Sunday, December 8, 2024

హుజూరాబాద్ లో ఈటల విజయ పతాక

  • హుజూరాబాద్ లో, బద్వేలులో ధరావతు కోల్పోయిన కాంగ్రెస్
  • టీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి
  • బద్వేల్ లో బీజేపీకి గణనీయంగా ఓట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీలు భిన్నమైన ఫలితాలను దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార వై సి పి అభ్యర్థి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తెలంగాణలో టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బిజెపికి మాత్రం రెండు చోట్ల ఫలాలు దక్కాయి. ఆ పార్టీ తెలంగాణలో అభ్యర్థిని గెలిపించుకొని విజయగర్వాన్ని పొందుతోంది.

Also read: భూతాపం అధికమైతే విలయం అనివార్యం

ఆంధ్రప్రదేశ్ లో రవ్వంత మెరుగైన ఓట్లను సాధించుకొని తృప్తి పడుతోంది. ఈ ఫలితాలు ఇలాగే ఉండవచ్చునని ఎక్కువమంది ముందుగానే అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై పెద్దగా ఆశ్చర్య పడక్కర్లేదు కానీ పార్టీలన్నీ ఆలోచించుకోవాల్సిన సందర్భం. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన ఆత్మసమీక్ష చేసుకోవల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ఫలితాలు ఘోరాతిఘోరంగా నమోదయ్యాయి. ఈ ఫలితాలకు పూర్తి బాధ్యత నాదేనని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినా,దానితో సరిపోదు. కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగాలి. ధోరణి మారాలి. ఆత్మపరీక్షలు మరింతగా పెరగాలి.

Also read: ఉక్కు ఉద్యమానికి పవన్ ఊతం ఉపకారమే

ఈటలకు జరిగిన అవమానానికి సమాధానం

తెలంగాణ ఉద్యమంతో, కెసిఆర్ తో, తెలంగాణ రాష్ట్ర సమితితో ఎన్నో ఏళ్ళ అనుబంధం ఎంతో దృఢమైన బంధాన్ని పెనవేసుకున్న ఈటల రాజేందర్ అత్యంత అవమానమైన పరిస్థితుల్లో బర్తరఫ్ కు గురియై, మంత్రిపదవి నుంచి గెంటివేయబడ్డారు. టీ ఆర్ ఎస్ పార్టీ నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆయన సొంతంగా పార్టీని స్థాపిస్తారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ -బిజెపిల మధ్య ఊగిసలాడి చివరికు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. రాజేందర్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వం నుంచి అనేక వేధింపులు ఎదుర్కున్నారు. సొంతంగా పార్టీ పెట్టకుండా, బిజెపిలో చేరడంపై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

Also read: గ్రామాలలో ఐటీ వెలుగులు!

సొంతంగా పార్టీని స్థాపించాలంటే పెద్దస్థాయిలో వనరులు కావాలి. రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కోవాలంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరడమే తెలివైన పనిగా భావించి అందులో చేరారు. చేరడమే కాక, చేరిన అతితక్కువ కాలంలోనే ఒక అసెంబ్లీ సీటును పార్టీకి బహుమతిగా అందించారు. హుజూరాబాద్ లో  విజయం వల్ల ఇటు ఈటలకు -అటు బిజెపికి  ప్రతిష్ఠ పెరిగింది. టి ఆర్ ఎస్ పై గెలుపు సాధించి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నట్లయింది. ఎన్నికల్లో నిలుచున్న ప్రతిసారీ విజయాన్ని దక్కించుకొని, గెలుపుగుర్రంగా పేరుతెచ్చుకున్న ఈటల మరోసారి తన ప్రతిష్ఠను కాపాడుకున్నారు. హుజూరాబాద్ లో బిజెపి గెలుపుకు అనేక కారణాలు ఉన్నాయి.ఈ గెలుపును పలురకాలుగా విశ్లేషించుకోవాలి.ఈ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం,తెలంగాణ ప్రాంత ప్రజలతో ఉన్న సంబంధం,టీ ఆర్ ఎస్ నుంచి గెంటపడి,వేధింపులకు గురికావడం వల్ల వచ్చిన సానుభూతి,బిజెపి ఎం.పి , పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు చెందిన కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉండడం, బండి సంజయ్ మంచి కేడర్ కలిగి వుండడం మొదలైనవి ఈటల రాజేందర్ కు బాగా కలిసివచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు కూడా ఈసారి ఈటలకే పడ్డాయి.ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావు అత్యంత అల్పమైన ఓట్లను దక్కించుకున్నారు.

Also read: కన్నడసీమను విషాదంలో ముంచిన పునీత్

బీజీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు

కాంగ్రెస్ కు చెందిన అగ్రనేతలు, శ్రేణులు రాజేందర్ తో కుమ్మక్కయ్యారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ కు గెలిచేంత పరిస్థితులు లేవు కాబట్టి, రాజేందర్ కు సహకరించి టి ఆర్ ఎస్ అభ్యర్థిని ఓటమి పాలుచేయాలనే వ్యూహంతోనే ఇదంతా జరిగిందనే మాటలు వినపడుతున్నాయి. ఈటల- కాంగ్రెస్ కు చెందిన కీలకమైన అగ్రనేత రహస్యంగా సమావేశమయ్యారని చెప్పుకుంటున్నారు. నిజానిజాలు ఎట్లా ఉన్నా, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బిజెపికి అదనంగా కలిసి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచిన అనుభవం, ప్రజల్లో ఉన్న పట్టు, పోల్ మేనేజ్ మెంట్ పై ఉన్న జ్ఞానం, సామాజిక నేపథ్యం ఈటల రాజేందర్ గెలుపుకు బలమైన భూమికను వేశాయి. హుజూరాబాద్ గెలుపులో వాటా బిజెపి కంటే వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ కే ఎక్కువ పాలు దక్కుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఉభయతారకంగా ఫలితం వచ్చింది.అధికార పార్టీ టీ ఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఎన్నికల్లో విజయాన్ని సాధించలేకపోయినా, ఓట్ల పరంగా మంచి ఫలితాలే వచ్చాయి. సుమారు 83,167 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య వ్యత్యాసం 24,068 ఓట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ కు కేవలం 3,014 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొంచెం మెరుగైన ఫలితాలను కాంగ్రెస్ సాధించుకొని ఉంటే, బిజెపి ఓట్లు తగ్గి, గెలుపు టీ ఆర్ ఎస్ కే దక్కిఉండే దని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలో ఎంతోకొంత నిజం లేకపోలేదు. బిజెపి (51.96)-టి ఆర్ ఎస్ (40.38) మధ్య 10 శాతం ఓటింగ్ తేడాను గమనించవచ్చు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దళితబంధు’ పథకం మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. అందరికీ దక్కివుంటే, టీ ఆర్ ఎస్ పై మంచి ప్రభావాన్ని చూపించి వుండేదని వారు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఓటమి పట్ల ఆయన ఆచితూచి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2023లోనే ఎన్నికలు జరుగనున్నాయి. కేవలం రెండేళ్లు మాత్రమే సమయం వుంది. ఉపఎన్నికలో గెలుపుతో మంచి ఊపు మీదున్న బిజెపి విజయగర్వాన్ని తలకెక్కించుకోకుండా, పార్టీ అభివృద్ధిపై దృష్టి సారిస్తే, వచ్చే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంది. అధికార టీ ఆర్ ఎస్ మరింతగా అప్రమత్తం అవ్వాలి. వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సమయానికి సుమారు పదేళ్ల కాలం పూర్తవుతుంది. ఇప్పటికే పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగానూ అసంతృప్తులు మొదలయ్యాయి. ఈ రెండేళ్లల్లో మరింతగా పెరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకత ( యాంటి ఇంకంబన్సీ ) ప్రభావం తప్పకుండా ఉంటుంది. దాని శాతం ఈ రెండేళ్ల పాలన, ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇక కాంగ్రెస్ లో పూర్తిస్థాయి ప్రక్షాళనలు జరగాలి.

Also read: రసకందాయంలో పంజాబ్ ఎన్నికల రంగం

బద్వేలులో అందరూ ఊహించిన ఫలితమే

ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వై సీ పీ ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం అందరూ ముందుగా ఊహించనే అంశమే. 90వేలకు పైగా మెజారిటీని దక్కించుకుంది. బిజెపికి 21,661 ఓట్లు లభించడం ఆ పార్టీకి మంచి పరిణామామే. కాంగ్రెస్ ఇప్పుడప్పుడే బాగుపడేట్లు లేదని నేటి ఫలితాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ఈ ఎన్నికలో తెలుగుదేశం,జనసేన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టలేదు. ఎన్నికల్లో ఎలాగూ గెలిచే అవకాశం లేదని టిడిపి ఈ నిర్ణయం తీసుకోవడం వ్యూహంలో భాగమే. బిజెపి గెలుపుకు వెనకాల నిలబడి సహకారాన్ని అందిస్తామని జనసేన మొదటి నుంచి అంటోంది. అది కూడా ఆ పార్టీ వ్యూహంలో భాగమే అయినప్పటికీ, తన స్థాయిని మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉంది. దానిని విస్మరించినట్లే లెక్క. నిజానిజాలు ఎట్లా ఉన్నాబద్వేలులో బిజెపికి ఈ మాత్రం ఓట్లు దక్కాయంటే, దానికి కారణం టీడీపీ వెనకాల ఉండి నడిపించడమే అనే విమర్శలు కూడా వస్తున్నాయి. వై సీ పీ అభ్యర్థి దాసరి సుధ గెలుపులో, పార్టీ బలంతో పాటు సానుభూతి కూడా పనిచేసిందంటున్నారు. గతంలో ఇదే పార్టీ నుంచి  ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. దానితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ స్థానాన్ని ఆయన భార్య సుధకు కేటాయించడంతో గెలుపు మరింత సులభమైంది. సాధారణంగా ఉపఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుస్తారు. ఈసారి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార వై సీ పీ విజయాన్ని సాధించింది. తెలంగాణలో అధికార టీ ఆర్ ఎస్ ఓటమిని చవిచూచింది. ఏది ఏమైనా, ఓటరు నాడిని పూర్తిగా పసికట్టడం జరిగేపని కాదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఎప్పుడూ ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదే గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. శాశ్వతమైన గెలుపు ఎవ్వరి సొత్తు కాదు.

Also read: ఇంటి నుంచి ఐటీ పనికి త్వరలో స్వస్తి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles