Thursday, April 25, 2024

బీహార్ బాహాబాహీ: ఫలితం ఊహకందని ఎన్నికలు

  • తొలిదశ ప్రశాంతంగా ముగిసింది
  • వృద్ధ రాజకీయవాదులకూ, యువకులకూ మధ్య పోరు
  • చిరాగ్ పాసవాన్ చక్రం తిప్పుతాడా?
  • తేజస్వి అందరి అంచనాలనూ తలకిందులు చేస్తాడా?
  • నితీశ్ నాలుగోసారి గెలుస్తారా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరభేరీలోని తొలి దశ ముగిసింది. పార్టీలన్నీ బాహాబాహీ తలపడుతున్న ఘట్టాలు ఆ రాష్ట్రంతో పాటు దేశంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఇంకా తగ్గక ముందే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించి, బిజెపి కరోనాను కూడా ప్రచార అస్త్రంగా మలుచుకుంది.ఈ ప్రభావాలు ఓట్ల రూపంలోనూ, ప్రజల ఆరోగ్య రూపంలోనూ త్వరలోనే తెలుస్తాయి. రెండు వారాలలోపే అందరి జాతకాలూ బయటకు వస్తాయి. రాజు ఎవరో  నవంబర్ 10వ తేదీన తేలిపోతుంది. మొత్తం 243అసెంబ్లీ స్థానాల్లో తొలి దశలో 71స్థానాల్లో బుధావారంనాడు పోలింగ్ ముగిసింది.50శాతంకు పైగా పోలింగ్ నమోదైంది.

నితీశ్, మోదీలకు పెను సవాల్

మరో రెండు విడతల్లో మిగిలిన స్థానాలకు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు అందరికీ అగ్నిపరీక్షగా మారాయి. ముఖ్యంగా, నితీశ్  కుమార్ కు ఈ ఫలితాలు చాలా కీలకం. నరేంద్రమోదీ నాయకత్వానికి కూడా ఇది పెద్ద సవాల్. బీహార్ ఎన్నికల్లో  యువతరం నాయకులు ప్రధాన పోటీదారులుగా ఉండడం ఈ సారి ఎన్నికల ప్రత్యేకత. అలాగే, రాజకీయ వృద్ధుడు లాలూ ప్రసాద్ యాదవ్ క్షేత్రంలో లేకపోవడం మూడు దశాబ్దాలలో ఇదే మొదటిసారి కావడం, నేటి బీహార్ ఎన్నికల్లో మరో ప్రత్యేకత. పాత తరానికి చెందిన నితీశ్ కుమార్ -యువతరానికి చెందిన తేజస్వి యాదవ్ -చిరాగ్ పాసవాన్ ల మధ్య సాగుతున్న ఈ పోరు రసకందాయంగా మారింది.

ముఖ్యమంత్రి పదవికోసం ముగ్గురు పోటీ

ముఖ్యమంత్రి పదవి కోసం ఈ ముగ్గురూ పోటీ పడుతున్నారు.అధికారంలో ఉన్న బిజెపి,జెడియులు  ఒక వర్గంలో ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్ జె డి,వామపక్షాలు ఇంకో వర్గంలో ఉన్నాయి. ఎల్ జె  పి (లోక్ జన్ శక్తి పార్టీ) మరో వర్గంగా ఉంది. ఎన్నికల్లో గెలిస్తే, మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని బిజెపి అధిష్టానం కూడా ప్రకటించింది. ఆ మాట ఎంతవరకూ నిలబెట్టుకుంటుందన్న విషయం ఫలితాల తర్వాత  తేటతెల్లమవుతుంది. యువనేత,రామ్ విలాస్ పాసవాన్ వారసుడు, ఎల్ జె పి  రథసారథి చిరాగ్ పాసవాన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో,  ఈ పార్టీ 30నియోజకవర్గాలకు మించకుండా ఎన్నికల బరిలో నిలుచుంది. ఆరు శాతం మించి ఎప్పుడూ ఓట్లు పడలేదు. ఈసారి భిన్నంగా, మొట్టమొదటగా,  134 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీలో నిలబెట్టింది.

చిరాగ్ సాహసోపేతమైన వ్యూహం

ఈ సాహసం, ఈ వ్యూహం చిరాగ్ చేపట్టాడు. నితీశ్ కుమార్ నే  తన ప్రధాన ప్రత్యర్థిగా యువనేత భావిస్తున్నాడు. ముఖ్యమంత్రి పీఠం నుండి అతన్ని గద్దె దింపడమే తన ప్రధాన లక్ష్యమని చెబుతున్నాడు. దీనికి సమాంతరంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటే తనకు ఎంతో ప్రేమ అని చిరాగ్ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాడు. అగ్రనేతలు అమిత్ షా, నడ్డాతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇటీవలే తండ్రి రామ్ విలాస్ పాసవాన్ దివంగతుడయ్యారు. బహుశా! నరేంద్రమోదీని తన సంరక్షకుడుగా భావిస్తున్నాడేమో!మొట్టమొదటిగా ఇన్ని సీట్లకు పోటీచెయ్యడం వెనకాల ప్రత్యేక వ్యూహం వుంది. తన బలాన్ని పరీక్షించుకోవడం, ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు వస్తే, రేపు బేరసారాలు జరుపుకోడానికి  వీలుంటుందనే ఆలోచనలు  కూడా ఉన్నాయని అనిపిస్తోంది.

బీజేపీ లేని చోటే చిరాగ్ పార్టీ  పోటీ

బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో చిరాగ్ తన పార్టీ నుండి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఇది కూడా వ్యూహంలో భాగమే.నితీశ్ కుమార్ కు ప్రత్యామ్నాయంగానూ, దళిత వర్గాల్లో పెద్ద నేతగానూ, దేశ రాజకీయాల్లో మహానేతగానూ అవతరించడానికి, బహుళ,  భవిష్య వ్యూహంతో ముందుకు సాగుతున్నాడు. నితీశ్ కుమార్ పాలనపై వున్న వ్యతిరేకత, రాంవిలాస్ పాసవాన్ సెంటిమెంట్, యువతరం నేతగా ఆకర్షణ మొదలైనవన్నీ కలిసొస్తే, లోక్ జన్ శక్తి పార్టీకి గతంలో కంటే కాసిన్ని ఓట్లు, సీట్లు పెరిగే అవకాశం ఉంది. యువనేత చిరాగ్ పాసవాన్ నాయకత్వ పటిమకు తొలి ఫలితాలు మరి కొద్ది రోజుల్లోనే తెలుస్తాయి.

తేజస్వి యాదవ్ ప్రధాన ఆకర్షణ

ముఖ్యమంత్రి అభ్యర్థిగా, నితీశ్ కుమార్ కు గట్టి పోటీ ఇస్తున్న ఆర్ జెడి నేత తేజస్వి యాదవ్ నేటి ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. అందరిలోనూ యువకుడు, లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రియమైన వారసుడు, కొద్దికాలం ఉపముఖ్యమంత్రిగా అనుభవం గడించినవాడు. మార్పుకు ఓటు వెయ్యండి.. అంటూ తన వాణిని బలంగా వినిపిస్తున్నాడు. తన కూటమిలో ఉన్న కాంగ్రెస్ కు గతంలో కంటే నేడు కొంత బలం పెరిగిందనే వార్తలు వినపడుతున్నాయి. రాహుల్ గాంధీలో క్రమంగా పెరుగుతున్న చురుకుదనం ఒక కారణం కావచ్చు. కరోనా సమయం నుండి తాజాగా హాథ్ రాస్ సంఘటన వరకూ రాహుల్ వినిపిస్తున్న గళం, పోరాడుతున్న తీరు కాస్త మార్కులు తెచ్చిపెడుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలపై ప్రజలకు కొంత వ్యతిరేకత ఉండడం మరో సహజమైన అంశం. ఇవ్వన్నీ మేలుచేస్తే, కాంగ్రెస్ కు సీట్లు పెరిగే అవకాశం ఉంది.

సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి

నితీశ్ కుమార్ 15ఏళ్ళ నుండి ముఖ్యమంత్రిగా పాలనలో ఉన్నారు. అతనిపై  వ్యక్తిగతంగా అవినీతి ముద్ర లేకపోయినా, అనేక అంశాల వల్ల, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే చెప్పాలి. సుదీర్ఘకాలం పాలనలో ఉండడం వల్ల సహజంగానే ప్రజలకు మొహం మొత్తుతుంది. ఈ 15ఏళ్ళల్లో సాధించిన అద్భుతమైన ప్రగతి  ఏమీ లేదు. కరోనా సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు నానా కష్టాలు పడ్డారు. నిరుద్యోగం పెరిగింది.ఉపాధి తగ్గింది. ఈ అంశాల్లో అటు కార్మిక వర్గంలోనూ, ఇటు యువతలోనూ వ్యతిరేకత పెరిగింది. పొత్తులు మార్చుకుంటూ ఉండడం వల్ల నాయకుడుగా వ్యక్తిత్వ గ్రాఫ్ పడిపోయింది. ఇవన్నీ నితీశ్ కుమార్ కు ప్రస్తుతం ఉన్న బలహీనమైన అంశాలుగా చెప్పవచ్చు. ఇంకో పక్క యువకులైన తేజస్వి యాదవ్, చిరాగ్ పాసవాన్ ప్రత్యర్ధులుగా బరిలో ఉన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభావం, నరేంద్రమోదీ నాయకత్వపు ఆకర్షణ ఇతనికి కలిసి వచ్చే అంశాలు.

బీజేపీ-జేడీయూ విజయం ఖాయం అంటున్న సర్వేలు

బిజెపి-జేడీయూ ద్వయమే  మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. క్షేత్రంలో వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయని తెలిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి, యువతరానికి స్వాగతం పలకాలనే  భావనలో ఎక్కువ శాతం ఓటర్లు ఉన్నారనే మాటలు సవ్వడి చేస్తున్నాయి. ఈసారి కూడా, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎంపికైతే అది అద్భుతమని చెప్పాలి. ఒకవేళ తేజస్వి యాదవ్ అధికారంలోకి వస్తే, ఆ పార్టీ తన పాలనలో మూటగట్టుకున్న అవినీతి, అరాచకం అనే ముద్రల నుండి బయటపడ వేయాల్సిన బాధ్యత అతనిదే.గెలుపు గుర్రం ఎక్కితే, అత్యంత యువ ముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కుతాడు.

బీజేపీకి అధికంగా సీట్లు వస్తే?

బిజెపి సీట్లు బాగా పెరిగి, జెడియు సీట్లు బాగా తగ్గితే, బిజెపి నేత,ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. మొత్తంమీద, ఈసారి, బీహార్ లో ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినా, దాన్ని “అద్భుతంగా!”నే  అభివర్ణించాలి. వెనుకుబాటుతనం, అరాచకం, అవినీతి మధ్య నలిగిపోతున్న బీహార్ ప్రజకు విముక్తి కలిగిన నాడు ప్రజాస్వామ్యానికి నిజమైన గెలుపు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles