Saturday, October 1, 2022

అందని లోకాలకు ఏగిన అందరి శేషాద్రి

  • చివరి క్షణం వరకూ స్వామి సేవలోనే
  • ప్రముఖులకు తిరుమలేశుని ఆశీస్సులు అందించడం ఆనవాయితీ
  • కార్తీక సోమవారంనాడు ‘డాలర్ శేషాద్రి’ వైకుంఠయానం

దశాబ్దాల పాటు శ్రీవారి సేవలో పునీతుడైన శ్రీపాల శేషాద్రి తుది శ్వాస విడిచారు. పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు అనంతవాయువుల్లో కలిసిపోయారు. స్వామివారి సేవలో భాగంగా విశాఖ వచ్చి, తుది వరకూ ఆ సేవలోనే తరించి, దైవ సన్నిధికి చేరుకున్నారు. కొనఊపిరి వరకూ వేంకటరమణుని కొలువులోనే ఉండాలన్న ఆ పవిత్ర సంకల్పం సిద్ధించింది. స్వామివారి సేవలో మరణం దరిచేరినా… తనకు అమితానందమే అని చెబుతుండేవారు.  ఆ మాటను నిలబెట్టుకున్నారు. వైష్ణవ మత వరిష్ఠుడైన శేషాద్రి చరమాంకంలో సింహాచల లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకొని భాగ్యగరిమను గడించారు. తిరునామంబును తీర్చి, దివ్యగిరిపై దేవదేవుని సన్నిధిలో దశాబ్దాల పాటు చరించిన ఆయన జన్మ ధన్యం, మరణమూ పుణ్యం. టీటీడీ అనగానే చెలికాని అన్నారావు, పీవీఆర్ కె ప్రసాద్ వంటివారి పేర్లు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. పాలకులుగా వారిది చిరస్మరణీయమైన ముద్ర. కానీ, ఈ పేర్లు ఎరుగని వారు కూడా ఈ తరంలో ఉన్నారు. ‘డాలర్’ శేషాద్రిగా శ్రీపాల శేషాద్రి నేటితరం వారికీ బాగా పరిచయస్తుడు. దేశ,విదేశాల ప్రముఖులందరికీ ఆయనతో గొప్ప అనుబంధం.

Also read: కొత్తరకం కరోనా ముప్పు

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యక్తులలో, ఈకాలంలో ఇంతటి ప్రముఖులు ఇంకొకరు ఎవ్వరూ లేరన్నది అతిశయోక్తి కానే కాదు. మీడియా బాగా పెరిగిన కాలంలో ప్రాచుర్యాన్ని  పొందడం సర్వ సాధారణం. కానీ, శేషాద్రి విషయంలో కేవలం అదొక్కటే కారణం కాదు. అది ఒక పార్శ్వము మాత్రమే. ఆయనకు ఎంతటి ప్రసిద్ధి వుందో అంతకు మించిన ప్రాముఖ్యత కూడా ఉంది. తిరుమలేశుని సర్వ కైంకర్యాలు, సేవలపై ఉన్న అపరిమితమైన జ్ఞానాధికారమే శేషాద్రికి ప్రాముఖ్యతను తెచ్చి పెట్టింది. సుప్రభాతం నుంచి పవళింపు వరకూ ప్రతి దశ, ప్రతి అడుగు, ప్రతి క్షణం ఆయనకు కరతలామలకం. ప్రధాన మంత్రులు, దేశాధ్యక్షులు, న్యాయమూర్తులు,వ్యాపార వేత్తలు అంతగా ఆయనను సొంతం చేసుకున్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన వారితో మెలిగిన విధానం.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు గోవిందుడి పటాన్ని అందజేస్తున్న శేషాద్రి, తదితరులు

ప్రముఖులతో అనుబంధం

తిరుమల గురించి, శ్రీవారి గురించి ఎన్నో విశేషాలను వారికి చెబుతూ ఉండేవారు. ప్రతి ప్రముఖ సందర్భంలో వారిని కలుసుకొని, స్వామివారి ఆశీస్సులు అందిస్తూ ఉండేవారు. ఏ ప్రముఖుడు తిరుమల దర్శించినా  పక్కనే శేషాద్రి ఉండాల్సిందే. ఇది కొత్తగా వచ్చిన అలవాటు కాదు. ఎన్నో ఏళ్ళుగా ఆయన తీరు అదే. ఆ సంప్రదాయాన్ని చివరి వరకూ అలాగే పాటించారు. అందుకే ప్రముఖులందరికీ ఆయనంటే అంత ఇష్టం. కేవలం ప్రముఖులు, ప్రసిద్ధులే కారు , సాధారణ భక్తులు కూడా ఆయనంటే ఎంతో ఇష్టపడతారు. దేవాలయ ప్రాంగణంలో ఎవరు ఎదురైనా నవ్వుతూ పలకరించడం ఆయన నైజం. గుండెను గుడిగా చేసుకొని పూజించడమే కాక,  ఇంటినే గర్భగుడిగా మార్చిన వైనం శేషాద్రిది. ఆయన నివాసాన్ని చూస్తే అది  మరో తిరుమలను తలపిస్తుంది. వాహనాలు, విగ్రహాల నమూనాలతో ఆ ఇల్లు నిండిపోయి ఉంటుంది. 1978 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంతో అనుబంధం కొనసాగింది. మధ్యలో 11 నెలలు మాత్రమే చిన్న విరామం వచ్చింది. ఉత్తర పారు పత్తేదారు నుంచి పత్తేదారుగా పదోన్నతి పొందారు. అనేక పదవులు, బాధ్యతలను నిర్వహించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ దంపతులతో పూజ చేయిస్తున్న శేషాద్రి

నిబంధనల ప్రకారం పదవీ విరమణ జరిగినా ఆ తర్వాత కూడా 14 సంవత్సరాల పాటు స్వామిసేవలో కొనసాగారు. ఓ ఎస్ డి గా నిరుపమానమైన సేవలు అందించారు. ఎందరు ముఖ్యమంత్రులు,అధికారులు వచ్చినా, ఎన్ని రాజకీయపార్టీల ప్రభుత్వాలు మారినా, శేషాద్రి స్థానం పదిలంగా ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చిన్ననాటి నుంచి తండ్రి ద్వారా దేవాలయాల వ్యవస్థపై మంచి జ్ఞానాన్ని సంపాయించారు. భక్తి భావనలు కూడా సహజంగా జతకలిశాయి. అవన్నీ తన ఉద్యోగ జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. అర్చక వాతావరణంలో కాక, పాలనా పరమైన విభాగాల్లోనే ఆయన పనిచేసినా శ్రీవారి కైంకర్యాలను ఆయన చాలా సునిశితంగా పరిశీలించేవారు. చిన్న లోపం దొర్లినా, వెంటనే కనిపెట్టి తెలియజేసి, అప్రమత్తం చేసి, సరిదిద్దే ప్రయత్నం చేసేవారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘మిరాసీ’ వ్యవస్థను రద్దు చేశారు. వ్యతిరేకంగా సమ్మెవంటి వాతావరణం ఏర్పడింది.  ఆ సమయంలో కార్యక్రమాలు స్థంభించిపోయాయి. మాడంబాకంవారితో కలిసి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. దానితో దేవాలయానికి పునఃవైభవం వచ్చింది. ఇందులో శేషాద్రి పాత్ర గణనీయమైంది. ఇటువంటివన్నీ ఆయనకు అధికారులు, పాలకుల వద్ద విశిష్టమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకూ, భార్య శోభకూ స్వామివారి లీలలు వివరిస్తున్న శేషాద్రి

కైంకర్యాల గ్రంథస్థం

ప్రత్యేకమైన సందర్భాలు, పర్వదినాలలో నిర్వహించాల్సిన కైంకర్యాలకు సంబంధించిన విశేషాలు, వివరాలన్నింటినీ గ్రంథస్థం చేయాల్సిన అవసరాన్ని అధికారులు, అధ్యక్షులు గుర్తించారు. ముఖ్యంగా ఎల్ వి సుబ్రహ్మణ్యం ఈఓగా, కనుమూరి బాపిరాజు ఛైర్మన్ గా ఉన్న కాలంలో ఈ బృహత్ కార్యానికి పునాదులు పడ్డాయి. ఇటీవలే 5 విభాగాలతో గ్రంథస్థమైంది. నేటి కాలానికి, భావి తరాలకు కూడా ఎంతో గొప్పగా ఉపయోగపడే గొప్ప కార్యం ఇది.ఈ పుణ్య ఘన కార్యాన్ని సంపూర్ణం చేసి  శేషాద్రి పుణ్యచరితుడయ్యారు.

తిరునామం చెదరకుండా వైకుంఠానికి…

‘డాలర్ శేషాద్రి’ అనే మాట ఆయనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. శ్రీవారి బొక్కసంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో 300నాణేలు అపహరణకు గురి అయ్యాయి. ఆ కుంభకోణం టీటీడీని కుదిపేసింది. ఆ అక్రమంలో శేషాద్రి ప్రముఖంగా ఉన్నారని పెద్ద ప్రచారం జరిగింది. దానితో డాలర్ శేషాద్రిగా ఆయన సంచలనమయ్యారు. 8ఏళ్ళ పాటు జరిగిన విచారణలో ఆ తర్వాత కేసు కొట్టేశారు. ఆ నింద నుంచి బయటపడినా,ఆ పేరు మాత్రం పోలేదు. ఆయన మెడలో ‘ మేకబొమ్మ’తో డాలరు వేలాడుతూ ఉండేది. దిష్టి కోసం పెట్టుకున్నారని చెబుతారు. ఈ విధంగా కూడా ఆయన ‘డాలర్’ శేషాద్రే. ప్రధాన అర్చకుల కంటే కూడా ఆయనే ప్రసిద్ధుడు. సరే, తోటి ఉద్యోగుల మధ్య రాజకీయాలు, అసూయలు, అనుమానాలు, అహంకారాలుఉండడం సహజం. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు – శేషాద్రి మధ్య సాగిన వివాదాలు సంచలనాలు రేపాయి. కాలంలో గాయం మానిపోయినట్లుగా ఇటువంటి వివాదాలు,విషాదాలు కాలగర్భంలో కలిసిపోతాయి. స్వచ్ఛమైన, సంపూర్ణమైన సేవే శాశ్వతంగా మిగులుతుంది. ఆ సేవకులే చరిత్ర పుటల్లో మిగులుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శేషాద్రి వంటివారు అరుదుగా జన్మిస్తారు.

Also read: ఉద్యమబాట వీడని రైతులు

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles