Sunday, May 26, 2024

తెలంగాణ కాంగ్రస్ కు చావో, రేవో తేల్చుకోవాల్సిన సమయం

తెలంగాణ కాంగ్రెస్ లో పుట్టిన ముసలం పార్టీ దుంపతెగే వరకూ వదిలేటట్టు కనిపించడం లేదు. పార్టీలో సీనియర్ నేతలకూ, కొత్తగా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లో చేరినవారికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలంగాణ కాంగ్రెస్ లో రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచీ కాంగ్రెస్ లోనే ఉంటూ వచ్చిన సీనియర్లు భట్టివిక్రమార్క నాయకత్వంలో సమీకృతమైనట్టు కనిపిస్తున్నారు. వారందరికీ భట్టి నాయకుడని చెప్పడం కంటే ప్రస్తుతం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా ఉన్నారు కనుక ఆయన నాయకత్వంలో అసమ్మతి రగిలించడానికి సీనియర్లకు అభ్యంతరం లేదు. అదే పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బదులు భట్టి విక్రమార్కను నియమించి ఉంటే ఈ సీనియర్లంతా ఆయన వెనుక నిలిచేవారా అన్నది అనుమానాస్పదమే.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించడం, ప్రతిపక్షంలోకి రాగానే గమ్మున ఉండటం, వీలైన పైరవీలు చేసుకోవడం మినహా పార్టీకోసం కష్టపడి పని చేసే ఆనవాయితీ లేదు. అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సరం కంటే తక్కువ వ్యవధి ఉన్న ప్రస్తుత సయమంలో వందలమంది సభ్యులుగా ఉన్నకమిటీలో కాంగ్రెస్ లో మొదటి నుంచీ కొనసాగుతున్నవారికి సభ్యత్వం లేకుండా ఇటీవలతెలుగుదేశం నుంచి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరులకు పదవులు దక్కడం పట్ల సీనియర్లు అభ్యంతరం చెబుతూ భట్టి విక్రమార్క నివాసం దగ్గర మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దీనికి ప్రతిగా రేవంత్ రెడ్డి వర్గం సభ్యులు తమ పదవులకు రాజీనామా సమర్పిస్తూ ఏఐసీసీ ప్రతినిధి మణిక్కం టాగోర్ కు లేఖలు రాశారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులంతా ఐకమత్యంగా, సమష్టిగా పని చేయవలసి ఉన్నదనీ, తమకు పదవులకంటే పార్టీని రక్షించుకోవడం ముఖ్యమనీ రేవంత్ వర్గీయులు ఉద్ఘాటించారు. ఇది సకారాత్మకంగా చేస్తున్న పోరాటంలాగా పైకి కనిపిస్తుంది. వందమంది సభ్యులున్న కమిటీలో సభ్యత్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత?

భట్టి విక్రమార్క వర్గం, రేవంత్ రెడ్డి వర్గం పోరాటం చేస్తున్నది బీజేపీ, టీఆర్ఎస్ ల మీద కాదు. పరస్పరం కుమ్ముకుంటున్నారు. కాంగ్రెస్ రక్షకులుగా తమకు తాము ప్రకటించుకుంటున్నారు. టీడీపీ నుంచి వచ్చినవారి నుంచి కాంగ్రెస్ రక్షిస్తామని కాంగ్రెస్ సీనియర్లు అంటుంటే టీఆర్ఎస్ కోవర్టులుగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుంచి పార్టీని కాపాడుకోవాలని టీడీపీ నుంచి వచ్చిన నేతలు అంటున్నారు.

అందరూ అందరే నందలూరి కరణాలు అన్నట్టు సీనియర్ నేతలు అందరూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించినవారే, మంత్రిపదవులు వెలగబెట్టినవారే, ఎంతోకొంత సంపాదించుకున్నవారే. అధికారంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ నాయకులు హాయిగా ఉంటారు. చిర్నవ్వు చెరగదు. దర్జాగా ఉంటారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం పదేళ్ళు దాటుతున్నా వారికి అలవాటు కాలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి, సోనియాగాంధీ ధర్మమా అని 2004 నుంచి 2014లో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ జరిగే వరకూ మంత్రి పదవులలో ఉన్న సీనియర్ నాయకులే ఇప్పుడు ప్రతిపక్షంలో అసహనంగా ఉన్నారు. వారిలో చాలా మందికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)తో రహస్య సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటారు. వారిలో కొందరు అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడే సమయంలో టీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనకుండా బీజేపీపైన మాత్రమే ధ్వజమెత్తుతారు. ఎన్నికలలో కొందరు కాంగ్రెస్ నాయకులపైన పోటీకి బలహీనమైన అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ టీఆర్ఎస్ టిక్కెట్టుపైన నిలబెడతారని ప్రతీతి.

కాంగ్రెస్ నాయకులలో టీడీపీకి వ్యతిరేకంగా ఉండాలనే పట్టింపుకూడా ఏమీలేదు. రేవంత్ రెడ్డి టీడీపీ విధేయుడంటూ అభ్యంతరం చెబుతున్న ఉత్తమకుమార్ రెడ్డి చాలా సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. కాంగ్రెస్ టిక్కెట్టు పైన గెలిచిన 18 మంది  ఎంఎల్ఏలలో 12మంది టీఆర్ఎస్ లో చేరిపోయినా నిరసన ధ్వని సైతం లేకుండా మౌనం ధరించారు. పార్టీని పరుగులెత్తించిన దాఖలా లేదు. పైగా చంద్రబాబునాయుడితో కలసి 2018లో ఎన్నికల పొత్తుపెట్టుకున్నది ఉత్తమ్ హయంలోనే. నాయుడు పనివేళా దిల్లీ వెళ్ళి నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శాలువా కప్పి అభినందించినప్పుడు ఉత్తమ్ ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు.

మరో సీనియర్ నాయకుడు జానా రెడ్డి సైతం టీడీపీ నుంచి వచ్చినవారే. ఆయన ఎన్ టి రామారావు ప్రభుత్వంలో అనేక శాఖలు నిర్వహించిన మంత్రి. ఎన్ టీ ఆర్ లో విభేదించి, టీడీపీ నుంచి బయటకు వచ్చి, సొంతపార్టీ పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసి, చివరికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అందుకే ఆయనకు టీడీపీ వారంటే అభ్యంతరం లేదు. ఆదివారంనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కీలక భేటీకి హాజరైనారు. మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా టీడీపీ తానులో ముక్కే. అందుకే ఆయనకు టీడీపీ ముద్ర అంటే పెద్దగా అభ్యంతరం లేదు. భట్టి నివాసంలో సమావేశానికి హాజరైనప్పటికీ జీవన్ రెడ్డి సమైక్యవాది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోపని చేయడానికి అభ్యంతరం లేని నాయకుడు. మధు యాష్కీ అభ్యంతరం ఏమిటో తెలియదు. రాహుల్ గాంధీకి దగ్గరైన నాయకుడుగా చెప్పుకునే యాష్కీ ఏదో ఒక వర్గంలో చేరకుండా అధిష్ఠానం నియమించిన వ్యక్తితో కలసి పని చేయవలసింది. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన దామోదర రాజనరసింహ సాధారణంగా ఇటువంటి విషయాలకు దూరంగా ఉంటారు. ఆయన సైతం భట్టి నివాసానికి వెళ్ళి విలేఖరుల గోష్ఠిలో మాట్లాడటం విశేషం.  ఈ విధంగా రకరకాల సీనియర్ నాయకులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సమీకృతమయ్యేది ఫలానా నాయకుడు అక్కరలేదనే అంశంపైనే.

అధిష్ఠానం సూచించినట్టు సీనియర్ నాయకులను మంచి చేసుకోవడానికి, వారి హృదయాలను గెలుచుకోవడానికి రేవంత్ రెడ్డి కొంతకాలం ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. ఇందుకు రేవంత్ రెడ్డి వ్యక్తిగత వ్యవహార శైలి, మాట తీరు, నిర్ణయాలు తీసుకునే సరళి  కూడా కారణం కావచ్చు. ఏమైనా చాలామంది సీనియర్లు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డిని మార్చేస్తారా?

అది అంత తేలిక కాదు. తన పార్టీలో చాలామంది సీనియర్ నేతలు కేసీఆర్ తో సంబంధాలు కలిగి  ఉన్నారనే విషయం రాహుల్ గాంధీకి స్పష్టంగా తెలుసు. కానీ సీనియర్ నేతలందరిపైనా చర్య తీసుకొని వారిని పార్టీ నుంచి సాగనంపే సాహసం చేయజాలరు. వారు పార్టీలోనే ఉంటారు. కానీ వారు దిల్లీ వెళ్లి రాహుల్ గాందీతోనో, సోనియాగాంధీతోనో, ప్రియాంకాగాంధీతోనో ఫలానా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు విధేయుడు కాదు, తెలుగు దేశం నేత చంద్రబాబునాయుడికి విధేయుడంటే వారు నమ్మరు. ఎందుకంటే వీరి విధేయతపైనే వారికి అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబుతో వ్యవహారం చేయడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సిద్ధంగానే ఉంది. వాస్తవానికి టీఆర్ఎస్ కి దూరంగా ఉండాలనీ, టీఆర్ఎస్ ను ఎదిరించి పోరాడాలనీ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. ఇటీవల వరంగల్లులో కర్షక సభలో ఈ మాట చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ పైన పోరాడవలసిందిగా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎంత ప్రోత్సహించినా టీఆర్ఎస్ ను వ్యతిరేకించడానికి కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా లేరు. అటువంటివారిలో కొందరు మొన్న భట్టి నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైనారు.

ఈ విధంగా ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటూ కాంగ్రెస్ సీనియర్లు కాలక్షేపం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకూ ఇల్లు కదలరు. నియోజకవర్గాలలో పర్యటించరు. ఎన్నికలు వచ్చినప్పుడు నెలా, రెండు నెలలు కష్టపడతారు. తర్వాత తమ నివాసానికే పరిమితం అవుతారు. చాలామంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అదే. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల గురించి ఆలోచించరు. ప్రజాసమస్యల విషయంలో స్పందించరు. అందుకే క్రమంగా తెరమరుగవుతున్నారు.

ఇదే రకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యవహరిస్తే, భట్టి, రేవంత్ వర్గాలు కలసి మెలసి పని చేయడానికి నిరాకరిస్తూ మొరాయిస్తే, కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు. మునుగోడు సీటును 2018లో సునాయాసంగా గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో మంచి అభ్యర్థి ఉన్నప్పటికీ ధరావత్తు కోల్పోవలసి వచ్చింది. ఇదే అనైక్యతారాగం ఆలపిస్తూ, పరాయి  పార్టీలకూ, నాయకులకూ కొమ్ముగాస్తే వచ్చే ఎన్నికలలో మూడో స్థానానికి దిగజారడం తథ్యం. ఇరవై శాతం కంటే ఓటర్ల శాతం తగ్గితే కాంగ్రెస్ నాయకులకు పరువు దక్కదు. ఇప్పుడు గౌరవం నటిస్తున్న ఇతర పార్టీలు ఈ మాత్రం గౌరవం కూడా ఇవ్వవు. ఒక వేళ టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నాయకులకు చెడు కాలం దాపురించినట్టే. 2023 అసెంబ్లీ ఎన్నికలలో గెలవకపోయినా కనీసం రెండో స్థానంలో కూడా కాంగ్రెస్ నిలబడలేకపోతే ఆ పార్టీ అడ్రసు గల్లంతు అవుతుంది. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి కాంగ్రెసేతర రాష్ట్రాల సరసన తెలంగాణను కూడా చేర్చవలసి వస్తుంది.

ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎన్నికలకు పది, పదకొండు మాసాల గడువుంది. కాంగ్రెస్ పట్ల ప్రజలలో సానుభూతి ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని భయపడుతున్నవర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు అందజేస్తున్నాయి. కానీ విషాదం ఏమంటే కాంగ్రెస్ నాయకులే బీజేపీతో కానీ టీఆర్ఎస్ తో కానీ పోరాడేందుకు సిద్ధంగా లేరు. తమలో తాము కలహించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మూఠాపోరుకే ఉన్న సమయాన్నీ, శక్తియుక్తులనూ ధారవోస్తున్నారు.

ఈ పరిస్థితి మారాలి. సోనియాగాంధీ లేదా ఖడ్గే లేదా ఇద్దరూ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడాలి. సీనియర్ నేతలను దిల్లీకి రావలసిందిగా అధిష్ఠానం కబురు పెట్టింది. అధిష్ఠానం పిలవడం, సీనియర్లు దిల్లీ వెళ్ళి రావడం ఒక క్రతువుగా జరుగుతూనే ఉన్నది. సీనియర్ల  వైఖరి మాత్రం మారడం లేదు. ఈ సారి చాలా స్పష్టంగా, అవసరమైతే కాస్త కటువుగా సందేశం ఇవ్వాలి. లక్ష్మణరేఖ దాటినవారిపైన చర్య తీసుకుంటామని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ దిల్లీలోనూ, పెక్కు రాష్ట్రాలలోనూ అధికారంలో లేదు కనుక అంత కటువుగా  పార్టీ నాయకులతో మట్లాడటం కుదరకపోవచ్చు. కానీ అధిష్థానం మెతకవైఖరి అవలంబిస్తే అసలుకే మోసం వస్తుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి వర్గం, భట్టి వర్గం కలసి సమష్టిగా పనిచేసేలా ఒప్పించాలి. కరవమంటే కప్పకు కోపం,  విడవమంటే పాముకుకోపం అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ వ్యవహారం. ఈ ముఠా తగాదాలు కాంగ్రెస్ కు కొత్త కాదు. రాజస్థాన్ లో ఏమి చేయాలో తెలియక గాంధీ కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. ఇందుకు రాజస్థాన్ తాజా ఉదాహరణ. ముఖ్యమంత్రి అశోక్ గెల్హాట్ నూ వదులుకోలేరు, సచిన్ పైలట్ నూ కాదనలేరు.  బీజేపీకి కూడా ముఠాబందీ వల్ల తలనొప్పితప్పడంలేదు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం ముఠా వైమనస్యాలే. ప్రాంతీయ పార్టీలలో అయితే అధినాయకుడు అదే రాష్ట్రంలో ఉంటారు కనుక అసమ్మతి రాజుకోదు. అసమ్మతి తలెత్తగానే అధినాయకులు చర్య తీసుకంటారు. జాతీయ పార్టీల విషయంలో అది సాధ్యం కాదు. అధిష్ఠానం దూరంగా దిల్లీలో ఉంటుంది. అసమ్మతి ఆటలు రాష్ట్రాలలో సాగుతాయి.

ఇతర రాష్ట్రాల సంగతి, పార్టీల సంగతి ఎట్లా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాపాడుకోలేకపోతే అది ఎప్పటికీ దక్కకుండా పోతుంది. చావో, రేవో తేల్చుకోవలసిన సమయం ఇది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles