Wednesday, April 24, 2024

ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా మధ్య పోటీ

  • గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రతిపక్షాల సన్నాహాలు
  • నితీష్ కుమార్ మద్దతుపైన ఆధారపడిన పోటీ తీవ్రత

జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధికార, ప్రతిపక్ష అభ్యర్థుల పేర్లు వెల్లడైనాయి. ఎన్ డీఏ తరఫున ఒడిషాకు చెందిన ఆదివాసీ రాజకీయవేత్త ద్రౌపది మున్రు, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా నిలబెట్టిన కేంద్రమాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలు పోటీ పడనున్నారు. చివరి క్షణంలో జనతాదళ్ (యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికార భాగస్వామి బీజేపీకి ప్రతికూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకుంటే పోటీ కొంత ఆసక్తికరంగా మారుతుంది. లేకపోతే ద్రౌపది పని నల్లేరు మీద బండి చందంగానే ఉంటుంది. బీజేపీకి స్వయంగా ఉన్న సంఖ్యాబలానికి తోడు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ సీపీ తో పాటు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ కూడా అధికార కూటమి అభ్యర్థిని బలపర్చుతున్నాయి.

ఉద్యోగాల తర్వాత రాజకీయ రంగం, చివరిలో గవర్నర్ పదవి

ద్రౌపది ముర్ము కార్పొరేటర్ గా రాజకీయ జీవితం ప్రారంభించి జార్ఖండ్ గవర్నర్ గా అయిదేళ్ళకాలం పని చేశారు. సంతాల్ తెగకు చెందిన ఈ ఆదివాసీ. ఈ సారి రాష్రపతి అభ్యర్థి తూర్పుభారతం నుంచి ఉండాలనీ, మహిళ కావాలనీ, ఆదివాసీ కావాలనీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. 64 ఏళ్ళ ముర్ము విద్యారంగంలో ఉపాధ్యాయురాలిగా చాలాకాలం పని చేశారు. రెండు విడతల శాసనసభ్యులుగా పని చేశారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలో బీజేడీ-బీజేపీ సంకీర్ణమంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు. ఒడిశాలోని మయూర్ భంజ్ లో జన్మించిన ముర్ము భువనేశ్వర్ లోని రమాదేవి విమెన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. శ్రీఅరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారు. అనంతరం ఒడిషా ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. 2000లలోనూ, 2004లోనూ శాసనసభకు ఎన్నికైనారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులైనారు.

తొలి ఆదివాసీ, మలి మహిళ

ఎన్నికైతే ద్రౌపది రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీ అవుతారు. రెండో మహిళ అవుతారు. అంతకు ముందు ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా వ్యవహరించారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వడం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదానికి అనుగుణంగా ఉన్నదని ద్రౌపది వ్యాఖ్యానించారు. ‘‘చాలా మంది పేర్లను పరిశీలించారు.వారిలో నా పేరు కూడా ఒకటి. వారిలో ఎవరైనా రాష్రపతిగా దేశానికి సేవలు చేసేవారే.  నా పేరు ప్రకటించడం నాకు ఆశ్చర్యం కలిగించింది,’’ అంటూ చెప్పారు. బీజూ జనతాదళ్ తనను సమర్థిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ‘‘నిజానికి నాకు బీజేడీ ఓట్లు పొందే హక్కు ఉంది. నేను ఒడిషా  కూతురినీ, కోడలిని కూడా,’’ అని ద్రౌపది వ్యాఖ్యానించారు. ఎన్ డీఏ అభ్యర్థిగాతన పేరు ప్రకటించిన వెంటనే తనకు అలవాటైన శివాలయానికి వెళ్ళి అక్కడ చీపురు తీసుకొని ఊడ్చారు. ఆ పని ఆమె చాలాకాలం నుంచి చేస్తూ వచ్చారు.

మాజీ బీజేపీ నాయకుడికా ప్రతిపక్ష అభ్యర్థిత్వం?

బీజేపీ నాయకుడిగా కేంద్ర మంత్రి హోదాకి ఎదిగిన యశ్వంత్ సిన్హా మోదీ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించేవారిలో ఒకరు. సిద్ధాంతపరమైన పోటీ ఉండాలని అభిలషించే ప్రతిపక్షాలు మాజీ ఐఏఎస్ అధికారినీ, 22 సంవత్సరాలు బీజేపీ ప్రముఖ పదవులు నిర్వహించిన వ్యక్తినీ అభ్యర్థిగా ఎన్నుకోవడం ప్రతిపక్షాల సైద్దాంతిక దారిద్ర్యానికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీలో ఉన్న మాట వాస్తవమే అయినా ఇప్పుడు యశ్వంత్ సిన్హా బీజేపీకి ప్రబల విరోధి అయిన తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ బద్ధవిరోధుల కంటే కఠినంగా బీజేపీని విమర్శిస్తున్నారు. 2018లో బీజేపీ నుంచి వైదొలిగినప్పటి నుంచి యశ్వంత్ సిన్హా చేసిన ప్రటనలు, తీసుకున్న నిర్ణయాలు బీజేపీ భావజాలానికి వ్యతిరేకమైనవేనని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. యశ్వంత్ సిన్హా కుమారుడు జస్వంత్ సిన్హా నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి అయిదేళ్ళలో కేంద్రమంత్రిగా పని చేశారు. లోగడ యశ్వంత్ సిన్హా ప్రాతినిధ్యం వహించిన జార్ఖండ్ లోని హజారీబాగ్ నియోజకవర్గానికి ఇప్పుడు జస్వంత్ సిన్హా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాజకీయ యోధుడు యశ్వంత్ సిన్హా

యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ అధికారిగా చేరి కేంద్ర ప్రభుత్వంలో రవాణాశాఖ జాయంట్ సెక్రటరీగా ఉన్న సమయంలో 1984లో రాజీనామా చేశారు. వెంటనే రాజకీయాలలో చేరారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ నాయకత్వంలోని జనతాపార్టీలో చేరారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న కొద్ది మాసాలలో సిన్హా ఆర్థికమంత్రిగా పని చేశారు. 1996 లోక్ సభ ఎన్నికల కంటే ముందు బీజేపీలో చేరారు. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా, విదేశాంగమంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికలలో పోటీ చేయడానికి తనకు టిక్కెట్టు నిరాకరించడంతో ఆయన బీజేపీకి ఎదురు తిరిగారు. పార్టీలో సీనియర్లను పక్కకు నెట్టినట్టే సిన్హాను కూడా క్రమంగా మోదీ ప్రభృతులు పక్కకు పెట్టారు. 2018లో బీజేపీకి రాజీనామా చేశారు. రాజకీయేతర వేదిక నిర్మించాలని ప్రయత్నించిన యశ్వంత్ సిన్హా నిరుడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్రపతి పోటీలో ప్రతిపక్ష అభ్యర్థిగా తన పేరు ప్రకటించడానికి కొద్ది గంటల ముందు తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా సమర్పించారు. ప్రతిపక్ష అభ్యర్థిగా సిన్హాను ఎంపిక చేయడాన్ని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ, సీపీఎం అధినేత సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ సమర్థించారు. ప్రజావ్యతిరేకమైన, నిరంకుశమైన మోదీ పాలనను నిరవధికంగా వ్యతిరేకించి సిన్హా పోరాడారని అభిషేక్ అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న రేఫల్, పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ విధానాలపైన సిన్హా గట్టిగా పోరాటం చేశారని ఏచూరి అన్నారు. పైగా ప్రతిపక్షాలన్నటిలోనూ సిన్హా పేరు మీద ఏకీభావం వ్యక్తమైందని అన్నారు. సిన్హా బీజేపీలో చేరకముందు సోషలిస్టు భావాలు కలిగిన కర్పూరీ ఠాకూర్ తో కలసి పని చేశారనీ, ఆ తర్వాత యంగ్ టర్క్ చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారనీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.

నితీష్ కుమార్ పై ప్రతిపక్షాల ఆశలు

రాష్ట్రపతి ఎన్నికలో కూటమి భాగస్వాములతో నిమిత్తం లేకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకునే చరిత్ర బిహార్ ముఖ్యమంత్రి నితీష్  కుమార్ కు ఉన్నది. 2012లో ఎన్ డీఏ భాగస్వామిగా ఉంటూ యూపీఏ అభ్యర్థి ప్రణబ్ కుమార్ ముఖర్జీకి ఓటు వేశారు. అట్లాగే లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీ తో పొత్తు పెట్టుకొని మహాఘట్ బంధన్ లో భాగస్వామిగా ఉన్నప్పుడు 2017 రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్ డీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కు అనుకూలంగా ఓటు చేశారు. కోవింద్ ఎన్నికైన తర్వాత మహాఘట్ బంధన్ నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకొని ఎన్ డీఏ కూటమికి తిరిగి వచ్చారు. 2020 అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి బీజేపీతో నితీష్ సంబంధాలు సవ్యంగా లేవు. రాజ్యసభ ఎన్నికలలో కేంద్రమంత్రిగా ఉన్న వ్యక్తికి జేడీ(యూ) టిక్కెట్టు ఇవ్వలేదు. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలలో తమ వైఖరి గురించి జేడీ(యూ)నేతలు మాట్లాడటం లేదు. జేడీ(యూ)కి 22,769 ఓట్లు ఉన్నాయి. అవి కనుక ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పడితే ప్రతిపక్షం ఓట్లు 4.5 లక్షలు దాటుతాయి. బీజేపీకీ, మిత్రపక్షాలకూ కలిపి 5.23 లక్షల ఓట్లు ఉన్నాయి. పదివేల ఓట్లు ఉన్న ఎలక్టొరల్ కొలేజ్ లో మెజారిటీమార్కుకు ఇరవై వేల ఓట్లు తక్కువ పడుతుంది. బీజూ జనతా దళ్ కు 31,705 ఓట్లూ, వైఎస్ఆర్ సీపీకి 45,798 ఓట్లూ ఉన్నాయి. ఈ రెండు పార్టీల సహకారంతో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలవడం ఖాయం. పదకొండుప్రతిపక్షాలు, వామపక్షాలకు కలిపి 3.8 లక్షల ఓట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీపార్టీ కూడా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తే ఆయన ఓట్లు 4.26 లక్షల దాకా పెరుగుతాయి. ఎన్ డీఏ ఓట్ల మొత్తానికి సమీపంగా వెళ్ళడానికి ప్రతిపక్షాలు చిన్నాచితకా పార్టీల మద్దతుపైన ఆధారపడి ఉన్నాయి. 2017లో ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్ ఎన్ డీ ఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ పైన 3.7 లక్షల ఓట్లు పొందారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles