Thursday, April 18, 2024

వికేంద్రీకరణ, ప్రగతి కొత్త జిల్లాల లక్ష్యాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభంలోనే  కార్యరూపం దాలుస్తుందనే కథనాలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్ల ఆశించిన ఫలాలు అందరికీ  దక్కుతాయా, దీని వెనక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయా అన్నది నేడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.  పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం, మానవ వనరుల సద్వినియగం పేరుతో జిల్లాల సంఖ్య  పెంచాలనే ఆలోచనతో ఈ బృహత్ కార్యాచరణ చేపట్టామని  ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈ దిశగా  కమిటీలు, ఉపసంఘాలు కూడా ఏర్పడ్డాయి.

సమగ్ర అధ్యయనం అవసరం

కమిటీలు సమగ్రంగా అధ్యయనం చేసి,  సమర్పించిన నివేదికల ఆధారంగా ఆచరణ బాటపట్టాల్సి వుంది. 2014లో ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత,  ముందుగా తెలంగాణ ప్రభుత్వం కొత్తజిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా, కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం 2016లో తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి, జిల్లాల సంఖ్యను గణనీయంగా పెంచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా జిల్లాల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో జిల్లాలు పెంచడం కొత్తగా వచ్చింది కాదు. గతంలోనూ కొత్త జిల్లాలను  ఏర్పాటు చేశారు.

చివరి జిల్లాలు విజయనగరం, ప్రకాశం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త  జిల్లాలు వచ్చి ఇప్పటికి చాలా కాలమయ్యింది. చివరగా ఏర్పడ్డ జిల్లాలు ఉత్తరాంధ్రలోని విజయనగరం,కోస్తా ప్రాంతంలోని ప్రకాశం. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలోని వెనుకబడిన ప్రాంతాలను కొన్నింటిని కలిపి, ప్రకాశం జిల్లాగా ఏర్పాటుచేశారు.ఒంగోలును  అధికార కేంద్రంగా చేస్తూ 02 ఫిబ్రవరి 1970లన  ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా ఏర్పడి ఇప్పటికి 50ఏళ్ళు దాటింది. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి, 01 జూన్ 1979న విజయనగరం జిల్లా ఏర్పడింది. ఇది ఏర్పడి కూడా 40ఏళ్ళు పూర్తయింది. ఆంధ్ర ప్రాంతంలో చిట్టచివరగా ఏర్పడిన జిల్లా విజయనగరం.ఆ తర్వాత, కొత్తగా ఏ జిల్లా ఏర్పడలేదు.

అన్నీ వెనుకబడిన ప్రాంతాలే

ఇన్ని దశాబ్దాల తర్వాత, మళ్ళీ ఈ ప్రక్రియ ప్రారంభమైంది. చివరగా  ఏర్పడిన విజయనగరం, ప్రకాశం జిల్లాలు ఇప్పటికీ వెనుకబడిన జిల్లాల ముద్రలోనే  ఉన్నాయి. జిల్లా కేంద్రాలైన ఒంగోలు, విజయనగరం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ చాలా వెనుకబడే ఉన్నాయి. రియల్ ఎస్టేట్, చీమకుర్తి గనులు, రాష్ట్ర విభజన మొదలైన అనేక అంశాల ప్రభావంతో స్థానికంగా ఒంగోలు పట్టణం, చుట్టుపక్కలా భూముల ధరలు వేలం వెర్రిలాగా పెరిగాయి. ఆస్తులు ఉన్న వారికి ఆనందమే కానీ, కొత్తగా కొనుక్కోవాలనుకునేవారికి అందని ద్రాక్షగానే మారిపోయాయి. జిల్లాలోని కొన్ని పట్టణాల్లోనూ ఇదే తీరు నడిచింది.   ఇది తప్ప, జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  జిల్లాల సంఖ్యను  పెంచాలనే కృత నిశ్చయంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది.

25 లేక 26 జిల్లాలో తేల్చుకోవాలి

 ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. లోక్ సభ స్థానాల ప్రాతిపదికతో 25 జిల్లాలు ఏర్పాటు చెయ్యాలనేది  పాలకుల ప్రధానమైన ఆలోచన . గిరిజన ప్రాంతాల  భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇంకొక జిల్లా అదనంగా ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రాతిపదికన 26వ జిల్లా ఏర్పాటు అంశం కూడా  తెరపైకి వచ్చింది. భౌగోళికపరంగా కొన్ని జిల్లాలు పెద్దవిగా ఉన్నాయి. ప్రస్తుతం  అనంతపురం, గుంటూరు, కృష్ణ, తూర్పు గోదావరి, విశాఖపట్నం  పెద్ద జిల్లాలు. ఇందులో  అనంతపురం, తూర్పు గోదావరి బాగా పెద్ద జిల్లాలు.

గిరిజన జిల్లా యోచన

అరకు గిరిజన ప్రాంతం. ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా పునర్ వ్యవస్థీకరించే ఆలోచనలు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి ఉన్నట్లుగా అర్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రెండు దశల్లో, 23జిల్లాలను కొత్తగా ఏర్పాటుచేసింది. గతంలో ఉన్న 10జిల్లాలు, కొత్తగా ఏర్పడిన 23జిల్లాలు కలిసి, ప్రస్తుతం  మొత్తం 33జిల్లాలు తెలంగాణలో ఏర్పడ్డాయి.ఈ రాష్ట్ర లోక్ సభ స్థానాల సంఖ్య 17. ఈ లెక్కన తీసుకుంటే లోక్ సభ స్థానాలకు రెట్టింపు సంఖ్యలో తెలంగాణలో జిల్లాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ప్రజలు, నిపుణులు,  పరిశీలకుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

తెలంగాణ జిల్లాలపైన అధ్యయనం చేయాలి

ప్రభుత్వం ఉద్దేశించిన ప్రయోజనాలు ఏ మేరకు ఫలితాలను ఇచ్చాయో ఇంకా సమగ్రంగా  అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది.ఇన్ని జిల్లాలు ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం లేదని ఎక్కువమంది నిపుణుల అభిప్రాయం.నిర్వహణా ఖర్చు బాగా పెరిగిందనేది మరో అభిప్రాయం. అధికార పార్టీ  రాజకీయంగా తన బలాన్ని మరింత పెంచుకోవడం కోసం పన్నిన  ఎత్తులో భాగమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే విమర్శలూ వచ్చాయి. అనునూయులకు పదవుల కల్పన చేస్తూ, కేడర్ ను పెంచుకోవడం కోసం వేసిన వ్యూహంగానూ కొందరు అభివర్ణించారు. అదే సమయంలో, జిల్లాలలో అధికారులపై రాజకీయ వర్గాల ఆధిపత్యం ఎక్కువై పోతోందన్నది ఇంకో అభిప్రాయం.ఇలా అనేక వ్యతిరేక విమర్శలు తెలంగాణలో వెల్లువెత్తాయి.

విమర్శలకు తావులేకుండా నిర్ణయాలు

నేడు, ఇటువంటి విమర్శలకు తావివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత  ఆంధ్రప్రదేశ్ లోని అధికార       వై ఎస్ ఆర్ పార్టీ, ప్రభుత్వ పెద్దలపై ఉంది. ప్రజలకు వేగంగా సేవలు అందించడానికి, ప్రజల వద్దకే పాలన తేవడానికి, మానవవనరులను  సద్వినియోగం చేసుకోడానికి ప్రభుత్వ పెద్దలు చేసుకున్న సంకల్పం మంచిదే కావచ్చు, ఆచరణ చిత్తశుద్ధిగా జరిగి, ఫలితాలు రాబడితేనే  నిజమైన ప్రయోజనం నెరవేరుతుంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కొత్త జిల్లాల ఏర్పాటులో,  నిర్వహణలో తెలంగాణ అనుభవాల నుంచి  మంచి చెడులను గ్రహించవచ్చు.

గ్రామసచివాలయాలు

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసింది. దేశంలోనే ఇది మొట్టమొదటగా చేపట్టిన విప్లవాత్మకమైన నిర్ణయం. దీని ద్వారా ఇప్పటి వరకూ సాధించిన ఫలితాలను పునఃసమీక్ష చేసుకోవాలి. ఇప్పుడు జిల్లాల సంఖ్యను  పెంచే దిశలోనూ ఈ అనుభవాలను జతచేసుకోవచ్చు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి. కొన్ని జిల్లాలు వైశాల్యంలో, జనసాంద్రతలో పెద్దవిగా ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ వల్ల ఇటువంటి చోట ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చు. అన్ని లోక్ సభ స్థానాలనూ జిల్లాలుగా మార్చాల్సిన అవసరం  ఉందా అన్నది కొందరి ప్రశ్న. ముఖ్యంగా అనంతపురం, గుంటూరు, కృష్ణ, తూర్పు గోదావరి, విశాఖపట్నంలో జిల్లాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.

పరిపాలనా వికేంద్రీకరణ అవసరమే

పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిన  అవసరమూ ఉంది. ఇది ఎప్పటి నుండో చర్చలో ఉన్న అంశమే. జిల్లాల పరిపాలన రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పటికీ, ఈ అంశంపై జాతీయస్థాయిలోనూ చర్చ జరగాల్సిన అవసరం ఉందని మేధావుల అభిప్రాయం. జిల్లాలు పెరిగినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఏమీ పెరుగవన్నది ఒక అంశం. జిల్లాల సంఖ్య పెరగడం వల్ల పరిపాలనా వికేంద్రీకరణ పెరుగుతుంది. అదే సమయంలో,  నిర్వహణా ఖర్చు కూడా పెరుగుతుంది. జిల్లాల సంఖ్యతో పాటు అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుపై జాతీయ విధానం

కొత్తగా ఏర్పడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం.కొత్త పరిశ్రమలు , సంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల పెంపు, నిధుల తోడ్పాటులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేయూతనివ్వడం చాలా అవసరం. రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య పెంపు  రాజకీయ అవసరం కాకూడదు. దీనిపై జాతీయ విధానం (నేషనల్ పాలసీ) రూపకల్పన చెయ్యాలి.  జాతీయస్థాయిలో కమిటీ  కూడా ఏర్పాటవ్వాలి. రిటైర్డ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ ప్రధానకార్యదర్శి స్థాయి అధికారులు , ఆర్ధిక, సామాజిక రంగ నిపుణులు జాతీయస్థాయి కమిటీలో సభ్యులుగా ఉండాలి. తద్వారా జిల్లాలు, రాష్ట్రాలు, మొత్తంగా దేశ ప్రగతికి కొత్త నిర్మాణం జరిగేలా జిల్లాల పునర్ వ్య్వవస్థీకరణ రూపొందుకోవాలి.

పరిపాలనలో వేగం పెరగాలి

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.ఆర్ధికంగా, పరిపాలనా పరంగా ఎంతో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా ప్రభావంతో కష్టాలు ఇంకా పెరిగాయి. రాష్ట్ర నవ నిర్మాణం వేగం ఇంకా ఎంతో  పుంజుకోవాలి. ఒకప్పుడు కాగితాలమీదే పరిపాలన సాగేది. ఇప్పుడు ఆధునిక సాంకేతికత, ఆన్ లైన్  కమ్యూనికేషన్ బాగా  పెరిగాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.పాలనా వేగం పెంచుకోవచ్చు. రవాణా సదుపాయాలు కూడా పెరిగాయి. ఇదీ కలిసివచ్చే అంశమే. రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. కొత్త జిల్లాల రూప కల్పనలో భాగంగా, రోడ్ల  మరమ్మత్తులు జరగాలి.

స్థానిక నాయకుల ప్రాముఖ్యత

పరిపాలనా వికేంద్రీకరణలో  స్థానిక నాయకుల ప్రాముఖ్యత కూడా  పెరగాలి. ప్రాముఖ్యత అంటే పెత్తనం కాదు. ప్రజల ప్రయోజనాలతో పాటు అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి పరిపాలనలో తగినంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కూడా ఉండాలి.ప్రజాప్రతినిధులు-అధికారగణాల మధ్య సమన్వయంతో, సంయుక్తంగా ప్రజలకు సుపరిపాలన అందాలి.  కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా ప్రత్యేక సహాయం అందించాలి.

కొత్త జిల్లాలతో కొత్త రక్తం

కొత్త జిల్లాల రూపకల్పనతో కొత్త రక్తం ఎక్కించుకొని, ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాలి. అసలే, అనేక సవాళ్ల మధ్య సాగుతున్న పరిపాలనా వ్యవస్థకు ,  కొత్త జిల్లాల రూపకల్పన కొత్త తలనొప్పి కాకూడదు. రాబోయే సవాళ్ళను ముందుగానే ఊహించి, యంత్రాంగం ఆ మేరకు సిద్ధమవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో ఇంకా తొలి అడుగులే పడుతున్నాయి. చెయ్యాల్సిన ప్రయాణం చాలా వుంది. పరిపాలన-అభివృద్ధి వికేంద్రీకరణలకు కొత్త జిల్లాలు   కొత్త ఊతం ఇవ్వాలి. రెండిటికీ సమన్యాయం జరగాలి. సమన్వయం సాధించాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles