ఆసక్తి, పట్టుదల కావాలి. మీ బలం ఏమిటో తెలుసుకోండి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయం దానంతట అదే వరిస్తుంది,’’ అని చెప్పాడు.

Previous articleఆకు
Next articleతపన

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles