Sunday, June 26, 2022

దేవిప్రియ అంటే అనేక శిఖరాలు

 షేక్ ఖాజా హుస్సేన్ అంటే ఎవ్వరికీ తెలియదు. దేవిప్రియ అంటే తెలియనివారు ఎవ్వరూ ఉండరు.”రన్నింగ్ కామెంటరీ”కి పర్యాయపదంగా మారిన దేవిప్రియ జీవితం ఒక దీర్ఘకావ్యం, ఆ జ్ఞాపకాలు ఎత్తిపోతల జలపాతాలు. మహేష్ బాబు నటించిన థమ్స్ అప్ ప్రకటనకు ఉరకలెత్తించే పంచ్ లైన్స్ రాసింది ఈయనే. కుదురుగా కూర్చోడం ఏమాత్రం అలవాటులేని మహాకవి శ్రీశ్రీతో ఆత్మకథ “అనంతం” రాయించిందే ఈ దేవీప్రియయే. బి.నర్సింగ్ రావు ‘రంగులకల’ సినిమాలో గద్దర్ పాడిన గంతులేయించే పాట ” జమ్ జమ్మల్ మర్రి – వెయ్యికాళ్ళ జెర్రీ” రాసింది ఈ కవిగారే. ప్రజాగాయకుడు గద్దర్ పై అద్భుతమైన డాక్యుమెంటరీ తీసుకొచ్చిందే ఈయనే. అస్సలు వీళ్ళ ఇంట్లో ఈయనే  తొలి అక్షరాస్యుడు. దేవిప్రియ నేపథ్యం సవాళ్ల సర్వం. అందులో నుంచి పైకెగసిన కెరటం దేవిప్రియ జీవితం. ఈ పలనాటిబిడ్డ పద్యం వెంట పరిగెత్తాడు.

పదాలపై స్వారీ

జీవితాంతం పదాలపైనే స్వారీ చేశాడు. బహుళార్ధసాధక ప్రాజెక్టులు ఎన్నో చేపట్టిన దేవిప్రియ బహుప్రతిభాసంపన్నుడు. ఆయనలోని కొన్ని కోణాలే ప్రపంచానికి పరిచయం. పోగొట్టుకున్న ఎన్నో నిధులు, లోకానికి తెలియని ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. తాత్వికత, చైతన్యం కలబోసుకున్న సృజనప్రియుడు దేవిప్రియ. పద్యమన్నా, పలనాడన్నా వల్లమాలిన ప్రేమ. భావాలు తీవ్రంగా ఉన్నా,భాష సుకుమార కుసుమాలు. కవిత్వం ఒక్కటే పట్టుకొని కూర్చోనిఉంటే కేవలం మంచికవిగానే మిగిలిపోయేవాడు. పాత్రికేయం, ప్రకటనలు, సినిమాలు.. ఇలా పరిపరి విధాలుగా పరిభ్రమించాడు. ఎక్కడ భ్రమించినా, రమించే రాశాడు. శ్రమనూ రమించాడు. భిన్న ధృవాలైన అమ్మ నాన్నల మధ్య నలిగిపోయి కొన్ని సాధించాడు, ఎన్నో కోల్పోయాడు. అమ్మ స్వయంగా కవి, గాయని. నాన్న కవిత్వానికి బద్ధ వ్యతిరేకి. దేవిప్రియ రాసి మిగిల్చిన దానికంటే  పోగొట్టుకున్నదే ఎక్కువ. కొడుకు తీరుపై కోపంతో కన్నతండ్రే ఆ కవిత్వపు కాగితాలన్నింటినీ కాల్చిపారేశాడు. అందులో వెలకట్టలేని ఎంతో కవిత్వం దగ్ధమై పోయింది. గుండె పొంగిన వేళ అప్పుడప్పుడు రాసుకున్న వేళలలో మిగిలిన కాసింత కవిత్వమే ఇంత పేరు తెచ్చిపెట్టింది. అంతా దొరికివుంటే ఇంకా ఎంతో పేరు వచ్చి ఉండేది. ‘గాలిరంగు’ కవిత కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు తెచ్చిపెట్టింది “అధ్యక్షా మన్నించండి” పేరుతో వచ్చిన రచనా సంకలనం సంచలనం సృష్టించింది. నయాగరా కవులు, దిగంబర కవులు ఇలా… చాలా శీర్షికల ఛత్రాల క్రింద ఎందరో కవులు కవిత్వం అల్లి చరిత్ర సృష్టించారు.

పైగంబర కవులు

ఈ ప్రభావం ఉన్నా లేకపోయినా, నలుగుర్ని కలుపుకొని “పైగంబర కవులు”గా కొంతకాలం సందడి చేశారు. సుగమ్ బాబు, కిరణ్ బాబు, కమలా కాంత్, ఓల్గా, దేవిప్రియ వీళ్ళే పైగంబర కవులు. ఈ బృందంలో తప్పకుండా స్త్రీ ప్రాతినిధ్యం ఉండాలని పట్టుబట్టి, తన కాలేజీ క్లాస్ మెట్ ఓల్గాను ఇందులో కలుపుకొని సాగారు. భావాల్లో ఎంత తీవ్రత ఉన్నా అభివ్యక్తిలో సున్నితత్వం, భాషలో సంస్కారం నిలుపుకుంటూనే కవిత్వం అల్లడం పైగంబర కవుల ప్రత్యేకత. కన్నతల్లి రాసి,పాడిన కశీబులు దేవిప్రియకు అమ్మచేతి తొలి గోరుముద్దలు. తప్పెట్ల ధ్వనుల మధ్య వినిపించిన ఆ నాదం దేవిప్రియలో కవిత్వమై ప్రతిధ్వనించింది. ప్రాచీన ప్రబంధాలు, కావ్యాలు తనకు  భాషాపరిపుష్టిని  ఇచ్చాయి. జాషువా ఖండకావ్యాలు హేతువాదం వైపు మళ్ళించాయి. నారాయణరెడ్డి నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయల వంటి ఆధునిక కావ్యాలు తనతో కావ్యాలు రాయించాయి. దేవిప్రియ ఏది రాసినా ఛందస్సుందర బంధురమైన పద్యంగానే వచ్చేది. అలవోకగా ఆశువుగా కందంలో అందంగా  మకరందాలు పూచేవి. కథలు రాశాడు.కవిత్వం చెప్పాడు. ఏది రాసినా, ఏది చేసినా ఆవేశంతోనే చేసేవాడు. రాత్రికి రాత్రే రాసేవాడు. వీటికి ఊతం సవాళ్లు. ఎవరైనా సవాల్ చేస్తే, దాన్ని ఎదిరించి,స్వీకరించి ప్రతిస్పందించి,ప్రవర్తించే పట్టుదలే దేవిప్రియతో ఇన్ని పనులు చేయించింది. ఉమర్ ఖయామ్ నుంచి కరుణశ్రీ వరకూ అందరూ అతన్ని వెంటాడినవారే. కరుణశ్రీ, కడియాల రామ్ మోహన్ రాయ్, స్ఫూర్తిశ్రీ మొదలైనవారు దేవిప్రియకు ఉపాధ్యాయులు. రన్నింగ్ కామెంటరీ గురించి ఇంక చెప్పనక్కర్లేదు.రాజకీయాలను కవితామయం చేసి వ్యంగ్యంగా రంగరించిన తీరు పత్రికా లోకాన ఒక ఊపు ఊపేసింది. కవిత్వం ఒక పక్క, పాత్రికేయం ఒక వంకగా చిన్ననాటి నుంచే జీవితం పెనవేసుకొని సాగింది.

గుంటూరు జీవితం చాలా నేర్పింది

గుంటూరు జీవితం చాలా నేర్పింది, చాలా ఇచ్చింది.ఎన్నో స్థానిక పత్రికల్లో పనిచేసిన అనుభవమే జర్నలిజం జీవితానికి పెద్ద పునాదులను వేసింది. కేవలం అక్షరాలతో ప్రయాణం చెయ్యడమే కాదు, అందంగా ముస్తాబు చేయడం కలిసి వచ్చిన అంశం. పుస్తకానికి కవర్ పేజీ నుంచి పత్రికల లే అవుట్ రూపకల్పన వరకూ ఆ కళే కాపాడింది, తనను విభిన్నంగా నిలిపింది. తను చేసిన ఋతువర్ణనలకు ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త చేకూరి రామారావు (చేరాతలు) ముగ్ధుడైపోయేవాడు.        ఇన్షా అల్లా! అంటూ రాసినా, అవి కూడా కందపద్యాలే.”… “మనోరమ” పేరుతో  ‘డెబనాయిర్’ వంటి పత్రికను తెలుగులో నడపాలని చిలిపి గడుసు ఆలోచనలు వచ్చి, కాళ్ళు, చేతులు, వళ్లు కూడా కాల్చుకున్నారు. అర్ధాంగిగారి బంగారం సంపూర్ణంగా సమిధగా మారింది. ‘మనోరమ’ పత్రిక తీవ్ర మనోవేదన మిగిల్చింది. ఆ తర్వాత  ఇస్లామీ సాహిత్య పత్రిక “గీటురాయి” ఊరటనివ్వడమే కాక, రాటుతేల్చింది కూడా. కేవలం దేవిప్రియ కోసమే మిత్రులు, ఆప్తులు పత్రికలు స్థాపించిన సందర్భాలూ ఉన్నాయి. ఇదే ప్రయాణంలో ప్రవేశించిన “ప్రజావాహిని” పత్రిక  “ప్రజాతంత్ర”లో చేరేట్టు చేసింది. ఈ ప్రస్థానం కొత్త మలుపు తిప్పింది. ఎన్ని పత్రికల్లో ఎటువంటి హోదాల్లో పనిచేసినప్పటికీ, ప్రజాతంత్ర, ఉదయంలో అనుభవించిన స్వేచ్ఛ ఎక్కడా పొందలేదని దేవిప్రియ జీవితాంతం చెప్పుకున్నారు. తన అభిరుచికి, ఆత్మగౌరవానికి భంగం కలిగే వాతావరణం చూచాయగా కనిపించినా, రేపటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యోగాలు వదిలివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

సమున్నత వ్యక్తులతో సాంగత్యం

ప్రజాతంత్రలో పనిచేసేటప్పుడు నడిపిన సినీతంత్ర శీర్షిక బి.నర్సింగ్ రావును దగ్గరకు చేర్చింది. వారి స్నేహం జీవితాంతం కొనసాగింది. జెమినీ ఛానల్ లో నిర్వహించిన బిజినెస్ ట్రాక్ ఫీచర్ దేశంలోనే మొట్టమొదటి ప్రయోగం. సిటీకేబుల్ లో చేసిన ఎలక్షన్ షో కూడా చాలా హిట్ అయ్యింది. సినిమాల్లో తనకు గాడ్ ఫాదర్ గా నిలిచింది అనిసెట్టి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర చాలా ఆత్మీయంగా ఉండేవారు. గుంటూరు జిల్లా తాడికొండ వీధిబడిలో ఓనమాలు దిద్దుకొని, అతి సామాన్యంగా ప్రారంభమైన ప్రస్థానం ఇందరు పెద్దల సాంగత్యాన్ని సంపదగా ఇచ్చి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గెలుచుకునే దశగా  ప్రభవించింది. నిరక్షరాస్య  కుటుంబ నేపథ్యం నుంచి మొదలైన జీవితయాత్రలో,తన రచనలను  అక్షరాధికులు సైతం గౌరవించి, ప్రేమించే దిశకు  ఎదిగిన దేవిప్రియ జీవనం ఎందరికో ప్రేరణం. తన పలనాడు మూలాలు, అక్కడి పరిస్థితులను ” ఎల్లుండి” అనే పేరుతో రచన చేద్దామని అనుకున్నారు. అముద్రితంగా ఉన్న రచనలన్నింటినీ “వగైరా” గా ఒక సంకలనం తెద్దామనుకున్నారు. తన ఆత్మకథను “ఎత్తిపోతలు” గా రాయాలని కలలు కన్నారు. తన ప్రియసఖి, అర్ధాంగి రాజ్యలక్ష్మి వెళ్లిపోయిన తర్వాత చాలాకాలం మనిషి కాలేకపోయారు. కొంతకాలానికి కొంత తేరుకొని, కవిత్వం ఆలంబనగా మళ్ళీ జీవించడం ప్రారంభించారు.ఇంతలోనే మృత్యువు కబళించింది. దేవిప్రియను ప్రఖ్యాత కవి కె.శివారెడ్డి  దేవుడు.. అంటారు.అన్నట్టుగానే  దేవుడిలో కలిసిపోయారు. అందరి ప్రియుడు దేవీప్రియ అందర్నీ వదలి, అందనిలోకాలకు వెళ్లిపోయారు. దేవిప్రియ రచనలు నేస్తాలుగా మన మధ్యనే ఉన్నాయి. అవే మనకు కాలక్షేపం. అవే మనకు దేవిప్రియ జ్ఞాపకాల దొంతరలు.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles