Saturday, July 20, 2024

రాజద్రోహం చట్టం అవసరమా: కేంద్రానికి చీఫ్ జస్టిస్ రమణ ప్రశ్న

దిల్లీ: ‘‘బ్రిటిష్ వలస పాలకులు మహాత్మాగాంధీపైనా, బాలగంగాధర్ తిలక్ పైనా ఉపయోగించి స్వాతంత్ర్య సమరాన్ని అణచివేయడానికి సాధనంగా వినియోగించిన రాజద్రోహ చట్టాన్ని(సెడిషన్ లా) మన రాజ్యాంగంలో ఇంకా ఉంచడం అవసరమా?’’ అని చీఫ్ జస్టిస్ రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దురుపయోగించడానికి ఎక్కువ అవకాశాలు కలిగిన ఈ చట్టం 75 ఏళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా మనకు కావాలా? ఏ పోలీసు అధికారి అయినా ఏ గ్రామంలోనైనా ఎవరి భరతం పట్టాలన్నా ఈ చట్టం ఉపయోగిస్తాడు అని చీఫ్ జస్టిస్ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు పని చేయడానికి ఈ చట్టం పెద్ద అంతరాయం కలిగిస్తోంది. పైగా ప్రభుత్వానికి జవాబుదారీతనం ఏమీ లేదు. అత్యుత్సాహవంతుడైన కంసాలికి రంపం ఇచ్చినట్టు ఉంటుంది వ్యవహారం. ఒక కొయ్య ముక్కను కోయమని రంపం ఇస్తే దాన్ని మొత్తం అడవిని కోసి కుప్పగా పెట్టడానికి ఉపయోగించినట్టు అవుతోంది అంటూ వ్యాఖ్యానించారు. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షులు. ఇతర న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ హృషీకేశ్ రే.

ఈ చట్టాన్ని రాజ్యాంగంలో ఉండనిచ్చి, దాని ప్రయోగానికి ఏమైనా మార్గదర్శక సూత్రాలు రూపొందిస్తే బాగుంటుందని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అన్నారు. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం గురించీ. ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేకపోవడం గురించీ మాట్లాడుతున్నామని చీఫ్ జస్టిస్ అన్నారు. మేజర్ జనరల్ ఎస్ జి వాంబాట్కేరే దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలిస్తూ ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం వాక్ స్వాంత్ర్యానికీ, భావప్రకటన స్వేచ్ఛకూ భంగం కలిగిస్తుందని పిటిషనర్ అన్నారు. ఈ చట్టం రాజ్యాంగంలో ఉండటానికి ఏ మాత్రం వీలులేదనీ, నిర్ద్వంద్వంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలనీ పిటిషనర్ వాదించారు. పిటిషనర్ దేశం కోసం ప్రాణాలు దాదాపుగా అర్పించారనీ, ఆయనకు దురుద్దేశాలు ఆపాదించడానికి వీలు లేదనీ జస్టిస్ రమణ అన్నారు.

ఇద్దరు జర్నలిస్టులు – మణిపూర్ కు చెందిన కిషోర్ చంద్ వాంగ్ ఖెమ్చా, హరియాణా కు చెందిన కన్హయాలాల్ శుక్లా-దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు వింటూ సర్వోన్నత న్యాయస్థానంలోనే మరో బెంచ్ పిటిషనర్ల వాదనకు సమాధానం చెపపవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజద్రోహ చట్టంపైన వచ్చిన అన్ని పిటిషన్లనూ ఒకే సారి వింటామని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజద్రోహం చట్టం కింద కేసులు అధికంగా నమోదైనాయి. అంతకు కిందట పదుల సంఖ్యలోఉంటే ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్నాయి. మొన్న బెయిల్ కోసం నిరీక్షిస్తూ ముంబయ్ ఆస్పత్రిలో మరణించిన హక్కుల కార్యకర్త, క్రైస్తవ ప్రీస్ట్  స్టాన్ స్వామిని ఈ చట్టం కిందనే సుమరు పది మాసాల కిందట రాంచీలో తన నివాసం నుంచి దిల్లీ నుంచి వచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అరెస్టు చేసి ముంబయ్ తరలించారు. ఈ రాజద్రోహం చట్టం కిందనే మన కవి వరవరరావునూ, మరి 14 మంది హక్కుల నాయకులనూ రెండు సంవత్సరాలుగా ముంబయ్ లోని తలోజా జైలులో బంధించి ఉంచారు. ఈ నల్ల చట్టం కిందనే ఆయేషా సుల్తానా అనే లక్షద్వీపాలకు చెందిన సినిమా నిర్మాతపైన కేసు పెట్టారు. కేరళ హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ విషయంలోనూ అంతే జరిగింది.  ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత బాలికపైన అత్యాచారం చేసి చంపివేసిన ఘటన గురించి తెలుసుకోవడానికి వెడుతున్న సమయంలో అతడిపైన అరెస్టు చేసి రాజద్రోహం చట్టం కిందనే కేసు నమోదు చేశారు. జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్దుల్లాపైన కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. సుప్రీంకోర్టు ఆయన కేసును ఆలకించింది. 370 వ అధికరణను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ రాష్ట్రానికి గల ప్రత్యేకాధికారాలకు గండి కొట్టినందుకు కశ్మీరీ ప్రజలు చేస్తున్న పోరాటంలో తమకు మద్దతు ఇవ్వాలని చైనా, పాకిస్తాన్ లను కోరినందువల్ల ఆయన శిక్షార్హుడని ఈ చట్టం ప్రయోగించారు.

హరియాణాలో బీజేపీ నాయకుడూ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అధికార వాహనాన్ని ధ్వంసం చేశారనే అరోపణతో వందమంది రైతులపైన ఈ చట్టం కింద కేసు పెట్టారు. మూడు వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వారు అధికారంలో ఉన్న పార్టీల నాయకులను ఘెరావ్ చేసే క్రమంలో కారు దెబ్బతిన్నది. ఇది రాజద్రోహం ఎట్లా అవుతుంది? అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ విమర్శించడమే పనిగా పెట్టుకున్న లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణం రాజు పైన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్నే ప్రయోగించింది.

తమను విమర్శించేవారిపైనా, తమ విధానాలను ఆమోదించడానికి నిరాకరించేవారిపైనా, తమకు వ్యతిరేకంగా మట్లాడేవారిపైనా పాలకులు రాజద్రోహ నేరం మోపుతూ ఈ చట్టాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు భావిస్తున్నది. దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు భావిస్తున్నది. ప్రభుత్వానికి లేఖ రాసి దాని అభిప్రాయం ఏమిటో తెలపమని సుప్రీంకోర్టు కోరింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles