Tuesday, April 23, 2024

ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డం.. తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్

  • పంజాబ్ తరహాలో మొత్తం వరిధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలి
  • పీకేతో నాది ఏడేళ్ళ స్నేహం, అతణ్ణి చూసి ఎందుకు భయపడతారు?

ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ‘‘ఇన్‌కం ట్యాక్స్, ఈడీ దాడులు చేస్తార‌ని గ‌త రెండు, మూడు రోజుల నుంచి యూట్యూబ్‌లో ప్ర‌చారం చేస్తున్నారు. ఈడీ కాక‌పోతో బోడీ దాడులు చేయ‌మ‌ను.. ఎవ‌రు వ‌ద్దంటున్నారు. ఎవ‌డు భ‌య‌ప‌డుతారు. కేసీఆర్ ఈ బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు భ‌య‌ప‌డుతాడా? ఈడీల‌కు, బోడీల‌కు, ఇన్‌కం ట్యాక్స్‌ల‌కు భ‌య‌ప‌డితే 15 ఏండ్లు తెలంగాణ ఉద్య‌మం చేద్దుమా? మేమా భ‌య‌ప‌డేది? ఈడీ దాడుల‌ని, సీబీఐ దాడుల‌ని బెదిరిస్తే కేసీఆర్ భ‌య‌ప‌డుతాడా? ఇలాంటి ప‌నులు అన్ని చోట్ల వ‌ర్క‌వుట్ కావు. భ‌యంక‌రంగా స్కామ్‌లు చేసేవాళ్లు భ‌య‌ప‌డుతారు. మేం భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు. పిట్ట బెదిరింపుల‌కు, ఈడీ, బోడీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు’’ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

చిన్న జీయర్ తో విభేదాలు లేవు

చిన‌జీయ‌ర్ స్వామితో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు.తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతుల‌ను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాల‌ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంట‌లు కొనేలా ఉద్య‌మిద్దామ‌ని చెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌లు కీల‌క విష‌యాల‌పై కేసీఆర్ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జ‌రుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజ‌ర‌య్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజర‌య్యారు.

మోదీ ప్ర‌భుత్వం విఫ‌లం

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప‌క్ష‌పాత వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని నిప్పులు చెరిగారు సిఎం  కేసీఆర్. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో విఫ‌ల‌మైంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. విభ‌జ‌న చ‌ట్టం హామీల‌ను అమ‌లు చేయ‌డంలో మోదీ స‌ర్కార్ విఫ‌ల‌మైందని స్పష్టంగా చెప్పారు. రైతు వేసే ప్ర‌తి గింజ‌కు కేంద్రం గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం ఏ వర్గాన్ని సంతృప్తి పరచటం లేదని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. 24, 25 తేదీల్లో రైతుల‌కు మ‌ద్ద‌తుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌న్నారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా త‌ర‌లిరావాల‌ని సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు త‌లెత్త‌కుండా ష‌బ్ క‌మిటీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు.

దేశానికి కావాల్సింది క‌శ్మీర్ ఫైల్స్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైల్స్

Kashmir Files: Vivek Agnihotri's film exposes India's new fault lines - BBC  News
కశ్మీర్ ఫైల్స్ సినిమా

ఇటీవ‌ల విడుద‌లైన క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. దేశానికి కావాల్సింది క‌శ్మీర్‌ ఫైల్స్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైల్స్ కావాల‌న్నారు. దేశంలో స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే ఈ సినిమాను విడుద‌ల చేశార‌ని మండిప‌డ్డారు.కేంద్రం క‌శ్మీర్ ఫైల్ సినిమాను వ‌దిలిపెట్టి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో చొర‌వ చూపాల‌న్నారు. క‌శ్మీర్‌లో హిందూ పండిట్‌ల‌ను చంపిన‌ప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డానికే క‌శ్మీర్ ఫైల్ సినిమాను ముందుకు తెచ్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి కశ్మీర్ ఫైల్స్ ని ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం జ‌రుగుతోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.న్న‌, ఈరోజు చూస్తున్నాం.. సోష‌ల్ మీడియా ద్వారా విష ప్ర‌చారం చేస్తున్నారు. అవాంఛ‌నీయ‌మైన, అనారోగ్య‌క‌ర‌మైన‌ ఏ ర‌కంగా కూడా ఆహ్వానించత‌గ‌న‌టువంటి.. క‌శ్మీర్ ఫైల్స్ అనే సినిమాను తీసుకొచ్చారు. ఏదైనా ప్రొగెషివ్ గ‌వ‌ర్న‌మెంట్ ఉంటే ఇరిగేష‌న్, ఇండ‌స్ట్రీయ‌ల్, ఎక‌నామిక్ ఫైల్స్ తీసుకురావాలి. క‌శ్మీర్ ఫైల్స్ తో వ‌చ్చేది లేదు. పోయేది లేదు. దీనిపై క‌శ్మీర్ పండిట్లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆ వీడియోలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయి. ఈ ర‌క‌మైనటువంటి దేశ విభ‌జ‌న, ప్ర‌జ‌ల విభ‌జ‌న స‌రికాదు. తెలంగాణ స‌మాజానికి అస‌లు జీర్ణం కాద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఉద్య‌మం ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉధృతంగా చేశాం. స‌క‌ల జ‌నుల స‌మ్మె అనే పిలుపునిచ్చాం. కానీ హిందువుల స‌మ్మె, క్రైస్త‌వుల స‌మ్మె, ముస్లింల స‌మ్మె అని పిలుపు ఇవ్వ‌లేద‌ని కేసీఆర్ గుర్తు చేశారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెలువులు ఇచ్చి క‌శ్మీర్ ఫైల్స్ సినిమాను చూడ‌మ‌న్నారు. ఈ దేశం ఎటు వైపు పోతోంది. ఇదేం విభ‌జ‌న రాజ‌కీయం. ఈ దేశాన్ని ఎక్క‌డికి తీసుకెళ్తున్నారు. ఒక మంచి వాతావ‌రణాన్ని పాడు చేస్తున్నారు. దేశం నుంచి 5 ల‌క్ష‌ల కోట్ల సాప్ట్ వేర్ ఎగుమ‌తులు ఉన్నాయి. ఈ విభ‌జ‌న రాజ‌కీయాల వ‌ల్ల అనేక ఇబ్బందులు వ‌స్తాయ‌న్నారు. ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త బ‌య‌ట‌ప‌డింది. క‌రోనాను అరిక‌ట్ట‌డంలో కేంద్రం ఘోరంగా విఫ‌ల‌మైంది. కోట్ల మందిని వేల కిలోమీట‌ర్ల న‌డిపించిన ఘ‌న‌త బీజేపీ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంది. క‌నీసం రైళ్ల‌ను కూడా క‌ల్పించ‌లేదు. అద్భుత‌మైన గంగా న‌దిలో వంద‌ల‌, వేల శ‌వాలు తేలేట‌ట్టు చేసింది ఈ ప్ర‌భుత్వం. ఈ స‌త్యాల‌ను దాచ‌లేరని కేసీఆర్ పేర్కొన్నారు.

ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌లో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాలి

ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌లో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండిన పండ‌బోయే యాసంగి వ‌రి ధాన్యాన్ని పంజాబ్ త‌ర‌హాలో కేంద్రంలో కొనుగోలు చేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏక‌గ్రీవంగా తీర్మానించాం. రేపు మంత్రుల బృందం, ఎంపీలు పార్ల‌మెంట్‌కు వెళ్లి, ఆహార మంత్రిని తెలంగాణ రైతుల ప‌క్షాన క‌లుస్తారు. కేంద్రం సూచ‌న మేర‌కు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచ‌న మేర‌కు రైతులు పంట‌ల మార్పిడి చేశారు. గ‌తంలో 55 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంట ఉండే. ఈ సారి 35 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఉంద‌న్నారు. దీంట్లో 3 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సీడ్ కోసం వ‌రిని ఉత్ప‌త్తి చేశారు. మ‌రొక రెండున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల్లో తిన‌డానికి వాడుకుంటారు. 30 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పండించిన వ‌రి అమ్మాల్సి ఉంటుంది. పంట మార్పిడి కింద వ‌రి ఉత్ప‌త్తిని త‌గ్గించగ‌లిగామ‌ని కేసీఆర్ తెలిపారు.ప్ర‌పంచ వ్యాప్తంగా ఆహార రంగంలో అన్ని దేశాలు కూడా స్వాలంబ‌న ఉండాల‌ని కోరుకుంటాయి. భార‌త‌దేశంలో కూడా ఫుడ్ సెక్టార్ ముఖ్య‌మైంది కాబ‌ట్టి.. ప్ర‌పంచ జ‌నాభాలో భార‌త్ రెండో స్థానంలో ఉంది. ఈ క్ర‌మంలో దేశంలో ఆహార కొర‌త రాకుండా ఉండేందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారు. ఈ క్ర‌మంలో కేంద్రం ధాన్యం సేక‌రించి, నిల్వ చేయాలి. కొన్ని సంద‌ర్భాల్లో ఒక వేళ ఎక్కువ పంట మొత్తంలో వ‌స్తే.. కేంద్ర‌మే భ‌రించి సేక‌రించాలి. ఆ బాధ్య‌త నుంచి కేంద్రం త‌ప్పించుకోకూడ‌దు. కేంద్రాన్ని స్ప‌ష్టంగా డిమాండ్ చేస్తున్నాం. వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ మాదిరిగానే వ‌న్ నేష‌న్ వ‌న్ ప్రొక్యూర్‌మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేక‌ర‌ణ విష‌యంలో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాలి. పంజాబ్‌కు ఒక నీతి, గుజ‌రాత్‌కు ఒక నీతి, తెలంగాణ‌కు ఒక నీతి ఉండ‌దు. ఇది రైతుల యొక్క జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌.. ఆ పంట సేక‌రించే విష‌యంలో ఇబ్బంది పెట్టొద్దు. కొన్ని రాష్ట్రాలు ఉద్య‌మించాయి కాబ‌ట్టి.. 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశాయ‌ని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పెట్టుకోవ‌ద్దు.. మోదీకి కేసీఆర్ హెచ్చ‌రిక‌

తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పెట్టుకోవ‌ద్దు అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ముఖ్య‌మంత్రి కేసీఆర్ హెచ్చ‌రించారు. ఒక వేళ తెలంగాణ‌తో పెట్టుకుంటే మీరే భంగ‌ప‌డుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ప్ర‌ధాని మోదీకి చేతులెత్తి న‌మ‌స్క‌రించి విన‌య‌పూర్వ‌కంగా విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. తెలంగాణ‌ను క‌దిలించ‌కండి.. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పెట్టుకోవ‌ద్దు. మేం ఉద్య‌మ వీరులం. ఉద్య‌మం చేస్తాం. మిమ్మ‌ల్ని వ‌దిలిపెట్టేది లేదు. మీరే భంగ‌ప‌డుతారు. పంజాబ్‌కు అవలంభించిన విధానాన్నే మాకు అవ‌లంభించండి. మేం కోరేది గొంతెమ్మ కోర్కె కాదు. పండించిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధ‌ర‌కు సేక‌రించిండి. మీరే మిల్లింగ్ చేసుకోండి.. పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తాం. పంజాబ్‌లో కొన్న‌ట్టే మా ధాన్యం కొని డ‌బ్బులు ఇచ్చేయ్. దేశ ఆహార భ‌ద్ర‌త విష‌యంలో రాజ్యాంగ బ‌ద్ధ‌మైన విధిని కేంద్రం నెర‌వేర్చాలి. దీన్ని నుంచి కేంద్రం త‌ప్పించుకోవ‌ద్దని కేసీఆర్ సూచించారు.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది. ఆ విధంగానే రేపు పొద్దున క‌రువు కాటకం వ‌స్తే అన్నం పెట్టే స్థితిలో ఉండాలి. ఏ దేశానికి కూడా ఇండియాకు వారం రోజులు అన్నం పెట్టే స్థితి లేదు. ఈ క్ర‌మంలో ధాన్యం సేక‌రించి నిల్వ చేయాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రైతులు పండించిన ధాన్యాన్ని సేక‌రించాలి. మేం అడిగేది భార‌త రైతుల కోస‌మే.. పాకిస్తాన్, అమెరికా రైతుల కోసం కాదని కేసీఆర్ చెప్పారు.

దేశాన్ని పంట‌ల కాల‌నీలుగా విభ‌జించండి. ఇది ప్ర‌జాస్వామ్యం.. పోరాడే, అడిగే హ‌క్కులుంటాయి. పంజాబ్‌, హ‌ర్యానా మాదిరిగానే వంద శాతం కొనుగోలు చేయాలి. దేశమంతా ఒకే పాల‌సీ ఉండాల‌ని కోరుతున్నాం. అట్ల చేయ‌ని ప‌క్షంలో అనేక పోరాట రూపాల్లో ఉద్య‌మం చేస్తాం. అవ‌స‌ర‌మైతే కేబినెట్ అంతా వెళ్లి తీవ్ర‌మైన నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతాం. కిసాన్ నాయ‌కులు కూడా త‌మ‌కు మ‌ద్ద‌తు తెలుపుతామ‌న్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల‌కు రాజ్యాంగ ర‌క్ష‌ణ లేదు. రైతుల‌కు రాజ్యాంగ ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

మీకెవ‌రికీ తెలియ‌దు..ప్ర‌శాంత్ కిషోర్ డ‌బ్బులు తీసుకుని ప‌నిచేయ‌డు

Prashant Kishor was good, but I-PAC interfered too much, says TMC leader -  Elections News
ప్రశాంత్ కిషోర్

ముఖ్య‌మంత్రి కెసీఆర్ ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘‘మీకెవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న డ‌బ్బులు తీసుకుని ప‌నిచేయ‌డు. ఎవ‌రి ద‌గ్గ‌ర అయినా డ‌బ్బులు తీసుకుని ప‌నిచేసిన‌ట్లు ఆధారాలు ఉన్నాయా? చూపించ‌గ‌ల‌రా?’’ అని ప్ర‌శ్నించారు.  ప్ర‌శాంత్ కిషోర్ ను చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని..ఆయ‌న అంటే ఎందుకు భ‌యం అని ప్ర‌శ్నించారు. దేశంలో ప‌రివ‌ర్త‌న కోసం ప్ర‌శాంత్ కిషోర్ తో క‌ల‌సి ప‌నిచేస్తాన‌న్నారు. ‘‘మీకు తెలుసా? ఏడేళ్లుగా నాకు ప్ర‌శాంత్ కిషోర్ స్నేహితుడు’’ అని కెసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ఎల్పీ అనంత‌రం కెసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఆరునూరైనా ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లం.. 105 స్థానాలు ఖాయం

రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. ఆరునూరైనా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే ప‌రిస్థితి లేద‌ని కేసీఆర్ తేల్చిచెప్పారు. గ‌తంలో ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప‌రిస్థితి ఉండే. మేం ప్రారంభించిన ప్రాజెక్టులు, ప‌నులు మేం చేయాల్సి ఉండే. కాబ‌ట్టి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి 88 సీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేదు. పాల‌మూరు, సీతారామ పూర్తి కావాలి. తెలంగాణ‌కు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల పెట్టుబడులు రావాల్సిన అవ‌స‌రం ఉంది. బ‌జార్లో అరిచే వ్య‌క్తుల గురించి మాట్లాడ‌ను. కేసీఆర్ ఎప్పుడు మోసం చేయ‌డు.. ఏం చెప్పినామో అదే చేస్తాం. తొలిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు, ఇప్పుడు 95-105 సీట్ల మ‌ధ్య గెలుస్తాం. 25 రోజుల త‌ర్వాత ఒక రిపోర్ట్ ఇస్తాను.. దాని చూస్తే మీరే ఆశ్చ‌ర్య ప‌డుతారు. నిన్న‌నే ఒక లేటెస్ట్ రిపోర్టు వ‌చ్చింది. 30 స్థానాల్లో స‌ర్వే చేస్తే 29 స్థానాల్లో మేం గెలుస్తామ‌ని రిపోర్టులో వ‌చ్చింద‌ని కేసీఆర్ తెలిపారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles