Tuesday, April 23, 2024

చెన్నైటెస్టు తొలిరోజున ఇంగ్లండ్ షో

  • బ్యాటింగ్ పిచ్ పై చెమటోడ్చిన భారత బౌలర్లు
  • శతటెస్టులో శతకం బాదిన జో రూట్

భారత్ తో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ కు ఇంగ్లండ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైన తొలిటెస్టు లో టాస్ నెగ్గడం ద్వారా శుభారంభం చేసిన ఇంగ్లండ్ తొలిరోజు ఆటను సైతం భారీస్కోరుతో ముగించింది. కెప్టెన్ జో రూట్ 128 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ 3 వికెట్లకు 268 పరుగులతో 500 స్కోరుకు మార్గం సుగమం చేసుకొంది.

కీలక టాస్ నెగ్గిన ఇంగ్లండ్ :

అంతకుముందు కీలక టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మరోఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొన్నాడు. భారతజట్టు మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ స్టాండ్ బైగా ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షా బాజ్ నదీమ్ ను తుదిజట్టులోకి తీసుకొంది. తమిళనాడు స్పిన్ ఆల్ రౌండర్ల జోడీ రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ లకు సైతం స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో స్ధానం కల్పించింది. మరోవైపు డోమనిక్ సిబ్లే- రోరీ బర్న్స్ మొదటి వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. అయితే …బర్న్స్ ను అశ్విన్, వన్ డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ ను బుమ్రా పడగొట్టడంతో ఇంగ్లండ్ 63 పరుగులకే రెండు ప్రధాన వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.
లారెన్స్ అవుట్ కావడంతోనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కమ్ 100వ టెస్టు హీరో జో రూట్ మరో ఓపెనర్ సిబ్లేతో కలసి భారత బౌలింగ్ ఎటాక్ ను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరూ ఆత్మవిశ్వాసంతో ఆడుతు తమతమ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. సిబ్లే ఆచితూచి ఆడూతూ భారత బౌలర్లను నిలువరిస్తుంటే…రూట్ మాత్రం తనదైన స్టయిల్లో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు.

తేలిపోయిన భారత బౌలర్లు :

బుమ్రా, ఇశాంత్, అశ్విన్, నదీమ్, సుందర్ లతో కూడిన భారత బౌలింగ్ పిచ్ నుంచి మద్దతు లేకపోడంతో తేలిపోయారు. తమ అమ్ములపొదిలోని అస్త్రాలన్నింటినీ ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది. తన కెరియర్ లో 100వ టె్స్టుమ్యాచ్ ఆడుతున్న రూట్ మొత్తం 164 బాల్స్ ఎదుర్కొని 12 బౌండ్రీలతో మూడంకెల స్కోరు నమోదు చేశాడు.వందో టెస్టు ఆడుతూ సెంచరీ సాధించిన 9వ క్రికెటర్ గా, మూడో ఇంగ్లీష్ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. ఆసియా ఉపఖండ దేశాల పిచ్ ల పైన జో రూట్ కు ఇది 5వ శతకం కాగా చెపాక్ వేదికగా తొలి సెంచరీ మాత్రమే. ఆట రెండో సెషన్ లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రూట్-సిబ్లేల భాగస్వామ్యాన్ని ఎలా విడతీయాలో అర్థంకాక భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ అయోమయంలో చిక్కుకొన్నాడు.

రికార్డు భాగస్వామ్యం :

జో రూట్- డోమనిక్ సిబ్లే మూడో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో భారతగడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఓ ఇంగ్లండ్ జోడీ భారత పర్యటనలో సాధించిన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఆట ఆఖరి సెషన్ ఆఖరి ఓవర్లో సిబ్లేను బుమ్రా పడగొట్టడంతో 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సిబ్లే 286 బాల్స్ ఎదుర్కొని 12 బౌండ్రీలతో 87 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. కెప్టెన్ జో రూట్ మాత్రం 197 బాల్స్ లో 14 బౌండ్రీలు, 1 సిక్సర్ తో 128 పరుగుల స్కోరుతో అజేయంగా నిలవడంతో తొలిరోజుఆట ముగిసింది. రెండోరోజుఆటలో రూట్ ను సాధ్యమైనంత త్వరగా పెవీలియన్ కు భారత్ సాగనంపక పోతే కష్టాలు కొని తెచ్చుకొన్నట్లే అవుతుంది. ఇంగ్లండ్ మాత్రం 500కు పైగా స్కోరు సాధించడమే లక్ష్యంగా రెండోరోజుఆటను కొనసాగించనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles