Thursday, April 25, 2024

సమతాభావన అత్యంత కీలకం: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

హైదరాబాద్ : శ్రీరామానుచార్య సహస్రాబ్ది కార్యక్రమంలో ఆదివారంనాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. సమతామూర్తి దర్శనం చేసుకున్నారు. చినజీయర్ స్వామి, రామేశ్వరరావు, తదితరులు స్వాగతం చెప్పారు. అక్కడ రాష్ట్రపతి చేసిన ప్రసంగం పూర్తి పాఠం ఇది:

జై శ్రీమన్నారాయణ

శ్రీమతే నారాయణాయ నమ:

శ్రీమతే రామానుజాయ నమ:

వైభవోపేతమైన భారతదేశ చరిత్రలో భక్తి, సమతాభావన పాత్ర అత్యంత కీలకం. భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహన పావన సందర్భంగా దేశ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా శ్రీ రామానుజుల వారి భక్తులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం, భగవద్రామానుజాచార్యుల విగ్రహావిష్కరణలో పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి 5న వసంత పంచమి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ రామానుజాచార్యుల భవ్యమైన సమతా ప్రతిమను జాతికి అంకితం చేశారు. ఇక్కడ 035 హోమగుండాలతో శ్రీ లక్ష్మీ-నారాయణ మహాయజ్ఞం, 108 మందిరాల్లోని విగ్రహాలకు ప్రాణప్రతిష్ట ద్వారా ఈ క్షేత్రానికి విశేషమైన ఆధ్యాత్మిక శక్తి వచ్చింది. ఈ శక్తి నిరంతరం ఇక్కడి ప్రత్యేకతగా నిలిచిపోతుంది. ఈ క్షేత్రానికి శ్రీరామ నగర్ గా పేరు పెట్టడం కూడా ఓ ప్రత్యేకతే. మన దేశం భక్తి భూమి, సమతా భూమి, విశిష్టమైన దైవదర్శన భూమి వీటన్నింటికీ కలుపుకుంటే మన భారతదేశం సంస్కారవంతమైన భూమి.

పావనమైన భరతగడ్డపై నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విశిష్టమైన సాంస్కృతిక వైవిధ్యతను గమనించవచ్చు. గోదావరి నది ప్రవహిస్తుండటం ద్వారా ఈ తెలంగాణ ప్రాంతం నా దృష్టిలో విశేషమైన మహత్వాన్ని కలిగిఉంది.

కానీ నేటి ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ఆధ్యాత్మిక, సామాజిక పరంపరలోని ఓ ప్రత్యేకమైన అధ్యాయంలో భాగస్వామ్యం అయ్యే మహోన్నతమైన అవకాశం నాకు కలిగింది. ‘భూయశ్చ శరద: శతాత్’.. అంటే వందకంటే  ఎక్కువ సంవత్సరాలపాటు నిలిచి ఉండాలనే శుభసంకల్పం, శ్రీ రామానుజాచార్యుల వారి జీవనాన్ని సార్థకం చేసింది. వందేళ్లకు మించిన వారి జీవనయాత్ర సందర్భంగా స్వామీజీ భారతదేశ ఆధ్యాత్మిక, సామాజిక స్వరూపానికి వైభవాన్నందించారు. ప్రజల్లో భక్తి, సమానత భావాలను పెంపొందించేందుకు శ్రీ స్వామీజీ స్వయంగా శ్రీరంగం, కాంచీపురం, తిరుపతి, సింహాచలం, ఆంధ్రప్రదేశ్ లోని విభిన్న క్షేత్రాల్లో పూరి జగన్నాథ్, బద్రీనాథ్, నైమిష్యారణ్యం, ద్వారక, ప్రయాగ్, మధుర, అయోధ్య, గయ, పుష్కర్, నేపాల్ లోని ముక్తినాథ్ వరకు ప్రయాణించారు.

ప్రియమైన సోదర, సోదరీమణులారా,

శ్రీ రామానుజాచార్యుల విశిష్ట అద్వైతం భారతదేశ తాత్విక చింతనతోపాటు ప్రజల దైనందిన జీవితాల్లో అనుసరించాల్సిన పద్ధతులను నేర్పించారు. విదేశాల్లో దీన్ని తత్వంగా చెబుతారు. మేధావులకు మాత్రమే దీన్ని పరిమితం చేసిన ఘనత పాశ్చాత్య దేశాలవారిది. కానీ మనం దాన్ని ‘దర్శనం’గా చూస్తాం. ఇదేదో మనసుకు తోచింది మాట్లాడటం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా చూస్తాం. మనం ఎలా దానితో కలిసి జీవిస్తాం అనే విషయాన్ని మన ‘దర్శనం’ మనకు బోధిస్తుంది. ఇప్పటికీ మన దేశంలో దీన్ని మనం గమనిస్తున్నా. ఇందుకుగానూ శ్రీ రామానుజాచార్యుల మంటి సాధు-సంతులు, తత్వవేత్తలు పోషించిన పాత్రను మనం గుర్తుంచుకోవాలి.

సోదర, సోదరీమణులారా,

శ్రీ రామానుజాచార్యుల వారు దక్షిణ భారతంలో సమృద్ధమైన భక్తి పరంపరను మరీ ముఖ్యంగా అళ్వార్ల పరంపరను ముందుకు తీసుకెళ్లారు. అళ్వార్లలో ఎక్కువమంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారనే విషయం మీ అందరికీ తెలిసిందే. శ్రీ రామానుజాచార్యుల వారు వెనుకబడిన వర్గాలకు చెందిన 53 మంది అళ్వార్ సంతులు చేసిన రచనలను వైష్ణవుల వేదాలుగా గౌరవాన్ని కల్పించారు.

వెనుకబడిన వర్గాల వారికి వైష్ణవ ధర్మం లోకి శ్రీ రామానుజాచార్యుల వారే ద్వారాలు తెరిచారు. భక్తిభావనకు జాతి భేదాలుండకూడదని, భగవంతుడిని పూజించే అధికారం అందరికీ సమానంగా ఉండాలనేది వారి భావన. ఈశ్వరారాధనకు పురోహితుడే అయి ఉండాలనే అవసరం లేదని వారు ఉద్భోదించారు. నాటి పరిస్థితుల ప్రకారం సమాజంలో ఉన్న భావనలను గౌరవిస్తూనే సమాజంలో అందరికీ సమానమైన అర్హతలుండాలని సూచించారు. వేదాంతంలోని భావనలకు భక్తిరసాన్ని జోడించిన సమాజాన్ని ఏకం చేసేందుకు ఎంతగానో కృషిచేశారు. అందరి హృదయాలను ఏకం చేసే పనిచేశారు. సర్వస్వాన్ని త్యాగం చేసి అందరూ భగవంతుడి మీదనే దృష్టి కేంద్రీకరించేలా అందరికీ మార్గదర్శనం చేశారు. ఈ భక్తిభావనకు ‘ప్రపత్తి’ అని నామకరణం చేశారు. భక్తి ద్వారా ముక్తిమార్గ సాధనకు మార్గం చూపించారు.

ప్రియమైన సోదర, సోదరీమణులారా,

శ్రీ రామానుజాచార్యుల వంటి సాధు, సంతులు, తత్వవేత్తలు ఎంతోమంది భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, సాంస్కృతిక ఐకమత్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. జాతీయవాద సాంస్కృతిక విలువలకు ప్రాణంపోశారు. పాశ్చాత్యులు నిర్వచించే విధంగా కాకుండా భారతదేశ విలువల ఆధారిత వ్యవస్థ పూర్తి భిన్నమైంది. పురాణాల కాలం నుంచి భక్తి సంప్రదాయం భారతదేశాన్ని ఒకే తాటిపై నడిపిస్తోంది. దీన్ని శ్రీ రామానుజాచార్యుల వంటి మహనీయులు భక్తి ఉద్యమాల ద్వారా సాకారం చేశారు. తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం నుంచి ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వరకు ఇలాంటి మహనీయుల స్ఫూర్తి సమాజాన్ని ముందుండి నడిపింది. అందుకే శతాబ్దాలుగా భక్తి అనే ఈ భావోద్వేగ ఐకమత్యానికి మార్గదర్శనం చేస్తోంది.

సోదర సోదరీమణులారా,

భారతదేశంలో భక్తి పారవశ్యం దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తోంది.. అందుకోసం ఉత్తరభారత దేశంలో నివసించే సాధువుల సమాజం శ్రీ రామానుజార్యుల వంటి దక్షిణ భారత దేశానికి చెందిన సాధు సన్యాసులకు సదా కృతజ్ఞతలు తెలియజేసింది.   ఉత్తర భారతదేశంలోని భక్తులలో ఒక దోహా ప్రాచుర్యంలో ఉన్నది.

“భక్తి ద్రావిడ్ ఉప్ జీ, లాయె రామానంద్

పర్ గట్ కియో కబీర్ నే, సాత్ ద్వీప్ నవ్ ఖండ్”

ఈ భక్తి ప్రవాహం దక్షిణ భారత దేశంలో ఆళ్వారు సన్యాసులు, శ్రీ రామానుజాచార్యుల పరంపరలో ఉద్భవించింది.  దానిని స్వామి రామానంద్ ఉత్తర భారత దేశానికి తీసుకుని వచ్చారు.  వారి శిష్యులైన, సంత్ కబీర్ జంబూ ద్వీపం తో పాటు  ఏడు ద్వీపాలు, భారత ఖండంతో సహా తొమ్మిది ఖండాలలో  అంటే  యావత్ భారత దేశం లో ఈ భక్తి జ్ఞాన కాంతులను వ్యాపింపజేశారు.  కబీర్, రైదాస్,దాదూ, దయాళ్ మరియు పీపా వంటి సాధువులకు స్వామి రామానంద్ భక్తి మార్గాన్ని చూపించారు.  పైన తెలిపిన స్వామి రామానంద్ శిష్యులందరు వెనుకబడిన జాతులకు చెందినవారు .  శతాబ్దాల క్రితం నాటి ఈ ఉదాహరణలో భారత దేశపు సమానత్వభావన అనే చైతన్యం  విరాజిల్లుతోంది.  ఈ విధంగా శ్రీ రామానుజాచార్యుల వారి భక్తి ,సమానత్వభావనలు  అందరినీ ఒక తాటి పైకి తీసుకుని వచ్చాయి.

మన సాంప్రదాయం లో సమానత్వ  భావననే  జ్ఞానానికి మూలాధారం గా భావిస్తారు.  “పండితాః సమదర్శినః” అని  భగవద్గీత  5వ అధ్యాయం లో చెప్పిన శ్లోకానికి అర్ధం  జ్ఞానులైన వారు సర్వప్రాణులను సమదృష్టి తోచూస్తారు.  అటువంటి సమదృష్టి కలిగి ఉండటమే శ్రీ రామానుజాచార్యుల వారి ప్రత్యేకత . 

సోదర సోదరీమణులారా..

నిన్న నేను మహారాష్ట్ర లోని డా. భీంరావ్  అంబేడ్కర్ వారి స్వగ్రామానికి వెళ్ళాను.  ఈరోజు నేను ఈ పరమ  పవిత్రమైన కార్యక్రమానికి హాజరైయ్యాను.  బాబా సాహెబ్ కుటుంబం కబీర్ మార్గాన్ని అనుసరించారు.  మహారాష్ట్ర లో రత్నగిరి జిల్లాలోని  బాబా సాహెబ్ గారి కుగ్రామం ఆంబడవే అలాగే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో ఉన్న ఈ ప్రదేశం, శ్రీ రామ్ నగర్ ,  శ్రీ రామానుజాచార్యులు, సంత్ కబీర్ పరంపరతో ముడిపడి ఉంది. సమసమానత్వానికి  ఆధారమైన భక్తి అనే ఆదర్శాన్ని స్మరింపజేసే  ఈ రెండు ప్రదేశాలు నాకు పవిత్ర పుణ్య  క్షేత్రాలు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles