Tuesday, November 12, 2024

నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి!

దీపావళి అంటే దీపాల వరుస. చుట్టూ ఉన్న చీకట్లను  పారద్రోలి వెలుగు నింపడానికి సంకేతంగా ఆ పండగ చేస్తున్నామని చెపుతారు. చెడు మీద మంచి సాధించిన విజయం అని కూడా చెపుతారు. అయితే, దాని చుట్టూ అల్లుకున్న పౌరాణిక గాథలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు, నరకాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సొమ్మసిల్లి పోయాడనీ, పక్కనే ఉన్న సత్యభామ ఉగ్రరూపం దాల్చి, బాణాల వర్షం కురిపించి నరకాసురుణ్ణి సంహరించిందనీ – ఒక పౌరాణిక గాథ ఉంది. మహకాళి రాక్షస సంహారం చేసినందుకు దేవీనవరాత్రులు జరుపుకున్నట్టు – మరో కథనం ఉంది. ఇవి కాక, దశ-హర (దసరా)కు, దీపావళికి దగ్గరి సంబంధం ఉంది. ఆ రెండు పండుగలు వెంటవెంటనే వస్తాయి. రాముడు లంకాధీశుడైన పదితలల రావణుణ్ణి చంపినందువల్ల దసరా జరుపుకుంటున్నామని చెపుతారు. దశ-హరా అంటే పది తలలు నరికేయడం. రావణుడి పది తలలు నరికి సంహరించిన తర్వాత, రాముడు సీతాలక్ష్మణులతో సహా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటున్నామని కథ చెపుతారు. పౌరాణిక గాథలు బావున్నాయి కాని, పురాణ పాత్రలు చనిపోతే, పురాణ పాత్రలు విజయం సాధిస్తే పండగలు జరుపుకోవడం ఏమిటీ? ఇందుల్లో ఉన్న అసలు మతలబు ఏమిటీ? విషయం తెలుసుకోవాలన్న ఉత్సుకత, గతాన్ని అవలోకనం చేసుకోగల సామర్థ్యం, ఓపిక ఉంటే నిజాలు బయటపడతాయి. మన పెద్దవాళ్ళు చెప్పారనో, జరుపుకోవడం మన ఆచారం అనో, ఆనవాయితీ అనో…కల్పిత గాథల ఆధారంగా అనాలోచితంగా జరుపుకుంటే జరుపుకోవచ్చు. కానీ, వాస్తవం వేరే ఉంది.

సాహిత్య రచనల్లో పాత్రల మధ్య యుద్ధాలు జరగొచ్చు. కొట్లాటలు జరగొచ్చు. ఓ పాత్ర విజయం సాధించొచ్చు. మరో పాత్ర పరాజయం పొందొచ్చు. అంత మాత్రానికి ప్రజలు ఉబ్బితబ్బిబై పండగలు జరుపుకోవాలా? పురాణపాత్రలు మరణిస్తే పండగలు, వేడుకలు జరుపుకోవడం ఎందుకూ? ఒక వేళ ప్రపంచం మొత్తానికి సంబంధించింది అయితే, అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిసి జరుపుకునేవి. కానీ, భారత దేశంలోని దాదాపు అన్ని పండుగలు పురాణాల్లోని రాక్షసుల మరణాలపైనే ఎందుకు జరుపుకుంటున్నారూ? ఆలోచించాలి కదా? రాముడు ఆర్యుడు. బయటి నుంచి వచ్చిన ఆర్యులకు ఇక్కడి మూలవాసులైన ద్రావిడులకు మధ్య జరిగిన సంఘర్షణల్ని పురాణాలుగా రాసుకున్నారని పెరియార్ చెప్పారు. ఇక్కడి మూలవాసుల్ని కోతులుగా, రాక్షసులుగా చిత్రించి, ఆర్యులు అవమానించారని కూడా ఆయన చెప్పారు. ఉత్తర భారత దేశంలో పండగలని ‘త్యౌహార్’ అని అంటారు. హిదీలో తూహారా- అంటే ‘‘నువ్వు పరాజితుడివయ్యావు’’- అని అర్థం. రావణుడు, నరకాసురుడు వగైరా ఎవరు పరాజితులైనా పండుగ జేసుకోవడానికి ఈ పదం వాడుతారు. ఎదుటివారి (శత్రువు)పరాజయాన్ని లేదా మరణాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవడమే  – త్యౌహార్.

Also read: శాస్త్రీయ అవగాహన పెంచిన కొడవటిగంటి వ్యాసాలు

పురాణాలన్నీ బుద్ధుడి తర్వాత రాసుకున్నవే

పురాణాలన్నీ బుద్ధుడి తర్వాత రాసుకున్నవేనని – బౌద్ధాన్ని నాశనం చేసే క్రమంలో రాయబడ్డాయని రూఢిగా తెలిసిపోయింది. పుష్యమిత్ర శృంగుడిని దృష్టిలో ఉంచుకుని రాముడి పాత్రకు రూపకల్పన జరిగిందని స్పష్టమైంది. మరి ఇక్కడ ఈ దీపావళికి అసలు కారణమేమిటి? దానిని ముందు ఏమని పిలిచేవారు? అది ప్రజాజీవనంలోకి ఎలా వచ్చింది? అసలు కారణం తెలుసుకోవాలంటే మనం గౌతమ బుద్ధుడి విషయాలు లేదా అతని మార్గాన్ని అవలంబించిన చక్రవర్తి అశోకుడి విషయాలు మాట్లాడుకోవాలి. సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత, తన నగరమైన కపిలవస్తుపురానికి వెళ్ళలేదు. తండ్రి శుద్ధోధనుడు బుద్ధుణ్ణి ఒప్పించి తీసుకురావల్సిందిగా కొంతమందిని పంపాడు. వారు బుద్ధుడిని అన్వేషిస్తూ  వెళ్ళారు. కానీ, అతడి ప్రభావానికి లోనై…ఆయనతో పాటే ఉండిపోయారు. తండ్రి శుద్ధోధనుడు మనుషుల్ని పంపుతూ ఉన్నాడు. కానీ, వెళ్ళినవారు వెళ్ళినట్టు  బుద్ధుడి దగ్గరే బౌద్ధభిక్కులుగా ఉండిపోతున్నారు. అలా పదిహేడు సంవత్సరాలు గడిచిపోయ్యాయి. చివరకు ఎలాగో బుద్ధుడు తన నగరానికి బయలు దేరాడు. ఆయన వస్తున్నాడని తెలిసి స్వాగతం పలకడానికి పురప్రజలు సంసిద్ధులయ్యారు. అప్పటికి వర్షాకాలం అయిపోయింది. వరదలకు కొట్టుకొచ్చిన చెత్తాచదారం వీధుల్లో ఉంది. వర్షాలకు నాని ఇళ్ళు నిమ్ముగా అయ్యాయి. ప్రజలు వీధులు శుభ్రం చేసుకుని, ఇళ్ళు శుభ్రం చేసుకుని, గోడలకు వెల్ల వేసుకుని, గుమ్మాలకు పూలమాలలు వేలాడేసుకుని సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నారు. ఆ రోజు అమావాస్య గనక, నగరమంతా దేదీప్యమానంగా దీపాలు వెలిగించారు. ఉన్నవారు లేనివారికి మంచి ఆహారం అందించారు. ఉన్నవారు లేనివారికి దీపాలు దానం చేశారు.అదే దీపదానోత్సవంగా స్థిరపడింది.

దీపావళి ముగ్గు, దీపాలతో ముంగిలిని అలంకరిస్తున్న మహిళ

దీపం అంటే జ్ఞానానికి సంకేతం. ప్రాణానికి సంకేతం. జ్ఞానవంతుడై ప్రపంచానికి జ్ఞానాన్ని వెదజల్లిన బుద్ధుడి రాకకు సంకేతమే దీపదానోత్సవం! బుద్ధుడు తన జ్ఞానాన్ని ప్రపంచానికి దానం చేశాడని చెప్పడానికి ప్రతీకే – ఈ దీపాలు వెలిగించడం! ఇది చరిత్రకు సంబంధించిన విషయం గనుక ఆధారాలు ఉంటాయి. పురాణ సంఘటనలకు చారిత్రక ఆధారాలు ఉండవు. అందుకే లక్ష్మి గణేష్ పూజకు, నరకాసుర వధకు ఎక్కడ ఏ ఆధారమూ దొరకదు. దీపదానోత్సవం – అంటే జ్ఞానదానోత్సవంగా మనం అర్థం చేసుకోవాలి. ఆలోచిస్తే ఇది సబబుగా తోస్తుంది. వైదిక ధర్మప్రబోధకులు ప్రచారం చేసినవి అన్నీ కల్పించిన కట్టుకథలని తెలుస్తూనే ఉంది. శ్రీకృష్ణుడు, నరకాసురుడు, సత్యభామ, లక్ష్మిగణేశుడు అన్నీ పురాణాల్లో కల్పించిన పాత్రలు. వాస్తవంగా ఈ దేశంలో పుట్టి పెరిగిన వారు కాదు. బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి రావడాన్ని రాముడు అయోధ్యకు తిరిగి రావడంగా మార్చి రాసుకున్నారు. భ్రమల్ని నమ్ముతూ బతికే వారితో మనకు గొడవ లేదు. వారి భ్రమల్ని మనం నమ్మాలంటేనే గొడవ. అది జరిగే పని కాదు.

Also read: ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!

వెలుగుని ఇతరులక్కూడా పంచడం

దీపదానోత్సవం అంటే మన ఇంటి వెలుగుని ఇతరులక్కూడా పంచడం. మన జ్ఞానాన్ని ఇతరులక్కూడా పంచడం అనేది ఇక్కడ ప్రతీకగా తీసుకోవాలి. పదిహేడేళ్ళ తర్వాత తిరిగి వచ్చిన సాఖ్యముని తథాగతుని మనస్ఫూర్తిగా ఆనందంగా ఆహ్వానించడమే – దీపదానోత్సవమైంది. కామన్ ఎరా కు (BCE) ముందు జరిగిన ఒక సంఘటన అది. ఇందులో భ్రమలు, కల్పితాలూ లేవు. బుద్ధుడు వాస్తవంగా ఈ నేలమీద తిరిగినవాడు. బుద్ధుడి కరుణను, దయాగుణాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఈ రోజు వరకూ ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బుద్ధుడి తర్వాత చాలా కాలం గడిచిపోయింది. మౌర్యచక్రవర్తి అశోకుడి (304-232 BCE) కాలం వచ్చింది. ఆయన ఈ దేశ మూలవాసి. బహుజనుడు. మౌర్య అనేది మోర్ – నెమలి…వారి అధికారిక పక్షి వల్ల వచ్చింది. ఆయన కళింగయుద్ధంలో విజయం సాధించాడు. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగినందుకు, లక్షలమంది నిరాశ్రయులైనందుకు విజయ గర్వంతో ఆయన వేడుకలు చేసుకోలేదు. ఆత్మవిమర్శ చేసుకున్నాడు. పశ్చాత్తాపంతో దుఃఖించాడు. ఆయుధాలు త్యజించి అహింసను ఆహ్వానించాడు. హింసాత్మకంగా విజయాలు సాధించి వేడుకలు చేసుకున్న చక్రవర్తులు ప్రపంచ చరిత్రలో ఉన్నారు. కానీ, విజయానికి కృంగిపోయి, యుద్ధాన్ని త్యజించి, శాంతిని ఆహ్వానించిన ఒకే ఒక్క మహనీయుడు అశోక చక్రవర్తి. మానసిక పరివర్తన వల్ల తను చేసిన రక్తపాతానికి పరితపిస్తూ బౌద్ధమార్గం స్వీకరించాడు. అలాంటి సందర్భంలో శోకతప్త హృదయంతో సంతాపదినాలు ప్రకటించాలి. కానీ ఆయన అలా చేయలేదు. అంధకారాన్ని పారద్రోలే దీపాలు వెలిగించమన్నాడు. వేలవేల దీపాలతో ప్రజల జీవితాల్లో శాంతి, అహింస, సత్యం, నిజాయితీ, నిబద్ధత, నైతికతలు వెలిగిపోవాలని ఆకాంక్షించాడు.

Also read: దళితుల రక్షణకోసం అవార్డు వాపసీ

‘నువ్వే దీపం అవ్వు’

దీపదానోత్సవ వివరాలన్నీ పాళీ భాషలో రాయబడ్డ శ్రీలంక బౌద్ధ గ్రంథంలో లభించాయి. దాన్ని మన భారతీయుడు డాక్టర్ వాల్మీకి ప్రసాద్ ‘‘దీప్ వంశ్’’-పేరుతో హిందీలోకి అనువదించారు. ఇదే కాకుండా ఇరానియన్ మేధావి, యాత్రికుడు, ఆంత్రపాలజిస్ట్, పరిశోధకుడు అయిన అబూ రేహాన్  అల్-బిరూనీ (973-1048 C.E.) తన ‘‘అల్ – బిరూనీ క భారత్ ’’- అనే గ్రంథంలో దీపదానోత్సవ విశేషాలు నమోదు చేశారు. ఆయన విదేశీయుడు. ఆయన గమనించచిన విషయాలే ఆయన నమోదు చేసి ఉంటారు. ఆ పుస్తకం రాసేనాటికి మన దేశంలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న పౌరాణిక గాథలేవీ లేవు. అందుకే ఆయన రాయలేదు. ఆ కాలంలో దీపదానోత్సవాన్ని – దీపదానోత్సవమనే పిలిచేవారు. అది బౌద్ధ దమ్మం అవలంభించేవారికి ఒక పర్వదినం! ఆ గ్రంథం అనేక ప్రపంచ భాషల్లోకి వెళ్ళింది. డా. అంబేడ్కర్ మిత్రుడు సత్ రామ్ బీన్ దాన్ని హిందీలోకి అనువదించారు. ఆ గ్రంథంలోని 530 వ పేజీలో దీపదానోత్సవం గురించి వివరంగా రాయబడింది. ఇవే కాక మనకు మరొక ఆధారం ఉంది. వేదాలు నాలుగింటికి తన వ్యాఖ్యానం జోడించి ప్రకటించిన గంగాశరణ్ శర్మ ఒక మాట చెప్పారు. ‘‘వైకల్పిక ప్రకాశ్ – వేదాలలో ఎక్కడా లేదు’’- అని నిర్ధారించారు. వైకల్పిక అంటే కల్పించిన – ప్రకాశ్ అంటే వెలుగు. అంటే మనిషి తన బుద్దిని ఉపయోగించి రూపొందించిన వెలుగు – కొవ్వొత్తి, లాంతరు, దీపం, ఎలక్ట్రిక్ బల్బు ఏదైనా కావొచ్చు. సూర్యుడు, చంద్రుడు ప్రకృతిసిద్ధంగా వెలుగునిచ్చేవి. మనిషి తన జ్ఞానంతో వెలిగించిన దీపాల ప్రసక్తి వేదాలలో లేదు – అని శర్మగారు చెప్పారు. అందువల్ల, దీపం బౌద్ధసాహిత్యంలోంచి వచ్చిందే. బుద్ధుడే స్వయంగా ‘‘అత్ దీపోభవ’’ అన్నాడు. అంటే ‘నువ్వే దీపం అవ్వు’ అని అర్థం!

Also read: ‘‘మేం చదువుకోవాలి’’ అంటూ నినదించిన కమలా భాసిన్  

మనువాదుల దాడిలో తీవ్రంగా గాయపడి, ప్రాణాలు విడిచిన బుద్ధుడి అనుచరుడు మౌద్యాల్యన్ స్మృతిలో కూడా  అదే కార్తిక అమావాస్యరోజు దీపాలు వెలిగించి,నివాళులు అర్పించాలని అశోకుడు ప్రకటించాడు. అంతే కాదు, తన రాజ్యంలోని గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో అన్ని చోట్లా 84 వేల బౌద్ధ స్థూపాలు, బౌద్ధ విహారాలు, సంఘారామాలు, విద్యాలయాలు, చికిత్సాలయాలు కట్టించాడు. కేవలం మూడేళ్లలో అవన్నీ పూర్తయ్యాయి. వాటన్నిటినీ ఇదే కార్తీక అమావాస్య రోజు – దీపదానోత్సవం రోజు ప్రారంభింపజేశాడు. మొదటిసారి పశువుల చికిత్సాలయాలు అశోకుని కాలంలోనే ఏర్పడ్డాయి. రహదారుల వెంట మనుషులకు-పశువులకూ విడివిడిగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయబడింది. మనుషుల గురించే కాదు, పశుపక్ష్యాదుల గూర్చి కూడా ఆలోచించాలని చెప్పింది బౌద్ధధమ్మమే! అందుకే బౌద్ద స్థూపాలు, బౌద్ధారామాల శిధిలాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా కనిపిస్తూనే ఉన్నాయి. అంతకన్నా సాక్ష్యాలేం కావాలి?

Also read: నిజం బతికే రోజు రావాలి!

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles