Thursday, December 8, 2022

సంధ్య

గగనమొక రేకు

కన్నుగవ సోకు

ఎరుపెరుపు చెక్కిళ్ళ విరిసినది చెంగల్వ

సంజె వన్నెల బాల రంగు పరికిణి చెంగు

చీకటిని తాకినది అంచుగా

చిరుచుక్క ప్రాకినది

వాలు నీడల దారి నీలి జండాలెత్తి

చుక్క దీపపువత్తి సొగయు బాటల నల్ల

నిదుర తూలెడి నడక గదుము మైకపు కోర్కె

వచ్చు నిశిలో కరగి నవ్వు శశిలో కలసి

సంజ వన్నెల బాల రంగు రంగు రుమాల

విసిరింది కలలల్లు

వెండి తోటల మధ్య

వ్రాలినది వ్రాలినది తావిగా

సోకినది సోకినది

సంజె పెదవుల ఎరుపు కడలి అంచుల విరిగి

సంజ పరికిణీ చెరగు ఎడద లోతుల మెరసి

ఏటి కొంగల నిదుర ఎర్రగా ప్రాకింది

బాతు రెక్కల నీడ బరువుగా సోలింది

సంజ వన్నెల చాలు స్వర్ణ స్వర్ణది ధార

వయసు మైకపు జీర కరగు మబ్బుల తేల

గగనమొక రేకు

కన్నుగవ సోకు

దేవరకొండ బాలగంగాధర తిలక్

1941

(అమృతం కురిసిన రాత్రి)

Devarakonda Balagangadhara Tilak 100th Birth Anniversary Guest Column -  Sakshi
దేవరకొండ బాలగంగాధర తిలక్

అంధ తిమిరాన చిరుచుక్క

అరుణారుణ పుష్పదళం వంటి సూర్యాస్తమయ శోభ కన్నుగవను సోకింది. ఎరుపెరుపు చెక్కిళ్ళ వంటి పూరేకులతో చెంగల్వ నీటిలో విప్పారింది. ఎఱ్ఱని సంజ వన్నెల బాల పరికిణి కొంగుకు అంచువలె అంధ తిమిరం సోకింది. అంధ తిమిరాన చిరుచుక్క ప్రాకింది.

Also read: అమృతోత్సవ వేళ ఆప్తవాక్యం

నీలి జండాలవలె ఏటవాలుగా  విస్తరిస్తున్న సందె నీడల్లో చిరుచుక్కయే దీపపు వత్తిగా, నిదురతో తూలుతున్న నడకతో, గదుముతున్న మైకపు కోర్కెతో, పరవశ పథ గామియై, పరతెంచే నిశిలో ద్రవిస్తూ, దరహసించే  శశికాంతితో కలుస్తూ, సంజ వన్నెల బాల, తన రంగురంగుల రుమాలను విసిరివేసింది. ఆ రుమాల, వెండి వెన్నెల కలలతో వెలిగే పూదోటల్లో వ్రాలింది. సుగంధ పరిమళంతో మమేకమై చీకటిలో సోలింది.

సంజ వన్నెల బాల ఎఱ్ఱని పెదవుల వెలుగు కడలి అంచులపై విరిగింది. సంజ వన్నెల బాల పరికిణీ చెరుగు కడలి లోతుల్లో మెరిసింది.  కొంగల నిశ్చల నిద్రాకృతి ఏటి అలలపై ఎఱ్ఱగా ప్రాకింది. అదే నీటిపై బాతు రెక్కల నీడ బరువుగా సోకింది.

Also read: నర్మగర్భితమైన జవరాలి పలకరింపు

ఒకచో  తెల్లగా అలుముకొంటున్న తెల్లని వెన్నెల చాలు, మరొకచో  ఆకాశగంగయై పొంగిన సూర్యాస్తమయ సువర్ణ కాంతి,

నిండు జవ్వనంలోని మైకపు జీర నీలి మబ్బులలో కరగి పోగా, అరుణారుణ పుష్పదళం వంటి సూర్యాస్తమయ శోభ కన్నుగవను సోకింది.

Also read: ఏల ప్రేమింతును

పూజా శిరీషం

ఎనభై ఏండ్ల క్రిందటి కవితాఖండిక యిది. నవయవ్వనశ్రీలు చిందే ప్రాయంలో కవితాసతి నొసట రసగంగాధరతిలకం వంటి ఒక కవి వెలువరించిన పూజాశిరీషమిది.

మహాసముద్రము, దానిలో కలిసే ఏటిపాయలు, అరుణారుణప్రభలు వెలార్చే మనోహర సూర్యాస్త మయము, నీలి జండాల వలె ఏటవాలుగా ప్రాకుతున్న నీడలు, ఏటి అలలను సోకుతున్న ఎఱ్ఱని కొంగల దేహకాంతులు, అదే ఏటిపై నల్లగా ప్రాకుతున్న బాతు రెక్కల నీడలు, వన్నెలు చిలికే ఒక బాలిక పరికిణీ వలె విరిసే అరుణారుణ సంధ్య, ఆ పరికిణీ చెరగు వలె ముసురుకోనే మసక చీకటి, చీకటిపై గీసిన చిరుచుక్క, ఎరుపెరుపు చెక్కిళ్ళతో విరిసిన చెంగల్వ, ఆ బాల నిదుర తూలెడి నడక., ఆ బాలను గదుముతున్న మైకపు కోర్కె, ఒకవంక అస్తమయ సంధ్యతో కలసి, మరొకవంక ప్రసవించే శశికాంతిలో కరగి, సంజవన్నెల బాల కలల వెన్నెల పూదోటలోకి విసిరే రంగురంగు రుమాల; కడలి అంచులపై విరిగే  ఆమె అరుణారుణ పల్లవాధర శోభ, ఒకవంక సంజవెన్నెల చాలు, మరొకవంక స్వర్ణ స్వర్ణది ధార, వయసు మైకపు జీర, నీలి మబ్బుల చార.

Also read: భ గ్న మా లి క

అవ్యక్త రసానుభవం

సంజ వెలుగును బాలికపరికిణీగా ఉపమిస్తూ, పూదోటలో ప్రాకే సింధూర కాంతిని ఆ బాలిక విసిరేసే రంగు రంగు రుమాలతో పోలుస్తూ, ఏటి అలలపై  కొంగల ఎరుపెరుపు వెలుగులు, అదే ఏటిపై బాతుల నీలినీలి నీడలు, వెన్నెల వెండి వెండి తోటలు, ఉప్పొంగిన అస్తమయ హిరణ్య మయూఖ నాకధుని, అణువణువునా అవ్యక్త రసానుభవాన్ని కలిగించే గేయం.

తుమ్మెద వలె ప్రతి శబ్దాన్నీ తీయని మరంద బిందువుగా గ్రోలడమే తెలిసిన ఉన్మత్త  భావుకులు, ఈ గేయంలోని అర్థ తాత్పర్యాలను విడదీసి చెప్పలేక తడబడతారు.

Also read: నా గు ల చ వి తి

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles