Friday, December 2, 2022

ఇండియాలో ఆక్సిజన్‌ వదిలే ఆవులున్నాయా?

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ లాగా – దేశంలోని అన్ని విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌లకు ఏడాది క్రితం ఒక సర్కులర్‌ పంపింది. తక్షణం విద్యార్థులందరికీ ఆవుపై ఓ పరీక్ష నిర్వహించాలన్నది – అందులోని సారాంశం! స్వదేశీ గోవుల ప్రాముఖ్యం గురించి, దాని చుట్టూ అల్లుకున్న వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాల గురించి – అంతే కాదు, ఆధ్యాత్మిక చింతనపై కూడా ప్రశ్నలుంటాయని యూజీసీ తెలిపింది. ఈ పరీక్షను రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ (ఆర్‌కెఎ) నిర్వహిస్తుందని, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులందరూ ఆ పరీక్ష రాయాలని యూజీసీ కోరింది. పదకొండు ప్రాంతీయ భాషల్లో, ఇంగ్లీషులో జరిగే ఈ పరీక్ష 25 ఫిబ్రవరి 2021న జరుగుతుందనీ, అందరూ ఆ పరీక్షరాసే విధంగా ప్రోత్సహించాలని వైస్‌-ఛాన్సలర్‌లను యూజీసీ ఆదేశించింది. ఇంతకూ యూజీసీ ఎందుకు అలా చేసిందీ అంటే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ గనక, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యూజీసీ కార్యదర్శి రజనీష్‌ జైన్‌ అలాంటి లేఖ / సర్కులర్‌ పంపించాడని అర్థమవుతూ ఉంది. తక్షణమే ఆవు శాస్త్రాన్ని అభివృద్ధి పరచాలని ప్రభుత్వం ఆరాటపడుతున్నట్టుగా ఉంది. అయితే ఆ పరీక్ష కోవిడ్‌ కారణంగా జరగలేదు.

Also read: నాస్తికత్వం ఒక విచారధార – జీవన విధానం

 ఇది ఇలా ఉండగా ఆవు పాలలో బంగారం ఉంటుందని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ప్రకటించారు. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. భారతదేశపు ఆవులకు మూపురం ఉంటుందని, దానిలో బంగారు ధమని (రక్తనాళం) ఉంటుందనీ, సూర్యకిరణాలు ఆ మూపురంపై పడినప్పుడు ఆవులో బంగారం ఉత్పత్తి అవుతుందని, అందుకే ఆవుపాలు పసుపురంగులో అంటే బంగారపు రంగులో ఉంటాయని ఆయన చెప్పారు. ఇంత గొప్ప ‘జ్ఞానాన్ని’ పాపం ఏ నోబెల్‌ కమిటీ గుర్తించడం లేదు. అయినా ఏముందీ, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి ఒక ‘గోవుల్‌ బహుమతి’ ఇచ్చినా ఇస్తుంది! ఆవు పాలలో బంగారం విషయం ప్రచారం కావడంతో గ్రామస్థులు చాలా మంది ఆవుల్ని తోలుకుని ఫైనాన్స్‌ కంపెనీల చుట్టూ, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. తమకు తమ ఆవులమీద ‘గోల్డ్‌ లోన్‌’ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దిలీప్‌ ఘోష్‌ తెలివి తక్కువ వ్యాఖ్యలకు గ్రామ సర్పంచ్‌లు, ఫైనాన్స్‌ కంపెనీల ఉద్యోగులు తలలు బాదుకుంటున్నారు. ‘బిటా-కెరోటిన్‌’ అనే పిగ్మెంట్‌ వల్ల ఆవుపాలు పసుపురంగులో ఉంటాయి. బంగారం వల్ల కాదు.

Also read: మనువాదం మట్టికరవక తప్పదు!

భారతదేశంలోని కొందరు హిందూ మత విశ్వాసకుల దృష్టిలో ఆవు పవిత్రమైన జంతువు. వారి విశ్వాసం వారు ఉంచుకోవచ్చు. అందులో తప్పులేదు. వారి విశ్వాసాన్ని వైజ్ఞానిక సత్యంగా మార్చాలనుకునే తాపత్రయం తప్పు. ఎవరి విశ్వాసాన్ని వారి వరకే పరిమితం చేసుకుంటే బావుంటుంది. కానీ, దాన్ని ప్రచారం చేయడానికీ విశ్వవ్యాప్తం చేయడానికీ కొందరు నానా తంటాలు పడుతున్నారు. పైగా తామే అసలైన హిందువులయినట్లు, తమ వాదనతో ఏకీభవించని వారంతా హిందువులే కాదన్నట్లు కూడా ప్రకటిస్తున్నారు. వారు ప్రచారం చేస్తున్న అబద్దాలేమిటీ? వాటిపై సైన్సు ఇచ్చిన వివరాలేమిటీ? ఒకసారి పరిశీలిద్దాం!

Also read: దశహరాకు వక్రభాష్యాలు ఆపండి!

ప్రచారం చేసిన అబద్దం: విషం ఆవును ఏమీ చేయలేదు. శివునిలా అది విషాన్ని గొంతులో దాచుకుని జీవిస్తుంది. ఈ విషయంపై న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆవుపై పరిశోధన జరిగింది. మూడు నెలల పాటు ప్రతి రోజూ ఒకసారి కొంత కొంత మోతాదులో ఆవుకు విషం ఇవ్వడం జరిగింది. ప్రతి రోజూ అది విసర్జించే మూత్రాన్ని, పేడను పరిక్షిస్తే ఎక్కడా విషపు జాడ కనబడలేదు. అలాగే దాని పాలను, రక్తాన్ని కూడా ప్రతిరోజూ పరీక్షిస్తూ వచ్చారు. ఏ పరిక్షలోనూ ఎక్కడా విషపు జాడలు కనబడలేదు. అంటే ఏమిటి? ఆవు విషాన్ని తన శరీరంలోకి పాకనివ్వలేదు. విషం దాన్ని ఏమీ చేయలేదు. ఏ జంతువుకూ లేని ప్రత్యేకత ఆవుకు ఉంది. అందువల్ల ఆవు మహిమాన్వితమైంది, పవిత్రమైంది – అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇలాంటి అనేక విషయాలు హిందూత్వవాదులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసి, అమాయక జనం మెదళ్ళను విషంతో నింపారు.

Also read: చిన్నారుల మెదళ్ళలో మతబీజాలు

వాస్తవం: ప్రముఖ శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబి) మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ బాల సుబ్రహ్మణ్యన్‌ రంగంలోకి దిగారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ సైంటిస్టులతో స్వయంగా మాట్లాడారు. చివరకు పై విషయాన్ని ఖండిస్తూ, ఆయన ఇచ్చిన వివరణ ఇలా ఉంది… ఈ విషయంలో నిజంగా పరిశోధన జరిగిందా? జరిగితే ఏ ఫలితాలు వచ్చాయి? – అని ఎయిమ్స్‌ పరిశోధకులను అడిగితే.. అలాంటి పరిశోధన ఏదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లోగాని, దేశంలోని ఇతర పరిశోధనా కేంద్రాల్లోగానీ జరుగలేదని, అసలు అలాంటి పరిశోధన జరగడానికే వీలులేదని చెప్పారు. ఎందుకంటే జంతువుల నైతిక విలువల కమిటీ’ – అని ఒకటుంది. అది ఏ జంతువుకైనా, కేవలం ప్రయోగం కోసమైనా విషమివ్వడానికి ఒప్పుకోదు. కనీసం ఒక్కసారైనా, ఒక్కరోజైనా విషం ఇవ్వడానికి ఒప్పుకోదు. జంతుశాస్త్రవేత్తలంతా చెప్పేదేమంటే ఆవు అన్ని జంతువుల లాంటిదేనని – దానికి ఎలాంటి ప్రత్యేక శక్తీ లేదని, జంతువులైనా, మనుషులైనా ఆహారం ద్వారా, మందుల ద్వారా, ఇంజక్షన్ల ద్వారా ఏవైనా పదార్థాల్ని లోపలికి తీసుకుంటే, అవి తప్పకుండా మల మూత్రాలలో, స్వేదంలో, పాలలో తప్పకుండా బయటకి రావాలి. అలా రాకపోవడమనేది జరగదు. జీర్ణక్రియ జరగని, శరీర ధర్మరీత్యా జీవక్రియలు జరగని నిర్జీవులలో మాత్రమే అది సాధ్యం! ఆవు-జీవలక్షణాలతో ఉన్న ఒక సాధారణ జంతువు. అందువల్ల ఎయిమ్స్‌ పరిశోధకులు విస్తృతంగా చర్చించిన  మీదట తేల్చిందేమంటే, సోషల్‌ మీడియాలో హిందూత్వ వాదులు ప్రచారం చేసింది కేవలం అబద్దం మాత్రమేనని!

Also read: రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు

ప్రచారం చేసిన అబద్దం: భూమి మీద ఉన్న జంతువులలో ఆవు ఒక్కటే ఆక్సిజన్‌ను పీల్చుకుని, తిరిగి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

వాస్తవం: మొక్కలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఏ జంతువుకూ ఆక్సిజన్‌ను విడుదల చేసే శక్తిలేదు. మనుషులుకానీ, జంతువులు గానీ పీల్చుకున్న గాలిని తిరిగి వదిలేసేప్పుడు వదిలే గాలితో పాటు కొద్దిపాటి ఆక్సిజన్‌ను వదులుతాయి. ఆవుకూడా అంతే! అది వదిలేసే గాలిలో కొద్దిపాటి ఆక్సిజన్‌ ఉంటుంది. మనుషులను పరీక్షించినా వారు వదిలేసే గాలిలో కొద్దిపాటి ఆక్సిజన్‌ ఉంటుంది. ఈ కారణం వల్లనే నీటిలో మునిగిన వారిని బయటికి తీసినప్పుడు నోటితో గాలిని ఊదడం మనకు తెలుసు. అలా ఎందుకు చేస్తారంటే వదిలే గాలిలో అంటే నోటి ద్వారా ఊదే గాలిలో కొంత ఆక్సిజన్‌ ఉంటుంది కాబట్టి! అది నీటిలో మునిగిన వ్యక్తికి కొంతలో కొంత ఆక్సిజన్‌ అందించినట్లవుతుంది. అంతే గాని, మొక్కల వలె ఆక్సిజన్‌ను వదిలే గుణం ఆవులకు లేదు. మనుషులతో సహా ఏ జంతువుకూ లేదు. ప్రకృతి విరుద్దంగా ఏదీ జరగదు.

Also read: మనిషి పక్షాన గొంతెత్తిన – పేరలింగం

ప్రచారం చేసిన అబద్దం: ఆవుపాలకు విషాన్ని విరిచే శక్తి ఉంది.

వాస్తవం: విషం అంటే ఏ విషం? అనేది స్పష్టంగా చెప్పలేదు. అది సయనైడా? లేక డిడిటినా? విషాన్ని ఆవుపాలు విరుస్తాయనడానికి రుజువులేదు. సైన్సు నిర్దారించలేదు. కాబట్టి దాన్ని చట్టమూ ఒప్పుకోదు. రుజువు చేయలేని అంశాన్ని రుజువైనట్లు ఎలా చెప్తారూ? అది నేరం అవుతుంది. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసేవారిని నేరుగా నేరగాళ్ళుగా పరిగణించి శిక్షించాలి.

ప్రచారం చేసిన అబద్దం: ఆవు మూత్రం విష క్రిముల్ని చంపుతుంది.

వాస్తవం: జంతువుది గానీ, మనిషిదిగానీ ఏమూత్రమైనా బాక్టీరియాను మాత్రమే చంపుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం! మూత్రంలో ఉండే ఎసిడిటీ, అమోనియా సంయోగ పదార్థాలు కలిసి బాక్టీరియాను చంపుతారు. ఆవు మూత్రంలో ఏ ప్రత్యేకతా లేదు. అన్ని జంతువుల, మనుషుల మూత్రానికి ఉండే లక్షణాలే దానికీ ఉంటాయి. కల్పించిన అవాస్తవాలకు రుజువులుండవు కదా? ఏప్రిల్‌ 2012 నాటి ”ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఫార్మాసుటికల్‌ రీసర్చ్‌” అనే వైజ్ఞానిక పరిశోధక పత్రికలో ఎ. ఆహుజా ప్రకటించిన విషయం ఇది. విషయమేమంటే, విషపూరితమైన సూక్ష్మక్రిముల్ని ఏ మూత్రమూ చంపలేదు – అని!

Also read: ఇవి కేవలం భారత దేశంలోనే జరుగుతాయి!

ప్రచారం చేసిన అబద్దం: నేలను ఆవుపేడతో అలికితే అది మనుషుల్ని రేడియో తరంగాల నుండి కాపాడుతుంది.

వాస్తవం: రేడియో తరంగాలు అనే పదం విశాలమైన అర్థంతో కూడిన పదం. దాని ప్రభావం తరంగ దైర్ఘ్యం, శక్తి తీవ్రత, ఫ్రీక్వెన్సీ లాంటి వివరాలు ఉంటే గాని, రేడియో తరంగాల ప్రభావాన్ని వివరించలేం. ఇదొక అవాస్తవం గనక దీనికి నిరూపణ దొరకదు. అసలైతే నేలను, గోడలను ఆవుపేడతో అలికినా, అలుకకపోయినా రేడియో, టీవీ, సెల్‌ఫోన్‌, వైఫైలు క్షేమకరంగానే పనిచేస్తాయి. తరంగాల ప్రత్యేక స్పెసిఫికేషన్లు చెప్పకుండా, ఊరికే ప్రకటనలు చేస్తే సరిపోదు. అందువల్ల ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోనక్కరలేదు.

ప్రచారం చేసిన అబద్దం: పది గ్రాముల ఆవు నెయ్యిని నిప్పుల్లో పోస్తే (యజ్ఞ యాగాదుల్లో పోస్తే) ఒక టన్ను – అంటే వెయ్యి కేజీల ఆక్సిజన్‌ విడుదల అవుతుంది.

వాస్తవం: ఇది భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తి విరుద్ధమైంది. ఏ ప్రయోగంలోనైనా, పది గ్రాముల పదార్థం వెయ్యి కిలో గ్రాముల పదార్థాన్ని సృష్టించలేదన్నది సైన్సు చెప్పే వాస్తవం. మన పూర్వీకులైన మునులు ఎప్పుడో కనుగొన్నారని అబద్దాలు చెప్పడం ఆత్మద్రోహమే! పైగా వారి ప్రకటనలను వ్యతిరేకించే వాళ్ళు హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని విమర్శించడం బుద్ధిలేని పని! యేం? మనోభావాలనేవి ఒక వర్గానికి మాత్రమే ఉంటాయా? అందరికీ ఉండవా? పైగా వాస్తవాలు చెప్పే వారిపై దాడిచేయడం ఏమైనా విజ్ఞత అనిపించుకుంటుందా? విశ్వాసాలతో ప్రపంచం గతంలో ముందుకు పోలేదు. ఇప్పుడూ పోవడం లేదు. సెంటిమెంట్లు, మనోభావాల పేరుతో అవాస్తవాల్ని ప్రచారం చేస్తే వివేకవంతులైన ప్రజలు వాటిని అవాస్తవాలుగానే స్వీకరిస్తారు. వాస్తవాలుగా ఒప్పుకోవాలంటే సత్యనిరూపణ జరగాలి. వైజ్ఞానిక పరీక్షలకు పరిశోధనలకు నిలబడాలి. అలా నిలబడని వన్నీ ఊకదంపుడు ప్రకటనలే. మరీ ముఖ్యంగా ముఖ్యమైన పదవుల్లో ఉండి, ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే వారికి ప్రజలు సరిగానే బుద్ధి చెపుతారు. గతంలో లాగా ప్రజలిప్పుడు అంత అమాయకులేం కాదు. చిన్న తనం నుండీ ప్రశ్నించే తత్వం అలవర్చుకుంటున్న కాలం ఇది.

Also read: భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

డాక్టర్‌ దేవరాజు మహారాజు

(వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.)

Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles