Thursday, September 19, 2024

పులుల పరిరక్షణ

  • భారత్ లో పులుల వేటపై నిషేధం ఉన్నా పులికి రక్షణ లేదు
  • పులిపై వ్యాపారం అక్రమంగా చేస్తున్నవారిపై అదుపు లేదు
  • పులిని అన్ని రకాలా వాడుకుంటున్న మనిషి
  • తగ్గుతున్న పులుల సంతతి

జూలై 29 వ తేదీ ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం’. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుక నిర్వహిస్తారు. సుమారు పుష్కర కాలం నుంచి సాగుతోంది. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన పులుల సంరక్షణా సమావేశంలో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ దిశగా ప్రజల్లో అవగాహన కల్గించడమే దీని ముఖ్యోద్దేశం. ఈ అంశాలను సమీక్షిస్తే ఆశించిన  స్థాయిలో అవగాహన పెరగలేదనే చెప్పాలి. అంతరించిపోతున్న జంతువుల జాబితాలోకి పులులు కూడా చేరిపోయాయన్నది చేదునిజం. పులుల ఉనికి ఎంతో అవసరమని శాస్త్రవేత్తలు గుర్తించారు. తగ్గిపోతున్న వాటి సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపట్టమని ప్రభుత్వాలకు వినతులు వెళ్తూనే ఉన్నాయి. ఎక్కువ దేశాల పాలకులు ఈ వినతులను పెద్దగా లక్ష్యపెట్టడం లేదని సంఖ్య తగ్గిపోతున్నట్లు తెలిపే నివేదికలే ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

Also read: కార్గిల్ విజయస్ఫూర్తి

ముప్పావు శాతం పులులు భారతావనిలోనే

ప్రపంచంలోని  మొత్తం పులుల సంఖ్యలో దాదాపు 75శాతం మన దేశంలోనే ఉన్నాయి. పులులకు అతిపెద్ద, సురక్షిత నివాస ప్రాంతాల్లో భారతదేశం ఒకటని తెలుస్తోంది. భారతదేశంలో గడచిన ఒకటిన్నర దశాబ్ద కాలంలో పులుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. నాలుగేళ్ళకు ఒకసారి ఈ లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. 2018 గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 2,967 పులులు ఉన్నట్టు వెల్లడించారు.అభివృద్ధి – పర్యావరణం మధ్య సమతుల్యతను సాధించడం జీవఆవశ్యకతలో ముఖ్యమైంది. వేటపై నిషేధం, అవగాహనా కార్యక్రమాలు, చట్టాలను కట్టుదిట్టడం చేయడం మొదలైన చర్యల ద్వారా పులుల సంరక్షణను సాధించవచ్చు. కానీ అది సక్రమంగా జరగడం లేదన్నదే నిపుణుల, జంతుప్రేమికుల  ఆవేదన. “మనిషి మాంసం రుచికి అలవాటు పడిన పులి మనుషుల కోసం వేటాడుతుంది, వెంటాడుతుంది, వెంపర్లాడుతుంది” అని అంటారు. పులుల సంగతి అలా ఉంచగా, పులులపై అక్రమ వ్యాపారం చేసి డబ్బులు సంపాయించే ఆకలికి అలవాటు పడిన మనిషి వల్ల, మనుషులు చేసే పనుల వల్ల పులుల సంఖ్య తగ్గిపోతోంది. పులుల ఉనికి ప్రశ్నార్ధకమవుతోంది. ఈ శతాబ్దంలోనే పులిజనాభా 93శాతం తగ్గిపోయిందని సమాచారం. పశ్చిమ, మధ్య ఆసియా, జావా, బాలి ద్వీపాలు, ఆగ్నేయ ఆసియా, చైనాల్లోని విశాలమైన ప్రాంతాల్లో పులి చాలా వరకూ కనుమరుగై పోయింది.  ఈ నేపథ్యంలో 1986లోనే పులిని అంతరించి పోతున్న జాబితాలో చేర్చారు. పులుల ఆవాస ప్రాంతాలు ధ్వంసమైపోవడం, వాటి నివాసాల్లో విభజన రావడం, వేట మొదలైన కారణాలతో పులుల సంఖ్య క్షీణించిపోయిందని తెలుస్తోంది.

Also read: బూస్టర్ డోస్ కు నో చెప్పకండి

పులికీ, మనిషికీ ఘర్షణ

భూమిపై ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాలలోనూ నివసించడం వల్ల పులికి – మనిషికి మధ్య ఘర్షణ వాతావరణం కూడా పెరిగింది. బుద్ధిబలమున్న మానవుడి ముందు అంతటి శారీరక బలమైన జంతువు కూడా ఓడిపోయింది. పులిని మనం ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నాం. జెండాల చిహ్నాలకు, దుస్తులకు, ఆయుధాలకు, ఆభరణాలకు, క్రీడా జట్ల చిహ్నాలకు, సర్వ గర్వ ప్రదర్శనకు, కథలకు, సినిమా పేర్లకు, సర్కస్ లకు, వినోదాలకు, విహారాలకు.. ఒకటేమిటి అన్ని రకాలుగా వాడుకున్నాం. వాటి అవయవ భాగాలు కొన్నింటికి దివ్యఔషధాలు. పులివేట నిన్నమొన్నటి వరకూ రాజసానికి, వీరానికి చిహ్నంగా భావించేవారు. అదొక పెద్ద క్రీడగా అవతరించింది. రాజుల కాలం నుంచి ఆ  వినోదవిహారం మానవాళిలోకి ప్రవేశించింది. పులిచర్మాలకు ఉన్న గిరాకీ అంతాఇంత కాదు. ఈ వ్యాపారం ఇప్పటికీ అనేక చోట్ల పెద్దస్థాయిలో జరుగుతోంది. పులిగోర్ల గురించి తెలిసిందే. పులి అవయవాల వాణిజ్యం, వ్యాపారం చట్టరీత్యా పెద్ద నేరం. చట్టవిరుద్ధమని ప్రభుత్వాలన్నీ ప్రకటించాయి. ఎన్ని నిషేధాలు వచ్చినా ఆ బ్లాక్ మార్కెట్ సాగుతూనే ఉంది.

Also read: అటు పోరాటం, ఇటు ఆరాటం

జీవవైవిధ్యం పరిరక్షించాలి

చైనా కేంద్రంగా పెద్దఎత్తున ఈ అక్రమ వ్యాపార క్రీడ యదేచ్ఛగా సాగిపోతోందని కథనాలు వెల్లువవుతూనే ఉన్నాయి. తైవాన్,దక్షిణ కొరియా, జపాన్ మొదలైన దేశాల్లో రవాణా బ్రహ్మాండంగా జరుగుతోందనే ప్రచారం ఉంది. అందిన కాడికి ఎవరి స్థాయిలో వారు ఈ మార్గాలలో డబ్బులు సంపాయిస్తూనే ఉన్నారు. పరిణామక్రమంలో, ప్రస్థానంలో, ఆధునిక జీవనంలో కొండలు, కోనలు, అరణ్యాలు కూడా మనిషికి ఆవాసమయ్యాయి. వనారణ్యాలు తగ్గిపోయాయి. జనారణ్యాలు పెరిగిపోయాయి. జంతువులు నివసించే ప్రాంతాలలోకి మనం వెళ్లిపోయాం. వాటికి దిక్కులేక, అప్పుడప్పుడు నరసంచారాల్లోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఊర్లకు దూరంగా ఉండే స్మశానాలు,  ప్రజలకు ఉపయోగపడే చెరువులు, పంటపొలాలు కూడా మనిషికి నివాసస్థానాలయ్యాయి. శృతిమించిన, మతితప్పిన భూవ్యాపారాలకు పేదమానవులతో పాటు నోరులేని మూగజీవాలు కూడా ఆర్తనాదాలు చేస్తున్నాయి. సృష్టిలోని ప్రతి జీవీ విలువైనదే. ప్రతిదాని వల్ల అవసరం,  ప్రయోజనం ఉన్నాయన్నది సత్యం. అన్ని జీవరాసులతో పాటు, పులులను కూడా సంరక్షించుకోవాలి. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వాలు, ప్రజలు కలిసి సాగాలి.

Also read: రాజరాజ పట్టాభిషేకం – నన్నయ సహస్రాబ్ది

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles