Saturday, April 20, 2024

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మవద్దు: ఈఏఎస్ శర్మ

  • ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ
  • విశాఖ ఉక్కు కర్మాగారం భూములు విలువైనవి
  • వాటిని విక్రయించడం నష్టదాయకం

విశాఖపట్టణం: విశాఖ ఉక్కు కర్మాగారం అప్పులు తీర్చడానికీ, కర్మాగారాన్ని సమర్థంగా నిర్వహించడానికీ కర్మాగారం కింద ఉన్న భూములను విక్రయించవచ్చునంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్మికులను కలుసుకున్నప్పుడు చేసిన ప్రతిపాదనను మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలనీ, భూములు విక్రయించరాదని కేంద్ర ప్రభుత్వానికిలేఖ రాయాలనీ కోరుతూ ముఖ్యమంత్రికి శర్మ ఒక లేఖ రాశారు. లేఖ పూర్తిపాఠం ఇది:

గౌరవనీయులు శ్రీ  వై ఎస్ జగన్ మోహన రెడ్డి గారు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 

అయ్యా,  

కేంద్రం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, ప్రైవేట్ కంపెనీలకు  ధారాదత్తం చేసే ప్రతిపాదనను వ్యతిరేకించాలని ఈనెల 4వ తారీఖున, 11వ తారీఖున మీకు నేను రాసిన రెండులేఖల నకళ్ళను జతపరుస్తున్నాను. మీరుకూడా ఆలస్యం చేయకుండా స్పందించి, ప్రధాన మంత్రిగారికి రాయడాన్ని స్వాగతిస్తున్నాను. విశాఖ పౌరుల తరఫునుంచి కూడా, ఈ విషయం మీద, ప్రధాన మంత్రి గారికి రాయడం జరిగింది.ఈ నెల 17వ తారీఖున, మీరు విశాఖ ఉక్కు కార్మికుల సంఘాలతో సమావేశం అయినప్పుడు, కర్మాగారంలో ఖాళీగా ఉన్న 7,000 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అమ్మి, అందునుంచి వచ్చే నిధులతో కర్మాగారాన్ని పునరుద్ధరించి, ప్రభుత్వ రంగం లోనే లాభాలు గడించే వ్యవస్థగా పెంపొందించాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అటువంటి ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎటువంటి పరిస్థితులలోను, కర్మాగారం భూములను అమ్మకూడదని కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించాలి.    విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి, గతంలో ప్రజా ప్రయోజనాలను  కారణంగా చూపిస్తూ, అప్పటి ప్రభుత్వాలు, రైతుల వద్దనుంచి మంచి వ్యవసాయభూములను బలవంతంగా సేకరించడం జరిగింది.

Also Read: జగన్ తో ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటీ

ఆ సందర్భంలో రైతుకుటుంబాలకు కర్మాగారంలో నష్టపరిహారమే కాకుండా, ఉద్యోగావకాశాలు కూడా కలిగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, అటువంటి అవకాశాలు అందరికీ లభించలేదు. ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూములను,  రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులకు బదలాయించడం భూసేకరణ చట్టాన్ని  ఉల్లంఘించినట్లు అవుతుంది. పైగా అటువంటి విలువైన భూములను వేలం వేస్తే, అతిచౌక ధరలకు భూమి, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం వలన లాభాలు  గణించేది, కొద్ది మంది వ్యాపారులు మాత్రమే. ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతారు. గతంలో ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారం భూములలో 2,000 ఎకరాలకు పైగా ప్రైవేట్ కంపెనీ అయిన గంగవరం పోర్టుకు అతి తక్కువ ధరకు ఇవ్వడాన్ని విశాఖ ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. 7,000 ఎకరాల భూమి మార్కెట్ ధర, ప్రస్తుతం 70 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చు. అటువంటి విలువైన భూముల  మీద, ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద నుంచి, భారీగా రుణాలను, కర్మాగారం యాజమాన్యం తీసుకోవచ్చును. కేంద్రం మంచి ఇనుప గనులను కేటాయించి, విదేశీ  ఉక్కుమీద సుంకాన్ని అధికం చేస్తే, కర్మాగారం ప్రభుత్వరంగ సంస్థగానే లాభాలతో ముందుకు పోగలదు. ప్రైవేట్ కంపెనీలకు, విదేశీ కంపెనీలకు యాజమాన్యాన్ని బదిలీ చేసే బదులు, కర్మాగారాన్ని విశాఖ ఉక్కు ఉద్యోగ సంఘాలకు బదలాయిస్తే, వారు సామర్ధ్యం తో కర్మాగారాన్ని నడిపించగలరు. కర్మాగారానికి, కావలసినది తనదైన ఒక మంచి ఇనుపగని మాత్రమే.

Also Read: “ఆంధ్రుల” హక్కులంటే అందరికీ “అంత” అలుసా…? 

ఈ విషయంలో, విశాఖ ఉక్కు కర్మాగారం భూములను అమ్మాలనే ప్రతిపాదనను, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులలోను సమర్ధించకూడదు. కేంద్ర ప్రభుత్వం, కర్మాగారాన్ని ఎలాగో ఒకలాగ ఒక విదేశీ కంపెనీకి, కొన్ని మన దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు బదలాయించే ప్రయత్నంలో  ఉన్నది. అటువంటి ప్రయత్నాలను చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించాలి.విశాఖ ఉక్కు కర్మాగారం భూములను అమ్మడంలో, మీరు స్పష్టంగా, మీద సూచించిన విధంగా, ఒక ప్రకటన చేయాలని కోరుతున్నాను. ప్రైవేట్ కంపెనీలకు కర్మాగారాన్ని బదలాయించే ప్రసక్తి ఉండకూడదు. ఈ విషయంలో నేను ముందే సూచించినట్లు, రాష్ట్ర శాసనసభకూడా ప్రజల ఉద్దేశాలకు అనుగుణంగా విశాఖ ఉక్కును ప్రభుత్వరంగ సంస్థగానే ఉంచాలని  తీర్మానం చేసి పార్లమెంటుకు తెలియపరిస్తే బాగుంటుంది. ప్రభుత్వరంగ సంస్థలను  పార్లమెంటులో  ఎటువంటి చర్చ లేకుండా ప్రైవేటీకరణ చేయడం తగదు. 

  ఇట్లు   

ఈఏఎస్ శర్మ 

విశాఖపట్నం

11-2-2021

Also Read: విశాఖ ఉక్కు అమ్మకం మరణ శాసనమే

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles