Friday, March 29, 2024

జీ 7 సదస్సుకు మోదీజీకి ఆహ్వానం ఖాయం

గతంలో జరిగిన జీ-7 సమావేశం

  • రష్యా-ఉక్రెయన్ యుద్ధంలో తటస్థ వైఖరితో తంటా
  • జర్మనీతో మంచి సంబంధాలు  ఇండియాకు రక్ష

ఈ సంవత్సరం జరుగబోయే ‘జీ 7 సదస్సు’కు భారతదేశానికి ఆహ్వానం ఖాయమైందని సమాచారం. ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో,భారత్ కు ఆహ్వానంపై పలు వదంతులు వ్యాపించాయి. ఈ సారి జర్మనీ అధ్యక్షతలో జూన్ 26-28 తేదీలలో ఈ సదస్సు జరుగనుంది. దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి (2003), జీ 7 సదస్సులకు మన దేశానికి ఆహ్వానం అందుతోంది. మొట్టమొదటగా ప్రధానమంత్రి హోదాలో వాజ్ పేయి వెళ్లారు. ఆ సంవత్సరం సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. నేటి ప్రధాని నరేంద్రమోదీ కూడా పలుసార్లు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో గత సంవత్సరం వర్చువల్ విధానంలో జరిగింది. దానికి బ్రిటన్ ఆహ్వానకర్తగా వ్యవహరించింది.

Also read: అ‘ద్వితీయ’ విద్యా విధానం

ఈ సారి అనుమానం లేకపోలేదు

వరుసతప్పకుండా ఆహ్వానం పొందుతున్న భారత్ కు ఈసారి ఆహ్వానం కష్టమేనని వచ్చిన వార్తలు నేటితో పటాపంచలై పోయాయి. భారత్-జర్మనీ సంబంధాలను ప్రశ్నార్ధకం చేస్తూ కొందరు కథనాలు వండి వడ్డించారు. జర్మనీ ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. మనతో పాటు సెనెగల్, సౌత్ ఆఫ్రికా,ఇండోనేషియా కూడా ఆహ్వానిత దేశాల జాబితాలో ఉన్నాయి. భారత్ – జర్మనీ సంబంధాలకు ఎటువంటి ఢోకా ఉండదని, ఇప్పటి వరకూ ఉన్నట్లే సత్ సంబంధాలు అదే తీరున నడుస్తాయనే విశ్వాసాన్ని విదేశాంగ వ్యవహారాల నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. బవేరియన్ ఆల్ప్స్ లో జరుగుతున్న ‘జీ 7 సదస్సు’కు అధికారికంగా ఆహ్వాన పత్రిక అతి త్వరలో రానుంది. ఇరు దేశాల మధ్య జరిగే ‘ఐ జి సీ’ ( ఇంటర్ గవర్నమెంటల్ కన్ సల్టేషన్స్) కు కూడా  ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారని సమాచారం. ఈ సమావేశాలు రెండు సంవత్సరాలకు ఒకసారి చొప్పున జరుగుతాయి. 2019లో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ భారత్ ను సందర్శించారు. ఎనర్జీకి సంబంధించిన రంగంలో రష్యాపై జర్మనీ ఆధారపడివుంది. ఆయుధాల విషయంలో రష్యాపై మనం ఆధారపడి ఉన్నాం. ఇలా.. రెండు దేశాలకు రష్యాతో అవసరాలు ఉన్నాయి. రష్యా- భారత్ మధ్య ఉన్న దశాబ్దాల ఆత్మీయ అనుబంధం  ప్రపంచ దేశాలకు తెలిసిందే. ఇటీవల చైనా వల్ల కొంత బాంధవ్యం తగ్గినా, తాజా యుద్ధ వాతావరణంలో భారత్ పై రష్యా స్నేహబంధం మరింత పల్లవించింది. భవిష్యత్తులో మరింత దృఢమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒకరకంగా ఇది మంచి పరిణామమే. మరోరకంగా చూస్తే అమెరికా,యూరప్ దేశాలతో కొన్ని తలనొప్పులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే, భారత్ సూటిపోటి మాటలు పడుతోంది. ఏది ఎలా ఉన్నా, ఆధిపత్య పోరులో తన అగ్రరాజ్య హోదాను నిలబెట్టుకోడానికి భారత్ తో అమెరికా స్నేహం చెయ్యక తప్పదు. ఉక్రెయిన్ , రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో, యూకె, అమెరికాలు అటు జర్మనీ-ఇటు భారత్ పై కూడా ఒత్తిళ్ళు పెడుతున్నాయి. కానీ,భారత్ ఎక్కడా తలవగ్గడం లేదు. తటస్థ వైఖరినే అవలంబిస్తోంది.జీ 7లోని రష్యా వ్యతిరేక దేశాలన్నీ ఒక గొడుగు కిందకు వస్తున్న తరుణంలో,జర్మనీ,భారత్ కలిసి ఉమ్మడి వేదికను నిర్మించుకొనే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Also read: ఒంటిమిట్ట రామాలయ ప్రాశస్త్యం

భారత్ –జర్మనీ సంబంధాలు బలోపేతం

జీ7 దేశాలకు అతీతంగా, జర్మనీ, భారత్ మధ్య సంప్రదాయ సరళిలో వాణిజ్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి.డిఫెన్స్-సెక్యూరిటీ అంశాలలో సుహృద్భావమైన వాతావరణం నెలకొని ఉంది. ఆర్ధికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో కూడినదే ‘జీ 7’. ఈ బృందంలో కెనడా, ఫ్రాన్స్,జర్మనీ,ఇటలీ,జపాన్, బ్రిటన్,అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. స్వాతంత్ర్యం,మానవ హక్కులు,ప్రజాస్వామ్యం, చట్టపాలన, సుసంపన్నత, సుస్థిరమైన అభివృద్ధి ప్రధాన సూత్రాలుగా ముడివేసుకొని ఈ బృందం కాపరం చేస్తోంది. జీ -7 పై అనేక విమర్శలు కూడా ఉన్నాయి.అభివృద్ధి చెందిన చైనాకు ఇందులో స్థానం లేదు. జనాభా తలసరి సంపద మిగిలిన అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువ ఉండడం వల్ల చైనాకు చోటు లభించలేదు. భారతదేశం మాత్రం ఇంకా ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు’ జాబితాలోనే ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా పరిణితి చెందాలంటే  చైనా ప్రగతి ప్రస్థానాన్ని అధ్యయనం చేసి తీరాల్సిందే. అలాగే, జీ 7 దేశాల అభివృద్ధి నమూనాను కూడా అధ్యయనం చెయ్యాలి. అన్నింటినీ పరిశీలించి, పరిశోధించి,ఆచరణలో పెడితే? మనం కూడా ఆ  దేశాల సరసున నిలుస్తాం. జీ 7దేశాల మధ్య అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి. సమీప భవిష్యత్తులో జీ 7 బృందం నుంచి కొన్ని దేశాలు పక్కకు వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అంతర్జాతీయ ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు. అవసరార్ధం,ఆర్ధిక, రాజకీయ,అధికార స్వార్థంతో సాగుతున్న బంధాల మాటున ప్రపంచ దేశాల మధ్య అనుబంధాలకు తావు ఉంటుందా? అన్నది ప్రశ్న? వెరసి స్నేహం,శత్రుత్వం రెండూ శాశ్వతం కానప్పడు ప్రతి  కలయికా కొత్తగానే ఉంటుంది.ఆత్మపరీక్ష చేసుకొని, లోపాలను సరిదిద్దుకొని,  అందరూ కలిసిమెలిసి సాగితేనే, ప్రపంచ మానవాళికి ఇటువంటి సదస్సులు, సమావేశాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి.

Also read: అపూర్వ రాజకీయ విన్యాసం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles